ప్రముఖ కథా, నవలా రచయిత సాహిత్య దిగ్గజం రాచకొండ విశ్వనాధశాస్త్రిగారి శతజయంతి సంత్సరం 2022లో వారి పేర కొత్త రచయితలకు పురస్కారాలు ప్రతీ సంత్సరం యివ్వాలని భావించారు ప్రముఖ కథకులు, జర్నలిస్ట్, ఉదయిని ఆన్లైన్ మ్యాగజైన్ ఎడిటర్ కూనపు రాజు కుమార్ గారు. యీ 2025 యీ అవార్డ్ కి యెంపికైన కరుణ కుమార్, రూబీనా పర్వీన్, మహి బెజవాడ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. యీ యేడాది యీ అపురూప పురస్కారం అందుకుంటున్న పురస్కారగ్రహీత కథా రచయిత, డైరెక్టర్ కరుణ కుమార్ గారి ఇంటర్వ్యూ.
1. మీ నేపథ్యాన్ని పంచుకుంటారా అండి.
శ్రీకాకుళం జిల్లా , పలాస మండలం, కంట్రగడ గ్రామం స్వస్థలం . పదవ తరగతి వరకు చదువుకున్నాను. వృత్తిరీత్యా 2016 వరకు ట్రావెల్ ఏజెంట్ ని . మొదటి కథ రాసింది 2017 లో . రైటర్స్ మీట్ లో కలిసిన రచయితల నుండి నేర్చుకున్న కథా రచన లోని మెళుకువలు సవర్లకొండ కథా సంపుటి తీసుకురావటానికి చాలా దోహదపడ్డాయి. 2016 నుండి సినిమా రంగంలో రచయితగా , మాటల రచయితగా , ఘోస్ట్ రైటర్ గా పనిచేస్తుండగా .. 2019 లో మొదటి సినిమా దర్శకత్వ అవకాశం వచ్చింది . పలాస 1978 మొదటి సినిమా . తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ , మెట్రో కథలు , కళాపురం , మట్కా సినిమాలకు రచయితగా , దర్శకుడిగా పనిచేశాను . ప్రస్తుతం హనీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాను. భార్య నీలిమ , పిల్లలు అనుదీప్ , నవదీప్ . ప్రస్తుత నివాసం హైదరాబాద్ .
2. రావి శాస్త్రి గారి అవార్డు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు.
రాయకుండా ఉండలేని ఉక్కపోత కు గురైనప్పడు మాత్రమే రాసిన కథలు అన్నీ కలిపి సవర్లకొండ కథా సంపుటి గా అన్వీ క్షికి వారు ప్రచురించారు . చాలా మంచి స్పందన వచ్చింది . కానీ రావిశాస్త్రి పేరిట ఉన్న అవార్డు ను ఊహించలేదు . చాలా గర్వంగానూ , సంతోషంగానూ అనిపించింది . సాహిత్యం లో మంచి చెడులు మాట్లాడుకునే మిత్రులు , సహ రచయితలు అభినందించారు . నా కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు . రాసిన కథలకు ఒక మంచి గుర్తింపు లభించినప్పుడు ఖచ్చితంగా ఇంకా బాగా రాయాలనే బాధ్యత , ఎక్కువ రాయాలనే ఉత్సాహం కలుగుతాయి కదా . నాకు అలాగే అనిపించింది . బాధ్యతగా , కొంచం వీలైనంత ఎక్కువగా రాయాలని అనుకుంటున్నాను .
3. మీ పుస్తకం గురించి మీరు మీ మాటల్లో ఏమనుకుంటున్నారో చెప్పండి.
నా పుస్తకం లో అన్ని కథలు నాకు బాగా నచ్చిన కథలే . కానీ చున్నీ మొదటి కథగా , ప్రశంసలు అందుకున్న కథగా ప్రత్యేకం . అలాగే పుష్పలత నవ్వింది కథ నాకు బాగా పేరు తీసుకొచ్చిన కథ . 7 సార్లు వివిధ సంకలనాలలో ప్రచురించిన కథ . 2025 సమకాలీన భారతీయ సాహిత్యం పేరుతో సాహిత్య అకాడెమీ ప్రచురించిన కథల సంకలనం లో హిందీలో అనువాదం చేయబడి ప్రచురించబడినది. ఇందులో ఉన్న సవర్లకొండ , సాయమ్మ , మేఘమాల , పురుగు ఇలా అన్ని కథలు నా మనసుకు నచ్చిన కథలు .
4. రావి శాస్త్రి గారి రచనల్లో మీకు నచ్చినవి కొన్నిటిని పంచుకుంటారా.
రావి శాస్త్రి గారి కథలు, నవలలు పూర్తిగా నేను చదవలేదు. నేను చదివిన వాటిలో రత్తాలు రాంబాబు , ఆరుసారా కథలు లో న్యాయం నాకు చాలా ఇష్టమైన కథలు .
వ్యాక్యాన్ని జతచేయండి