ఉపవాస దీక్ష విరమణకు కూర్చున్నారు మిత్రులు
ఉపవాసం ఏదీ లేకపోయినా
సాయంత్రం విందుకు మిత్రులతో కూర్చున్నాము
బయట మంటలు పెట్టిన ఎండ సాయంత్రవేళ కూడా
మా విందు హాలుని వేడి గాలులతో
ఒకింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది
మిత్రుడు చెప్పాడు
'మూడు ఖర్జూరాలతో ఉపవాసదీక్ష ముగించమన్నాడు ప్రవక్త- ఒక ఖర్జూరంతో కూడా ప్రారంభించవచ్చు'
బయట మంటలు దహించి వేస్తున్నపుడు
నలుగురు మిత్రులతో
ఒక సాయంత్రం కలవడమే ఒక పండుగ
ఒక్క ఖర్జూరం కూడా పెద్ద విందు
మిత్రుడు అన్నాడు
బయటి వేడి గాలుల నడుమ
నాలుగు చల్లని మాటలు పంచుకుందాము
పండుగల రోజుల్లో అటూ ఇటూ ఇళ్ల నడుమ తిరిగిన
సేమియా పాయసాలు, గారెల గురించి ఒకరు చెబితే
మసీదు పైనా, గుడి పైనా, చర్చి పైనా ఎగిరిన
పావురాల గురించి మరొకరు చెప్పారు
ఒకరు రోజూ ఉర్సు గుట్టకు మొక్కిన
తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే
మరొకరు ఊళ్లలోని పీరీల పండుగల
రోజుల గురించి తలచుకొని తడిసిపోయారు
విందులో పదార్థాలు ఒకటొకటిగా కదులుతున్నాయి
వేడిసెగలు తగలని
వేరు వేరు భావనలు దరిచేరని
చల్లని రోజులలోకి కదిలి
జ్ఞాపకాలు మెల్లిగా బరువెక్కాయి
విందు చివరన మిత్రులు వడ్డించిన
సేమియా పాయసం తీయగా నవ్వింది
మిత్రులు ఇచ్చిన చల్లని అలాయ్ బలాయ్ తో
హాలులోకి చొరబడిన వేడిగాలి నిష్క్రమించింది
వ్యాక్యాన్ని జతచేయండి