ఇచ్ఛామతి

యీ మాసపు లేఖ

యే దూర శిఖరాలమీంచి తరలి వచ్చిన మబ్బులో కానీ యీ యేడాది రోహిణీ కార్తెని  ధిక్కరించి కురిసింది  ఆకాశం.  యే కోశానా మృదుత్వం లేని జోరుగాలి  వేసవి వానలు. చెరువులైన నగరాలు… మాయమైన మాఘ పౌర్ణమి. చిన్న నాటి వర్షాకాలపు జ్ఞాపకాలు సొరుగు లోంచి తీసి వొక్కటొక్కటే పేర్చుకుని చూసుకున్నాను. కిటికీ వూచల మీద వొక్కటొక్కటిగా జారుతున్న నీటి చుక్కలు. బఠానీ తీగల మీదనుంచి జల జల రాలుతున్న జల్లులు, సుళ్ళు తిరుగుతూ వేగంగా ముందుకు సాగుతున్న చిన్న చిన్న ప్రవాహాలు, యెక్కడినుంచి వచ్చాయో వొక్కసారి ప్రత్యక్షమయ్యే రంగు రంగుల కప్పలు, వాన ఆగీఆగగానే పొలాల మీదుగా యెగిరే సముద్రాల్లా దాటిపోతూ యెగురుతున్న పక్షుల రెక్కల సంగీతాన్ని వింటూ, గాలికి రాలిన మామిడి పూతని చూస్తూ… బుజ్జి పిడికిలంత పండీ పండని కాయల్ని కాకెంగిలితో పంచుకుంటూ… చుక్కలాకాశం కింద రాత్రుల్లు ఆరుబయట వరుసగా పడుకుని విన్న రెక్కల గుర్రాల లాంతరు సాహస కథలు యిలా అన్నీ కళ్ళముందు తిరుగుతూనే వున్నాయి. యీ సందడిలో యెక్కడో తప్పిపోయిన వొక జ్ఞాపకం తాలూకా జ్ఞాపకం సన్నగా సలుపుతోంది.

తప్పిపోయిన జ్ఞాపకాలు యెన్నెన్నో…  ముసురు వాన పడితే చెరువులు నిండుతాయి. పంటలు పండుతాయి. నదులు పొంగుతాయి. మొక్కలు యేపుగా పెరుగుతాయి. పిల్లలకి వేసవి కాలం సెలవులు ముగిసి బళ్ళు మొదలవ్వుతాయి.  చూర్లు కారుతాయి. గొడ్ల సావడ్లు వొక్కో సారి కూల్తాయి. గాలికి పక్షుల గూళ్ళు కింద పడతాయి. పాములు బయటకి వస్తాయి. మొక్కజొన్న కంకుల్ని బొగ్గుల మీద  కాలుస్తున్నప్పుడు యెగిసే పచ్చి సుగంధం మిరపకాయ బజ్జీలు వేగుతున్న ఘాటు గాలుల్లో చుట్టుకుని టెస్ట్ బడ్స్ ను యాక్టివేట్ చెయ్యటం… బట్టలు ముతక వాసన వేస్తాయి… యివన్నీ వొకప్పటి విషయాలు.. యిప్పుడు నగరంలో రోడ్లు నీటి ప్రవాహాలతో నిండి పోయి వాహనాలు కదలక గంటలు తరబడి యిల్లు చేరడానికి వీలవ్వక తల్లడిల్లిపోతున్నారు. ఆసుపత్రి నర్సులు,  షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్స్,  వంట మనుషులు, స్విగీ డెలివరీ బాయ్స్,  అర్బన్ కంపెనీ బ్యూటీషన్స్ యిప్పుడు వర్షం పడితే రెండు నిమిషాల్లో కొమ్మలు విరిగి నేలకు కూలే చెట్లు..  బుస బుసమని పొంగి వంటింటిని నింపేసే సింక్  కింద డ్రైన్…   యెక్కడెక్కడ నుంచో పెళ్ళగించుకొని వచ్చిన మురికితో నిండిపోయిన నీళ్ళు యిళ్లను చుట్టు ముడుతుంటే  యెప్పుడు నొప్పులు మొదలవుతాయో డెలివరీకి యెవరిన్ని సాయం అడగాలో  తెలియక కంగారెత్తిపోతున్న భర్తలు…   

యీ  ప్రపంచాల మధ్య న యెక్కడ తప్పిపోయిందో జాడ తెలియని వివేకం. వొక్కప్పుడు  యింత గందరగోళంగా బతకలేదు. అంటే మనలో యేదో వొక తెలివిడి యెరుక వుండి వుండాలి.  దాని జ్ఞాపకం సలుపుతుంది.  

Spread the love

కుప్పిలి పద్మ

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, ఆరు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, ముక్త, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, ముకుల కథా సంపుటులు.
'నెమలీకలు పూసే కాలం', 'మోహనదీ తీరంలో నీలి పడవ' దేశ దిమ్మరి తేనె తలపులు, కవితా సంపుటులు వచ్చాయి.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!