నాకంటే ముందునుంచే
ఈ నదిలాంటి వాగువుంది.
ఒంపులు ఒంపులుగా తిరిగి
భూమ్మీద చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లా
ఇది నా బాల్యంలోకి జొరబడి ఆశ్చర్యపరిచింది.
నది ఒడ్డునుంచి వచ్చాను.
నదికి నాకు విడదీయరాని బంధం.
సుళ్ళు తిరుగుతూ, నురగలు కక్కుతూ
గలగలమని పరుగులెత్తే నీళ్ళను చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకుంటున్న అనుభవం.
నా తల్లి నీళ్ళలోనే నన్ను నీళ్ళాడిందేమో!
చేపపిల్లలా తేమ ఆరని శరీరంతో,మనసుతో
పాకురు పట్టినట్టు వుంటాను.
మేటలు వేసిన ఇసుక దిబ్బలమధ్య
పచ్చపచ్చగా మెరిసే తుంగగుబురులా ఉంటాను.
చెలమల్లో నీళ్లు దోసిళ్ళతో తాగి
అమృతం సేవించిన ఆత్మలా ఉంటాను.
ఎన్నెన్ని చిత్రాలు, ఎన్నెన్ని అందాలు –
వాగుఒడ్డుమీద ఎదిగిన చెట్లకొమ్మల్లో,
అల్లుకున్న తీగెల్లో, ఆటలాడుకునే పిట్టల రెక్కల్లో, గిజిగాడి గూడుల్లో, గాలికి ఊగుతూ సన్నని శబ్దంచేసే ఆకుల సందడిలో, పూలమధ్య కమ్మని వాసనై వీచే గాలుల్లో,
కాయలవగరుల్లో, పండ్ల రుచుల్లో
వాగునీళ్ల అంచుల్లో గంతులేసే కప్పల పండుగల్లో
తీరొక్క చేపల విన్యాసాల్లో
నేనూ వాగులా చేరి మారిపోయాను.
ఇప్పుడు నేనూ నదినే. వాగునే.
గలగలపారే ప్రవాహాన్నే.
చెమ్మగిల్లే గుండెనే.
తడి తడి కన్నుల చెమరింతనే.
ఇప్పుడీ వాగును చూడండి.
నేను కన్పిస్తాను.
నన్ను ఈ నగరంలో వెతకండి.
వాగులా ప్రవహిస్తూ మీమధ్యనుంచే
అటూఇటూ తిరుగుతూ కన్పిస్తాను.
వ్యాక్యాన్ని జతచేయండి