ఇచ్ఛామతి

యాద్ పియాకి ఆయే!

సంగీత పూదోటలో విరిసిన వేయి రేకుల గులాబీ ఈ ఠుమ్రి – యాద్ పియాకి ఆయే . మన హైదరాబాదీ హిందుస్తానీ సంగీత విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ ఠుమ్రి పాదుషా . పెద్ద పెద్ద విద్వాంసులే ఆయనలా పాడలేమని ఠుమ్రి లు పాడడం తగ్గించారుట. ఖాన్ సాబ్ స్వయంగా రాసి, పాడినది అజరామరమైన ఈ గీతం.

    మామూలుగా ఠుమ్రిలు ప్రేమ, భక్తి భావనలతో వుంటాయి. ఇందులో కూడా ప్రేమే – కానీ విరహం తో కాలి పోతున్న ప్రేమ. 1932 లో ఖాన్ సాబ్ సతీ మణి మరణించారు. అప్పటికి ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆ వియోగం ఈ ఠుమ్రిలో నిండింది .

యాద్ పియాకి ఆయే 

ఏ దుఖ సహ నహి జాయే హాయ్ రామ్ 

సహచరి వియోగం మిగిల్చినది జ్ఞాపకాలు, భరించలేని దుఃఖం.

బాలీ ఉమరియా సూనీరే  సజరియా

జోబన్ బీతీ జాయే హాయ్ రామ్

వయసు తక్కువే. ప్రియతమ పక్కన లేకుండా ఈ రాత్రి గడచి పోతోంది.

వహా బైరీ కోయిలియా కూక్ సునాయే 

ముఝే బీర్ హల్కాజొయరా జలాయే 

హ ప్రీత్ న జాన్ జగాయ్ హాయ్ రామ్ 

ఆ కోయిల ఎంత దుర్మార్గురాలో! కూ కూ అంటూ ప్రియతమ పాటలే వినిపిస్తోంది. ఈ విరహం నన్ను కాల్చి వేస్తూ పగలు , రాత్రి కూడా నిద్ర లేకుండా చేస్తోంది. 

          ఈ పాట పంజాబీ ఠుమ్రి బాణీలో నడుస్తుంది. భిన్న షడజ్ అని ఉత్తర భారతీయులు పిలుచుకునే ఈ రాగం, ఆ విరహానికి రూపం యిచ్చింది. ఖాన్ సాబ్ గొంతులో పలికే విషాదం మన మనసు లోపల పొరల్లో కి కూడా వ్యాపించి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆయన విషాదాన్ని అందమైన గమకాలతో , రాగ ఆలాపనతో ముడి వేస్తారు . నేనింకా వయస్సులో ఉన్నాను – ఒక్క వ్యక్తే కాదు – ప్రేమ కొరకు తపనకు ,కోల్పోయిన విషాదానికి ప్రతీక . అందుకే ఎన్ని తరాలు గడచినా ఈ పాట ఈ నాటికి శ్రోతల ఆదరణ పొందుతోంది . 

        అంతేలా హృదయాన్ని కదిలించిన మరో గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్. జగజీత్ సింగ్ జ్ఞాపకార్థం చేసిన కచేరీలో ఆయన పాడిన ఈ పాట అటు మన వ్యక్తిగత జ్ఞాపకాలే కాకుండా జగజీత్ సింగ్ మృదు మధురమైన గీతాలను గుర్తుకు తెచ్చింది. యాద్ పియా కి ఆయే అని పలికనప్పుడు ఆ గంభీరమైన గొంతులో విషాదపు జీర . కళ్ళలో నీరు రాక మానదు . శొక దేవతలా కూర్చున్న చిత్ర సింగ్ మనస్సు ని  పాట రూపం అయ్యిందేమో అనిపిస్తుంది .

                ఇక ఇదే పాటను కొంచెం హుషారుగా పాడింది- అజయ్ చక్రవర్తి, కౌశిక్ చక్రవర్తి. సుడులు తిరిగే కౌశిక్ గొంతులో కోయిల కూతలు పలుకుతాయి. కోయిలే ఆమె గొంతులో నివాసముండి పాడుతోందా అనే భావన కలుగుతుంది. అదో గొప్ప ఫీట్ . అయితే పాట అంతా విన్నాక మనకు కలిగేది అబ్బురం! ఆమె విద్వత్తుకి, స్వర విన్యాసం కి మధుర గానానికి ఆశ్చర్యం, ఆనందం. ఆ రాగానికి మరో పేరు- కౌశిక ధ్వని!!ప్రహర్ అనే సినిమాలో కూడ ఈ పాట వుంది . ఠుమ్రి మహారాణి శొభా గుర్తు పాడారు .

Spread the love

Prasuna Balantrapu

ప్రసూన బాలంత్రపు:
ఇంగ్లీషు సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న ప్రసూన బాలంత్రపు సాహిత్యంపై అవగాహన కలిగిన విద్యావేత్త. కళలపై , సాంస్కృతిక అంశాలపై ప్రగాఢమైన ఆసక్తి. విమర్శకురాలిగా, వ్యాఖ్యాతగా చదువు, కళల పట్ల పిల్లలలో, విద్యార్థులలో ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు.
పుస్తకాలు, సంగీతం పై ఆమెకున్న అభిరుచి, విమర్శకురాలిగా గుర్తింపు పొందడానికి కారణం అయింది.
'ది హిందూ' పత్రికకు ఆమె కొంతకాలం పాటు సాంస్కృతిక అంశాలపై అందించిన సమీక్షల్లో, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలపై చేసిన సమీక్షలు లోతుగా, స్పష్టంగా, చారిత్రక దృష్టితో ఉన్నవిగా గుర్తింపుని పొందాయి.
పిల్లలలో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. విజయవాడ పుస్తక ఉత్సవం నిర్వాహకులలో ఒకరిగా, ఆమె ప్రతి సంవత్సరం జరిగే పిల్లల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు.
పత్రికలకే కాకుండా, ప్రసూన బహుళ ఆకాశవాణి ప్రసంగాలు ఇచ్చారు. అలాగే  అనేక ప్రముఖ తెలుగు ఈ-మేగజైన్లకు వ్యాసాలు, పుస్తకాల సమీక్షలు అందించారు. డిజిటల్ వేదికలపై కూడా, ఆమె పుస్తకాలపై చేసే సమీక్షలు, సాహిత్యంపై చర్చలకు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!