నీళ్ళంటే ఎవరికైనా ఎందుకిష్టం ఉండదు? సముద్రాల నుంచి నదులూ, సెలయేళ్ళూ, పంట కాలువలూ, ఎర్రని వాన నీళ్ళూ, ఎగసి దూకే జలపాతాలూ.. నీళ్ళేవైనా సౌందర్యం ఏం తక్కువ? నగ్న ప్రకృఇకి బలమే నీళ్ళు కదా? నీరంటే జీవమూ పూజనీయమూ కూడా కదా
గాంభీర్యం సంద్రం సొంత కావచ్చు. నిత్య సంభాషణ నది సౌందర్యం. ఎటూ ప్రవహించలేని నిస్సహాయతతో సముద్రం గాంభీర్యం ముసుగేసుకుని ఘోష పెడుతుంటే, నిత్య ప్రవాహిని గా నది, తుళ్ళుతూ తన దారి వెంట కలిసిన ప్రతి ఒక్కరితోనూ కబుర్లు చెప్తుంది.
మట్టి నేల మీద ప్రవహించే నదిది ఒక రకం సౌందర్యమైతే, కొండలూ రాళ్ళ మీదుగా పరుగులు పెట్టే నదిది మరో రకం సౌందర్యం
కృష్ణా కావేరీ ఈ రెండో కోవ కు చెందుతాయి. రెండూ ఎక్కువ భాగం రాళ్లు, కొండల మధ్యే ప్రవాహ గమనాన్ని నిర్దేశించుకున్నాయి
తల కావేరి దగ్గర గోముఖం నుంచి స్వచ్చంగా ఎగసి పడుతూ జన్మించిన కావేరి గమనమంతా వురుకులూ పరుగులే. గంభీఅంగా ప్రశాంతంగా ప్రవహించే చోట్లు కావేరీ జీవధారలో అంతగా కనపడవు, రిజర్వాయర్ లో బంధిస్తే తప్ప
నిసర్గ ధామ దగ్గర మడమలు తడిసేలా నదిని దాటినా , తలకాడు దగ్గర పుట్టిలో గింగిరాలు తిరిగినా, శ్రీరంగ పట్నం దగ్గర మెట్ల మీద నీళ్ళలో కాళ్ళు పెట్టి కూచున్నా, కావేరి తో ప్రయాణం, కావేరి లో ప్రయాణం అత్యద్భుతమైన అనుభవమే
మైసూరు కి దగ్గర లో అర్క నది, కావేరీ నదుల సంగమ స్థానం ఉంటుంది. అర్క నెమ్మది గా మందగమనయై వస్తుంటే, మరో వపు నుంచి శరవేగంగా ప్రవహిస్తూ వచ్చి అర్కను తనలో కలిపేసుకుని ముందుకు సాగి పోయే దృశ్యం సంభ్రమాశ్చర్యాలు కల్గిస్తుంది
అక్కడి నుంచి మరి కొంత ముందుకు వెళ్తే మేకదాటు అనే ప్రాంతం మరో సౌందర్య దర్శనం. ఒక మేక ఎగిరి దూకి దాటగలిగినంత సన్నని వెడల్పుతో రాళ్ల మధ్య శరవేగంగా ప్రవహిస్తుంది కావేరి అక్కడ.నీలి రంగులో పెద్ద హోరుతో రెండు కొండ రాళ్ల మధ్య జీవ చైతన్యంతో ఎవరి మాటా వినని చిన్న పిల్లలా పరుగులు పెట్టే కావేరి ఆమె
శివ సముద్రం వద్ద కావేరి రెండు పాయలు గా చీలి, గగన చుక్కి, భరచుక్కి అనే రెండు జలపాతాలు గా శివమెత్తి ఆడుతుంది. జలపాత ప్రదేశానికి ప్రవహించే కావేరి వేగాన్ని అంచనా వేయడం చాలా కష్టం.
శివసముద్రం గ్రామాన్ని ఆనుకునే కావేరి ప్రవాహం! నీలం లో ఆకుపచ్చ కలిసిన రంగుతో వాలుగా ప్రవహిస్తూ, గగన చుక్కి జలపాతం వైపు పరిగెత్తే కావేరి మనల్ని దయగా దగ్గరకు రమ్మంటుంది. రాళ్ళ మీద కూచుని పాదాలు నీళ్ళలో పెట్టుకుంటే, నవ్వుతూ తుళ్ళుతూ పాదాల చుట్టు గిరికీలు కొట్టి, తడిపేసి ముద్దాడి పోతుంది . ఆ రాళ్ళు, చుట్టూ పచ్చని కొండల మధ్య కావేరిని చూస్తు జన్మల తరబడి కూచోవచ్చనిపించే అందం అక్కడ
ఇక కొండల మీద నుంచి దూకే ఆ రెండు పాయలూ, సంతోషంతో గుండె నిండి, కమ్మని భావమేదో కన్నీరై చిందేలా దూకుతూ ఉంటాయి. ప్రపంచమేమై పోయినా ఆ కావేరి కి పట్టదు.
హొగెనెక్కల్ జలపాతం ఒక మహోగ్ర సౌందర్య ధార. వర్షాకాలంలో హొగెనెకల్ సౌందర్యం చూసి , కాస్త సౌందర్య ప్రియులైన వారు మతి పోగొట్టుకోకుండా ఉండలేరు
శ్రీరంగం లో మరొక దృశ్యం.
సముద్రపు కౌగిలి చేరే వరకూ కావేరి ఎక్కడా ఎవరికీ తలొగ్గదు. అవిశ్రాంతంగా, అలుపు సొలుపు లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవాహిని కావేరి
కవేరి తో ప్రేమలో పడని వాళ్ళెవరూ ఉండరు
రెండు రాష్ట్రాలూ కొట్టుకు చావ వలసిన నదే నిజంగా!
నదులన్నిటినీ స్త్రీలకు ప్రతీకలు గానే చూస్తున్నా, కావేరి more powerful, more energetic and more feminine గా అనిపిస్తుంది
ఏ నదైనా అనంతమైన శక్తి తో భయత సౌందర్యంతో అంతా తానే మహోగ్రం గా ప్రవహిస్తూ ఉన్నపుడు మన ఉనికి ఆ ప్రకృతిలో ప్రశ్నార్ధకమైన చోట, ఆ సౌందర్యాన్ని నిశ్శబ్దంగా చూస్తూ కూచోవటం ఒక అలౌకిక స్థితి.
కావేరి ఎలాటి సందేశాలూ ఇవ్వదు. ఏ నదీ ఇవ్వదు.
మనమే తీసుకోవాలి. జీవించినంత కాలం, కావేరిలా శక్తివంతంగా, జీవచైతన్యంతో, దూకుడుగా బతకాలంతే, No matter what
వ్యాక్యాన్ని జతచేయండి