ఇచ్ఛామతి

నీరవ నిశ్శబ్దంలో మనతో నంచేసే మనో వైభవపు మైమరపు సంభాషణ – ఘాంద్రుక్

నువ్వెక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావని యిప్పుడెవరైనా నన్నడిగితే   ‘ఘాంద్రుక్’  అనేంతగా  అన్నపూర్ణా
సర్క్యుట్ లో హైకింగ్ చేస్తోంది మనసు. 
సతీశ్ చప్పరికె గారి ‘ఘాంద్రుక్ ’  వొకానొక రమ్య వైభవపు మైమరపు హృదయాన్ని దేదీప్యమానంగా వెలిగిస్తుంది.
వుజ్వలమైన జీవనానందం మొగలిపూల పరిమళమై మనసుపొరలన్ని గుప్పుమనిపిస్తుంది. యీ మాంత్రిక
యాత్రానుభవం మంత్రనగరి సరిహద్దులల్ని స్కేటింగ్ చేయిస్తుంది. జీవిత సంక్షోభాల అగాధాల అంచున
నిలబడినప్పుడో జీవితపు విజయ శిఖరాల మీద నిట్టనిలువుగా నిలబడి యెగరేసిన విజయకేతనాన్ని వీక్షిస్తూ చుట్టూ
చూస్తూ మెల్లగా కిందకి చూసినప్పుడు యెక్కి వచ్చిన తోవని చూస్తే యెంతటి విభ్రమాశ్చర్యానందమో అంతే
వెన్నులోని జలదరింపుతో గగుర్పాటుకిలోను చేస్తుంది.
తెల్లని కాగితాల్లో నల్లని అక్షరాలతో హైకింగ్… మొన్ననెప్పుడో చదవటం పూర్తి చేశాను… చేశానా… యేమో…
కింద నుంచి పైకెక్కుతున్నప్పుడు యాత్రికులు ఆ రోజుకి ఆ రాత్రికి మజిలీ చేసినప్పుడు శరీరం అక్కడి
వాతావరణానికి అడ్జస్ట్ అవ్వటానికి వుండాలనుకున్న చోటు నుంచి వో వంద మీటర్లు పైకెక్కి మళ్ళీ కిందకు వస్తే
వారి శరీరం అక్కడ అడ్జస్ట్ అవుతుందన్నట్టు పూర్తి చేసానని అనుకుంటూనే మళ్లీ వెనక్కి వెళ్లి…  మళ్లీ ముందుకొచ్చి
మొత్తానికి  ‘ఘాంద్రుక్ ’తో మనస్సు హైకింగ్ చేస్తూనే వుంది. హృదయం అన్నపూర్ణ సర్క్యుట్ లో వొక్కసారే  జైంట్
వీల్ యెక్కినట్టు… రోలర్ కోస్టర్ లో గిర్రున మెలికలుపోతున్నట్టు… వూయల వూగుతున్నట్టు… రంగుల రాట్నం
తిరుగుతున్నట్టు…    
 
సహజంగా యాత్రల్ని  యిష్టపడే నేను నే చేసిన యాత్రల ఆవరణ ని కథల్లోకి తీసుకొచ్చే నాకు యీ నవల
చదువుతుంటే నే రాసిన ‘సప్తవర్ణ ప్రేమ’లో ‘మిహిక’, ‘అతని భార్య’ లో నీహారిక తమ జీవితపు సంక్లిష్టతలో నిలబడి
వో దారిని వెతుక్కునే వెతుకులాటలో ట్రెక్కింగ్ కి గ్రేటర్ హిమాలయాలకి వెళ్ళుతుంటారు. ‘నీలాంగ్ ’ దారుల్లోనో…
కిలిమంజారో నో ప్రయాణిస్తుంటారు. మనసులో దట్టంగా కమ్ముకున్న సంఘర్షణ  తొలి సూర్యకిరణం
ప్రసరించటంతో దట్టమైన పొగమంచు కరిగిపోయినట్టు కరిగిపోయి తను తీసుకోవలసిన వొకానొక నిర్ణయం
స్పష్టంగా గోచరిస్తుంది. యీ కథల్ని బోలెడన్ని సార్లు చదువుకునేదాన్ని… తిరిగితిరిగి హిమాలయాలు… కిలి

మంజారో ప్రయాణానుభవం కోసం. అవును… ప్రయాణాలు మనలోకి మనం చూసుకునేలా చేస్తాయి. భలే
సంతోషంగా వుంటుంది యాత్రలు చెయ్యటమంటే. యిక మీరే వూహించండి యీ నవలలో మొత్తం అన్నపూర్ణ
సర్క్యుట్ అణువణువుని మన చెయ్యి పట్టుకుని  రచయిత తన పాత్రలతో  మనల్ని  ప్రయాణం చేయిస్తూ…  మనతో
వేడి వేడి బ్లాక్ కాఫీ… టీ తాగిస్తుంటే ‘ఘాంద్రుక్ ’  లోనే దివారాత్రులు యెలా తిరుగుతున్నానో. ‘వనవాసి’,
‘యాత్ర’, ‘జమీల్యా’ యిలా మరి కొన్ని నవలల్లా మళ్ళీ మళ్ళీ చదువుకునే జాబితాలోకి  ‘ఘాంద్రుక్ ’ చేరిపోయింది.
 
తిరిగి తిరిగి మన కళ్ళు అక్షరాల వెంట వాక్యాలతో అడుగులు వేస్తాయి. యీ ప్రయాణమంతా మెల్లమెల్లగా
నిదానంగా జాగరూకతతో అడుగులు వెయ్యాలి. అటూయిటూ యెటూ పాదం తొణక్కూడదు. తొణికితే
పర్యవసానాలేమిటో వూహించలేము. యీ నవల్లో వొక్క పదాన్ని… వొక్క వాక్యాన్ని దాటుకుంటూ వెళ్ళలేవు
చూపులు. అంత కుతూహలం…  అంత వుద్విగ్నత… అంతటి ఆనందాన్నినింపుకుంటూ  మన నయనాలు మనకి
మరింత విస్మయసౌందర్యాన్ని కానుక చేస్తాయి. అందికే మనం మన కళ్ళ పట్ల కృతజ్ఞతగా వుండాలి.  అప్పుడే
మనకి యిలాంటి నవలల్ని దోసిట్లో పదిలపరుస్తాయి. యెంతో విలువైన ‘ఘాంద్రుక్’ ని అందించిన సతీశ్ చప్పరికె
గారికి, ప్రచురించిన ఛాయా వారికి, చక్కని అనువాదాన్ని అందించిన నాగిణి అప్పసాని గారికి హృదయ పూర్వక
కృతజ్ఞతలు.
  
యీ నవల అత్యంత అపురూపమెందుకంటే యిందులోని వ్యక్తుల ఆంతరంగం బ్లాక్ అండ్ వైట్ లా ప్లాట్ గా
 బోరింగ్ గా వుండదు.  కఠిన దారుల్లో నడవటానికి మొరాయించే పాదాలకి… భయపడే మనసుకీ  యెప్పటికీ తన
జీవితం నడవాల్సిన తోవ సాక్షాత్కరించదని నిక్కచ్చిగా చెపుతుందీ ‘ఘాంద్రుక్ ’. నీరవ నిశ్శబ్దంలో మనతో మనం
చేసే సంభాషణ యీ నవల.
సిద్ధార్థకి తన తండ్రి అనారోగ్యంగా వున్నప్పుడు అతన్నే పూర్తిగా చూసుకుంటుండేవాడు. తన స్టార్ట్ అప్ ‘ జస్ట్
ఇంటెలిజెన్స్’ మీద సమయం పెట్టకపోవటంతో ఆ కంపెనీ సి యీ వో పోస్ట్ నుంచి తప్పుకునే వుచ్చులో పడి
తప్పుకుంటాడు సిద్ధార్థ అనాలోచితంగా. తండ్రి యీ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన దుఖం…  మరో వైపు తన
సర్వస్వం అనుకున్న స్టార్టప్ వదులుకోవాల్సి రావటంతో విపరీతమైన స్ట్రెస్ కి లోనవుతాడు. విరక్తి కలుగుతుంది.
మరోవైపు తండ్రి కోరుకున్నట్టుగా తాను మళ్లీ పెళ్లి చేసుకోలేదనే తలంపు విపరీతంగా బాధిస్తుంటుంది. తన తండ్రి
యెన్నో సార్లు అడిగినా అతనితో యెక్కువ సమయం గడపకుండా నిశ్చల తో పెట్టుకున్న రహస్య సంబంధం
అతనిలో గిల్ట్ ని మరింత పెంచుతుంది. తీవ్రమైన వేదనకి గురి చేస్తుంటుంది. యిన్ని మానసిక విరక్తులు కల్లోల
పరుస్తుంటే తనని తాను స్వస్థత పరుచుకునే దారి వెతుక్కుంటూ సిద్ధార్థ యింట్లో యెవ్వరికి చెప్పకుండా… తనకి
సంబధించిన యే కాంటాక్ట్ యివ్వకుండా అన్నపూర్ణ సర్క్యూట్ కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ ప్రయాణం మొదలు

పెట్టినప్పుడు హైకింగ్ లో అతనికి యే అనుభవమూ లేదు. అయినా గైడ్ ని కూడా పెట్టుకోకుండా హైకింగ్
మొదలుపెడతాడు..
ఆ ప్రయాణంలో ప్రతి సాయంకాలం మజిలీ చేసే చోట దేశదేశాల కో ట్రావెలర్స్ తో పరిచయాలు… పంచుకొనే
జీవిత శకలాలు… యిన్స్టంట్ యిష్టాలు… ఆకర్షణలు… సెల్ఫ్ నియంత్రణలు … వారివారి అన్వేషణ…
చెప్పుకోవటం.
దారుల్లో ప్రత్యక్షమయ్యే భిన్న సంస్కృతులు… నాస్తికుడైన సిద్ధార్థ ది జైన నేపథ్యం … అయితే యీ
శిఖరారోహణ చేస్తున్నప్పుడు కొండల్లో… పర్వతాలలో… లోయల అంచుల్లో… కొలనుల చెంత అనేకానేక
ఆధ్యాత్మిక విశ్వాసాలు… నమ్మకాలు… వాటిని అతను చూసే పద్దతి… ఆ అనుభవాలపై చూపిన సమన్వయము…
అతనిలో భిన్నకలయికల్ని కలుపుకునే పరిణతి గోచరిస్తుంది. మనుషుల ఆంతరంగిక అనుభవాల్ని జడ్జిమెంటల్ గా
చూడని గొప్ప సంస్కారం దర్శనమిస్తుంది. యింద్రియాలు తెరిచి చుట్టూ జరుగుతున్న ప్రపంచాన్ని వొక పట్టింపుతో
చూసిన నవల ‘ఘాంద్రుక్ ’ అందుకే హిమాలయాల మీద వెన్నెల్లా ప్రకాశిస్తుంది.
జీవితంలో చూసిన, చదువుకున్న, చేసిన యాత్రా అనుభవసారాన్ని రచయిత తమలోకి వొంపుకున్నప్పుడు… వాళ్ళ
స్వభావాల్లోకి మేలిమి జీవనసారం ప్రవహిస్తున్నప్పుడు ప్రతిపాత్ర ప్రతి మలుపు వాళ్ళ చుట్టూ ఆవరించిన జీవితాలు
వాళ్ళని వాళ్ళు వ్యక్తపరచుకోవటం ప్రపంచంలోని భిన్న అస్తిత్వాల… విభిన్న మనోగతాలున్న మనుషులు
చదువరికి పరిచయం అవుతారు. దేశదేశాల రాజకీయాలు… ఘర్షణలూ వారి వారి దృక్పధాల నుంచి వింటాం.
యెక్కడో వొక మాఫియా వుంటుంది. మరి యెప్పుడో వొక యుద్ధం జరుగుతుంటుంది. మరి యెక్కడో వొక చోట
మనుషులు మాయమవుతుంటారు. వొకచోట వ్యాపార రంగం కుదేలవుతుంది. మరోచోట కార్పొరేట్ సెక్టరు
ఖండాంతరాల్లో కూడా వికసిస్తుంది.
కొలంబియాలో అండర్ వరల్డ్… డ్రగ్స్… మాఫియా లీడర్ ఏస్కో బార్ లాంటి వ్యక్తి మనవరాలు సోఫియా.
అనేక  సంక్షోభాలను బాల్యం నుంచే చూసింది సోఫియా. వ్యక్తిగత జీవితంలోని హింస నుంచి కలిగిన యెరుకతో
సోఫియా ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూస్తుంది. బౌద్ధదేశాల ప్రభుత్వాల అమానవీయత గురించీ ఆమె మాట్లాడుతుంది.
యుద్ధాలే లేని ప్రపంచాన్ని ఆమె ఆకాంక్షిస్తుంది. అన్నింటినీ విడిచి పెట్టి ఆమె శాంతిని వెతుక్కుంటూ
బయలుదేరినప్పుడు ఆమెకి శాంతి నేపాల్లో హిమాలయాల సానువుల చెంత దర్శనమవుతుంది. శాంతి కోసం
ఆమె ఆచరిస్తున్న జీవన విధానం అతనితో పంచుకుంటుంది. స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికలూ స్పష్టపరుస్తుంది.
వాటన్నింటిని పూర్తిగా అర్థం చేసుకుని ఆమెతో ఆయా విషయాలలో ట్రావెల్ కాగలిగేంత సామాజిక రాజకీయ
అవగాహన సిద్ధార్థ కి వుంది.

యవ్వనారంభంలో యెన్నో యేళ్ళుగా సిద్ధార్థ, సోఫియా తమ జీవితంలోని అశాంతిని పోగొట్టుకోటానికి
శారీరక సంబంధాల్లోనే కొంత శాంతిని వెతుక్కుంటూ వుంటారు. సోఫియా స్వలింగ సంబంధాల్లో… రకరకాల
కాంబినేషన్స్ లో కూడా వెతుకుతుంది. అయితే యే యిద్దరిలోనైనా వొక వైపు మాత్రమే వుండే వుద్వేగపూరితమైన
సంబంధాల్లో వచ్చే కాంప్లికేషన్స్ పట్ల యిద్దరికీ యెరుక వుంది. అందుకే చాలా జాగ్రత్తగా వుంటారు. బాధ్యతగాను
వుంటారు. ఆ విషయాన్నియిద్దరూ తమతమ జీవితాల్లో ఆచరిస్తారు.
యిన్ని ప్రయాణాల తరువాత యిప్పుడు యిద్దరికీ జీవితాన్ని… జీవనాన్ని పంచుకునేంతగా తమిద్దరి మనసులు
కలిసాయనే నమ్మకం… కలిసి బతకాలనే ఆకాంక్ష హృదమంతా నిండుగా వుంది. యిటువంటి అవగాహనకి
చేరువయ్యే సమయంలో యిద్దరూ యాత్ర పూర్తి అవ్వబోతున్న మజిలీ దగ్గర ఆగుతారు. ఆ సమయంలో సిద్ధార్థ తన
యింటి వారిని కాంటాక్ట్ అయినప్పుడు తాను యింటి నుంచి యాత్రకి వెళ్ళిన రోజుల్లోతన యిద్దరు చిన్నాన్నలు యీ
లోకాన్ని వదిలి వెళ్ళిపోయారని తెలుస్తుంది సిద్ధార్థ కి. అతని స్నేహితులు కొత్త స్టార్ట్ అప్ మొదలు పెట్టి అతని కోసం
యెదురు చూస్తుంటారు. మరో వైపు వొక కార్పరేట్ కంపెనీలో ఆఫర్ వస్తుంది. తన తండ్రికి అతని సహచరితో
పుట్టిన కూతురు వుందని తెలుస్తుంది. ఆ సహచరికి కేన్సర్. కానీ వెంటనే  పెద్దగా భయపడేది యేంలేదు
వీలుచూసుకుని అమ్మని కలవమని చెల్లెలు చెప్తుంది. యే మాత్రం కొత్త అనేదే లేకుండా అన్నయ్యా అంటూ
ఆత్మీయంగా కలివిడిగా ఆ చెల్లెలు మాట్లాడటం యిలా అనుకోకుండా అతనికి వో కుటుంబం… తన పూర్వీకుల
వూరు… పెద్ద వుద్యోగం తన కోసం యెదురు చూస్తుండటం అతన్ని చుట్టుముడతాయి. అతను యే మాత్రం
వూహించనివీ బాధ్యతలు…అనుబంధాలు… బంధాలు… వూరి ప్రజల లెగసీ యిలా అన్నీ వొక్కసారిగా అతని
ఆలోచనల్ని… ప్రణాళికల్ని తారుమారు చేస్తూ అతని ముందు నిలిచి ఆ దారిని యెంపిక చేసుకోమంటుంటాయి.  
మరోవైపు మనసున మనసైన సోఫియా. ఆమె దారిలో వెళ్ళాలంటే అనుకోకుండా వచ్చిన వీటన్నింటినీ
వదులుకోవాలి. యెందుకంటే సోఫియా దారి స్థిరంగా యేర్పర్చుకొంది. సిద్ధార్థ దారిలోకి ఆమె రాదు. యిప్పుడు
నిశ్చయించుకోవలసింది సిద్ధార్థ యే.
సోఫియాతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు యివేవీ అతని ముందు లేవు. యిప్పుడు దేనిని వదులుకోవాలి… దేనిని
పట్టుకోవాలి అన్న విషయంలో అతనికి అంతో యింతో స్పష్టత వుంది. అందికే ప్రయాణారంభంలో వన్ నైట్ 
స్టాండ్ ప్రపోజ్ చేసిన లూసినీ ఆమోదించలేదు.  యీ యాత్రకి ముందు వూహగా మాత్రమే గుర్తొచ్చే స్థాయిలో వో
రహస్య రిలేషన్ షిప్ నుంచి వచ్చేసాడు. తన భార్య ఫీలవుతున్న విషయాన్ని అర్థం చేసుకుని, ఆమె కోరిక మేరకు
నిర్ణయం తీసుకున్నాడు. అయితే యిప్పుడు సోఫియా విషయంలో యింతకు ముందులా నిర్ణయం తీసుకోవటం
అతనికి కష్టం. పైగా ఆ మిస్సింగ్ ఫీలింగ్ ని ప్రాసెస్ చేసుకోవడం కూడా వూహకందని విషయం.

సోఫియా అతని ఆంతరంగాన్ని అంచలంచలుగా ఆవరించిన శాంతి వెన్నెల. సిద్ధార్థ కి సోఫియా తన essential
being అని స్పష్టంగానే తెలుసు. సోఫియాతో జీవితం అతనికి యిష్టం. కావాలి. కానీ యిద్దరి గమ్యాలు వేరువేరుగా
కళ్ళ ముందు నిలబడ్డాయి. యింత ట్రావెల్ తరువాత జీవితంలో యెంచుకోవల్సిన మార్గం పరీక్ష పెడుతుంది.
సంశయం… సందిగ్ధత రెండూ రెండు కళ్ళలో తిష్ట వేస్తాయి.
‘ఘాంద్రుక్’ మొదలైనప్పుడు కనిపించే మొదటి వాక్యం – అందరినీ వదిలి పారిపోవడమా! 
“ముప్పై ఆరు అందరి నుండి  దూరంగా పారిపోయే వయసా ఇది” ‘ఘాంద్రుక్ ’ నవలలోలోని కథా నాయకుడు
సిద్ధార్థ హొసమనె తనకి తానే వేసుకున్న ప్రశ్న.
యీ ప్రశ్నతో మొదలైన యీ నవల తమతమ యాత్ర అయిపోయే ముందు నేపాల్ లోని అన్నపూర్ణ యాత్ర
మార్గంలోని చేరుకునే వూరు‘ఘాంద్రుక్ ’. వొక చిన్ని వూరు.  ఆ ఆవరణలో యాత్రికులు సేదతీర్తూ తమ తమ
ప్రయాణాల్ని నెమరేసుకుంటూ… తమలోకి తాము తరచి చూసుకుంటూ శిఖరారోహణ అనుభవాన్ని
సమీక్షించుకునే మనో లోగిలి ‘ఘాంద్రుక్’ కి చేరుకున్నప్పుడు సిద్ధార్థ హొసమనె కి తన యాత్ర ప్రారంభంలో
మెదిలిన ప్రశ్నకి సమాధానం దొరికిందా… లేదా మరింత అయోమయానికి లోనైనాడా… తనలో పోగుపడిన గిల్ట్
కరిగిపోయిందా… మనసుని శిశిరపు ఛాయలా మసకబార్చిన వేదనంతా శుభ్రపడి హృదయం వసంతపు
సూర్యరశ్మిలా ప్రకాశవంతంగా విరబూసిందా…
సిద్ధార్థ  కళ్ళముందు స్పష్టంగా స్థిరంగా నిలిచిన ధవళగిరి యేంటి…  సిదార్ధ మనకి కలిగించిన యెరుక యేమిటి…  
నమస్తే… నమస్తే…
ప్రారంభించండి మీ ప్రయాణం… సతీశ్ చప్పరికె  ‘ఘాంద్రుక్ ’ లో అన్నపూర్ణ సర్క్యూట్ లో చేయించే హైకింగ్…
చెప్పే విశేషాలు… పరిచయం చేసే పర్యాటకుల్ని… స్వాపికుల్ని… సాహసకుల్ని  కలుసుకోండి.  వో వేడివేడి బ్లాక్

కాఫీ తాగుతూ…

కుప్పిలి పద్మ

Spread the love

కుప్పిలి పద్మ

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, ఆరు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, ముక్త, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, ముకుల కథా సంపుటులు.
'నెమలీకలు పూసే కాలం', 'మోహనదీ తీరంలో నీలి పడవ' దేశ దిమ్మరి తేనె తలపులు, కవితా సంపుటులు వచ్చాయి.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!