నేను
నేనవడానికి ముందు నదిని
***
నడవడానికి ముందే ప్రవహించిన వాణ్ణి
నెమ్మదించి నడుస్తున్నాను కానీ
ప్రవహించి పరుగెలెత్తిన వాణ్ణి
వేగం ఒడుపు తెలిసినవాణ్ణి
***
ప్రవహించడానికి ముందే
తరగల తలెత్తి
జలపాతమైనవాణ్ణి
దూకినవాణ్ణి
ఎత్తు తెలిసిన వాణ్ణి
కిందకి చూడ్డం తెలిసిన వాణ్ణి
నేల చేరడంలో నేర్పరిని
***
దూకడానికి ముందు
ఒక శిఖరమైనవాణ్ణి
పైకి చూడ్డం తెలిసినవాణ్ణి
గగన విస్తీర్ణం కొలవగలిగినవాణ్ణి
విస్తరించడం తెలిసినవాణ్ణి
ఎగరడం అనివర్యమైనవాణ్ణి
మేఘమవగల మెలకువగలవాణ్ణి
***
అంతకు ముందు
ఒక బిందువైనవాణ్ణి
సింధువైనవాణ్ణి
భరించడం తెలిసిన వాణ్ణి
***
నెమ్మదించి నేనిలా నడుస్తున్నాను కానీ
ప్రవహించి పరుగెలెత్తగలవాణ్ణి
నడకల గమ్యం తెలిసినవాణ్ణి
నదిని.
***
అలలై
నవ్వుతున్నవాణ్ణి
నడుస్తూ విస్తరిస్తున్నవాణ్ణి
నడకతో ఎగరగలవాణ్ణి
నడుస్తున్నా…
ప్రవాహమవగలవాణ్ణి
***
నడుస్తున్నాను గానీ
అక్షరమై ఎగురుతున్నవాణ్ణి
నడుస్తూనే ఆకుపచ్చగా విస్తరిస్తున్నవాణ్ణి
అడవిగా మారుతున్నవాణ్ణి
నిశ్శబ్దంగా ఒక నినాదమవుతున్నవాణ్ణి
నదీనినాద గమ్యం తెలిసినవాణ్ణి.
వ్యాక్యాన్ని జతచేయండి