ఇచ్ఛామతి

తీరం చేరినా చెదరని జ్ఞాపకాలు…

సినిమాటోగ్రఫీ రంగంలో మాస్టర్స్ చేసిన నేను పుస్తకాలు చదవడమేగానీ ఎప్పుడూ కలం పట్టుకుని కథలు రాసిందిలేదు. కానీ కరోనా సమయంలో నా మనసు పూర్తిగా స్క్రీన్ ప్లే, దర్శకత్వం వైపుకు మళ్ళింది. మెల్లిగా సినిమా కథలు, కథనాలు రాయడం మొదలుపెట్టాను. అలా రాస్తూ ఉండగా, తెలుగు సాహిత్యంలో అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఒక మిత్రుడు నాతో తన కథల పుస్తకం గురించి చర్చలు జరిపేవాడు. ఆ సమయంలోనే నేనూ రచనలు చేయాలని నా మదిలో చిన్న ఆశ పుట్టింది. అప్పుడే నా చిన్ననాటి జ్ఞాపకాలు నిండిన ఒక కథను రాసి ఒక సంవత్సరం పాటు ఎవ్వరికీ చూపించకుండా దాచిపెట్టేశాను. కానీ ఎందుకో? ఎలా ధైర్యమొచ్చిందో తెలియదుగాని  ఒకరోజు నిద్ర లేచిన వెంటనే ఆ కథను ఒక వెబ్ మ్యాగజైన్‌కు పంపాను. కథ ప్రచురితమైతేనే సాహిత్య రచనలు చేస్తాను లేకపోతే సినిమా కథలు మాత్రమే రాసుకుంటానని గట్టిగా మనసులో అనుకుని రిసల్ట్ కోసం ఎదురుచూశాను. (నాకలా ఎందుకు అనిపించిందో ఇప్పటికీ అర్థంకాదు.)

అలా 2022లో నా మొదటి తెలుగు కథ “రూఫస్ గాడి సైకిల్” సారంగ వెబ్ మ్యాగజైన్‌లో కథల పొద్దు అనే శీర్షికలో నా ఇంటర్వ్యూతో సహా ప్రచురితమవ్వడంతో నా రచనా ప్రయాణం మొదలయ్యింది. ఆ కథ చదివి చాలా మంది నన్ను నోస్టాల్జియా కథలు మరికొన్ని రాయమని సలహా ఇచ్చేవారు. కానీ ఆ సమయంలో నేను కలిసిన కొందరు మనుషులు, చూసిన పరిస్థితులు నన్ను, నా రచనను వేరే దారికి మళ్ళించాయి. అనుకోకుండానే స్త్రీ ప్రధానంగా ఉండే కథలు ఎక్కువగా రాయడం, వాటిని పత్రికలకు పంపడం జరిగిపోయింది. కొన్ని కథలు సాక్షి, విశాలాంధ్ర, V6 వెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. అప్పటికి ఆరు కథలు రాశాను. వీటికి అదే నేపథ్యంలో మరికొన్ని కథలు జతచేసి ఒక పుస్తకంగా తీసుకురావాలనే కోరిక పుట్టింది. అనుకుందే తడవుగా పదమూడు కథలతో పుస్తకం రాయడం పూర్తి చేశాను.

కథలు రాయడం 2023 లోనే పూర్తయినా.. ఒక పుస్తకంగా రావడానికి ఇంత సమయం పట్టింది. మరి ఇంత ఆలస్యం ఎందుకయ్యిందని అడిగితే చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి.. నేను అనుకున్నట్టు పుస్తకం తీసుకురావాలనే పట్టుదల. రెండు.. ఎడిటింగ్. నా వరకు ఈ ఆలస్యం నాకు, ఈ కథలకి ఎంతో మంచి చేసిందనే చెప్పగలను. ఒకవేళ నేను గనుక ఆవేశపడి ఈ కథలను రెండు సంవత్సరాల ముందే పుస్తకంగా తీసుకుని వచ్చుంటే అవి నేను మాత్రమే కూర్చుని చదువుకోవాల్సి వచ్చేదని కచ్చితంగా చెప్పగలను.

గత రెండు సంవత్సరాలలో ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల, కొందరు రచయితలు, పబ్లిషర్ల ఫీడ్ బ్యాకులు – పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ల వల్ల నా రచనా శైలిలో కాలక్రమేణా చాలా మార్పులు వచ్చాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, మరికొన్ని విస్మరించాను. ఆ చిన్న అనుభవంతో ఈ పదమూడు కథలలో ఎన్నో సవరణలు చేశాను. ఒకానొక కాలంలో “ఆహా! చాలా బాగా రాశానే” అని భుజాలు తడుముకుని గర్వపడ్డ భాగాలను కూడా కథకి అనవసరం అనిపిస్తే ఎలాంటి బాధ లేకుండా తీసి డస్ట్ బిన్లో పడేశాను. నీతి, ప్రేమ సూక్తులు లేవు. అతిశయోక్తి లేదు. అనవసర డ్రామాలు లేవు. ప్రతీ వాక్యం కాంషియస్ గానే వ్రాస్తూ.. కేవలం కథలు మాత్రమే రాయగలిగాను. మొత్తానికి ఇగోతో ఈ మార్పును తిరస్కరించకుండా.. ఈ ప్రక్రియను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ, ఈ కథలతో పాటు నేను కూడా పరిణామం చెందుతూ రావడం నాకు బాగా నచ్చింది.

ఉషాప్రత్యుషగారు తన తండ్రిగారి జ్ఞాపకార్థం మొదలుపెట్టిన బాలా బుక్స్ పబ్లికేషన్స్ సంస్థకు నా పుస్తకం చేరింది. నా కథలు, ఆలోచనలను, ప్రయోగాలను మెచ్చి ఈ పుస్తకాన్ని నేను అనుకున్నట్టుగా తీర్చిదిద్దదానికి ఉషాగారు నాకెంతో స్వేచ్ఛనిచ్చి స్వాగతించారు. ఆ విధంగా నా పుస్తకానికి నేనే కవర్ డిజైన్, లే అవుట్ కూడా చేసుకునే అవకాశం దక్కింది. అనుకున్నట్టుగానే నా పుస్తకం “తీరం చేరే దాకా – మరికొన్ని కథలు” అనే శీర్షికతో ప్రచురితమయ్యి నా చేతికొచ్చింది.

పుస్తక ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. కవి గోరటి వెంకన్నగారు, రచయితలు మొహమ్మద్ ఖదీర్‌బాబుగారు, కుప్పిలి పద్మగారు, సినిమాటోగ్రాఫర్ పి.జీ. విందాగారు వంటి ప్రముఖులు నాలాంటి కొత్త రచయిత పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఒప్పుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వారి చేతుల మీదుగా జూలై 6, ఆదివారం నాడు పుస్తకం ఆవిష్కరణ జరిగింది.

కానీ ఆవిష్కరణ రోజు హైదరాబాదులో మొహరం, బోనాలు, తొలి ఏకాదశి జరుగుతుండడంతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. ఆవిష్కరణకి చాలా తక్కువ మందే వచ్చారు కానీ నాకు కావాల్సిన వారు మాత్రమే వచ్చినందుకు నాకెంతో సంతోషమనిపించింది. మిగితా గెస్టులతో పాటు అందరం గోరటి వెంకన్నగారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. ఓ గంట దాటింది అయినా ఆయన రాలేదు. సిటీకి అవతల వైపు ఉన్న వనస్థలిపురం నుంచి ఇవతల వైపు ఉన్న ఎమ్మెల్యే కాలనీకి రావాలి. చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. అందరూ దాదాపు ఆశలు వదులుకున్నారు. ఒకవైపు భయంగానే ఉన్నా, నాకు మాత్రం ఎక్కడో చిన్న ఆశ మిగిలుంది. సరిగ్గా 6:54 నిమిషాలకి వెంకన్నగారి కార్ వచ్చి ఆగింది. ఆయన మెల్లిగా కార్ దిగారు. నేనదే మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా కలవడం. పరిచయం చేసుకుని షేక్ హాండ్ ఇవ్వగానే ఒక్కసారి రోమాలు నిక్కపొడిచాయి. అసలు కథా రచనకు ఏమాత్రం సంబంధంలేని వారు, ముఖపరిచయం లేకున్నా, తమ సమయం వెచ్చించి నా పుస్తకం చదివి, నా రచనా శైలిని అర్థంచేసుకుని, నా కాంటెంపరరీ కథలు నచ్చి, మెచ్చి ఈ తొలి రచయిత కోసం.. ఇచ్చిన మాట ప్రకారం వెంకన్నగారు ఆరోజు ఎంతటి ట్రాఫిక్ జామ్ ఉన్నాసరే సభకు వచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆప్యాయంగా నా రచనల గురించి మాట్లాడారు. కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. సభ ముగిసే వరకు అక్కడే ఉన్నారు. ఇంతకన్నా నా పుస్తకానికి గొప్ప గౌరవం, సత్కారం ఇంకేముంటుంది అనిపించింది.

మరోవైపు నన్ను ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను మంచి రచనలవైపు నడిపించిన వారిలో మొహమ్మద్ ఖదీర్‌బాబుగారు ఒకరు. కథలు ఎలా రాయాలో కూడా పుస్తకాలు రాసిన వారికి కథలు అంత సులువుగా నచ్చవని తెలుసు. వారిని మెప్పించడం చాలా కష్టం కూడా. రైటర్స్ మీట్ ద్వారా నన్ను గుర్తించి, ప్రత్యక్షంగాను ఒక కథను విపరీతంగా మెచ్చుకొని, పరోక్షంగాను మరో కథను మౌనంగా తిరస్కరించి మొత్తం నా రచనా శైలిలో మార్పుకు కారణమయ్యారు. వారితో పరిచయం చాలా తక్కువ కానీ నేను వారిని కలిసి పుస్తకం అందించి విషయం చెప్పగానే అతిథిగా రావడానికి ఒప్పుకున్నారు. ఆవిష్కరణ రోజున వారు నా కథల గురించి, శైలి గురించి, చిన్న చిన్న వ్యత్యాసాల గురించి విశ్లేషణ చేసి విపులంగా వివరించిన విధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నా కథలు వారి మన్ననలు పొందడం ఆనందంగా అనిపించింది.

ఎక్కడో ఎవరో చెప్తే విన్నట్టు గుర్తు, ఒక కొత్త రచయిత స్త్రీ వాదంలో కొత్తగా ఏదో రాసేశాము అనుకున్నది ఏదైనా సరే అది ఇదివరకే కుప్పిలి పద్మ గారు వారి రచనలలో వ్రాసి ఉంటారు అని. అటువంటి వారు నా పుస్తకంలోని స్త్రీలకు సంబంధించిన సున్నితమైన అంశాలు తప్పకుండా అర్థంచేసుకుంటారనిపించింది. వారితో మాట్లాడి, పుస్తకం అందించి అతిథిగా ఆహ్వానించాను. పుస్తకం పూర్తిగా చదివి, పరిశీలించాక రావడానికి ఒప్పుకున్నారు. కానీ అసలు వారకి నా కథలు నచ్చాయో లేదో ఆవిష్కరణ రోజు వరకు నాకు తెలియలేదు. ఈ సస్పెంన్స్ వల్ల ఒక వైపు చిన్న భయం అలుముకుంది. అదే విషయం వారితో చెబితే “భయమెందుకు? మీకు సినిమా రచన మీద మంచి అవగాహన ఉంది. బాగానే రాశారు.” అని వారి చమత్కార శైలిలో ధైర్యం చెప్పారు. కానీ ఆవిష్కరణ రోజున వారు నా కథల గురించి ఆప్యాయంగా విపులంగా చర్చించిన విధానం చూశాక ఊరట కలిగింది. నేను సరైన పద్ధతిలోనే కథలు రాశాననే నమ్మకం కలిగింది.

నేను రచనలు చేస్తున్నాను అంటే దానికి పరోక్ష కారణం పి.జీ.విందా గారు. ఫిలిమ్ స్కూల్ నుంచి  బయటకు వచ్చిన తొలి రోజుల్లో సినిమాలని థియేటర్లో చూసినప్పుడు సినిమాను సినిమాగా చూసి ఎంజాయ్ చేయడం కన్నా, వాటిలో నాకు తప్పులే ఎక్కువగా కనిపించేవి. పైగా అప్పుడు నా స్నేహితుడితో కలిసి సినిమాలకు సంబంధించిన విశ్లేషణలు కూడా చేసేవాడిని. అందులో భాగంగా ఒకసారి బాహుబలి సినిమా సినిమాటోగ్రఫీ పైన లోతైన విశ్లేషణ చేసి ఒక ఆర్టికల్ నా వెబ్సైట్లో ప్రచురించాను. అది బాహుబలి సినిమా సినిమాటోగ్రఫర్ కె.కె.సెంతిల్ కుమార్ గారు షేర్ చేయడంతో బాగా వైరల్ అయింది. అప్పటికే పరిచయం ఉన్న విందా గారికి కూడా దాన్ని పంపించాను. వారు దాన్ని చదివి నాకు కాల్ చేసి “చాలా బాగా రాశావు. ఈ వయసులోనే సినిమాని చాలా లోతుగా అర్థంచేసుకుంటున్నావు. ఒకవేళ క్రిటిక్ అవ్వాలనుకుంటే ఈ పని కంటిన్యూ చేయి. కానీ నువ్వు గనక సినిమాలు తీయాలి అనుకుంటే ముందు ఈ పని మానేసి సినిమాలు రాయడం, తీయడం మొదలుపెట్టు. ఎందుకంటే – The more critically you look at things, the more you risk losing the joy in the creative process.” అన్నారు. అప్పుడు అర్థమయ్యింది నేనెందుకు అందరిలా సినిమాలను ఆస్వాదించపోతున్నానో అని.

ఆరోజు వారు ఇచ్చిన సలహా పాటించినందు వల్లే నేను మూడు షార్ట్ ఫిలిమ్స్ (లవ్, అంజలి; మహానుభావులు; దేవుడా! దేవుడా!! దేవుడా!!!), ఒక ఆంతాలజీ షార్ట్ ఫిలిమ్ (బ్రేకప్ స్టోరీస్) తీయగలిగాను. అందులో “దేవుడా! దేవుడా!! దేవుడా!!!” అనే షార్ట్ ఫిలిమ్ ముప్పైకి పైగా జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. పదికి పైగా అవార్డులు గెలుచుకుంది. ఈ కథ ముందుగా సాక్షి పత్రికలో కథగా ప్రచురించబడింది. ఆ తరువాత ఫిలిమ్ స్క్రీన్ ప్లేగా అడాప్ట్ చేశాను. నాలో ఇంతటి మార్పుకు కారణమైన విందా గారు అతిథిగా వచ్చి నా పుస్తకం ఆవిష్కరణ చేసి, నా రచనల గురించి ఓ నాలుగు మంచి మాటలు మాట్లాడటం సంతోషమనిపించింది.

ఈ అనుభవం జీవితంలో మరిచిపోలేనిది. ఈ నలుగురు ప్రముఖులు నా పుస్తకం ఆవిష్కరణ చేసి నాపై ఎనలేని బాధ్యతను మోపారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిత్తశుద్ధితో, మంచి రచనల వైపు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను.

“తీరం చేరే దాకా” అనేది పదమూడు కథల సంపుటి. ఈ కథలన్నీ స్త్రీ ప్రధానంగానే ఉంటూ కథనాలు ముందుకి సాగుతాయి. ఇంట గెలిచాక రచ్చ గెలవమన్నారు. మన ఇంట్లో స్త్రీలని గౌరవించుకుని అర్థంచేసుకున్నప్పుడే సమాజంలో ఇతర స్త్రీలని గౌరవించి, అర్థంచేసుకునే మానసిక దృక్పథం ఏర్పడుతుంది. అందుకే ఈ పదమూడు కథలు, గర్భంలో పిండం దశ నుండి జీవితం చివరి దశ వరకు స్త్రీ జీవితంతో ముడి పడి ఉండే కొత్తతరం మానవ సంబంధాల గురించి, ఆ సంబంధాల దృశ్యా పురుషులు స్త్రీలపై తరతరాలుగా మోపబడ్డ ఆంక్షలు, పెత్తనాల గురించి, అవి వారిపై చూపే ప్రభావం గురించి, మారుతున్న ప్రపంచంలో ఆధునిక స్త్రీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, కోరికలు, సమస్యల గురించి.. ఆధునిక మానసిక దృష్టికోణంలో అర్బన్, సెమీ-అర్బన్ నేపథ్యంలో సున్నితంగా చర్చించడం జరిగింది. స్త్రీల జీవితాలలో కేవలం పురుషులు చేసే తప్పిదాలే కాకుండా ఆ తప్పిదాల వెనుక స్త్రీల యొక్క పాత్ర, ప్రోద్బలం ఎంతగా ఉన్నదో ఈ కథల ద్వారా శోధించే ప్రయోగం చేయడం జరిగింది. కథలన్నీ స్త్రీ ప్రధానమే అయినా తటస్థ దృక్కోణం నుండి మానవ సంబంధాలని చూసి అర్థంచేసుకునే ప్రయత్నమే ఈ కథ సంపుటి ప్రధాన లక్ష్యం. కథనంలో వేగం, వైవిధ్యం, వ్యంగ్యం ఈ కథ సంపుటి ప్రధాన లక్షణాలు. నా చుట్టూ నిత్యం జరిగినవి చూస్తూ, వింటూ.. ఒక నిస్సహాయ స్థితిలో నా కలం నుండి జారిపోయిన అక్షరాలే ఈ కథలు.

Spread the love

Dinnesh

దినేష్ తెలంగాణాలోని నాగర్‌కర్నూల్‌లో 1993లో జన్మించారు. అక్కడే లిట్టిల్ ఫ్లవర్ హై స్కూల్‌లో తన
ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. బాసర ట్రిపుల్ ఐటి (రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ - RGUKT) నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌ రంగంలో ఇంజనీరింగ్, రామనాయుడు ఫిల్మ్ స్కూల్ ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, (JNAFAU, Hyderabad) నుంచి సినిమాటోగ్రఫి రంగంలో మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ (M.F.Tech) పట్టాలు పొందారు. ఇప్పటివరకు తన సంస్థ ‘Two Wheel Entertainment’ నుంచి ఆరు షార్ట్ ఫిల్మ్స్ రచించి, ఛాయాగ్రహణంతో పాటుగా దర్శకత్వం కూడా వహించారు. తన షార్ట్ ఫిల్మ్స్ దాదాపు 30కి పైగా అంతర్జాతీయ, జాతీయ చలనచిత్రోత్సవాలలో ఎన్నుకోబడి ప్రదర్శితమయ్యాయి. 10కి పైగా అవార్డులు కూడా గెలిచాయి. తన రచనలు కొన్ని సాక్షి, V6 వెలుగు, సారంగ, విశాలాంధ్ర, మ్యూస్ ఇండియా పత్రికలలో ప్రచురితమయ్యాయి.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!