“తరగతి గదిలో పాట నాకొక అత్యవసర పరికరమయ్యింది. పిల్లల్ని ఆకట్టుకునే అత్యంత బలమైన సాధనమయ్యింది”- గంటేడ గౌరునాయుడు
ఆ తరగతి గదిలోంచి ఎదిగొచ్చిన విద్యార్ధిగా ఆ పాట ప్రయాణం నాకు బాగా తెలుసు. మాష్టారి పాటతో నా ప్రయాణం సుమారు సమాంతరంగా సాగింది. ఇది కాస్త తలతిరుగుడు మాటై ఉండొచ్చు కానీ అనడానికి ఏమాత్రం సంకోచించట్లేదు నేను.
“అడవితల్లి ఒడిలోన ఆడుకునే పిల్లలం – చదువులమ్మ సిగను చేరుకున్న కొండమల్లెలం” అన్న పాట చిన్నప్పుడు హాష్టల్లో పాడుకున్నాను, ఇప్పుడూ పాడుతున్నాను, మా పిల్లలూ పాడుతునే వున్నారు. మాష్టారి పాట ఒక నిత్య చైతన్య స్రవంతి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి అవసరం లేదేమో!
అతడి తరగతి గది విద్యార్ధికి ఒక మహా మంత్రనగరి. సుద్దముక్క తో నల్లబల్ల వేదిక మీద ప్రతి పాత్ర చేతా మాట్లాడించేవారు… పాటలు పాడించే వారు. అతనడుగుపెడితే తరగతి గది ఒక అద్భుత రంగస్థలంగా మారిపోయేది. ఆ మనుషుల బాధలు, సంతోషాలు… కష్టాలూ కన్నీళ్ళు… సరదాలూ సందళ్ళూ … అన్నీ తరగతిలో ఆవిష్కృతమయ్యేవి, విద్యార్ధుల కళ్ళ ముందు కదలాడేవి. ఆ తరగతి గదుల్లోనే పువ్వుల లోకం మాది- చిరునవ్వుల లోకం మాదని ప్రకటించుకుంటారు పిల్లలు.. ఛేదిస్తాం చదువులతో చిక్కుముడుల వలలు- నిజం చేసి తీరుతాం కన్నవారి కలలని ప్రకటిస్తారు.
అక్కడ మొదలయిన మాష్టారి పాట ప్రతి పాఠశాలలోనూ ఒక స్వేచ్చా గీతమై ప్రతిధ్వనిస్తునే వున్నది. ప్రతి విద్యార్ధినీ దేశప్రేమికునిలా మారుస్తునే వున్నది. ఆ గది గోడలు దాటి నలుదిశలా పెను ప్రభంజనమై విస్తరిస్తూనే వున్నది.
“మట్టి మనుషుల మెతుకే పాట – బక్క ప్రాణుల బతుకే పాట
చెమట చుక్కల సవ్వడి పాట – శ్రామిక శక్తుల శకటం పాట
సమ సమాజ నిర్మాణం కోసం జరిగే పోరే పాట” అని పాటకు తన నిర్వచనాలిస్తూ ప్రజల నాల్కల మీద నిలుస్తునే వున్నారు.
“క్రిటికల్‌గా దేశముంది క్రికెట్ బ్యాటు విడిచిరా- బ్రేకైపోతోంది జాతి బ్రేకు డాన్స్ వదిలిరా –ప్రళయమొచ్చి పడుతోంది ప్రేమ పాట ఆపిరా- కలం పట్టు, కాదంటే గళం విప్పు- లేదంటే కుటిల రాజకీయాలను కూలద్రోయ నడుం కట్టు” అంటూ యువతకు పిలుపునిచ్చిన మాష్టారులో ఒక విప్లవ కారుడు ధ్వనిస్తాడు. “అమ్మనురా నేల కనుల చెమ్మనురా” అని చెట్టు గొంతులో అంటున్నా “నేలతల్లి కలలపంట కదరా మనిషంటే’ అని కవి గళమెత్తుతున్నా అతని మాటలో కవిత్వం శ్రోతని కట్టిపడేస్తుంది.
పాటలెన్ని రాసినా దిగంతాల నినదించింది మాత్రం ’పాడుదమా స్వేచ్ఛాగీతం’ పాటే. ఈ పాట పుట్టుకని అపురూపంగా గుర్తు చేసుకుంటారు మాష్టారు. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం రేగిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నపుడు రాసిన పాటది. ఓ రోజు సోషల్ మాష్టారి బదులు చరిత్ర పాఠం చెప్పాల్సొచ్చిందట. రోజూ సాయంత్రాలు ఆ కొండల్లోకి బస్సొచ్చేదాకా పాటలు పిల్లలకి పాటలు పాడే బృందంలోని పదోతరగది అమ్మాయి భారతి ఆ రోజు అడిగిందట “మాష్టారూ ఈ పాఠాన్ని పాట చేయకూడదా? అది మాకు నేర్పకూడదా?” అనట.
అదిగో అప్పుడే… ఆ రోజు సాయంత్రం బస్సొచ్చే లోగా రాసిన మూడు చరణాల పాటే ఆ స్వేచ్ఛాగీతమని గుర్తు చేసుకుంటారు. విషాదమేమిటంటే ఆ అమ్మాయి ఆమె బడి తదనంతర జీవితం లో ఓడిపోయిందట. బాధల బరువుని మోయలేక అర్ధాంతరంగా తన బతుకుని తానే చిదిమేసుకుందట. ఆ భారతిని గుర్తు చేసుకోవడం నా బాధ్యత అని దిగులుగా కళ్ళు తుడుచుకుంటారు.
ఇందులో దేశభక్తి గీతాలే కాదు, సామాజిక గీతాలూ, లలిత గీతాలూ, జానపద గీతాల తో బాటు తాత్విక గీతాలూ ఉన్నాయి. దీని వెల 300.00
ఈ పుస్తకం గురించి చినవీరభద్రుడు గారి మాట తప్పక వినాలి మనం…
గంటేడ గౌరునాయుడు మన కాలం లోని పదకర్తల్లో అగ్రశ్రేణిలో ఉండే కవి, గాయకుడు, పిల్లల ప్రేమికుడు. ఈ ముప్పై ఏళ్ళకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను “పాడుదమా స్వేచ్ఛాగీతం” వినిపించని బడి, ప్రతిధ్వనించని కొండా, కోనా లేవంటే అతిశయోక్తి కాదేమో! “ఏటి పాటలు ఏడ్పు గీతాలుగా మారిన’ కాలంలో, ’ఏనుగు కూడా గానుగ అడగవలసి వచ్చిన’ కాలంలో నిజమైన కవి తన గొంతునే ఒక ఆయుధంగా మార్చక తప్పదని తెలిసినవాడు గౌరునాయుడు. అందుకనే ’అన్నదాతల పైన గన్నెక్కుపెట్టేవు నీవు తింటున్నది అన్నమేనా’ అని పాలకుల్ని ప్రశ్నిస్తాడు. ’ఎంతవరకు ఎంత వరకు మౌనమెంతవరకు అట్టడుగు పొరల్లో అగ్గి రగలనంత వరకు’ అని హెచ్చరిస్తాడు.
ప్రజల్ని ప్రేమించే కవి ఆగ్రహ గీతాలు మాత్రమే రాసి ఊరుకోడు. ప్రతి కన్నీటి చుక్కనీ తుడిచే అనునయ గీతాలు కూడా పాడుతాడు. “శోకపు చీకట్లొ అమ్మ సిరివెన్నల తునక’ అని అన్నా, ’విచ్చుకుంటే పూలు గుప్పెడు అది అరకులోయ గుండె చప్పుడు’ అని అన్నా ఆ మాటలన్నీ గౌరునాయుడు మాత్రమే అనగలిగిన మాటలనిపిస్తాయి. అందుకే “పది మందిని కదిలించే పాటే నా ఊపిరి” అని అతడు అంటున్నప్పుడు నమ్మబుద్దేస్తుంది. స్వేచ్ఛాగీతమ్మెచట ఎగిసి ఎలుగెత్తునో ఆ గీతభావమే గౌరునాయుడు అని చెప్పుకోవచ్చు.
– వాడ్రేవు చిన వీరభద్రుడు గారు
***
చీకటి ప్రచురణలు- వెలుగుల కోసం గా ఈ పుస్తకం రావడం ఎంతో శ్రమ దాగి వున్నది. మాష్టారి సాహిత్య సర్వస్వాలు కథలు, కవితలు తర్వాత వచ్చిన పాటల సర్వస్వం ఈ పుస్తకం. ఇందులో 203 పాటలున్నా మాష్టారు రాసినవి సుమారు వెయ్యికి పైగా. అలభ్యాలు ఎన్నో. పట్టు బట్టి ఈ పాటలు జనం లోకి మరింత వెళ్ళాలంటే పుస్తకం గా రావాల్సిందేనని దివాకర్ గారు ఈ శ్రమనంతా భరించి ఈ పాటల్ని ఇలా మనముందుంచారు. ఇందులో వొరప్రసాద్ గారి శ్రమ కూడా చాలా వుంది.
ఈ సభలో క్లుప్తంగా… ఎవరేమన్నారంటే…
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రముఖుల జయంతులు, వర్ధంతులలో గురజాడను గుర్తించని ఈ సందర్భంలో ఈ పుస్తకం ఆవిష్కరించుకోవడం పెను సంచలనం – అట్టాడ అప్పల్నాయుడు గారు
ఈ పాటల్ని మన జిల్లాలో గల అన్ని గ్రంధాలయాలకూ చేర్చాల్సిన అవసరం వుంది. ఆ పని నేను తీసుకుంటాను – మజ్జి శ్రీనివాసరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్
ఈ రోజు మనకి స్వేచ్చ కావాలి. అణచివేత నుంచి, అహంకారం నుంచి, వివక్ష నుంచి, పేదరికం నుంచి, అన్యాయపు ధోరణుల నుంచి, అసహన అధికారం నుంచి ఈ దేశానికి ఇప్పుడు స్వేచ్ఛకావాలి. ఆ స్వేచ్ఛా గీతాన్ని ఇప్పుడు బృందగానమవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. – తెలకపల్లి రవి గారు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు
గురజాడ దేశభక్తి గీతానికి గౌరునాయుడు స్వేచ్ఛాగీతం కొనసాగింపు. మొదటిది జాతీయోద్యమ సందర్భంలో బ్రిటిష్ కి వ్యతిరేకంగా పాడితే ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా పాడాల్సిన అవసరాన్ని గురుతు చేస్తున్నాడు కవి – ఎం. వీ. ఎస్. శర్మ గారు. ఎమ్మెల్సీ
గౌరునాయుడు మాష్టారి వ్యక్తిత్వం ఆయన పాటలాంటిదే- డి.వీ.జీ. శంకర్రావు గారు, చైర్మన్, ఎస్టీ కమీషన్
గౌరునాయుడు గారు నాకు కూడా మాష్టారే – ద్వారం దుర్గాప్రసాదరావు గారు, కేంద్ర సంగీత అకాదెమీ అవార్డు గ్రహీత
గాయకులు డప్పు శ్రీను, సోధన చీపురుపల్లి బృందం, జానకి రాం, గజల్ వినోద్, మల్లిపురం, శ్రీధర్ లతో పాటు వాద్యబృందాలు చేసిన సందడి తో విజయనగరం మారుమ్రోగిపోయింది.
వ్యాక్యాన్ని జతచేయండి