‘‘జన్మచేత వచ్చే లక్షణాలు కొన్ని లోకం నించి నేర్చుకునేవి కొన్ని వుంటాయి మనకి…వీటన్నింటినీ వదుల్చుకోవడం ఒక సాధన..’’
‘‘ఆహార నిద్రామైథునాదులన్నీ జన్మత లక్షణాలు … కొన్ని అవే వదులుతాయి. మన సాధనతో పనేలేదు. నేర్చుకునేవి ప్రేమ, భయం, అనురాగం… వగైరా వగైరా అన్నీ… వీటిని సాధనతో వదుల్చుకోగలం…’’
అని ఆగాడు మహాలక్ష్మి. దుబ్బుగా పెరిగిన మీసాల కింద పెదాలు కదలడం తెలియలేదు… శబ్దమూ, చిబుకం కదలికలూ మాటల్ని అందించాయి. డెబ్బైఏళ్ళ మనిషతడు.. లోకం చూసిన వాడు.
ఆతడితో మాట్లాడడమంటే ఎంతో యిష్టం నాయుడికి.
ఎప్పుడూ యిలా మాట్లాడ్డు గానీ మహా లక్ష్మి ఒక్కోసారి యిలా మాట్లాడుతాడు.
‘‘భక్తి.. మతం… పూజ… యివన్నీ నేర్చుకునేవి’’అని కళ్ళెగరేసాడు.
దాని గురించి పట్టించుకోలేదు నాయుడు ‘‘అయితే కోపం జన్మత లక్షణమా? నేర్చుకునేదా?’’అనడిగాడు.
అడుగుతాడని అనుకున్నవి అడక్కపోవడమూ అనూహ్యమైనవి అడగడమూ నాయుడి దగ్గర ఉంటం చూసాడు. కాబట్టి మహాలక్ష్మి ఆశ్చర్యపోలేదు అయితే అతని ప్రశ్న మనసులో మోగినట్టనిపించింది.
నాయుడి బట్టతల మీద నిలబడ లేక కాంతి జారిపోతూ వుంది. పావలా కాసంత ఖచ్చితంగా కోసినట్టు వుంటాయి అతని ముక్కుపుటాలు. ముఖం గుండ్రంగానే వుంటుంది కానీ నెత్తి మీద కొంచెం ఒండ్రు అద్దినట్టు పైకి శంకం లాగా లేచి వుంటుంది. పళ్ళు కొంచెం దూరంగా వుంటాయి.
నాయుడికి మహాలక్ష్మి మీద యిష్టానికి కొలమానాలేమీ లేవు. గుళ్ళో భజన దగ్గర పరిచయమయ్యారు ఒకరికొకరు చాలా ఏళ్ళ క్రితం. ఎమ్మే పీహెచ్‌డీ చేసి తెలుగు మాస్టారిగా పని చేస్తున్న నాయుడికి భక్తి చాలా ఎక్కువ. ఉద్యోగం కాక అతనికున్న మరో వ్యావృత్తి భక్తే. సామర్ల కోటలో ఇరుకు సందుల్లో వీథి మొగదల ఉన్న గుళ్ళలో ఏ వారపు దేవుడికి ఆ వారపు భజనలో నాయుడుంటాడు. అతను బాగా పాడలేడు. కానీ భజనకి కావల్సింది అది కాదు. పైగా నాయుడు తన తెలుగు పాండిత్యాన్నంతా ధార పోసి సినిమా పాటల బాణీలో బ్రహ్మాండమైన భజన పాటలు రాస్తాడు.
డోలక్ మాస్టారూ భజన గురువూ అయిన మహాలక్ష్మితో అతనికి జన్మజన్మల బంధంగా స్నేహం కలిసిపోయింది. మహాలక్ష్మి గురువు. యితడు శిష్యుడు.
నాయుడి ప్రశ్న మనసులో తరంగాలుగా మోగుతోంది.
‘‘కోపం…’’ మీసాల్ని సవరించాడు. బనీనుకి అంటకుట్టిన జేబులోంచి బీడీ తీసాడు. పెదాల మధ్య పెట్టి అగ్గిపుల్లతో వెలిగించి
‘‘కోపం… కోపం నేర్చుకునేది .. సాధనతోనే పోతుంది..’’
‘‘బీడీ కూడా నేర్చుకునేదే కదా.. సాధనతో పోగొట్టుకో వద్దా’’ అంటూ నవ్వుతూ పొగని విదిలించాడు నాయుడు.
నవ్వాడు మహాలక్ష్మి. నవ్వు దగ్గులోకి దిగింది. దగ్గు ఆయాసం తెప్పించింది. కాసేపు ఆగి
‘‘సాధన సామాన్యం కాదు నాయుడూ’’అన్నాడు.
‘‘కానీ కోపం జన్మత లక్షణం కదా గురూ… అది నేర్చుకునేదేటి?’’
బీడిని పారేసి గట్టిగా వూపిరి పీల్చి వదిలి మెడల వరకూ పెరిగి వున్న జుట్టుని వేళ్ళతో సవరించి.. గుడ్లు కాస్త మిటకరించి..
‘‘నువు అడిగిన విషయం చిన్నదేం కాదు నాయుడూ… జన్మత లక్షణాలూ నేర్చిన లక్షణాలూ కలగా పులగమైపోయి ఏది ఏదో తెలవకుండానే కాలక్షేపం చేసేస్తున్నాం. కోపం చూడూ దానికి మూలం ఆధిపత్యం కాదా?’’ అన్నాడు. అని ‘‘మరి ఆధిపత్యం నేర్చుకునేది కాదా?’’అని కూడా అన్నాడు.
నాయుడు మహాలక్ష్మి వంక చూస్తూ ఉన్నాడు. ఈ పెద్దాయిన ఏమి చదివాడో ఎక్కడ తిరిగాడో కానీ బలే మాట్లాడతాడు. అతని మనసులో ఆధిపత్యము కోపమూ.. దానితో పాటు హింసా తిరుగుతూ ఉన్నాయి. చూసి చూసి..
‘‘సరే… నేను పోతా గురూ చిన్నోడు చూస్తూ ఉంటాడు…’’అని కదిలాడు.
కొంచెం భుజాలు ఎత్తి పెట్టి నడుస్తాడు నాయుడు. వెళ్తున్న నాయుడి వంకే చూస్తూ వుండిపోయాడు మహాలక్ష్మి.
నాయుడి రెండో కొడుకు మానసిక వికలాంగుడు. తండ్రి మాట తప్ప ఎవరి మాటా వినడు ఆ కుర్రాడు.
వీథిలోకి మళ్ళుతుండగా మొదటి ఇంటి అరుగు మీద కూర్చొని వున్న ఇబ్రహీం
‘‘నాయుడన్నా… ఎక్కడనించి రాక’’అని పలకరించాడు.
నాయుడు చూసి ఆగి గుమ్మానికి యిటువేపు వున్న అరుగు మీద కూర్చుంటూ ‘‘ఏముంది.. మంగళారం కదా ఆంజనేయుడి గుడి నించి’’ అన్నాడు.
అలా కాసేపు స్కూలు కబుర్లలోకి పోయారు. ఇబ్రహీం భార్య జరీనా వచ్చి నాయుడిని చూసి
‘‘అన్నయ్యా ఎళ్ళి పోమాకులే… వేట మాంసం మావిడికాయ వేసి వండాను.. కూర ఇస్తాను.. చిన్నోడికి పెడుదువు’’అంది.
నాయుడు ముక్కుపుటాలు ఎగబీల్చి ‘‘ఇందాకట్నుంచీ ఎక్కడ్రా వాసన అనుకుంటున్నా…అదీ సంగతీ’’అన్నాడు నవ్వుతూ.
జరీనా కూడా నవ్వింది.
నాయుడికి మాంసం అంటే పిచ్చి. అతని చిన్నోడికి అంతకన్నా పిచ్చి. కానీ నాయుడు ఖర్చు దగ్గర బాగా వెనకాడే మనిషి. అతని కలుపుగోలుతనం వల్ల ఆ వీధి లోని చాలా మందికి అతను అన్నయ్య బావ మామయ్య రకరకాలు…
జరీనా బాక్సు తెచ్చి యిచ్చింది. చాలా వేడిగా వుంది. నాయుడు మూత తీసి వాసన చూసి ‘‘అబ్బ! ఇలాంటి ఉడుకుడుకు కూర తింటే స్వర్గం దిగొచ్చేదా…’’ అంటూ ‘‘సరే వస్తానమ్మా’’అని మెట్లు దిగి అడుగులు వేసాడు.
కాస్త లేటయ్యింది అప్పటికే.
ఇంటి దగ్గర చిన్నోడు వీరంగం ఆడేస్తున్నాడు. వాళ్ళమ్మ వాణ్ని కాయలేక కిందా మీదా పడుతోంది.
నాయుడ్ని చూడగానే చిన్నోడు వాళ్ళమ్మ చేతుల్ని విడిపించుకుని ఒక్క వుదుటున నాయుడు మీద పడి రెండు చేతులతోనూ బాదడం మొదలు పెట్టాడు. కడుపు మీద కొట్టుకుంటూ అరుస్తున్నాడు.
మామూలుగా అయితే నాయుడు ఆ కుర్రాణ్ణి వంచి రెండు దెబ్బలు బాదేవాడు. కానీ ఈవేళ అతని వంక చూస్తూ ఉండిపోయాడు. బక్కపల్చని ఆ కుర్రవాడు పొట్ట మీద కొట్టుకుంటూ అరుస్తున్నాడు. అతని నోటిలో చొంగ… కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి.
నాయుడు బాక్సు మూత తీసి కూరని అన్నంలో కలిపాడు. అన్నాన్ని చూస్తూనే చిన్నోడు ఆ… ఆ… అంటూ నవ్వడం మొదలు పెట్టాడు. కలిపి ఒక ముద్ద వేడి వేడి అన్నం నోట్టో పెట్టాడు. ఆర్చుకుని తింటున్న చిన్నోడిని చూస్తుంటే కళ్ళంట నీళ్ళు తిరిగాయి నాయుడికి
నాలుగైదు ముద్దలు తిన్నాకా నాయుడు చేతిని ఆపి దాన్ని నాయుడి నోటికేసి తిప్పాడు చిన్నోడు. మామిడికాయ మాంసం కూర. దాని రుచికి నాయుడికి కళ్ళ నీళ్ళు తిరిగాయి మళ్ళీ
ఈ చిన్నోడి ఆకలి కోపం పిచ్చి అన్ని జన్మత లక్షణాలే కదా గురువా అనుకున్నాడు. కానీ యివి వదలవు.
వాడిని కొట్టడానికి కారణం నా ఆధిపత్యమేనా? అనుకున్నాడు.
పూలకి రంగులు వున్నవి కానీ
పూజకి రంగులు వున్నావా
పూల వంటిదే జీవాత్మా
పూజ వంటిదే పరమాత్మా
ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా…
కంఠమ్మీద నరాలు నులక తాడులా ఉబ్బి పోతూ పాడుతున్నాడు నాయుడు. మెళ్ళమీద జుట్టు ఎగిరెగిరి పడుతుండగా డోలక్ వాయిస్తున్నాడు మహాలక్ష్మి.
జాయ్ శ్రీ కనకదుర్గమ్మ వారికీ…
జాయ్ శ్రీ సామర్లకోట సత్తెమ్మ తల్లి వారికీ…
అని ముగించాడు.
ఇద్దరూ మళ్ళీ దణ్ణాలు పెట్టుకుని బయటకు వచ్చారు. పక్క కిళ్ళీ కొట్లో బీడి తీసి ముట్టించాడు మహాలక్ష్మి.
వెయ్యేళ్ళ క్రితం నల్లసేనపు రాతిలో చెక్కిన బొమ్మలా వుంటాడు మహాలక్ష్మి. కాటు రంగు చర్మానికీ ఎముకలకీ మధ్య ఎర్రని ద్రవం మాత్రమే ఉంటం వల్ల చర్మం సాగుతూ వేళ్ళాడుతూ ఉంటుంది. నలుగురు స్త్రీలని పెళ్ళాడిన వాడు మహాలక్ష్మి. రెండు వీధులలో ఉన్న కుటుంబాలన్నీ అతని సంతానమే. చనిపోయిన ముగ్గురూ అతనికి కనీసం జ్ఞాపకమైనా లేరు.
చాలా హింసని అనుభవించిన వాడు మహాలక్ష్మి.
‘‘నాకు పదారు పదేడేళ్ళప్పుడు కామోసు.. మా వూరిలో చాలా పెద్ద కూలీల పోరాటం జరిగింది.మా వూరే కాదు చుట్టుపక్కల పదిపదేను వూళ్ళ కూలిపనోళ్ళు కూలీ రేట్లు పెంచాలని పోరాడినం. అప్పట్లో కమ్యూనిస్టులే మా నాయకులు. ఒక రోజు పోలీసోల్లు రెండు వాన్లలో దిగి తరిమి తరిమి కొట్టారు. నన్ను వూరి మధ్యలో పడేసి కర్రలు విరిగిపోయేలా కొడితే ’’చేతులు చూపుతూ ‘‘ఆరు గజాల పంచె రక్తం మండ్లమైపోయింది బాబా. రెండు రోజులు సోయి లేకుండా పడున్నా’’ అని గొట్టం లాగా పొగ వదిలాడు.
ఈ కథ చాలా సార్లు విన్నాడు నాయుడు.
‘‘నన్ను కొట్టిన పోలీసోల్లని కామందుల్నీ చంపేయాలనుకున్నాను. ఉడుకు రక్తం కదా … తిరిగాను. అంత కోపం వుండేది కానీ ఏమీ చైలేదు. వాళ్ళు ఏ కోపం లేకుండా అంత హింస ఎందుకు చేసారు? ఆధిపత్యం వుండడంవల్ల కదా. అంత కోపం ఉండీ నేనెందుకు ఏమీ చైలేదు? ఆధిపత్యం లేకపోవడం వల్లనే కదా…’’
ఈ మాటలు కొత్తగా వింటున్నాడు నాయుడు.
‘‘అందుకే కోపం జన్మత లక్షణం కాదు..ఒకరి మీద నీ కుండే ఆధిపత్యం పెత్తనం వల్ల వచ్చేది…దాన్ని వదుల్చుకోవాలి.’’
కాసేపు వూరుకున్నాడు నాయుడు. మహాలక్ష్మి కళ్ళలోనికి చూస్తూ
‘‘నీకే గానీ ఆధిపత్యం వుంటే ఆళ్ళని చంపేద్దువా?’’అన్నాడు.
చిన్న నవ్వు నవ్వాడు మహాలక్ష్మి.
‘‘ఈ ప్రశ్న వస్తుందని తెలుసు నాయుడూ… చాలా ఏళ్ళుగా ఈ ప్రశ్నకి జవాబు చెప్పుకోలేకపోతున్నా.
నాయుడు మహాలక్ష్మి వంక చూస్తున్నాడు.
“కోపం వున్న వాడికి ఆధిపత్యం లేకపోవడం గొప్పా.. మంచిదా… ఆధిపత్యం వున్నవాడికి కోపం లేకపోవడం మంచిదా?గొప్పదా ’’
ఏది గొప్ప?
‘‘దేవుడు గొప్పా… మతం గొప్పా.. దేవుడే గొప్పనుకోవడం కోపం లేని ఆధిపత్యం..మతం గొప్పదని అనుకోవడం కోపం వున్న ఆధిపత్యం..దానికి కోపం కావాలి. హింస కావాలి. అందుకే భక్తీ మతమూ పూజా యివన్నీ నేర్చుకునేవి… వాటిని వదుల్చుకోవాలి.’’
‘‘అంటే నాస్తికులైపోవాలా?’’
‘‘కాదు. వాటిని వదుల్చుకునేందుకు సాధన చేయాలి…
నాయుడు చూస్తూ ఉండిపోయాడు.
ఆఖరుగా బీడీ దమ్ము పీల్చి దాన్ని విసిరేస్తూ అన్నాడు మహాలక్ష్మి
‘‘ఆ సాధన ఏంటో తెలుసా?
జీవించడం….జీవించనీయడం’’
వ్యాక్యాన్ని జతచేయండి