ఇచ్ఛామతి

బాల్యమంతా కథలై వెలిగి.. బతుకుంత పుస్తకమై మిగిలి…

కొందరి బాల్యం బంగారు జ్ఞాపకాల గని. ఆ గని నిండా తరగని నిధి ఉంటుంది. మేలిమి బంధాల మంచి ముత్యాలు మిలమిల మెరుస్తుంటాయి. స్నేహాల వజ్రాలు ఠీవిగా నిలిచి పిలుస్తుంటాయి. అమ్మానాన్నలు ప్రేమలో తడిసిన పిల్లాలు రత్నాలై మెరుస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు నవరత్నాలై నిలుస్తారు. ఎన్ని సంతోషాలు.. ఎన్నెన్ని సంబరాలు. అది కదా బాల్యమంటే అనిపిస్తుంది. అక్కడే జీవితాంతం నిలబడిపోవాలనిపిస్తుంది. 

తెలుగులో బాల్య జ్ఞాపకాల చుట్టూ సాగే కథలు అనేకులు రాశారు. వాటిని సాహిత్యంలో సుస్థిరం చేశారు. తమ బాల్యాన్ని అందరికీ చేరువ చేశారు. ఎందరు రాసినా మరింత మందికి చోటు ఇచ్చేది ఈ బాల్య జ్ఞాపకాల సాహిత్యం. ఎన్ని చదివినా మరొకటి చదివేందుకు ఉత్తేజాన్ని అందిస్తుంటాయి. ఈ వరుసలో వచ్చిన తాజా పుస్తకం ‘సోపతిగాళ్లు’. వేముల విశ్వరూప్ దీని రచయిత. ఇది తన తొలి పుస్తకం. పది కథల మేలిమి పుస్తకం. ‘రేగి అచ్చులు’ ప్రచురణ సంస్థ ద్వారా వెలువడిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం(13-05-2025) రోజు హైదరబాద్ నగరం లామకాన్ వేదికగా జరిగింది. 

ఈ కార్యక్రమానికి వక్తలుగా ప్రముఖ సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, కథా రచయిత్రి తాయమ్మ కరుణ, కవి, కథకుడు కోడూరి విజయ్‌కుమార్ హాజరయ్యారు. వారి సమక్షంలో రచయిత తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రచురణకర్త వి.సాయివంశీ ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పలు కీలక అంశాలు వివరించారు. ‘40 ఏళ్లలోపు ఎవరూ సాహిత్యం రాయకూడదని’ ప్రముఖ రచయిత్రి పెర్ల్.ఎస్.బక్ చెప్పిన మాటను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఆ మాటను అబద్ధం చేస్తూ అనేకమంది యువకులు రచయితలుగా మారి, రచనలు చేయడం ఆనందకరమైన విషయం అని అన్నారు. మరింతమంది యువత రచయితలు కావాలని ఆకాంక్షించారు. 

తర్వాత రచయిత కోడూరి విజయ్‌కుమార్ మాట్లాడుతూ కథల్లోని పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఆ కథలతో తన కనెక్ట్ విధానాన్ని, తన బాల్యాన్ని తాను గుర్తు చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేసిన వైనాన్ని వివరించారు. తెలంగాణ పల్లె జీవనానికి ఈ పుస్తకం ఒక డాక్యుమెంట్‌గా మారుతుందని పేర్కొన్నారు. రచయిత ఎటువంటి భేషజాలు, ఆర్భాటాలు లేకుండా రాయడం వల్ల కథలన్నీ నూతనంగా ఉన్నాయని తెలిపారు. రచయిత మున్ముందు మరిన్ని మేలైన కథలు రాయగలరన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. 

అనంతరం రచయిత్రి తాయమ్మ కరుణ మాట్లాడుతూ కథలు చదవడానికి తాను చాలా అవస్థ పడ్డానని, చదువుతున్నంతసేపూ నవ్వుతూ ఉండటమే అందుకు కారణమని వివరించారు. ‘పుట్టు కథలు కొన్ని.. కట్టు కథలు కొన్ని’ అని కాళీపట్నం రామారావు వివరించిన మాటల్ని ఉదహరించి, ‘సోపతిగాళ్లు’ కథలన్నీ పుట్టు కథలని కితాబు ఇచ్చారు. విశ్వరూప్ స్కూల్ జీవితంలో ఒక సంవత్సరంలో జరిగిన విశేషాలే ఈ కథలని, అతనితోపాటు అతని స్నేహితులు చేసిన అల్లరి పనులు ఆకట్టుకున్నాయన్నారు. కొన్ని కథల్లోని వాక్యాల గురించి వివరిస్తూ అవి తనను ఎంతగా ఆకట్టుకున్నాయో వివరిస్తూ నవ్వులు చిందించారు. కొన్ని వాక్యాలను రచయిత చేత చదివించారు. కథల్లోని పలు పాత్రలను ప్రస్తావిస్తూ, అవి తన మనసుకు హత్తుకున్న విధానాన్ని హృద్యంగా చెప్పారు. రచయిత మరిన్ని మేలైన కథలు రాయాలని అభినందించారు. అనంతరం రచయిత తల్లిదండ్రులు, స్నేహితులు తమ అభినందనలు తెలిపారు. చివరగా ప్రచురణకర్త వి.సాయివంశీ మాట్లాడుతూ ఈ పుస్తకానికి పనిచేసిన చిత్రకారుడు చరణ్ పరిమితోపాటు ఇతర బృందానికి నెనరులు తెలిపారు. పుస్తకం వేయడానికి తనను ప్రేరేపించిన అంశాలను వివరించారు. 

‘సోపతిగాళ్లు’ ఆవిష్కరణ సభ ఆనందంగా, ఆద్యంతం హాయిగా సాగింది. కవి, కథకుడు కట్టా సిద్ధార్థ సభను సందర్భోచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న పెద్దలకూ, అతిథులకూ, పాఠకులకూ ప్రచురణకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

…..

Spread the love

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!