నేను పుట్టి పెరిగింది మొత్తం రాయలసీమ చిత్తూరు జిల్లా పలమనేరు టౌన్ లో. నా చదువు మొత్తం జరిగింది పలమనేరు SRRS మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ( సింపుల్‌గా నార్త్ స్కూల్ అని పిలిచేవారు). అలా స్కూలు బ్యాగులో మోసే పుస్తకాలు చదువుకుంటూ, హోమ్‌వర్కులతో బతుకీడుస్తున్న రోజుల్లో… అంటే నా నాలుగో తరగతిలో అన్నమాట. ఎండల కాలం దాంతో పాటే సెలవులూ వచ్చాయి. బోల్దన్ని సెలవులు అవన్నీ ఏం చేసుకోవాలా అని మా అక్కా, నేనూ, ఇంకొంతమంది స్నేహితులు మాటాడుకున్నాం.
పలమనేరు గాంధీ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో వేసవి సెలవులలో పిల్లలలో పఠనాసక్తిని పెంపొందించడానికి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని, వెళ్లిన ప్రతి ఒక్కరూ రిజిస్టర్లో సంతకం చేస్తే రోజుకు ఒక పుస్తకం ఇస్తారని అవి తెచ్చుకు చదువుకుందామనీ మా అక్క చేసిన ప్రతిపాదనని అందరూ అంగీకరించారు.
అనుకున్న ప్రకారమే వెళ్ళి అక్కడ మా పేర్లూ, ఇంటి అడ్రెసులూ చెప్పి ఒక్కొక్క పుస్తకమూ తెచ్చేసుకున్నాం. అలా నా చేతికి అందిన మొదటి పుస్తకం “సింధ్‌బాద్ సాహస యాత్రలు”. ఉన్న ఊళ్ళో బతకటం కష్టమైపోయి ఇంటినుంచి బయలు దేరిన సింధ్ బాద్ అనే మనిషి పడ్డ కష్టాలు, అతని ప్రయాణం లో కలిసిన వింత మనుషులూ, కొత్తకొత్త అనుభవాలూ. ఇప్పుడూ నవ్వొస్తుందిగానీ అప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో.
ఎక్కడైనా పాత ఇల్లు కనిపిస్తే అక్కడ దెయ్యం ముసలాడు ఉన్నాడేమో అనుకునేదాన్ని. ఏ కాకర పాదో, అలా పందిరి మీదకి పాకిన ఆనపకాయ తీగో కనిపిస్తే ద్రాక్షా తీగలు ఇలాగే ఉంటాయేమో అనుకునేదాన్ని (ఆ పుస్తకంలో బొమ్మ అలాగే ఉంది మరి) నాన్న తెచ్చే ద్రాక్షపళ్లతో సారాయి తయారు చేయవచ్చా? లాంటి వైల్డ్ థాట్స్ కూడా వచ్చేవనుకోండి అది వేరే విషయం.
అన్నిటికంటే ముఖ్యంగా ఆ పెద్ద పెద్ద గండభేరుండ పక్షులూ, వజ్రాల లోయలూ. అతని భార్య చనిపోయినప్పుడు అతన్నీ సజీవంగా సమాధిలోకి తోసేయడాలూ ఇవన్నీ నాకు కొత్తగా, వింతగా అనిపించేవి. గాళ్లో ఎగిరే గద్దలని చూస్తూ గండ భేరుండాలని ఊహించేదాన్ని. అసలు ఒక్క కాలికి తనని తాను కట్టేసుకుని తప్పించుకున్నాడు గానీ… ఆ పక్షి అతన్ని చంపేసి ఉంటే? అతని ఇంటివాళ్లకి తెలిసేది కూడా కాదు. బతకడానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉందా అనిపించేది.
ఇంట్లో చపాతీ చేసినప్పుడు సింధ్ బాద్ నములుతున్న రొట్టెలు ఇలాగే ఉండి ఉంటాయా? ఎడారి అంటే ఎలా ఉంటుందీ అనే ఆసక్తికరమైన ఆలోచనలు స్కూలు బుక్స్‌లో ఉన్న జాగ్రఫీ మీద ఇంట్రస్ట్ పుట్టించాయి. ఎప్పుడైనా వానపడుతున్నప్పుడు కాగితం పడవ వేస్తే అందులో సింధ్‌బాద్ అతనితో నేనూ వెళ్తున్నట్టు ఊహించుకునేదాన్ని. ఆ పడవ మునిగిపోతే ఈదుకుంటూ ఎలా బయటికి రావాలా అని వర్షాన్ని చూస్తూ ఆలోచించేదాన్ని. పెద్దయ్యాక నేనూ సింధ్ బాదిని లాగా అలా యాత్రలకు పోయి సముద్రాలూ, ఎడారులూ అన్నీ తిరిగి బోల్డంత డబ్బులు తెచ్చి పేద్ద ఇల్లు కట్టి మా అమ్మా నాన్నాలకి రోజూ పాలకోవాలూ, మైసూర్ పాక్‌లూ తెచ్చివ్వాలి అనుకునే దాన్ని (అప్పుడు నాకు తెల్సిన స్వీట్లు అవి రెండే మరి)
పదేళ్ల లోపు వయసులో ఓ చిన్న పుస్తకం చదివితే అరేబియా లాంటి దేశాల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ల మత, ఆహారపు అలవాట్లూ, జీవన విధానాలు ఎలా ఉంటాయో నాకు తెలియకుండానే నేర్పించిన పుస్తకం అది. మన దగ్గరి మనుషులే ఎలా మోసగిస్తారో, ప్రేమనటిస్తూ తమ పనులు చేయించుకునే ద్రాక్షతోటల్లోని ముసలి వాడి లాంటి మనుషులూ ఉంటారని తెలుసుకున్న రోజులవి.
సరే.. వయసూ, దానితోపాటు మెదడూ పెరిగాయి. అరేబియా ప్రాంతాలు పూర్తిగా మారిపోయాయి. అయినా నాకు తెలిసిన, నేను ఊహించుకున్న ఎడారులూ, ఇసుక దిబ్బలూ, ఒయాసిస్సుల్లూ అన్నీ నా ఊహల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. ఎందుకంటే అది నా మొదటి ఊహ, సింధ్‌బాద్‌తో పాటూ తిరుగుతూ ఓ ఎనిమిదేళ్ల పిలకాయ సృష్టించుకున్న ప్యారలల్ వరల్డ్. అది నా సొంత ప్రపంచం.
ఇప్పుడూ చదువుతూనే ఉంటాను. పని చేస్తూ ఉంటాను…. అయినా ఎప్పుడైనా నడుస్తుంటే “ఎండ ఎంతేక్కువగా ఉందో” అనుకుంటే… ఓ ఎడారీ అక్కడ నడుస్తున్న అరబ్బు దుస్తుల్లో సింధ్ బాద్. అతనితో పాటూ నడుస్తున్న చిన్నారి అనే ఓ దృశ్యం కళ్ల ముందు మెదులుతుంది. (ఆ పాపని నేనే అని వేరే చెప్పక్కర లేదనుకుంటా) ఎప్పుడైనా ఏదైనా పనిలో అలసిపోయినట్టు అనిపిస్తే, చావు ఎదురైన ప్రతీసారీ ఏదో ఒకరకంగా తప్పించుకొని, ఎంతోకొంత డబ్బు కూడా సంపాదించిన సింధ్‌బాద్ గుర్తొస్తాడు. ఎప్పుడైనా ఓడిపోతున్నట్టు అనిపిస్తే అతను దేవున్ని ప్రార్థించిన విషయం, అతని ఇంటినీ, కుటుంబాన్ని తలుచుకుని ధైర్యాన్ని తెచ్చుకున్నదీ గుర్తొస్తుంది.
ఏమో! మనందరి లోపలా ఓ సింధ్‌బాద్ ఉన్నాడేమో, లేకుంటే ఇన్నిన్ని ఇబ్బందుల మధ్యా, ఈ రకం కాలంలో కూడా బతకగలుగుతున్నాం అంటే అతనికంటే మనమే గొప్ప యాత్రికులమేమో….
వ్యాక్యాన్ని జతచేయండి