ఎడారి కాగితం మీద
పలు ప్రణాళికలుగా విస్తరించాను
సూది రాతి మొనతో
చీకటి రాత్రుల కళ్ళుపొడిచాను
నాలుక తిప్పి భాషని లొంగదీసి
వేల అబద్దాల్ని పోగుచేశాను
ఎద్దు మెడలో కుండ పెంకుని కట్టి
వాణిజ్యప్రకటనని తయారు చేసుకున్నాను
కాలికి చక్రం తొడిగి తెగ తిరిగాను
గాలిని తెరచాపకి ముడివేసి
సముద్రం మీదకి ఉసిగొలిపాను
నీటి మీద కనబడని హద్దుల్ని గీశాను
పేరు లేని దేవుళ్ల జాబితా రాసుకున్నాను
ఆకాశాన్ని చీల్చి చందమామ మీద
మచ్చలా మిగిలాను
వెలుగు పుల్లతో అజంతా గుహలో
తొలిచిత్రాన్నై మిగిలాను
సింధూ నదీ పాయనుంచి
లుంబిని వనం గుమ్మం నుంచి
సైబీరియన్ వలస వాదినై
బుసెఫాలస్ గుర్రమెక్కి
యుగాలమధ్యన తిరుగుతూ ఉన్నా
కాలం మొత్తం నడుస్తూ
పక్కనే మెసులుతున్న వాడ్ని
నమ్మడంలో తడబడి
ఎప్పటికీ మెలకువ రాని
ఈజిప్ట్ పిరమిడ్ లో మమ్మీలా
నిస్తేజంగా మిగిలిపోయున్నా
వ్యాక్యాన్ని జతచేయండి