ఇచ్ఛామతి

అబషిరీ అంత దూరం

(1883-1971)

వోయ షిగా(1883-1971) చేపట్టిన కథా ప్రక్రియ పేరు “Shi- shosetsu”( I novel.)

ఫ్రెంచి నాచురలిస్ట్ నవల, యూరోపియన్ వ్యక్తి ప్రాధాన్య భావుకత, జాపనీయ ఆలోచనా స్రవంతి వ్యాస శైలుల మిశ్రమం అనుకోవచ్చు “షి షోసెట్సు” ను.

ఈ జాపనీయ సాహితీ సంప్రదాయలో గొప్ప రచనలు చేసిన వాళ్ళల్లో  నవోయ షిగా ను ఎక్కువ విశేషంగా చెప్పుకుంటారు. వందపై చిలుకు చిన్న కథలు, మూడు నవలిక లు, ఒక పెద్ద నవల, చాలానే వ్యాసాలు వ్రాసిన ఈయన్ను “కథల దేవుడ”ని, Shi shosetsu ప్రక్రియను ప్రతిభావంతంగా వాడుకున్న వాడని, ‘‘A Dark Night’s Passing‘’ అనే ఈయన నవలను ”Divine novel”అనీ అంటారు జపాన్ లో. ఆయన వ్రాసిన కథే ఈ ‘As Far As Abashiri.’ తెలుగు లో ‘అబషిరీ అంత దూరం’ అన్నాను.

‘ఉట్సుమోనియ’ లో ఉండే స్నేహితుడొకడితో ” ‘నిక్కొ’ కు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను” అని చెప్తే, “వెళ్ళేటప్పుడు నన్నూ పిలువు,  నిక్కొ నేనూ వస్తా” నన్నాడు.

ఆగస్ట్ వొచ్చినా దారుణంగా ఉన్నాయి ఎండలు. మధ్యాహ్నం 4.20 రైలు ఎక్కి వాడికి దగ్గర లో ఉన్న స్టేషన్లో దిగుదామని ఆలోచన. ఆ రైలు ‘ఓమోరి’ కి వెళ్తుంది. ‘యెనో’ స్టేషన్ కు వెళ్ళేప్పటికి, టికెట్లిచ్చే గేట్ దగ్గర ఒక గుంపు జనం. వాళ్ళతోపాటు నేనూ.

గంట మోగంగానే గేట్ తెరుచుకుంది.అందరూ ఒక్కసారి కదిలి లేచి నిలబడ్డారు. వరసగా టికెట్లు పంచ్ చేసే చప్పుడు మొదలైంది. చేతుల్లో సంచులు క్యూలో కోక్కేలకు తగులుకుని వాళ్ళ నూ గుంజుతుంటే చికాకు పడుతున్న ముఖాల వాళ్ళు, పక్కకు తోసేయబడితే మళ్ళీ ఆదుర్దా గా క్యూలోకి వచ్చి కలుస్తున్నవాళ్ళు, వాళ్ళను రానివ్వని వాళ్ళు- సామాన్యంగా మనుషులు గుంపైన చోట ఉండే వైనమే అక్కడ. వీళ్ళలో ఒక్కొక్కొణ్ణీ గుర్రుగా చూస్తున్నాడు ఒక పోలీస్, టికెట్ తీసుకునే అతని వెనక నిల్చుని. ఆ తంతు లోంచి బయటపడ్డవాళ్ళు ప్లాట్ ఫార్మ్ వైపు వడివడిగా నడిచారు. ‘‘ఆ ముందు పెట్టెలు ఖాళీ, ముందు పెట్టెలు ఖాళీ ‘‘ అని పోర్టర్ అరిచే అరుపులు వినిపించుకోకుండా అందరూ ఇక్కడి బోగీల్లో కే తోసుకుంటూ దూరారు. అన్నిటిలోకి ముందుండే బోగీ ఎక్కాలని నేను అటువైపు హడావిడిగా వెళ్ళిపోయా.

అనుకున్నట్లే ముందు బోగీలన్నీ ఖాళీయే. మొట్టమొదటి బోగీలోని చివరి కూపే ఎక్కాను. అటు సీట్లు దొరకని వాళ్ళందరూ హైరానా పడుతూ ఇటు పడొచ్చారు. కానీ ఇక్కడ ముప్పావు మందికే చోటు ఉంది. రైలు కదిలే సమయమైంది. అంతా బోగీల తలుపులు వేసి గొళ్ళాలు పెట్టే చప్పుడు. ఒక ఎర్రటోపీ తలుపు మూసేయబోతున్నవాడల్లా ఆగి, చెయ్యి పైకెత్తాడు.

‘‘ ఇటు, ఇటు రండి మేడమ్‘‘ అంటూ వేసిన తలుపు మళ్ళీ తెరిచాడతను. పాలిపోయినట్టుండి, జుట్టు పలచగా ఉన్న ఒక ఇరవై ఆరు, ఇరవై ఏడేళ్ళామె ఒక చంకలో  బిడ్డతో,  రెండో చేత్తో పట్టుకున్న పిల్లవాడితో లోపలికి ఎక్కింది. ట్రెయిన్ కదిలింది.

చివ్వరి సీట్లో కూర్చుంది ఆమె, పడమటి సూర్యుడి ఎండ పడుతున్న ఆ సీటొకటే ఖాళీగా ఉంది.

‘‘ అమ్మా! పక్కకు జరుగు.‘‘ ఏడేళ్ల ఆ పిల్లవాడి చిరాకు హుంకారం.

‘‘ అక్కడ ఎండగా ఉంది.” పసిబిడ్డను ఒడిలోంచి దించుతూ మెల్లిగా అంది ఆమె.

‘‘ నాకు ఎండే ఇష్టం.”

‘‘ ఎండలో కూర్చుంటే నీ చెడ్డీ జిలపుడుతుంది”.

‘‘ అయితే?” వాడొక పిల్లదెయ్యం లా చూశాడు ఆమె వైపు.

‘‘టకీ!” వాడి మొహం దగ్గరగా తన మొహం పెట్టి , ‘‘మనం పెద్ద ప్రయాణం మీద వెళ్తున్నాం, దోవలో నీకు జిల మొదలవుతే అమ్మకు ఏం చెయ్యాలో తెలీదు, ఏడుపొస్తుంది తనకు. మంచి పిల్లవాడివి నీవు, అమ్మ చెప్పిన మాట కొంచెం వినవూ, కాసేపాగితే ఎండ పడని సీటు దొరుకుతుంది. అది దొరకంగానే అక్కడ కూచుందువుగాని, అర్థమైందా?” అంది.

‘‘నాకు తలనొప్పి పుడుతోంది చాలా.” వాడి కి తన మాట నెగ్గించుకోవాలి ఏదో విధంగా. దిగులు కమ్ముకుంది తల్లి మొహంలో. ‘‘అమ్మకు ఏం చేయాలో పాలుపోవడం లేదురా.”

నేనింతలో ‘‘ఇక్కడ కూచో దా,” అని కొంచెం జరిగి నా కిటికీ దగ్గర చోటు చేసి, ‘‘ఇటు ఎండ లేదు” అన్నాను.

నావైపు ఓ చూపు చూశాడు. పిండి ముద్దలాంటి మొహం, తాంబాళం లాంటి తలకాయ, వాణ్ణి చూస్తుంటే తేళ్ళు, జెర్రులు పాకుతున్నాయి నాకు. వాడి చెవుల్లో, ముక్కుల్లో చిన్న దూది ఉండలు.

‘‘ అయ్యో, ఎంత మంచివారు.” మొహంలోకి చిరునవ్వు వస్తుండగా వాడి వీపు వెనక చెయ్యేసి నా వైపు మెల్లిగా నెడుతూ ‘‘ టకీ! ఆయనకు thanks చెప్పు, వారు చెప్తున్నచోట కూచో.‘‘

‘‘దా, దా !” వాడి చెయ్యి పట్టుకుని నా పక్కన కూచోపెట్టాను.

ఆ పిల్లవాడు నా మొహం వైపు మార్చి, మార్చి ఓ రకంగా చూశాడు, కానీ కొంచెంసేపటికల్లా కిటికీ లోంచి దాటిపోతున్న దృశ్యాలు చూడటం లో మునిగిపోయాడు. ‘‘అటువైపు చూడు, లేకపోతే బొగ్గునుసి కళ్ళల్లో పడుతుంది.”

ఈ మాటలు నేనన్నప్పుడు కూడా వాడు ఉలుకూ, పలుకూ లేదు. మెల్లిగా ‘ఉరువా‘ వచ్చింది. నా ఎదురుగా కూచోనున్నవాళ్ళు ఇద్దరు దిగిపోయారు. ఆ పిల్లవాడి తల్లి తన ఉరువులు తీసుకుని ఆ చోట్లోకి వచ్చి కూచుంది.

ఉరువు ‘లు‘ అన్నాను కానీ ఆడవాళ్ళు సామాన్యంగా వాడే ఒక గుడ్డ సంచీ, చేతిగుడ్డలో కట్టిన మూట ఒకటి, అంతే ఆమె వస్తువులు.

‘‘ఇంక, ఇప్పుడు ఇటు కూచో. Thank you so much, sir.” ఆ తల్లి తల వొంచి మరీ నాతో అన్నది. రైలు ఉయ్యాలకు జోకొట్టినట్టు అంతదాకా నిద్రపోయిన చంటి బిడ్డ, లేచి ఏడవటం మొదలుపెట్టింది.

‘‘లేదు, లేదు ఏడవకేడవకు.” వాణ్ణి చేతుల్లో ఊపుతూ సముదాయించే ప్రయత్నం చేసింది. ‘‘చి చి చిచీ, చి చి చిచీ”, ఊహూ వాడు కాళ్ళు ఝాడిస్తూ ఇంకాస్త పెంచాడు ఏడుపు. ‘‘సరే, సరే ఏడవకేడవకు, నీ కొకటి పెడతాను” అంటూ ఒక చేత్తో సంచీ లోంచి ‘Garden Dew Drop’ తీసింది. అయినా అదీ ఆ చంటి వాడి ఏడుపు ఆపలేక పోయింది. ఈలోపలే చాలా అసహనంగా వీడు ‘‘అమ్మా, మరి నాకో?”

‘‘నీవూ తీసుకో.” తన కిమొనో తెరిచి పసివాడికి స్తన్యం నోట్లో పెట్టింది. ఒబీ( వాళ్ళ డ్రెస్ కు వెనక ఉండే సంచి లాటిది) లోంచి కొంచెం మాసినట్టున్న సిల్క్ రుమాలు తీసి మెడ దగ్గర దోపుకుంది గుండెల పైన ఆచ్ఛాదన గా.

వీడు సంచీలో చేయి పెట్టి వెతుక్కుంటూ ‘‘అరె! ఇవి కాదు నాకు కావలసింది.” తల అడ్డంగా ఊపుతూ నస.

‘‘అవి కాదా, నీకు ఏవి కావాలి వేరే?”

‘‘ ‘Jewels.’ “

” ‘Jewels’ లేవు, అవి నేను తేలేదు.”

‘‘ఛండాలం, ఛండాలం! ఏం? అవెందుకు తేలేదు” ముక్కుల్లోంచి సెగలు కక్కుతూ శోకాలు పెట్టాడు.

‘‘సంచీ అడుగున చూడు, వేరేవి ఉన్నాయి, అవి తీసుకో, మంచివాడివి కదూ నీవు, అవి కూడా భలే బాగున్నాయి.”

అఖ్ఖర్లేదన్నట్టు తల విదిలించాడు. ఒక చేత్తో మళ్ళీ సంచీలోంచి తీసి ఓ నాలుగో, ఐదో వాడి చేతిలో పెట్టింది.

‘‘ఇంకొన్ని.” ఇంకో రెండు ఇచ్చింది.

పాలతో శాంతుడై పసివాడు వాళ్ళమ్మ సిగలోంచి జారిన నల్ల చుక్కల దువ్వెనతో ఆడటం మొదలుపెట్టాడు.

చివరికి దాన్ని నోట్లో కి దోపుకునే సాధనలో పడ్డాడు.

‘‘అట్లా చేయకూడదు” అంటూ ఆ చిన్ని చేతిని పట్టుకున్నప్పడు అటు తిప్పిన వాడి తెరుచుకున్న నోట్లోంచి అప్పుడే పుడుతున్న రెండు కింది పళ్ళు కనిపించాయి.

‘‘ఊ.. ఊ…భలే, భలే” ఒళ్ళో పడ్డ Gold Drop ఊపింది వాడి మొహం ముందు.”ఉంగా, ఉంగా” అంటున్న వాడు కళ్ళ చివరల్నుంచి అటు చూశాడు. దువ్వెన వదిలేసి బొద్దుగా ఉన్న పిడికిట్లోకి Gold Drop దొరకపుచ్చుకున్నాడు. ఇంక మొత్తం గుప్పిలి తో సహా దాన్ని నోట్లో కి తోసేసే ప్రయత్నం చేశాడు. నోట్లోంచి చొంగ తీగలు జారాయి.

బిడ్డను ఒత్తిగిలించి వాడి తొడల మధ్య తాకి చూసింది. అనుకున్నట్లే అక్కడ తడిగానే ఉంది.

‘‘డైపర్స్ మార్చాలి” తనలో తను అనుకుంటూన్నట్లు, ‘‘ టకీ, నన్ను అక్కడ కూచోనీ, నీవు కొంచెం లే, డైపర్ మార్చాలి నేను” అంది పెద్ద పిల్లవాడితో.

‘‘ఫో అమ్మా, నాకిదేం నచ్చలేదు.” గయ్యి మంటూనే లేచాడు అక్కణ్ణించి.

‘‘ఇక్కడ కూచో రా” మళ్ళీ నా పక్కన చోటు చేశాను.

‘‘మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. వీడు చాలా పెంకి. వీడిట్లా ఉంటే నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు.”  నా వైపు చూస్తూ దీనంగా నవ్వింది.

‘‘బహుశా వాడికి చెవులూ, ముక్కూ లో ఏదో ఇబ్బంది ఉన్నదేమో.”

‘‘ఒక నిమిషం.” అటు తిరిగి కొత్త డైపర్, ప్లాస్టిక్ కవరొకటీ తీసింది బయటికి.

‘‘ మీరన్నది నిజమే.”

‘‘ఎప్పట్నుంచి ఇట్లా?”

‘‘పుట్టినప్పట్నుంచీ. డాక్టర్ అనటం, తండ్రి విపరీతమైన తాగుడే కారణం, వాడికి తల లో కూడా ఏదైనా లోపం ఉడుంటుందా అని నా భయం.”

చిన్నవాడు సీటు మీద బోర్లా దొర్లి తల ఎత్తి ఎటూకాని ఒకవైపు దీక్షగా చూశాడు. చేతులు ఊపుతా,ఊంగాలు కొట్టాడు.గబగబ డైపర్ మార్చి తడిది తీసి పడేసి, పసివాణ్ణి చేతుల్లోకి ఎత్తుకుంది.

‘‘టకీ, ఇటురా….. Thank you very much sir.”

“ఫరవాలేదు, నువ్విక్కడే కూర్చోవచ్చు‘‘, కానీ వాడు ఒక్క మాట లేకుండా లేచి నిల్చున్నాడు. నాకు ఎదురుగా కూర్చోంగానే బయటకు చూడ్డం మొదలు పెట్టాడు.

‘‘ఎంత పెడసరం.” చిన్న పుచ్చుకుంటూ నా వైపు చూసింది, నేనేమైనా నొచ్చుకున్నానేమో అన్నట్లు.

కొంచెం సేపయ్యాక, అడిగాను, ‘‘ఎక్కడిదాకా వెళ్తున్నారు?”

‘‘‘హొక్కైడో‘ . ‘అబషిరి‘ అనే చోటుకు. చాలా దూరమనీ, విసిరేసినట్లు ఉంటుందనీ అంటారు.”

‘‘ఏ జిల్లా లో?”

‘‘ ‘ కితమి‘.”

‘‘ఇంక దాని తర్వాత ఏం లేదు పోవటానికి, అధమపక్షం అయిదు రోజులు పడుతుంది మీకు.”

‘‘మధ్యలో ఎక్కడా ఆగకుండా వెళ్తేనే ఒక వారం అవుతుందిట చేరటానికి.”

రైలు ‘మమద‘ దాటింది ఇప్పుడు. దగ్గర్లోని అడవులలోంచి కీచురాళ్ళ ధ్వని మాతో కూడా వస్తున్నట్టు ఉంది.

సూర్యుడు అస్తమించాడు. పడమటి వైపు ముఖాలు పెట్టి కూచున్నవాళ్ళు కిటికీ నల్లఅద్దాలు పైకెత్తారు. చల్లటి గాలి లోపలకు వీచింది. అమ్మ చేతుల్లో నిద్రకు పడ్డ పసివాడి అర బెత్తెడు పట్టులాంటి వెంట్రుకలు గాలికి వణికాయి. కొద్దిగా తెరుచుకున్న వాడి నోటి దగ్గర చికాగ్గా రెండు, మూడు ఈగలు ఎగురుతూ తిరిగాయి. ఏదో ఆలోచిస్తున్న వాళ్ళమ్మ వాటిని చేతిగుడ్డతో అప్పుడప్పుడూ తోలింది. కొద్ది సేపయాక తన వస్తువులు అవతలకు సర్ది బిడ్డను సీట్ పైన పడుకోబెట్టింది. రెండో, మూడో పోస్ట్ కార్డులు, పెన్సిల్ సంచీ లోంచి తీసి, వ్రాయడం మొదలు పెట్టింది. కొంచెం సేపు కూడా కాలేదు.

‘‘ అమ్మా.” బయటి దృశ్యాలు చూడటం సైతం విసుగొచ్చిన పిల్లాడు.

‘‘ఏంటి సంగతి? ఇప్పుడేం కావాలి?”

‘‘ఇంకా దూరమా?”

‘‘అవును, చాలా దూరం. నిద్దర వస్తుంటే, దా. నన్నానుకుని పడుకో. నిద్రపో.‘‘

‘‘నాకు నిద్ర రావడం లేదు.”

‘‘సరే, అయితే బొమ్మల పుస్తకం చూడు.”

పిల్లవాడు నెమ్మదిగా తలూపాడు. గుడ్డల మూటలోంచి తల్లి ఓ నాలుగో, ఐదో వారపత్రిక లు, ఇంకేవో పుస్తకాలు తీసింది. అణకువగా, ఆ పిల్లవాడు వాటిని ఒక్కోటీ చూడటం మొదలు పెట్టాడు. అప్పుడు, కొంచెం వెనక్కు జారిగిలబడి, ఆ కళ్ళ జతను చూసినప్పుడు, బొమ్మల పుస్తకం చూస్తున్న పిల్లవాడి కళ్ళూ, పోస్ట్ కార్డు రాస్తూ వంచిన తల్లి కళ్ళూ, అచ్చు ఒకేలాగా ఉన్నాయి.

బస్సుల్లోనో, రైళ్ళల్లోనో నా ఎదురుగా కూచుని ఉన్న ఒక బిడ్డ ను వాళ్ళ అమ్మా, నాన్నలతో చూసినప్పుడు – నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంటుంది – ఏమాత్రం ఒకరితో ఒకరికి ముఖ కవళికల్లో గానీ, శరీరాకృతి లో గానీ పోలికల్లేని ఆలు మగలు ఒక అందమైన సంయోజనంతో ఈ సృష్టి చేశారు కదా అని. మొదట బిడ్డనూ, తల్లి నీచూసి అచ్చు ఒేకే పోలిక అనుకుంటాను. తర్వాత తండ్రిని, బిడ్డను చూసి ఇద్దరూ అచ్చం గా ఒకే పోలికలు అనుకుంటాను. చివరగా ఆ అమ్మా, నాన్నల వైపు చూసినపుడు ఎంతో విచిత్రంగా అనిపించేది వాళ్ళకు ఒకరితో ఒకరికి ఏ పోలికలూ ఉండకపోవటం.

ఈ అనుభవం నన్ను ఆ పిల్లవాడి తల్లిని చూస్తూ వాడి తండ్రిని రూపకల్పన చేసేట్టు చేసింది. అతని ప్రస్తుత జీవన శైలి ఎలా ఉంటుందో కూడా నా ఊహకు తోస్తోంది.

నాకే తమాషాగా అనిపించేట్లుగా నా ఊహల సహాయం తో, చాలా సులభంగా ఈ మహిళ భర్త ఆకారాన్ని, మొహాన్ని నా ముందు నిలుపుకోగలిగాను. ‘ Peers’ ‘ స్కూల్లో దివాన్జీ వంశీయుడొకడు, నాకంటే ఆరేళ్ళు పెద్దవాడై ఉండీ నా కంటే పైన రెండో తరగతిలో ఉన్న మగాఖీ అనేవాడు గుర్తొచ్చాడు. వాడు పెద్ద తాగుబోతు, దానికి తగ్గ వాగుబోతు. భారీ శరీరం, పాలిపోయిన మొహం, గద్ద ముక్కు. ఎప్పుడూ సరిగా చదివేవాడు కాదు. రెండు, మూడు సార్లు పరీక్షలు తప్పి, చివరికి తనే స్కూల్ వదిలి వెళ్ళి పోయాడు. రూసో- జపాన్ యుద్ధం అయిపోయిన కొన్నాళ్ళకు తన పేరు పేపర్లలో చూశా, జోషు హెమ్ప్ జాయింట్ స్టాక్ కంపెనీ కి ప్రెసిడెంట్ ట. ఆ తర్వాత ఇంకెప్పుడూ అతని పేరు వినలేదు.

మగాఖీ గుర్తుకురావటంతో ఈమె భర్తా అటువంటి వాడేనా అనుకున్నాను. కానీ మగాఖీ కేవలం ప్రగల్భాల మనిషి, తనతో అంతకు మించి కష్టం ఏమీ ఉండదు. నిజానికి వాడు కలుపుగోలుగా, నవ్వుతూ, జోకర్ లా నవ్విస్తూ ఉండేవాడు. కానీ, వాస్తవానికి ఆ రకం మనుషులు ఎప్పుడు ఎట్లా ఉంటారో చెప్పటం కష్టమే. ఎంతో నవ్వుతూ సంతోషంగా ఉన్నవాళ్ళే వరసగా ఎదురుదెబ్బలు తిన్నాక తన తో బ్రతుకు దుర్భరం అనిపించేలా మారతారు. ఉన్నట్టుండి విసుగు, కోపం తెచ్చుకుంటారు, వాళ్ళ నిర్వేదం, కసి ఇంట్లో బలహీనురాలైన భార్యమీద వెళ్ళదీస్తారు.

ఈ పిల్లవాడి తండ్రి ఆ కోవకు చెందిన వాడే అయ్యుండడూ?

 పాతది లా ఉన్నప్పటికీ, ఒక క్రేప్ సిల్క్ కిమొనో, ఆకాశం కలర్ ఒబీ వేసుకున్నది ఆమె. వాటిని బట్టి తన వివాహ సమయంలోనూ, అంతకు ముందూ, ఆమె కు ఉండిన చక్కటి శరీర సౌష్టవం ఊహించగలిగాను.

 అప్పటి నుంచీ ఆమె పడ్డ కష్టాలు కూడా ఊహించగలిగాను.

ట్రెయిన్ ‘ఒయామా‘ దాటింది, ‘కొగనే‘ దాటింది, ‘ఇషిబాషీ‘ దాటింది, ఇంకా వెళ్తూ, వెళ్తూ ఉంది.

కిటికీ బయట ప్రదేశాలు మెల్లిగా చీకటి పడ్డాయి.

 తల్లి రెండు కార్డ్ లు రాయటం కాగానే , ‘‘అమ్మా నేను పోవాలి.” ఈ బోగీలో టాయ్లెట్ లేదు.

 ‘‘ఇంకొంచెం సేపు ఆగలేవా?” ఏం చెయ్యాలో పాలుపోక అడిగింది.

 కనుబొమ్మలు ముడేసి తల అడ్డంగా ఊపాడు.

 పిల్లవాడి చుట్టూ చేతులు వేసి, కలయజూసింది చుట్టుపక్కల, ఏం చేయాలో ఆమెకు తోచినట్లు లేదు.

 ‘‘ఒక్క రవ్వ ఓర్చుకో, కొంచెం సేపే” బ్రతిమాలుతూ వాణ్ణి ఊరడిస్తూ అంది తల్లి.

 కానీ తల విదిలిస్తూ వాడు, ఈ క్షణమో, ఇంకో క్షణమో పోసేస్తా అన్నాడు.

 ఈ లోపలే ‘ సునోమియా‘ కు వచ్చింది రైలు.

 కండక్టర్ ను అడిగింది, కానీ ఇక్కడ అంతసేపు ఆగదు, తర్వాత వచ్చే ‘ఉట్సునోమియా‘ దగ్గరైతే ఎనిమిది నిమిషాలాగుతుంది అని అన్నాడతను.

 ఆ తర్వాతి స్టేషన్ వచ్చేలోపల ఆ తల్లికి దిక్కుతోచక తల వక్కలయి ఉంటుంది ఆదుర్దా తో.

 అంతదాకా నిద్ర పోతున్న చంటి వాడు కళ్ళు తెరిచాడు. వాడికి రొమ్ము నోట్లో పెట్టింది, ‘‘ఇంకొంచం సేపే, ఇంకొంచం సేపే ఇదిగో” అంటూనే ఉంది పెద్దవాడితో. మొగుడు ఈమెను ఎట్లాగూ కాటికి పంపే లోపల వీడే ఆమెను హతం చేసేస్తాడు అనుకున్నా. బొంయ్ మంటూ రైలు స్టేషన్ లోకి వచ్చింది. అది ఆగీ ఆగక ముందే పిల్లవాడు వంగి పొత్తి కడుపు పట్టుకుని మొత్తుకుంటున్నాడు, ‘‘తొందరగా, తొందరగా.”

 ‘‘దా, దా ఇప్పుడు వెళ్దాం.” పసివాణ్ణి సీట్ మీద పడుకోబెట్టి వాడి మొహం దగ్గరగా మొహం పెట్టి, ‘మంచి పిల్లాడిలా ఉండు, కొంచెం ఆగు.” అంటూ నావైపు తిరిగి, ‘‘క్షమించండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, బిడ్డను కాస్త చూస్తుంటారుగా?” అంది

 ‘‘అయ్యో తప్పకుండా.” చాలా ప్రసన్నం గా చెప్పాను.

 ట్రెయిన్ ఆగింది. నేను తొందరగా తలుపు తెరిచాను, పిల్లవాడు ఒక్క గొంతులో దూకాడు ప్లాట్ఫారం మీదకి.

 ‘‘నెమ్మది.” కానీ తీరా వాళ్ళమ్మ కదిలిపోయే ముందు పసి పిల్లవాడు చేతులు ఆమెవైపు జాపి కయ్యిమని ఏడవటం మొదలు పెట్టాడు వాడి కొంపకు ఎవరో నిప్పు పెట్టినట్లు.

 ‘‘ఓరి తండ్రీ” ఒక క్షణం సందేహం లో పడింది, వెంటనే ఆ గుడ్డలమూటలోంచి ఒక పల్చగా నిడివిగా ఉన్న హక్కర్ట్ సిల్క్ ఒబీ తీసింది. అది పిల్లవాడి చేతులకిందినించి దూర్చి వీపు పైకి ఎత్తుకునే లోపు ఒక పాత చేతిగుడ్డ నేతది తీసుకుని తన మెడమీద వేసుకుని ఈ పిల్లవాడితో ఒబీని నైపుణ్యం గా బిగించి కట్టుకుని ప్లాట్ ఫాం పైకి దిగింది. ఆమె వెనుకే నేనూ దిగుతూ, ‘‘ఇక్కడే నేను దిగాల్సింది‘‘ అన్నాను.

 ‘‘ఓహ్…………అవునా!” ఆశ్చర్యపోయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా మర్యాద పూర్వకంగా తలవంచి ఊపింది.

 ‘‘మీ సాయానికి కృతజ్ఞత లు.”

 జనం మధ్య పక్క పక్కనే నడవసాగాం.

 ‘‘మీకు శ్రమ ఇస్తున్నాననుకోకపోతే ఈ కవర్లు పోస్ట్ చేస్తారా?”

 తను, ఆ మాట అంటూ డ్రెస్ ముందు వైపు దోపుకున్న వాటిని తీయడానికి ప్రయత్నించింది, బిడ్డను మోస్తున్న కిమొనో తాళ్ళు తన వక్షాల మధ్య మెలికలు పడి పోస్ట్ కార్డు కవర్లు తీయడానికి వీలుపడలేదు. ఆగింది .

 ‘‘అమ్మా ఏమయింది?” అరుస్తున్నట్టే అన్నాడు పిల్ల వాడు.

 ‘‘ఒక నిమిషం” అంటూ గడ్డం వంచి డ్రెస్ వదులుచేసుకోసాగింది. ఆమె చెవి తమ్మెలు ఎర్రబారాయి వత్తిడికి, సరిగా అప్పుడు చూశాను ఆమె మెడమీద వేసుకున్న చేతిగుడ్డ నడిచేప్పుడు కదలికలవల్ల ముడతలుగా మెలిక పడి ఒక భుజం పైకి చేరింది.

 నేను, ఏమీ మాట్లాడకుండా అది సరిగా సర్దటానికి ఆమె భుజం మీద చెయ్యి పెట్టాను. ఉలిక్కిపడి కళ్ళు పైకెత్తింది. ‘‘కర్చీఫ్ మొత్తం ముడుచుకు పోయింది, అందుకని నేను…….‘‘ కాస్త లజ్జ పడుతూ అన్నాను.

 ‘‘ఓహ్ మన్నించండి. మరి, సరిచేస్తారా.”నేను ఆ చేతి గుడ్డను మడతలు సరిచేస్తున్నప్పుడు ఆమె కదలక, మెదలక నిల్చుంది.

 నేను ఇంకో మాట లేకుండా ఆమె భుజం మీంచి చెయ్యి తీయంగానే మరోసారి ‘‘నన్ను క్షమించండి.” అంది.

 అక్కడ ఆ ప్లాట్ ఫాం మీద ఒకళ్ళను ఒకళ్ళం పేరు అడగకుండా విడిపోయాం.

 చేతిలో పోస్ట్ కార్డ్స్ తో స్టేషన్ ద్వారం దగ్గరకు వచ్చాను. అక్కడ ఒక పోస్ట్ బాక్స్ ఉంది గోడకు. కవర్ల లోపల ఉన్న  ఆ పోస్ట్ కార్డ్స్ ను చదవాలని నాకు లోపల అనిపిస్తోంది అని తెలుస్తోంది నాకు. అట్లా చేస్తే నష్టం ఏం లేదని కూడా అనిపించింది.

ఒక్క క్షణం తటపటాయించాను, కానీ పోస్ట్ డబ్బా దగ్గరకు రాగానే అడ్రస్ వ్రాసున్న వైపు పైకి వచ్చేట్టుగా ఒక్కోటీ డబ్బాలోకి పడేశాను. పడవేయంగానే వాటిని మళ్ళీ బయటకు తీద్దామని అనిపించింది. అవి లోపలకు జారుతుంటే వాటి అడ్రెస్ లు చూశాను. రెండూ టోక్యో లో అడ్రెస్స్ లే. ఒకదానిపై ఆడ పేరు, ఇంకొక దానిపై మగ పేరు.

Spread the love

Suraparaju Padmaja

సూరపరాజు పద్మజ గారు చెన్నై నివాసి. సాహిత్య విమర్శకురాలు, అనువాదకురాలు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!