సాయంత్రం ఐదు గంటలకే సమామిష్ లో చీకటి పడుతుంది. అమెరికాలో ఉన్నంతకాలం ఏ సిటీ లో ఉన్నా ఉదయం పూట వాకింగ్ చేయడం తప్పనిసరి.ఏదైనా పని ఉండి ఉదయం వాకింగ్ చెయ్యని రోజు సాయంత్రమైనా సరే వాకింగ్ చేయాల్సిందే. మొత్తానికి ఏ సమయమైనా వాకింగ్ తప్పనిసరి.
అయితే ఇండియాలో ఉన్నప్పుడు వాకింగ్ చేసే వాడిని.అమెరికాలో చిన్నా పెద్దా ముసలీ ముతకా అందరూ జాగింగ్ చేయడం చూసిన తరువాత జాగింగ్ చెయ్యడం అలవాటుగా మారింది.అది గంట కానీ గంటన్నర కానీ.
బోస్టన్ నుండి సియాటెల్ కు నెలరోజుల వెకేషన్ కోసం పాపతో సహా అందరమూ వచ్చాము.
ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకే కొంచెం మసక మసగ్గా ఉంటుంది. నెమ్మదిగా చీకటి చాయలు కమ్ముకుంటూ ఐదు గంటలకు చిక్కటి చీకటి పడుతుంది.
ఆరోజు ప్రపంచాని కంతటికి విమానాలను అందించే ఎవరెట్ ప్యాక్టరీ బోయింగ్ విమానాల తయారీ కేంద్రం చూసి రావడానికి వెళ్ళి వచ్చేటప్పటికి సాయంత్రం అయింది.
వాషింగ్టన్ రాష్ట్రంలో కింగ్ కౌంటీలో సమామిష్ సంపన్నవంతమైన పట్టణం.సమామిష్ పట్టణంలోని క్రాస్ వాటర్ కమ్యూనిటీ అది. కొన్ని ఇళ్ళు బయట రంగురంగుల సీరియల్ లైట్లతో మిరుమిట్లు గొలుపుతున్నాయి.
ఇక్కడ ఇళ్ళకు పెద్ద పెద్ద కిటికీలు కిటికీలకు పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి. అద్దాలు గుండా బయటకు చూస్తే చుట్టూ అడవి కనిపిస్తుంది. అడవిలోని చీకట్లోకి చూడడం కొత్త కదా… నాకు చాలా భయమేసేది.ఇక్కడ వీళ్ళు ఏ భయమూ లేకుండా ఎలా ఉండ గలుగుతున్నారు… అవసరం దేనినైనా అలవాటుగా మారుస్తుందా… కొంతమంది వృద్ధులు పెద్దపెద్ద ఇళ్లల్లో కూడా ఒంటరిగానే ఉంటారు.
ట్రాక్ సూట్ పైన రెయిన్ ప్యాంట్ వేసుకుని, కాళ్లకు మందంగా ఉన్న సాక్స్ లు వేసుకుని, బూట్లు తొడుక్కుని, టీషర్ట్ పై రెయిన్ కోటు ధరించి తలకు హుడీ పెట్టుకుని చేతులకు గ్లోవ్స్ వేసుకుని నెమ్మదిగా ఇంట్లో నుండి బయటపడ్డాను. అమెరికా ట్రిప్ మొత్తంలో వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయడం… రోజులో అతిగొప్ప అనుభూతి నిచ్చే కార్యక్రమం.కారులో తిరిగి చూడలేని ప్రకృతి అందాలను నలువైపులా తిరిగి దర్శిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని యూట్యూబ్ లో వింటూ జాగింగ్ చేయడం ఓహ్… రోజూ అదో అద్భుత దృశ్యశ్రవ్యకావ్యం. మనసు శరీరము ఏకమై అనుభూతి చెందుతూ చెందుతూ దివ్యలోకాలకు దారి వెతుకుతూ వెతుకుతూ…
అమెరికా వచ్చేటప్పుడు ఆడియో వినడానికి ఇయర్ ఫోన్స్ వాడేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడియో కళ్లద్దాలను ఆడియో వినడానికి ఉపయోగిస్తున్నాను. ఎంతైనా అమెరికా టెక్నాలజీ కదా!
ఈరోజు వాకింగ్…హర్షణీయం ఫోడ్ కాస్ట్ లో… మహీ బెజవాడ సాహితీ ప్రయాణం గురించి… యూట్యూబ్లో.. ఇంటర్వ్యూ తో మొదలైంది.
ఇంటి బయట వీధిలైట్లు మినుకు మినుకు మంటూ పనుపు పచ్చని కాంతిని విరజిమ్ము తున్నాయి.
ముందుకు వెళ్లే కొద్దీ వెలుతురు దూరం కాసాగింది.చీకటి నెమ్మదిగా వెలుతురును మింగేస్తూ ఉంది.
పుట్ పాత్ పై నెమ్మదిగా నడుస్తున్నాను. చైనా వాళ్ళ ఇంటి ముందుకు రాగానే గరాజ్ ముందు లైట్ వెలిగింది.
గుండెలు గుభిల్లు మన్నాయి. అటు వైపు చూస్తే మనుషులు ఎవరూ లేరు. వాళ్ళ ఇంటి మీదుగా ఎవరైనా వెళితే ఆటోమేటిక్ లైట్ వెలుగుతుందని అర్థమైంది.
ఇంకొంచెం ముందుకు సాగి పూర్తిగా చీకటిలో మునిగిపోయాను. వాషింగ్టన్ రాష్ట్రంలో కింగ్ కౌంటీ జిల్లాకు సియాటెల్ హెడ్ క్వార్టర్. ఈ రాష్ట్రంలో సంవత్సరంలో ఆర్నెల్లు విరామం లేకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి. భూగర్భ మురుగునీటి సరఫరా అద్భుతంగా ఉండటం వలన ఎంత వర్షం పడ్డా ఒక్క చుక్క నీరు కూడా రోడ్లమీద నిలబడదు.
క్రాస్ క్రీక్ దాటి వాటర్ క్రాస్ కమ్యూనిటీ రెండవ భాగంలో కట్టిన ఇళ్ళ వద్దకు చేరుకున్నాను. క్రిస్మస్ కు వేసిన లైట్లు ఇంకా మినుకు మినుకు మంటూనే ఉన్నాయి.
ఎత్తైన రోడ్డు కావడంతో కొంచెం ఆయాసంగా నడుస్తున్నాను. తలకు ఏదో తగిలింది. ఉలిక్కిపడ్డాను. తల పైకెత్తి చూస్తే ఫెన్సింగ్ మీదుగా బయటకు వచ్చిన చెట్టు కొమ్మ. గట్టిగా గాలి పీల్చి వదిలాను.
చినుకుల కింద వడివడిగా నడుస్తున్న నడక జాగింగ్ కు మారింది.
చుట్టూ నిశ్శబ్దం. ఎక్కడా మనిషి అలికిడేలేదు. ఎక్కడ నుండో ఏదో శబ్దం వినపడింది. చుట్టూ చూశాను. ఏమీ కనబడలేదు.రెండడుగులు ముందుకు వెళ్లాను.వాననీళ్ళు రోడ్డు పక్కనున్న డ్రైనేజీ గుంటలోకి ప్రవహిస్తున్నాయి.
ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాను. చిమ్మ చీకటి. దూరంగా బ్రిడ్జికి ఉత్తరాన మాత్రమే రోడ్డు పక్కన లైట్లు వెలుగుతున్నాయి.
జుయ్ జుయ్ మని ఎవరో పెద్దగా ఈల వేసినట్టుగా అనిపించింది.ఉలిక్కిపడి అటూ ఇటూ చూశాను.ఎవరూ కనిపించలేదు.గాలి తెమ్మెర చల్లగా నన్ను స్పృశించడం తెలిసింది.గాలి కూడా ఇంత పెద్దగా ఈల వేస్తుందా..మామూలు సమయాల్లో ఎన్నో సార్లు గాలి ఈలలు విని ఉంటాము.కానీ ఈ నిర్జన ప్రదేశంలో ఈ రాత్రిలో ఈ చల్లని వాతావరణంలో మనుషులే తిరగని సమయంలో ఈ గాలి ఈల గుండె ఝల్లు మనిపించింది.
ఒక వైపున మేఘాలు చుట్టూ ముసిరి ఉన్నా పడమటి ఆకాశంలో ఎర్రెర్రని రంగులు నీలి రంగుతో రంగరించినట్టుగా కలిసి పోయింది. రంగు రంగుల పడమటి ఆకాశం నుండి సందు చేసుకుని ఏదో వింత ఆకారం బయటికి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆకాశం కింద అడవిలో అక్కడొకటి ఇక్కడొకటి ఇళ్ళు.ఇళ్ళ చుట్టూ అడవి. దట్టంగా ఉన్న అడవి. పొడవైన చెట్లు, రోడ్డుపై జర జరా పాకుతున్న కార్ల శబ్దం.
కొంచెం ముందుకు పోవడంతో రోడ్డు వంపుగా ముందుకు సాగింది. రోడ్డు పక్కనే వుట్ పాత్ పై కొంత దూరం నడిచాను.అక్కడ చీకట్లో కుక్క భౌ భౌమని అరిచింది. కుక్కలంటే నాకు చాలా భయం కావడం మూలాన ఆ చిమ్మ చీకట్లో కుక్క అరిస్తే ఇంకేముంది టక్కున ఆగిపోయాను. ఎక్కడైనా సరే దారిలో నడిచేటప్పుడు కుక్కలు ఎదురైతే నెమ్మదిగా పక్కకు తప్పుకుంటాను. కుక్కను దాటిన తర్వాత వెనక్కెనక్కి చూస్తూ నడుస్తాను. ఎందుకంటే అరిచే కుక్క కరవదంటారు. అరవకుండా ఉండే కుక్క కరుస్తుందని భయం.
అమెరికాకు వచ్చే ముందే ఒంగోలులో కృష్ణారెడ్డి మామకి కుక్క కాలు పట్టుకొని పీకడం కండ బయటికి రావడం గుర్తొచ్చింది. విచిత్రంగా గాయపడిన చోటే చాలా ఇంజక్షన్లు వేశారని చెప్పాడు. ఒళ్ళు జలదరించిందప్పుడు. ఒకప్పుడైతే బొడ్డు చుట్టూ పన్నెండు ఇంజక్షన్లు వేసే వాళ్ళని చెప్పేవాళ్ళు. ఆ మాట వింటేనే ఒళ్ళు గగుర్పొడిచేది.
ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి చీకట్లో ఒక అమెరికన్ కుక్కను పట్టుకొని నడుస్తూ ఎదురయ్యాడు.
ఇక్కడ అమెరికాలో ప్రతి అమెరికన్ కూ ఒకటి రెండు కుక్కలు ఉంటాయి. కానీ వాటి మెడకు బెల్ట్ తప్పకుండా ఉంటుంది.
బోస్టన్ లో ఒకరోజు సి బ్లాక్ గుండా వాకింగ్ చేసేటప్పుడు రేపిడో నడిపే గడ్డం అమెరికన్ ఇంట్లో నుండి బయటకు వస్తూ తన చిన్న కుక్కను వదిలేశాడు.అది నాదగ్గరకు పరుగెత్తుకుంటూ వొచ్చింది. చిన్న కుక్క పిల్ల అయినా సరే నాలో ఒక చిన్న జర్క్.
ఇట్స్ ప్రెండ్లీ అంటూ నవ్వుతూ వెనకే వొచ్చాడతను.
ఒంగోలులో రంగారాముడు చెరువు కట్టపై రాత్రి తొమ్మిది గంటల వరకు వాకింగ్ చేస్తున్నా…చుట్టూ హెడ్ లైట్ల వెలుతురులో ఎంతో జనసమ్మర్థం… ఏ భయమూ ఉండదు. తొమ్మిది గంటల వరకూ సందడే సందడి. ఎటు చూసినా మనుషులే.
ఇక్కడ అమెరికాలో ఇంటి బయట కార్లలో మనుషులు తప్ప కాళ్ళతో నడిచే మనుషులు కనపడ్డంలేదు. మనుషుల్ని చూడాలంటే సిటీస్ కి వెళ్లాల్సిందే.
చీకట్లోనే అలా జాగింగ్ చేస్తూ చేస్తూ ముందుకు సాగాను. వాటర్ పాండ్ జంక్షన్ దగ్గర రోడ్డు దాటాలి. జీబ్రా లైన్లు దగ్గర ఆగి రెండు వైపులా చూస్తుండగా ఒక కారు వచ్చి ఆగింది. ఆకారు వెనుక ఇంకో కారు, దాని వెనుక ఇంకో కారు ఆగాయి.ఇండియాలో కార్లను చూసి మనుషులు ఆగినట్లే అమెరికాలో మనుషులను చూసి కార్లు ఆగిపోతాయి. ఇక్కడ మనుషుల ప్రాణాలకు అంత విలువ ఉంటుంది మరి.
ఇండియాలో ప్రాణాలకు విలువే లేదు. బడిలోకి పిచ్చికుక్కలు వచ్చి పిల్లల్ని కరిచినా దిక్కే లేదు. టీచర్లు, పిల్లలే కుక్కల్ని తోలుకోవాలి.పాపం మా స్కూల్లో మస్తాన్ సార్ బాత్రూమ్ లోకి పోయినప్పుడే రెండు సార్లు గోడ మీద నుండి పాములు కిందకు దూకాయి.
అదృష్టం కొద్దీ కరవలేదు కాబట్టి సరిపోయింది.బాత్ రూములో టాయిలెట్లో ఇరుక్కుపోయిన పాముని బయటకు తియ్యడానికి నేనెంత ప్రయత్నం చేశానో… పిల్లల బాత్ రూములోకి ఎన్ని సార్లు పాములు వచ్చాయో.. బడిలో పిల్లల ప్రాణాలకు విలువుందా! రోడ్లపై మనుషుల ప్రాణాలకు విలువుందా!
విండ్సర్ కమ్యూనిటీ దాకా వచ్చిన రోడ్ పక్కన పుటపాత్ ఆగిపోయింది. సైకిల్ ట్రాక్ మొదలైంది. జాగింగ్ ఆపి గిరుక్కున వెను దిరిగాను. రోడ్డుపై వెళ్తున్న కార్ల లైట్లు వెలుతురు చెట్లపై బడి చెట్ల నీడలు ప్రహారీ ఫెన్సింగ్ పైన పడి పరిగెడుతున్నాయి.
హఠాత్తుగా రోడ్డు రెండో వైపున మనుషుల మాటలు వినబడ్డాయి. అస్సలు మనుషులు లేని చోట ఒక్కసారిగా మాటలు వినబడేసరికి అటువైపు చూశాను.
ఇద్దరు మనుషులు కుక్కను పట్టుకుని సిగరెట్లు తాగుతూ పొగ వొదులుతూ నడుస్తున్నారు. పరీక్షగా చూశాను. భార్యాభర్తలు లాగున్నారని అనుకున్నాను.
ఇండియాలో సిగిరెట్ల పొగ తాగడం మాని డ్రగ్ సిగరెట్లు దాకా వెళ్ళారు. వీళ్ళింకా స్మోకింగ్ దశలోనే ఉన్నారే అనిపించింది.
ఏదైనా అలవాటును పాశ్చాత్య దేశాలు మనదేశానికి అంటించి వదిలేస్తారు.వాళ్ళు మాత్రం ఎంతవరకు వాడుకోవాలో తెలుసుకుని జాగ్రత్త పడతారు. ఇవాళ సెల్ ఫోన్ కూడా అలాంటి జాడ్యమే మరి.
నిరక్ష రాస్యులు, అజ్ఞానంతో కొట్టు మిట్టాడేవాళ్ళు మాత్రం ఆ విషవలయంలో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటారు. నేను మళ్ళా జీబ్రా లైన్స్ మీదుగా వెనక్కు తిరిగి ఫుట్ పాత్ ఎక్కాను.
ఎడమ చేతి వైపు కమ్యూనిటీ లైట్లు మిల మిలా మెరుస్తున్నాయి. హాలోవీన్ పండుగకు వేసిన సీరియల్ లైట్లు క్రిస్మస్ న్యూ ఇయర్ అయిపోయేంతవరకు అలాగే ఉంటాయి.
వెనుతిరిగి వాటర్ క్రాస్ కమ్యూనిటీలో రెండో భాగంగా ఉన్న ఇళ్ళ మీదుగా పెరిగిన పొదలు దాటుకుంటూ ముందుకు వచ్చాను. ఫుట్ పాత్ బాగా డౌన్ గా ఉండడంవల్ల జాగింగ్ ఆపి నడక సాగించాను. ఎత్తుగా ఉన్నప్పుడు పల్లంగా ఉన్నప్పుడు జాగింగ్ చేస్తే మోకాళ్ళు నొప్పి వొస్తుంది. అందుకే నడుస్తూ రోడ్డు దాటి బ్రిడ్జి మీదకు ఎక్కాను . బ్రిడ్జ్ కు లోపల వైపుకు దృష్టి సారించాను. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.
ఎన్నోసార్లు పగటి పూట నడిచిన దారైనా చీకట్లో చూస్తే ఎందుకో భయం. చీకట్లో చెట్లు జుట్టు విరబోసు కున్న దయ్యాల్లాగా కనిపిస్తున్నాయి. దయ్యాలంటే ఎవరికైనా భయమే. అసలు దయ్యాలను ఎవరైనా చూశారా! మనుషులు చనిపోయినప్పుడు
ఎక్కడకు వెళతారు. దయ్యాలవుతారని చిన్నప్పుడు అనేక కథలు చదువుకున్నాం. బాల్య జ్ఞాపకాలు అలా మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై పోయి ఉంటాయి.
చిన్నప్పుడు కలికివాయ చెరువుకు ఎప్పుడైనా రాత్రి పూట చెంబు తీసుకుని పోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురమైనా కలిసి వేళ్ళేవాళ్ళం. అప్పుడు చెరువులో దూరంగా నిప్పు కొరువులు ఎర్రగా కనిపించేవి. అరే కొరివి దెయ్యాలు రేయ్ అని భయం భయంగా దగ్గరగా వచ్చి కూర్చునేవాళ్ళం.
రెడ్డిపాలెం వాళ్లు చచ్చిపోతే చెరువు మధ్యలోనే తగల బెట్టే వాళ్ళు. ఆ బూడిద,చిన్న చిన్న కట్టెలు మిగిలి పోయి ఉండేవి. వడ్డిపాలెం వాళ్ళు చెరువుకు దక్షిణం వైపు కాలువ కట్ట దగ్గర పూడ్చి పెట్టే వాళ్ళు.
గరువు చేలల్లోకి పోయేటప్పుడు కాలవ దగ్గరగా వచ్చేటప్పటికి పెద్ద గోరీ ఒకటి ఉండేది. ఆ గోరీ దాటేంతవరకు అటు వైపుకు చూడకుండా వొడివొడిగా నడిచే వాణ్ణి. ఎవరైనా తోడుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నడిచే వాళ్ళం. పెద్దవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్ళ చాటుగా వెళ్లే వాళ్ళం.
చిన్నప్పటి చీకటి భయం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందా! చీకటి ఎలా వొస్తుంది. వెలుగు లేకుంటే చీకటే కదా. వెలుగులో లేని భయం చీకటిలో ఎందుకు వస్తుంది. చీకటిలో మనిషి ఆలోచన మారిపోతుందా!
ఈచీకటిలో అమెరికాలో ఎవరైనా బయట ఒంటరిగా తిరుగుతారా అంటే తిరుగుతారు. అయితే కుక్కల్ని వెంట బెట్టుకు తిరుగుతారు. కుక్క పక్కన ఉంటే మనిషికి ఎంతో ధైర్యం.
మరి నాకు కుక్క లేదే. అయినా నేను ధైర్యంగా తిరగ గలుగుతున్నాను. ధైర్యంగానా ఆదైర్యంగానా. అప్పుడప్పుడు నేను కూడా ఉలిక్కి పడుతున్నాను కదా!
జాగింగ్ చేస్తూ ముందుకు పోయాను. రోడ్డుకు ఆవతలి వైపున పొడవాటి చెట్లు పెద్ద అడవిలా ఉంది. ఆ చెట్లు గాలికి ఒక్కసారిగా భయ్యిమంటూ కదిలాయి.ఆ శబ్దానికి మళ్ళీ వొళ్ళు జలదరించింది. చుట్టూ చూశాను. చెట్లు ఊగడం చూసి ముందుకు నడిచాను.
యూట్యూబ్ లో మహి బెజవాడ ఇంటర్వ్యూ చివరికొచ్చింది. ధైర్యముండాలి దేనికైనా. ధైర్యం చేసి ముందుకు కదలాలి. అప్పుడే దేనినైనా సాధించగలము. మహి జీవితము ఆదర్శము చాలా గొప్పగా అనిపించింది. తెలుగు సాహిత్య లోకంలో ప్రచురణ రంగంలో వెంకట్ సిద్ధారెడ్డి తో కలిసి పుస్తకాలతో చేస్తున్న ప్రయోగాలు
సాధించిన విజయాలు తెలుగు సమాజానికి ఎంతో కొంత మేలు చేసేవే. అలాంటి వారి ధైర్యమే చీకట్లోనైనా ఒంటరిగానే నన్ను నడిపిస్తుంది. ఇంత కటిక చీకట్లో కూడా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.
క్యారసాన్ ఎలిమెంటరీ స్కూల్ కి ఎడమవైపుగా తన.కూడలి దగ్గరకు చేరాను.పగలైతే అక్కడ నుండి దక్షిణం వైపుగా చూస్తే శిఖరాన మంచు ధరించిన మౌంట్ రైనీర్ పర్వతం కనిపిస్తోంది. అక్కడ నుండి ఘుందుకు చూస్తే చిల్డ్రన్ ఎట్ ప్లే బోర్డు కనిపించింది. ఇళ్లల్లో కనిపించే వామ్ లైట్స్ నారింజ రంగు వెలుగును విరజిమ్ముతున్నాయి. ఒక రథం లాంటి చిన్న ఇల్లు దానికి చుట్టూ లైట్లు వేశారు. ఆ లైట్లను లైట్ల కాంతిని ఆస్వాదిస్తూ నడుస్తున్నాను.
ఆ నిశ్శబ్ద నిశీధిలో చీమ చిటుక్కుమన్నా గుండె గుభిల్లుమంటుంది.గల గలమని శబ్దం వినిపించింది. అటు ఇటు చూశాను.ఎవరూ లేరు.ఆకులు గలగల మంటూ దోర్లుకుంటూ పోసాగాయి.హమ్మయ్యా అనుకుని గుండె మీద చెయ్యి వేసుకున్నాను.చివరకు ఆకులు కూడా నన్ను భయ పెడుతున్నాయే అనుకునే సరికి పెదాలపై చిన్న నవ్వు తెమ్మెర మెరిసి చీకట్లో మాయమైపోయింది.
ఎడమ చేతి వైపుగా కొంచెం ముందుకు వెళ్ళగా రోడ్డు నుండి ఇంటిదాకా ఎర్రటి పండ్లు కాసిన చెట్లు వరుసగా ఉన్నాయి. ఆ రోడ్లో ఫుట్ పాత్ లేకపోయినా రోడ్డు వెడల్పుగా ఉంది. ట్రాఫిక్ లేదు. అందుకే ఆ రోడ్డు చివరిదాకా వెళ్లాలని నిర్ణయించుకున్నాను.నేను అటు వైపుగా జాగింగ్ చేస్తూ ముందుకు సాగాను. ఎడమవైపు చాలా పెద్ద ఇల్లు. చాలా పొడవుగా ఉంది. ఇంటి పక్కనే పెద్ద తోట. ఇంటి ముందుగా పెద్దకొలను. కొలను ఒడ్డునే పడవలు. కొలనులో ఈదుతున్న బాతులు. ఇక్కడి మనుషులు ప్రకృతి నుండి విడివడి నివసించడం లేదు. నేటివ్ అమెరికన్స్ ఏవిధంగానైతే అడవులలో జీవించారో. ఇప్పటికీ అమెరికన్స్ అదే పద్ధతిలో నివసిస్తున్నారు.
ఇళ్ళ చుట్టూ చెక్క కంచె. కంచె బయట ముళ్ళ పొదలు. చీకటిలో కూడా ఆ పొదలలో నుండి ఏ జీవీ బయటకు రాదు. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఏ జీవులు బయటకు వస్తాయి..కాకులు కూడా కావు కావు మంటాయే కానీ ఇండియా కాకుల్లా శబ్దం బయటికి రాదు. గొంతు లోనే శబ్దం ఆగిపోయినట్టుగా వస్తుంది.
ఆడవుల్ని అక్కడక్కడ కొట్టేసి ఇళ్ళు కట్టుకున్నా, ఇళ్ళ చుట్టూ తప్పనిసరిగా చిన్నదో పెద్దదో అడవి ఉండాల్సిందే ఇక్కడ…
సడన్ గా హలో అని వినిపించింది. .అదిరిపడి పోయాను. పరుగెత్తుకుంటూ వెనక నుండి వచ్చాడు అమెరికన్.అతను నన్ను దాటి ముందుకు వెళ్లాడు. ఎంత భయపెట్టావురా బాబూ అనుకున్నాను.
కొలంబస్ భయపడి ఉంటే అమెరికాను కనుక్కునేవాడా యుద్ధంలో చనిపోతామనుకుంటే అస్సలు సైన్యం లో చేరతారా! అమెరికా కొత్త ప్రాంతం అయితే మాత్రమేమి… ఇండియా కన్నా మనుషుల ప్రాణానికి ఎక్కువ విలువనీయడం కనిపిస్తుందిక్కడ.
ఉత్సాహంతో ముందుకు ముందుకే సాగుతున్నాను. జాగింగ్ జాగింగ్ అలసట వచ్చినప్పుడు వాకింగ్. ముందు కనిపించే ఇల్లు క్రిస్మస్ లైట్లతో జిగేల్మంటున్నాయి. ఆ లైట్లు వెలుతురులోన ఆ రోడ్డు చివర వరకూ ముందుకు వెళ్ళాను. రోడ్డుకు చివర ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి తర్వాత ఎడమవైపున పెద్ద కొండ లాగా ఉంది. కొండపైన ఏమి ఉందో అర్థం కావడం లేదు. రోడ్డుకు ఇరువైపులా తెల్లని ఫెన్సింగ్ వేసి ఉంది. రోడ్డు ముందుకు పోతూనే ఎడమవైపున దట్టమైన అడవి చెట్లతో నిండిపోయి ఉంది. చీకటి నిండిన అడవిలోకి తొంగి చూడడానికి ప్రయత్నించాను. భయం వేసింది.వీధి లైటొకటి కునికిపాట్లు పడుతోంది.రోడ్డు ముందుకు సాగుతుంది. రోడ్డుకు ఇరువైపులా తెల్లని చెక్క ఫెన్సింగ్ వేసి ఉంది. వాకింగ్ కు వొచ్చేటప్పుడు చిన్నల్లుడు ప్రభవ్ ఎలుగుబంట్ల గురించి హెచ్చరించడం గుర్తొచ్చింది. మనుషులు కనిపిస్తే పైన బడి గోళ్ళతో రక్కుతాయి,చీల్చి వేస్తాయి అని భయపెట్టాడు.
నువ్వు ఎప్పుడైనా చూశావా అంటే చూడలేదన్నాడు.
మరి చూడకుండా ఎలా చెబుతున్నావు అని చెప్పి ధైర్యంగానే వాకింగ్ కు బయలు దేరాను. కానీ ఇక్కడ ఎలుగు బంటి భయం నన్ను ముందుకు పోనియ్యలేదు.
రోడ్డు మలుపు తిరిగి ఉంది. ఆ మలుపులో ఏముందో అర్ధం కావడం లేదు. కాలు ముందుకు పడలేదు.
నెల్లూరు దగ్గర రాముడు పాలెం సంఘటన గుర్తుకు వచ్చింది. డబ్బులు తీసుకోని ఎగ్గొట్టిన మిత్రుని కోసం వెళ్లాను. ఆ ఊరు కనుక్కుని వెళ్ళే సరికి చీకటి పడింది. సమయానికి కరెంట్ కూడా పోయింది. ఆచీకటిలో ఎదురుగా పెద్ద ఆకారం నన్ను నిలేసింది. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాసేవు అలాగే నిలబడి పోయాను.
కాసేపటికి పోయిన కరెంటు వచ్చింది. ఎదురుగా గుబురుగా ఉన్న పెద్ద చెట్టు కనిపించింది.చీకటి భయాలు ఆలా ఉంటాయి.
అలాగే ఇక్కడ మూల మలుపు నన్ను నిలేసింది. ఆ ముందు ఏముందో తెలియదు.
అక్కడ నుండి వెనుదిరిగి జాగింగ్ చేసుకుంటూ దారి పట్టాను.
కుక్కకు నడుముకి రేడియం బెల్టు తన తలకు హెడ్ లైట్ కట్టుకుని ఒక ఇండియన్ ఎదురొచ్చాడు.
ఇండియన్ కదా నేనూ ఇండియన్ అని గుర్తు పడతాడేమోనని ఎదురు చూశాను.
ఊహూ మూతి ముడుచుకుని దాటి పోయాడు.
ఇప్పుడే కాదు చాలా సార్లు ఇండియన్ ఎదురైనప్పుడు నాకు ఆశాభంగమే ఎదురయ్యింది.నలుపు లేదా చామన చాయ కలిగిన మనుషులు ఇండియన్స్ అయినా కావొచ్చు లేదా ఆసియన్స్ ఐనా కావొచ్చు.
ఎదురైనప్పుడు అలవాటు ప్రకారం హల్లో అనేవాడిని.మూతి ముడుచుకు పోయిన సందర్భాలే ఎక్కువ ఎదురయ్యాయి.
అమెరికా పోయి డాలర్లేనా సంపాయించేది. అమెరికన్ల నుండి మంచి విషయాలు నేర్చుకోకూడదా!ఎక్కడికి వెళ్ళినా ప్రతి మనిషికి నేర్చుకోవడం ఒకటి ఉండాలి కదా!
టెక్నాలజీ సాఫ్ట్వేర్ డాలర్ల లెక్కలే కాదు కదా జీవితమంటే!మనసుకు సంబంధమైనది, మంచికి సంబంధించినది, సమాజ అవగాహనకు సంబంధించినది నేర్చుకుంటూనే ఉండాలి.
వైయంసియ్యే కి వెళ్ళినప్పుడు జిమ్ చేస్తో ఒక పెద్దావిడ పుస్తకం చదువుతుంది. ఆ వయసులో ఆమెకు అవసరమా అనిపించింది. ఇండియానా పోలిస్ ఎయిర్ పోర్ట్ లో పండు ముదుసలి పెద్ద బౌండు పుస్తకం చదువుతూ ఉండడం చూశాను.ఆమె ఛాతీ ఆచ్చాదన మీద కూడా ఆమెకు పెద్దగా స్పృహ లేదు. ఏమి చావ బోయే వాళ్లకు చదవడం అవసరమా…వాళ్ళను చూసైనా నేర్చుకోవాలని తెలియదా..నేర్చుకోవడం నిరంతరం కదా. అది ఎప్పటి దాకా… చివరి దాకా….ఊపిరా గిపోయే దాకా కదా…
బరువెక్కిన మనసుతో ఇంటి వైపుగా సాగాను.
***
వ్యాక్యాన్ని జతచేయండి