
ఫ్రాంజ్ కాఫ్కా
1883-1924
జర్మన్ రచయిత. అస్తిత్వవాద సాహిత్య రచయితలలో ప్రముఖుడు.’Metamorphosis’, ‘America’, ‘The Castle’, ‘The Trial’, ‘In the Penal Colony’ అతని ప్రసిద్ధ రచనలు.వాస్తవాన్ని అద్భుతాన్ని అత్యంత సహజంగా కలిపి పేనిన
రచనలు ఇతనివి.ప్రస్తుత అనువాద కథ ‘దంపతులు’ కు మూలం ‘The Married Couple’ అనే కాఫ్కా రచన.
దంపతులు
అసలు వ్యాపారం అంటేనే ఎంత కష్టం, అందుకే ఒక్కోసారి నేనే స్వయంగా అమ్మాల్సిన వస్తువుల నమూనాల సంచీ భుజానేసుకుని, అలవాటుగా నా దగ్గర కొనేవాళ్ళ ఇళ్ళకు వెళుతుంటాను. వీలు చేసుకుని ఎట్లాగైనా నేరుగా కలవాలి అనుకున్న వాళ్ళలో N , ఇతనితో గతంలో నాకు నిలకడగా నడుస్తూ ఉండిన వ్యాపారం ఏమైందో తెలీదు, గతేడాది నుంచి పూర్తిగా కుంటుపడింది.
అదట్లా ఉంచితే, నిజానికి ఏ బలమైన కారణం అక్కరలేదు ఇటువంటి ఆఘాతాలకు, ఈ కాలం లో ఓ చిన్న మాటో మనస్తాపమో చాలు తక్కెడ ముల్లు అటో ఇటో వంగడానికి, అంతే సులభంగా కేవలం ఒక్క మాట చాలు ఒక్కోసారి వ్యవహారం మొత్తం చక్కబెట్టడానికి.
N దొరకడం కొంచెం చిక్కుతో కూడిన విషయమే; అసలే ముసలివాడు, ఈ మధ్య కొంత అశక్తత కూడా తోడయింది, వ్యాపార విషయాలన్నీ తనే చూసుకుంటానంటాడు, మళ్ళీ ఆఫీస్ లో ఎప్పుడూ ఉండడు; అతణ్ణి కలవాలంటే ఇంటి కి వెళ్ళాల్సిందే, అందుకే ఇట్లాంటి జిడ్డు పనిని ఎవరికైనా వాయిదా వేద్దామనే అనిపిస్తుంటుంది.
సరే, ఏదైతేనేం నిన్న సాయంత్రం ఆరు దాటాక ఆయన ఇంటికి బయల్దేరాను, అది ఎవరినీ ఇళ్ళ దగ్గర కలుసుకునే సమయం కాదు. కానీ వ్యాపార సంబంధమైన పని మీదుగానే కదా నేను కలవడానికి వెళ్ళడం, ఫర్వాలేదులే, పెద్ద అసంబద్ధంగా కనిపించకపోవచ్చు. నా అదృష్టం బాగుంది. N ఇంట్లోనే ఉన్నాడు; భార్యతో సాయంత్రపు వాహ్యాళి నుంచి అప్పుడే తిరిగి వచ్చాడని నౌకరు చెప్పాడు. ప్రస్తుతం, ఆరోగ్యం సరిగా లేక పడకకే పరిమితం అయిన కొడుకు ఉన్న గదిలో ఉన్నాడు. నన్ను అక్కడికి వెళ్ళమన్నారు, మొదట తటపటాయించినా, ఈ తలకాయ నెప్పి పనిని ఎంత వీలైతే అంత తొందరగా అవగొడదాం అనే ఉద్దేశంతో నా ప్రియాప్రియాలు పక్కన బెట్టి, కోట్, టోపీతో సహా నౌకర్ దోవ చూపిస్తుంటే ఒక చీకటి గదిలోంచి కొద్దిపాటి దీపం వెలుగుతోందని కనిపిస్తున్న గది లోకి వెళ్ళాను, అక్కడ ఒక చిన్నపాటి సంస్థే సమావేశమై ఉంది.
సహజంగా నా చూపు ముందు అక్కడున్న ఒక ఏజెంట్, వ్యాపారం లో నా ప్రత్యర్థి, పైన పడింది. ఓహ్, అయితే వీడు నాకంటే ఒక అడుగు ముందుగానే ఉన్నాడే అనిపించింది. తనేదో డాక్టర్ అయినట్టు మంచం పక్కనే, మంచి చక్కటి కోట్ లో బోర విరుచుకుని కూచుని ఉన్నాడు, దాని గుండీలు విప్పేసి ఉన్నాయి. ఒంట్లో బాలేనివ్యక్తి కూడా తన బాధలో తనున్నాడు. జ్వరానికి చెంపలు ఎరుపెక్కి, చూడ్డానికి వచ్చిన ఆ మనిషి వైపు అప్పుడప్పుడూ చూస్తూ పడుకోనున్నాడు. అతనేం మరీ చిన్నవాడు కాదు, N కొడుకు, దాదాపు నా వయసుంటుంది, అనారోగ్యం వల్ల సరిగా పట్టించుకోక పెరిగిన చిన్న గడ్డం ఆతనికి.
వృద్ధుడు N, బాగా పొడగరి, వెడల్పైన భుజాలు. కానీ ఆశ్చర్యం ఒంట్లోకి చల్లగా వచ్చి చేరిన ఏదో జబ్బు మూలాననుకుంటా వంగిపోయి, వడలిపోయి, ఇంకా బయటికి వేసుకెళ్ళిన ఆ ఊలు కోట్ తోనే ఉన్నాడు. కొడుకుతో ఏదో గొణుగుతున్నాడు. అతని భార్య, చిన్న ఆకారం, అందులో చాలా నీరసం, అయినా చాలా చురుగ్గా ఉంది. కానీ అది భర్తతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆ చురుకు. మమ్మల్ని మిగతా వాళ్ళను అసలు గమనించినట్టు కూడా లేదు, మసలాయనకు ఓవర్ కోట్ విప్పడం లో తలమునకలై ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరి పొడవుల్లో తేడా దృష్ట్యా అదొక పెద్ద పనే. చివరికి ఎట్లా అయితే ఏం సాధించింది.
ఆమె కోట్ విప్పుతున్నంతసేపూ ఆయన పడక్కుర్చీ కోసం చేతులతో తడుముతూ వెతుకుతూనే ఉండబట్టి అంత కష్టం అయినట్టుంది నిజానికి, ఓవర్ కోట్ విప్పంగానే భార్య ఆ కుర్చీను తక్షణమే అతనివైపుకు నెట్టింది. మునిగిపోయేంత హేరాళంగా ఉన్న ఆ కోట్ తనే తీసి పట్టుకుని వెళ్ళింది ఆమె.
ఇప్పటికి నాకు అవకాశం దొరికింది, అహ, ఇంకా రాలేదు, అసలు దొరుకుతుందా ఎప్పటికైనా; కానీ నేను ఏమైనా చెయ్యదల్చుకుంటే వెంటనే చెయ్యాలి, నా బిజినెస్ వ్యవహారం పోను పోను నాకు అననుకూలంగా మారిపోగలదు; పోనీ ఇక్కణ్ణే పాతుకుపోవటానికి, అలా అనుకుని వచ్చినట్టు కనిపిస్తున్న ఆ రెండో ఏజెంట్ లాగా, నా తత్వం అది కాదు, అదీగాక అక్కడ వాడి ఉనికిని ఎక్కువ సేపు సహించడం అసలే నచ్చలేదు నాకు. అందుచేత భారీ ఉపోద్ఘాతం లేకుండా అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాను N కు, అతనికి అప్పుడు కొడుకుతో కొంచెం సేపు మాట్లాడాలని ఉండుంటుంది అని స్పష్టంగా తెలుస్తునే ఉన్నా. సాధారణంగా ఒక ముచ్చట, లేదా పనికంటూ నన్ను నేను సంసిద్ధుణ్ణి చేసుకున్నాక, ఈసారి దానికి ఎక్కువ శ్రమా, సమయమూ పట్టలేదనుకోండి, నాకు లేచి అటూ ఇటూ నడుస్తూ మాట్లాట్టం అలవాటు.
ఎవరి ఆఫీస్ లో వాళ్ళ కు ఇదొక చక్కటి వెసులుబాటే కానీ ఒక కొత్త ఇంట్లో ఈ పద్ధతి కాస్త తలమోత వ్యవహారమే. కానీ నా వల్ల కాలేదు ఇంకోలా ఉండటానికి, మరీ ముఖ్యంగా నాకు అలవాటైన సిగరెట్ ముట్టించనూ కుదరక. ఫర్వాలేదులే, ప్రతి ఒకరికీ ఒక దురలవాటు ఉంటుంది. నాకు నేనే నయం అనిపిస్తాను, ఆ ఏజెంట్ కి ఉన్నవాటితో పోలిస్తే. అసలు వాడికి ఉన్న అలవాట్ల సంగతి చెప్పాల్సొస్తే ఉదాహరణకి, ఉన్నట్టుండి వాడి టోపీ తో తలపైన టప, టప మని దరువు వేసుకుంటున్నాడు అప్పుడప్పుడు; ఇందాకటి వరకూ దాన్ని మోకాలి మీద పెట్టుకుని పైకి కిందికి నెడుతున్నాడు మెల్లిగా. కానీ వెంటనే మహాపరాధం ఏదో చేసినట్లు దాన్ని వెంటనే మోకాలి మీద నుంచి తీసి తలపైన పెట్టుకున్నాడనుకోండి , ఒకటో రెండో ఘడియల సేపు, మళ్ళీ మాటి మాటికీ అదే ప్రహసనం.
కచ్చితంగా ఇటువంటి ప్రవర్తన ను ఖండించాల్సిందే. అయితే అది నా ధ్యాసను భంగపరచలేదు. నేను నడుస్తునే ఉన్నాను ముందుకూ వెనక్కూ, నా వ్యాపార లావాదేవీల్లో లీనమై పోయి, అతణ్ణి అసలు పట్టించుకోలేదు; కానీ ఇంకొకరికైతే ఈ టోపీ సర్కస్ మతిపోగొట్టేయగలదు పూర్తిగా. ఏదేమైనా నేను ఒక పనికి పూనుకున్నానంటే ఇటువంటి చికాకులు సరే, అసలు దేన్నీ పట్టించుకోను. చుట్టూ జరుగుతున్న వన్నీ చూస్తునే ఉంటాను నిజం చెప్పాలంటే, అలాగని వాటిని వేటినీ నా బుర్రలోకి దూరనివ్వను నా పని అయిందాకా, లేదా అభ్యంతరం ఏదైనా ఎదురైందాకా.
అందుచేత ఆవిధంగా నేను బాగా గమనించింది ఏంటంటే, N ఏమాత్రమూ ఏదీ పట్టించుకునే పరిస్థితిలో లేడు, తన కుర్చీ చేతులను గట్టిగా పట్టుకుని అటు, ఇటు మెలికలు తిరుగుతున్నాడు, కనీసం ఒక్క సారి కూడా నావైపు తలెత్తి చూళ్ళేదు, అయోమయం గా అగమ్యగోచరంగా ఉన్నాయి అతని చూపులు, శూన్యంలో దేనికైయ్యో వెతుకుతున్నట్టు, నేను మాట్లాడేదాంట్లో ఒక్క అక్షరం కాదు కదా అసలు నా ఉనికి అయినా ఆయన ఎఱుక లోకి కూడా వెళ్ళుండదు అని అనిపించేంత నిర్వేదం గా ఉంది అతని మొహం.
అవును, అతని స్థితి, నాకు అమంగళకరం అయిన ఆ అనారోగ్యపు మనిషి పరిస్థితి, నాకు పూర్తిగా తెలుస్తూనే ఉంది; అప్పటికీ నేను నా మాటలతో వ్యవహారం మొత్తం చక్కబెట్టవచ్చు అన్నట్లుగా మాట్లాడుతునే ఉన్నాను, బోలెడు లాభం ఉన్న రాయితీలు ఇస్తూ- అన్ని రాయితీలా నాకే భయం వేసింది, నిజానికి ఇవేవీ అసలు అతను అడిగినవి కాదు. ఆ ఏజెంట్ ఎట్టకేలకు వాడి టోపికి కొంచెం తెరిపి ఇచ్చి దాని మానాన దాన్ని వదిలేసి, ఛాతీ మీద చేతులు కట్టుకుని కూచోడం చూసినాకు భలే తృప్తి కూడా కలిగింది. నేనేం ప్రత్యేకంగా చూళ్ళేదు వాణ్ణి, ఊరికే ఒక చూపు అటువైపు వేసానంతే. కానీ నా ప్రదర్శన నేను ఒప్పుకుతీరాలి, సగం వాడిని ఉద్దేశ్యించి చేసిందే. వాడికి అది బానే గట్టిగా తగిలినట్టుంది. ఈ విజయం తాలూకు ఆనందం లో నేను ఇంకా మాట్లాడుతూ ఉండేవాడినే, ఆ కొడుకు, ఎవర్నైతే నేను నా ప్రణాళికా రచన లో అప్రాముఖ్యం అనుకున్నానో, అతను ఉన్నట్టుండి పెద్ద ప్రయత్నం చేసి పైకి లేచి పిడికిలి ఊపుతూ నన్ను కదిలించకపోతే.
వాడేదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో చూపించాలనుకుంటున్నాడు, కానీ అందుకు వాడికి శక్తి సరిపోలేదు. మొదట వాడికి మతి తప్పింది అనుకున్నాను, కానీ ముసలాయన వైపు అనుకోకుండా చూసినప్పుడు అర్థం అయింది కొంచెం అదేంటో.
ఉబ్బి పత్తికాయల్లా విచ్చుకొన్న గాజు కళ్ళు తెరుచుకుని కూచుని ఉన్నాడు N, అవి ఇంకాసేపట్లో మూసుకుపోబోతున్నట్లు ఉన్నాయి; ఆయన వణికిపోతున్నాడు, ఎవరన్నా కిందికి గుంజి పట్టుకున్నట్లుగానో, భుజాలు వంగదీసి కొట్టినట్లో తన శరీరం ముందుకు వంగిపోతోంది; అతని కింది పెదవి, కింద దవడ మొత్తం లోపలి చిగుళ్ళతో సహా నిస్సహాయంగా బయట పడుతూ; అతని మొహం మొత్తం ఎక్కడికక్కడ సడలి ఊడిపోయినట్లు కనిపిస్తోంది; ఇంకా శ్వాస పీలుస్తున్నాడు, ప్రయాసతో నే అయినప్పటికీ ; కానీ ఈ లోపలే ఏదో విమోచనం దొరికినట్లు తన కుర్చీలో వెనక్కి వాలిపోయాడు, కళ్ళు మూసుకున్నాడు, ఒక పెను అలసట తాలూకు బాధా ఒక తెర లాగా అతని మొహం మీద తారట్లాడి మాయమయింది, అంతా అయిపోయింది.
ఒక్క అంగలో అతని దగ్గరకు దూకి, తన నిర్జీవమైన చేతిని గుంజి పట్టుకున్నాను, అదెంత చల్లగా ఉందంటే నా ఒంట్లో మొత్తం చలిమిర్లు పాకాయి; ఇప్పుడు అక్కడ నాడి కొట్టుకోవడం లేదు. అంతా ముగిసిపోయింది అనమాట. అతను వృద్ధుడే. ఇటువంటి అనాయాస మరణం దొరికితే మనం అదృష్టవంతులమే. కానీ ఎంత ఉంది చేయవలసింది! అసలు మొట్టమొదట ఏం చేయాలి ఎవరైనా?
సాయం కోసం చుట్టూ చూశాను; కానీ కొడుకు దుప్పట్లు మొహం పైకి లాక్కొని ఉన్నాడు, పెద్దగా వాడి వెక్కిళ్లు వినపడుతున్నాయి; ఉలుకు, పలుకు లేకుండా ఆ ఏజెంట్ నిమ్మకు నీరెత్తినట్లు, కేవలం రెండడుగుల దూరం లో N కుర్చీకి, నేను ఏమీ చేయబోవటం లేదని నిశ్చయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ, ఏం జరగబోతోందో అని వేచి చూడటానికి కూర్చున్నట్లు ఉన్నాడు; ఇక నేను, కేవలం నేనొక్కణ్ణే మిగిలిపోయాను ఏదైనా చేసేందుకు. అన్నిటికన్నా కష్టం ఇట్లాటప్పుడు, ఈ విషయాన్ని ఆయన భార్యకు కొంచెం భరించగలిగే విధం లో చెప్పడం. నిజం చెప్పాలంటే వాస్తవం లో అలా చెప్పగల విధం అసలు లేదు. ఇంతలోనే ఆమె వడి వడి అడుగుల చప్పుడు పక్కగదిలోంచి వినవస్తోంది నాకు.
ఇంకా ఆ బయటికేసికెళ్ళిన బట్టలేసుకునే – మార్చుకునేందుకు వ్యవధి లేకపోయింది ఆమెకు – ఇంట్లో రాత్రిపూట వేసుకునే చొక్కా ఒకటి వెచ్చచేసి తీసుకొచ్చింది భర్త వేసుకోవడానికి. ‘‘ఈయన నిద్రలోకి జారుకున్నాడూ‘‘, అంది ఆమె నవ్వుతూ, తల ఊపుతూ, మమ్మల్ని కొయ్య బొమ్మల్లా కదలకుండా కూర్చొని ఉండటం చూసి. అమాయకులకు ఉండే అపారమైన నమ్మకం తో ఆమె, క్షణం క్రితం ఏ చెయ్యైతే నేను భయము, జలదరింపు తో పట్టుకున్నానో అదే చేతిని చేతిలోకి తీసుకుని ముద్దుగా ముద్దు పెట్టుకుంది. ఇంతలో – అసలు ఏవిధంగా మేము ముగ్గురం ఆ దృశ్యాన్ని హరాయించుకోగలం – N కదిలాడు, గట్టిగా ఆవులించాడు, చొక్కా వేయనిచ్చాడు, “అంత సేపు నడక ఎందుకు అలిసిపోయేటట్లు?” అన్న భార్య గారాబపు మందలింపును కాస్త చిరాగ్గా, కాస్త హాస్యంగా సహించాడు, ఆశ్చర్యం గా జవాబు కూడా చెప్పాడు, అయితే తను నిద్రలోకి జారుకున్న కారణం వేరే చెప్పాడనుకోండి, ఏం తోచక, విసుగొచ్చి ట.
తర్వాత, ఇంకొక గదికి పోవాలంటే ఆ గదులు మధ్య చల్లటి నడవాగుండా వెళ్ళి జలుబు తెచ్చుకోవటం ఎందుకని, అప్పటికి కొడుకు పక్కపైనే పడుకున్నాడు; కొడుకు పాదాల పక్కన, భార్య హడావుడిగా తెచ్చిన రెండు దిండ్ల మీద తల పెట్టి. ఇదంతా జరిగినంత సేపు నాకు అందులో ఏదీ అసంబద్ధంగా తోచలేదు. ఆ తర్వాత, సాయంకాలం పేపర్ అడిగి ఇప్పించుకున్నాడు, అతని అతిథులను పట్టించుకోకుండా ఆ పేపర్ తెరిచాడు, ఊరికే అక్కడక్కడా తిరగేయడం తప్ప దాన్ని చదవలేదు, మేం ఇచ్చిన రాయితీల గురించి ఏమాత్రం రుచించని అభిప్రాయాలు చెప్పాడు, ఎంత నిశితమైన దృష్టి ని చూపిస్తున్నాయి ఆ అభిప్రాయాలు, ఆ రెండో చెయ్యి నిర్లక్ష్యంగా ఊపుతూ, ఎగతాళిగా నాలిక చప్పరిస్తూ మా వ్యాపారం పోకడలు ఛండాలంగా ఉన్నాయని సూచిస్తున్నట్లు.
ఆ రెండో ఏజెంట్ మాత్రం ఒకటి రెండు అసందర్భపు జవాబులు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, జరిగినదాంట్లో తనకు కొంచెం అయినా నష్టపరిహారం రావలసి ఉంది అనుకున్నాడు వాడి బుర్ర తక్కువతనంతో, కానీ వాడు అది అడిగిన పద్ధతే మరీ అధమస్తంగా ఉంది. సందుదొరకగానే నేను శెలవు తీసుకున్నాను, ఏజెంట్ కు చాలా కృతజ్ఞుడిని అనిపించింది, అక్కడ వాడు లేకపోయుంటే నాకు అక్కణ్ణించి అప్పటికైనా కదలాలనే గట్టి నిశ్చయం వచ్చేది కాదు.
నడవాలో Frau N కు ఎదురు పడ్డాను మళ్ళీ. జాలి కలిగిస్తున్న ఆమె ఆకారం చూడంగానే “మా అమ్మ గుర్తొస్తోంది మిమ్మల్ని చూస్తుంటే” అనేశాను అనుకోకుండా. గమ్మున ఉండిపోయిన ఆమెను చూస్తూ ఇది కూడా అన్నాను, ‘‘జనాలు ఏమైనా అననీ కానీ, ఆమె అద్భుతాలు చేయగలిగేది, మేము నాశనం చేసిన వాటిని ఆమె మళ్లీ పూర్ణం చేసేది. నేను చిన్నప్పుడే పోగొట్టుకున్నాను ఆమెను.‘‘ కావాలనే చాలా నిదానంగా, స్పష్టంగా మాట్లాడాను నేను, ఎందుకంటే ఆమెకు వినికిడి తక్కువ అని అనుకున్నాను. కానీ ఆమెకు వినిపించడం నిజం గానే తక్కువ అనుకుంటా, ఇంతలో, ఎటువంటి తొట్రుపాటు లేకుండా, ‘‘మా ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు నీకు?‘‘ అని అడిగింది. వచ్చేస్తూ నేను ఆమెతో మాట్లాడిన ఇంకొన్ని మాటల్లో, ఆమె నన్ను ఆ మరో ఏజెంట్ అనుకుంది అని అనిపించింది; అట్లా అనుకోవటం నాకు బాగుంది లేకపోతే ఆమె నాతో ఇంకొంచెం బాగా మాట్లాడేది.
ఇంక నేను మెట్లు దిగాను: దిగటం ఎక్కినప్పటికంటే అలసటగా ఉండింది. అది మాత్రం! అదీ ఏమీ సులభం గా లేదప్పుడు. అబ్బా, ఎన్ని వ్యాపార ప్రయాణాలు వృధా అయిపోతుంటాయి, అయినా వెళ్తూనే ఉండక తప్పదు.
***
వ్యాక్యాన్ని జతచేయండి