ఇచ్ఛామతి

నింద

ఇంటిలోని హాలు మొత్తం దగ్గరి బంధువులతో నిండిపోయి వుంది 

మూడవరోజు కూడా ఇంటి మనిషి హఠాత్తుగా అందరినీ శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయిన దుఃఖం, ఇంటి నిండా ఇంకా గాడంగా పరుచుకుని వుంది

హాలులో ఒకవైపు చిన్న పీట మీద పెట్టిన అతని ఫొటోకు దండ వేసి వుంది. పీట మీద ఒకవైపు దీపం వెలిగించి వుంది. మరొకవైపు కాలుతున్న అగరుబత్తుల నుండి వస్తోన్న పొగ మెల్లిగా గదిని ఆవరిస్తున్నది         

హాలులో ఒకవైపు కిందకు ఒరిగిపోయినట్టుగా మూలన కూర్చుని ఏడుస్తోంది ఆమె. ఏడ్చీ ఏడ్చీ ఉండడం వల్ల ఆమె కళ్ళ వెంబడి నీళ్లు రావడం లేదు. లోతుకుపోయి, పీక్కుపోయినట్టున్న ఆమె కళ్ళు, ఒంటికి అవసరమైన తిండీ, విశ్రాంతీ లేకపోవడం వలన బక్కపలచగా అయిపోయిన ఆమె శరీరాన్ని ఒకింత పరిశీలనగా చూసిన వాళ్లెవరికైనా ఆమె ఏడుపు ఒక పూటకో ఒక రోజుకో సంబంధించినది కాదని అర్థమై పోతుంది.

ఎండాకాలం కావడం వల్ల ఉదయం పది గంటలకే బయట ఎండ, మిట్టమధ్యాహ్నపు ఎండలా భగభగ మండిపోతున్నది. అటుపక్కన కూర్చున్న అత్తామామలవైపు చూసింది. మూడు రోజుల నుండి ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోయినట్టుగా అయిపోయారు.

‘పాపం – కన్నందుకు వాళ్లకు మాత్రం ఏం ప్రశాంతత మిగిల్చి వెళ్లాడని’ అంత దుఃఖం లోనూ అనుకుంది ఆమె. 

ఇంటి ముందు వున్న రోడ్డు మీద వేసిన టెంటు కింద వేసిన కుర్చీలలో మూడో రోజు పూజ కోసం వచ్చిన బంధువులు, తెలిసిన వాళ్ళు  కూర్చొని మాట్లాడుకుంటున్నారు. టెంటుకు ఒకవైపు దడి వంటిది కట్టి  అటుపక్కన వంటల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

స్టూల్ మీద పెట్టిన ఫొటోకు అటువైపు కూర్చుని వున్న కొడుకు వైపు చూసింది. డిగ్రీ రెండో సంవత్సరంలో వున్నాడు వాడు. మూడవ రోజు పూజకు సంబంధించి ఏమేమి చేయాలో పక్కన వున్న వాళ్ళు ఏదో చెబుతూ ఉంటే ముభావంగా వింటున్నాడు.  

మొదటి రోజు రాలేకపోయిన బంధువులు కొందరు ఒక్కరొక్కరుగా వస్తున్నారు 

ఒకరు ఆమెని పట్టుకుని ‘ఇంత చిన్న వయసులో దేవుడు నీకు ఈ రాత రాసిండు’ అని ఏడిస్తే, మరొకరు అతని తలిదండ్రులను పట్టుకుని ‘ఈ వయసులో మిమ్మల్ని కండ్లల్ల పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకు విడిచిపెట్టి పాయె గదా’ అని ఏడుస్తున్నారు. ఇంకొకరు ఆమె కొడుకుని పట్టుకుని ‘డాడీ మిమ్మల్ని ఒంటరోళ్ళని చేసి వెళ్లిపోయిండు గదరా’ అని ఏడుస్తున్నారు.   

నిజానికి ఈ ఊహించని మృత్యువు ఇంట్లో వాళ్లందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది కదా! నిజంగానే ఇది ఊహించలేదా ఆమె?

ఆ పెళ్లి మురిపెం, సంతోషం ఒక మూడు నాలుగు నెలలు వుండి ఉంటుంది – అంతే ! ఆ తరువాత క్రమంగా అర్థం కావడం మొదలయింది – అతడు మందు తాగే వ్యసనానికి ఎంత బానిసలా మారిపోయాడన్న సంగతి.

ఆ సంగతి మనసులోకి ఇంకిన క్షణాల నుండి క్రమంగా పెళ్లి గురించి, తనదైన కుటుంబం గురించి ఆమె కన్న చిన్ని చిన్ని కలలు క్రమంగా లోలోపలే ఆవిరైపోవడం మొదలయింది. పెళ్లి చేసే గాయాలు క్రమంగా మనసునూ, శరీరాన్నీ సలపడం మొదలయింది

పెళ్లి విషయంలో ఆమె కన్న కలలు ఏమంత పెద్దవి?

ఇంటి పట్లా, తన పట్లా కాసింత ప్రేమగా, బాధ్యతగా వుండి, ఇంట్లో వుండే నలుగురు మనుషులు వేళకు ఇంత తిండి తినగలిగేంత సంపాదించే వాడు భర్తగా దొరికితే చాలు అనుకున్నది. తన ఇల్లు, ఇంటిలోని హాలు, వంటగది వంటివి తనకు నచ్చిన విధంగా పెట్టుకుని కాసింత హాయిగా గడిపే జీవితం 

  తాను కూడా డిగ్రీ చదువుకున్నది కాబట్టి, సిటీలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఇల్లు కాస్త సౌకర్యంగా నడవడం కోసం నాలుగు డబ్బులు సంపాదించగలనన్న ధైర్యం.

ఇంతే కదా ఆమె  కన్న కలలు.

లోపలే ఇంకిపోయిందనుకున్న దుఃఖం మళ్ళా ఎగిసివచ్చింది ఆమెకు. ‘ఊర్కో తల్లీ!  మనం ఎంత ఏడిస్తే మాత్రం పోయిన మనిషి తిరిగి వస్తడా కండ్ల ముందుకు చెప్పు? రాత … రాతను మార్చుడు ఎవరి తరమైతది? పిలగాడిని చూడు – పిలగాడిని చూసుకోని ధైర్యంగ ఉండాలె ఇప్పుడు’ పక్కింటి పెద్దావిడ సముదాయిస్తున్నది

నిజానికి, పెళ్లి గురించి పెద్ద కలలు కనేంత కుటుంబం నుండి రాలేదు ఆమె. నలుగురు ఆడపిల్లలు వున్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి, ‘దేనికైనా సర్దుకుపోయి బతకడం’ అనే తర్ఫీదు యిచ్చిన ఇంటి నుండి వచ్చింది.

ఈ ‘దిగువ మధ్య తరగతి కుటుంబం అన్న పేరు కాస్త చదువు అబ్బిన వాళ్ళు తమను తాము పేద కుటుంబం అని చెప్పుకోవడం నామోషీగా భావించి పెట్టుకున్న పేరయి ఉంటుంది’ – చిన్నప్పుడు చెల్లెలు అన్న మాట గుర్తుకొచ్చింది ఆమెకు

‘పూజలు చేస్తే మంచి మొగుడు వస్తడు – మంచి సంసారం వుంటది’ అని నూరిపోసిన సంస్కృతి నుండి వచ్చింది. ఎన్ని పూజలు చేసేది. ఎన్ని ఉపవాసాలు ఉండేది. ఎట్లా మిగిల్చాడు ఆ దేవుడు చివరికి ఆమెను.   

‘పిలగాడు ఒక్క ఉద్యోగం కాదు – సాయంత్రం పూట పార్ట్ టైం ఇంకో ఉద్యోగం కూడ చేస్తడు. చాలా బుద్ధిమంతుడు’ అని సంబంధం తీసుకొచ్చిన బంధువులు చెప్పినప్పుడు తన పూజలు, ఉపవాసాలూ ఫలించినట్టుగా సంతోషించిన రోజులు గుర్తుకొచ్చాయి ఆమెకు.

ఆ మాటలలో నిజమెంతో అర్థం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు ఆమెకు. కొన్నాళ్లపాటు ఏదో ఒక ఉద్యోగం ఎక్కడెక్కడో చేసేవాడు. ఎక్కడా కుదురుగా ఉండేవాడు కాదు. అసలు ఎక్కడా అతను కుదురుగా ఉద్యోగం వంటిది చేయలేడనే సంగతి కూడా ఆమెకు త్వరలోనే అర్థమై పోయింది. ఒకవేళ ఎక్కడైనా కొంత పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించినా అవి అతని రోజువారీ అవసరాలకే సరిపోయేవి.

ఈ బాధనంతా కన్నవాళ్ళతో చెప్పుకోవాలని ఆమె ఎన్నోసార్లు అనుకునేది కానీ, ‘గుండెల మీది నుండి ఇంకో బరువు దిగిపోయింది’ అని తన పెళ్లి తరువాత బంధువులతో వాళ్ళు పంచుకున్న సంతోషం గుర్తుకొచ్చి ఆగిపోయేది. అయినప్పటికీ ఇన్ని బాధల నడుమ కూడా నిలబడి బతికింది, తన తోడబుట్టిన వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే.

ప్రతి దినం ఒక పరీక్షలా సాగిన జీవితం మధ్యలో కొడుకు కూడా పుట్టి పెద్దవాడు అయ్యాడన్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఒకింత ఆశ్చర్యం వేసింది ఆమెకు.

‘మంచి మనిషి పాపం. ఏదన్నా సాయానికి రమ్మంటే ముందు వెనుక సూడకుంట వచ్చెటోడు. మున్సిపాలిటీలనో, హాస్పిటల్లనో గీ పని వున్నది చేసి పెట్టు కొడుకా అంటే పని అయ్యే దాక వుండెటోడు’ ఎదురింటి ముసలాయన బాధతో అంటున్నాడు.

నిజమే! మంచివాడే ! మంచి మనసున్న వాడే !

కానీ, ఎవరికి అక్కరకు వచ్చిన మంచి?

కట్టుకున్నదానికీ, కడుపులో పుట్టిన వాళ్ళకీ పనికి రాని మంచి!  

పెళ్లయిన కొద్ది కాలంలోనే అతడి వ్యవహారం అర్థమైన తరువాత, ఒక చిన్న ఉద్యోగం చూసుకుని అందులో చేరిపోయింది ఆమె. ఉద్యోగంలో చేరిన తరువాత కొన్నాళ్ళకు ఎప్పుడూ లేనిది కొత్తగా అనుమానించడం మొదలు పెట్టాడు కొన్నాళ్ళు. ఆఫీస్ నుండి కాల్స్ వస్తే ఒక్కోసారి అనుమానంతో చేయి చేసుకునే వాడు. 

ఇక భరించలేక కొడుకుని తీసుకుని చెల్లెలు ఇంటికి వెళ్ళిపోయింది ఒకరోజు. కొడుకు అప్పుడు ఏడవ తరగతిలో వున్నాడు.

‘మమ్మీ ! వదిలెయ్ మమ్మీ ! అతన్ని వదిలేసి, పిన్ని ఇంటికి దగ్గరగా  మనం వేరే ఉందాము మమ్మీ! నాకు భయం వేస్తోంది మమ్మీ!’

అప్పుడు చెల్లెలి ఇంట్లో కొడుకు ఏడుస్తూ అన్న మాటలు ఇప్పటికీ చెవులలో గింగురుమంటాయి ఆమెకు.

ఆమె తోడబుట్టిన వాళ్ళు కూడా అప్పుడు ఆమెకు గట్టిగానే చెప్పారు – ‘ఇంకా ఈ తిప్పలు పడుతూ బతికే బదులు వదిలెయ్యవే. మేమున్నాం కదా’ అని.

కానీ, వదలలేదు అతను

బతిమిలాడాడు. తప్పు చేశానని పదే పదే చెప్పుకున్నాడు. 

‘నువ్వు లేకపోతే బతకలేనని’ ఏడ్చాడు.  

అతనికి తోడు, అత్తమామలు కూడా ‘ఇంకోసారి వాడు నిన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామమ్మా’ అని ఒకటికి పదిసార్లు చెప్పారు.

‘అర్థమవుతుందా అసలు నీకు? అంత అనుమానం ఉంటే చెప్పు … అది ఇంట్లనే వుంటది. వెళ్లి సంపాదించి తీసుకురా! ఇంట్ల మీ ముగ్గురికి తిండి యెట్ల, పిల్లవాని చదువు యెట్ల, మీ హాస్పిటల్ ఖర్చులు యెట్ల అన్న సోయి వున్నదా నీకు?’ ఆ రోజు ఆమె కోసం ఇంటికి వచ్చిన అతడిని తన ఇంటి గుమ్మం ముందే నిలబెట్టి చెల్లెలు అన్న మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకు.

అతడి వైపు వాళ్ళూ, ఆమె వైపు వాళ్ళూ అతడిని అట్లా అనడం మొదటి సారీ కాదు – చివరి సారి కూడా కాదు. ఎవరు ఎప్పుడు ఏమి చెప్పినా ‘సారీ! ఇప్పటి నుండీ నేను బాగుంట. ఇంక మీద ఇట్లుండ’ అని అప్పటికి చెప్పి ముగించేవాడు.

తెంచుకోవడం అంటూ జరిగితే, ఆ రోజే అది జరిగి ఉండ వలసింది. ఆ రోజు అంత దూరం వెళ్లిన తరువాత ఇక ఆ పైన అడుగు వేయడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. అట్లా అని పరిస్థితిలో పెద్ద మార్పు ఏదో వుంటుందన్న ఆశ కూడా ఆరోజు ఏదీ లేదు ఆమెకు.  తిరిగి కొడుకుతో ఇంటికి వచ్చిన తరువాత, అనేకసార్లు విడిచి వెళ్ళవలసిన అగత్యాలు ఎన్నిసార్లు ఎదురైనా అన్నింటినీ భరించింది.

కాకపొతే, ఆమె తోడబుట్టిన వాళ్ళు గట్టిగా మందలించిన భయం వల్లనో లేక ఇల్లు గడవడానికి వున్న ఏకైక మార్గం ఆమె సంపాదన మాత్రమే అని అర్థమైన అనివార్యత వల్లనో ఆఫీసుకు వెళ్లే తనను అనుమానించడం మాత్రం  తగ్గిపోయింది.

‘మళ్ళా అనుమానించలేదు’ అన్న మాటే గానీ, ఏ రోజూ ప్రశాంతంగా గడిచింది లేదు.

‘ఈ రోజు ఒక రుచికరమైన వంట వండుకున్నాము. హాయిగా తిందాము’ అని కూర్చుంటే ఆ రోజు తాగి ఏ గొడవ మొదలు పెడతాడోనని భయం.

రోజంతా ఆఫీసులో పనిచేసి, ‘ఇంటికి వెళ్లి కాస్త తిని పడుకుందాము’ అని ఇంటికి చేరితే, ఆ రాత్రిని ఏ నిద్ర లేని కాళరాత్రి చేస్తాడోనని భయం.

ఏ రోజూ కడుపునిండా తిన్నది లేదు

ఏ రాత్రీ కంటి నిండా హాయిగా నిద్రపోయింది లేదు

దగ్గరి వాళ్ళ ఇంట్లో ఏ శుభ కార్యానికైనా అతడిని తీసుకుని వెళ్లకపోతే ఒక గొడవ … తీసుకుని వెళితే ఇంకో గొడవ. అయినవాళ్లలో ఎవరిని ఎక్కడ డబ్బులడుగుతాడోనని ఎప్పుడూ ఒక అవమానభారం మోస్తూ ఉండేది.

జీవితం నిండా ఎగిసిపడిన ఈ గొడవల పుణ్యమా అని ఆమెని కండరాల నొప్పులు, థైరాయిడ్ సమస్యలు చుట్టుముట్టాయి. రెండు రోజులు ఎక్కువ సెలవు తీసుకుంటే ఉద్యోగం ఏమవుతుందో అన్న బెంగ ఇంకోవైపు

అయినా సరే – చాలా ప్రయత్నించింది – అతడిని రక్షించుకోవడానికి. లోకం ముందు తనవాడంటూ ఒకడున్నాడు అని చెప్పుకోవడం కోసమైనా అతడు బాగుండాలని కోరుకుంది.

ఎక్కడో బయట రోడ్డు మీద పడిపోతే కాలు విరిగి ఒకసారీ, చెయ్యి విరిగి ఒకసారీ, తాగీ తాగీ వాంతులు చేసుకుని జబ్బు పడితే ఇంకోసారి …. ఆమె ఆఫీసు మెడికల్ ఇన్సూరెన్స్ అంతా అతని కోసమే ఖర్చయిపోయింది.

‘ఏ పని చేయకపోయినా ఫరవాలేదు – అతను ఇంట్లో అట్లా కుదురుగా ఉంటే చాలు’ అని కూడా అనేకసార్లు ఆశపడింది ఆమె.

‘కావాలంటే వారానికి ఒకసారి ఇంటికే కొద్దిగా తెచ్చుకుని తాగబ్బా … పిలగాడు కూడా పెద్దోడు అవుతున్నాడు … నా మొహం కాకపోయినా పిల్లవాడి ముఖం  చూసైనా కాస్త మారు’ అని బతిమాలింది అనేకసార్లు.

‘గట్టి శరీరం …  తాగుతూ, మధ్య మధ్యలో జబ్బు పడుతూ మరికొన్నాళ్లు ఉంటాడు’ అని అనుకున్నది కానీ ఇట్లా ఉన్నట్టుండి వెళ్ళిపోతాడు అనుకోలేదు ఆమె. ఆమె మాత్రమే కాదు – అతడికీ, ఆమెకూ దగ్గరైన వాళ్ళు అందరూ!

మూడు రోజుల క్రితం రాత్రి కూడా ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి బాటిల్స్ తో కనిపిస్తే, ‘ఇక ఈ రాత్రి కూడా ఒక గొడవ పెట్టుకుని గానీ నిద్రపోడు’ అని నిస్సత్తువగా అనుకుంది గానీ, ఇక అది చివరి రాత్రి అవుతుంది అనుకోలేదు.

మూడు గంటల రాత్రి అకస్మాత్తుగా వాంతులు మొదలై అవి కాస్తా రక్తం వాంతులుగా మారాయి. ఇంతకు ముందు కూడా ఇట్లా జరిగినా ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు.

‘హాస్పిటల్ కు వెళదాం పా’ అని గంటసేపు బతిమిలాడినా ఎప్పటిలాగే మొండిగా ‘నాకేం కాదు – ఇట్లనే వాంతులు చేసుకుంటే అంత సాఫయి పోతది’ అని వారించాడు.

కొద్దిసేపటి తరువాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఆదరాబాదరాగా ఆటో మాట్లాడుకుని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుపోయిన తరువాత వెంటనే అతడిని పరీక్షించిన డాక్టర్లు చెప్పారు – ‘సారీ అమ్మా ! ఆల్రెడీ ప్రాణం పోయింది’ 

ఆ తరువాత ఏమి జరిగిందీ ఆమెకు జ్ఞాపకం లేదు

అతడిని మార్చురీ నుండి ఐస్ బాక్స్ లో ఇంటికి తీసుకు వచ్చి, గుమ్మం ముందు పెట్టిన తరువాత గానీ ఆమె ఈ లోకం లోకి రాలేదు.

ముక్కు రంధ్రాలలో జొనిపిన కాటన్ ఉండలతో, రెండు కాళ్ళ బొటన వేళ్ళను కలిపి బంధించిన తాడుతో, శరీరం అంతా బట్టతో చుట్టబడి, జీవితమంతా కల్లోల కెరటాలుగా చుట్టుముట్టిన అలజడి, అశాంతత అంతా ఒక్కసారిగా సద్దుమణిగినట్టుగా ప్రశాంతంగా వున్నాడు లోపల. 

‘అమ్మా! భార్య కొడుకు ముందుకు రావాలె’ పూజ చేస్తున్న అయ్యగారు పిలవడంతో తిరిగి ఈ లోకంలోకి వచ్చింది.

ముందుకు కదిలి కొడుకు పక్కన కూర్చుని, వాడి భుజం చుట్టూ చేయి వేసింది. ఏ భావం వ్యక్తం చేయాలో తెలియని కళ్ళతో తల్లి వైపు చూసాడు వాడు.

ఇంతలో, పూజకు వచ్చిన బంధువులలో ఒక ముసలావిడ ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసులో విస్కీ తీసుకుని వచ్చి, అతని ఫోటో దగ్గర పెడుతూ ‘ఆత్మకు ఇష్టమైనవి పెట్టాలమ్మా ఈ రోజు’ అంది.

‘బతుకంతా దీని వల్లనే నేను నా కొడుకు నరకం అనుభవించినం. అయినా  మీరు పట్టించుకోరా?’ అని చీదరగా చూసింది ఆమె

ఆమె చెల్లెలు కూడా మందు గ్లాసు పెట్టొద్దని వారించినా అక్కడ వున్నవాళ్లు ఎవరూ వినలేదు. పైగా ‘మనిషే పోయిన తరువాత వీటి గురించి లొల్లి ఎందుకు?’ అని సర్ది చెప్పారు.

అయ్యగారు మంత్రాలు తాను చదువుతూ కొడుకుతో చదివిస్తున్నాడు. 

వెనుక వైపు కూర్చున్న పెద్ద వయసు స్త్రీలు మాటల్లో పడిపోయారు.           

‘వీడు చిన్నప్పుడు బాగనే వుండేటోడు. తాగి తాగి పోతడనుకోలేదు. పెళ్లి వరకు వీనికి ఇంత అలవాటు వున్నట్టు లేదు గద’ వెనుక వైపు కూర్చున్న బంధువులలో ఒకావిడ తన పక్కన కూర్చున్న మరొక స్త్రీతో అంటున్నది.

కొడుకు భుజం మీద చేయి వేసి కూర్చున్నది కాస్తా శక్తినంతా కూడదీసుకుని లేచి, వెనక్కు తిరిగి ఆ మాట అన్న స్త్రీ వైపు చూసి కోపంతో, దుఃఖంతో ఊగిపోతూ అన్నది ఆమె –

‘అవును – పెళ్లి వరకు అతను బుద్ధిమంతుడు. నా వల్లనే తాగుడు షురూ చేసిండు. నా వల్లనే పాడై పోయిండు. నా వల్లనే చచ్చిపోయిండు’  

అకస్మాతుగా జరిగిందేమిటో అర్థం గాక, ఆమె కొడుకు లేచి నిలబడి తల్లిని పొదివి పట్టుకున్నాడు.  

ఆమె అట్లా ఏడుస్తూనే వుంది. చుట్టూ వున్నవాళ్ళెవరికీ ఆమెని వెంటనే ఓదార్చే ధైర్యం రాలేదు.  

* * * * * *

Spread the love

కోడూరి విజయకుమార్

కోడూరి విజయకుమార్ తెలుగు సాహిత్య ప్రపంచంలో కవిగా సుపరిచితులు. ఆరు కవిత్వ సంపుటాలు వెలువరించారు. కొన్ని కథలు, సాహిత్య వ్యాసాలు, సినిమా సమీక్షలు, రెండు నాటికలు రాశారు. కవిత్వానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం మరియు ఇతర పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!