సాయం కోసం అరచి అరచి
ఆమె గొంతు ఎండిపోయింది.
జనం ఎడారి చూపులు
* * * *
అతని కనుగుడ్లు
ద్వేషంజీర బారాయి.
కత్తి వాదరకు తెగిన రక్తంనది.
* * * *
ఎండిన రక్తం చుట్టూ
ముసురుతున్న తడిలేని మాటలు.
తెల్లారి కట్ట తెగిన వార్త
* * * *
అందరూ లోపల
నదులెండిన వాళ్లే..
ఒడ్డున పాదముద్రల చుట్టూ చెమ్మవృత్తం
గత వైభవం
* * * *
కులం వడగాలి
సుడివేసి పోయింది.
ప్యాకేజీ వింజామరలు
* * * *
అరుపులు ఆక్రోసాల మీద
జల్లు కురుస్తుంది.
ఇదొక అలవాటయిన ఋతుక్రమం.
* * * *
ఇళ్లకు చేరి కాళ్లు కడుక్కుంటే..
బేరం కుదిరి
కడుపులో నీళ్లు కదలకుంటే..సరి.
* * * *
కన్నీళ్లు తోడేసిన కళ్లతో
ఆమె ఇక్కడే అదృశ్యంగా
అంతటా తిరుగుతుంటుంది.
కొన్నాళ్లకు అతను
నవ్వుతున్న తోడేలు కళ్లతో
బయట బలాదూరు తిరుగుతాడు.
* * * *
నది కళ్లెందుకు
లోతుకుపోయాయని..
పారుతున్న నది ఒంటికి
పూనకం ఎందుకొస్తుందనీ..
నది అచ్చం హత్యాచారం
జరిగిన ఆడదానిలా అలా
బీటలు పడిన గుండెలతో
ఖాళీగా ఎందుకు చూస్తుందని
నది కొంచెం కొంచెంగా
రాలుతున్న నీటినుసిలా
ఎగిరిపోతుందేమని…
గుండెకాయలు పిండం చచ్చిన
ఉమ్మనీటి కయ్యలయిన మనకు
అడిగే హక్కులు లేవు.
నదీ మూలాన్ని నరికేసినవాడికి
దోసెడునీళ్లు పుట్టవు.
వ్యాక్యాన్ని జతచేయండి