చేలో బార్లు తీరిన
సైనికుల్లా పొగ మొక్కలు
నిటారుగా నిలబడి
వందనం చేస్తున్నాయి
నల్లటి నేల మీద
పచ్చ చుక్కల్లా మెరిసిపోతూ
మోరలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాయి
పైరగాలికే ఆకులు బారలు చాస్తూ
నింగి వైపు ఎగబాకుతున్నాయి
నిండాపరుచుకున్న
మంచు దుప్పట్లోంచి తొంగి చూస్తున్న
ఆకులపై పేరుకున్న నల్ల మడ్డి
లేలేత ఎండకి నిగనిగలాడుతోంది
పొద్దుపొడుపుకు ఎదురెళ్లే
వడుపైన చేతులు ఇరిసిన ఆకులు
పచ్చపచ్చగా చేదు వాసన వేస్తున్నాయి
గుడ్డి వెలుగు దీపం
దారి చూపిస్తూ
గొరుకొయ్యల దిక్కుకేసి
నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ సాగిపోతోంది
తూర్పున చుక్క పొడవకముందే
గుట్టలుగా పొగుపడ్డ ఆకులు
గుర్రం మీద కర్రకు వడుపుగా
వడివడిగా అల్లుకుంటున్నాయి
కర్రకు ఆకు అందించే ముఖాలకు
ఏ ఫెయిర్ అండ్ లవ్లీ లు అవసరం లేదు పొగాకుమడ్డి బెత్తెడు మందాన
అంటుకున్న ముఖాలు
చిక్కటి నవ్వుల్ని విరగబూస్తున్నాయి
చలికి ఒళ్ళు విరుచుకుంటూ
బేరన్ పొయ్యిలోకి బొగ్గేస్తున్న
అన్నం మెతుకులు
నల్లగా మసిబారిపోయాయి
బేరన్ లోంచి దించే ఆకు
పసుపు వర్ణానికే మారుపేరులా
బంగారం దించుతున్నట్లే ఉంది
తెల్లారగట్ట మంచుకు మెత్తబడ్డ ఆకులు
అదో రకపు కమ్మని వాసనతో
చెక్కుల్లో ఇమిడిపోతున్నాయి
శ్రమను పేర్చుకున్న పొగాకు పందిళ్ళలోని బంగారం బంగారంలా అమ్ముడవడం లేదు చెక్కుల్లోంచి నాలుగు ఆకులు
బయటకు లాగిన చేతులు
పెదవి విరుపుమాటలతో
ఆరుగాలపు కష్టాన్ని యిరగ కోస్తున్నాయి చూర్ణమైపోతున్న బతుకులు
ఆకుదీసిన ఈనెల్లా
చెత్త కుప్పలు చేరుతున్నాయి
వ్యాక్యాన్ని జతచేయండి