విశాలాకాశం కింద
దేహాన్ని సాగదీస్తూ
ముందుకు సాగే
మెలికల పాములా
బంగారు కిరణాల్లో
మెరిసే వెండి పోతలా
నేల నడుమున
అలరారే వడ్డాణంలా
అచ్చెరువొందే మనిషిని
మరికాస్త విస్మయపడేలా
జీవులన్నింటికి ఆలవాలమవుతుంది
ఒడ్డున నడుస్తూ
తన చిరునవ్వుల
మైమరపులో మునిగి పోతూ
అక్కడక్కడా వైశాల్యం కొలుస్తూ
ఒంగిన చెట్ల నీడలు
ఇరువైపులా పరుచుకున్న
పచ్చని పంట పరిమళానికి
తన చల్లదనాన్ని అద్ది
ముఖాన్ని స్పర్శిస్తూ
తాదాత్మ్యతను పరిచయిస్తుంది
పిట్టల కువకువలు
కొంగల జపాలు
కాకుల అరుపులు
సీతాకోకచిలుకల పలకరింపులు
నీటిలో అల్లరల్లరిగా
ఈదులాడే చేపపిల్లలు
పిల్ల గాలుల వీచికలకు
ఆనందంగా తలలూపే గడ్డి పూలు
బరువు దింపుకోమంటూ
మేఘాలను ఊరిస్తాయి
ఒక తడి
ఎన్నింటికో జీవిక
ఒక ప్రవాహం
బతుకు అడ్డంకుల
అధిరోహ ఉత్సాహం
ఒక నది
పర్యావరణ సమతుల్యత
ఆ నది
ఒక కుటుంబం
నదీ ఆమె
వేరువేరు కాదు
ఆమె మరో రూపం
జీవనది
వ్యాక్యాన్ని జతచేయండి