రాలిన పూలేరుకుంటాను.
గాలికీ, వానకీ, గాలివానకీ
రేకల రెక్కలతో ఎగరలేని పూలు
మట్టిని ముద్దాడిన చోట మురిపెంగా ముని వేళ్ళ కొసలతో...
రాలిన పూలేరుకుంటాను
కొమ్మతల్లి ఒడిలోంచి బిడ్డను కోయలేక,
చిగురాకు ఇంటిని కన్నీళ్లిగిరిన శూన్యంతో నింపలేక...
రాలిన పూలేరుకుంటాను.
నింగి మైదానంలో ఋతువుల అల్లరి ఆటకు
అటూఇటూ పరుగులు తీసే
సూర్య చంద్రుల చిరునవ్వు దివిటీలకు
కుండీల వరసలు సవరిస్తూ...
రాలిన పూలు ఏరుకుంటాను.
సుగంధాల బుక్కాలకు గిరికీలు కొట్టే తేనె పిట్టల పాటల్లో
సుదూర సీమల రహస్యాలు ఆలకిస్తూ...
రాలిన పూలు ఏరుకుంటాను.
ఎండిన పూల రేకల్ని దుఃఖపు జిగురుతో
జ్ఞాపకాల సంపుటిగా పదిలం గా అతికించి,
బతుకు పాటలో చరణాలుగా మలచుకుంటూ...
రాలిన పూలేరుకుంటాను
ఎప్పటిలా.
చిగురాకు ఇంటిని కన్నీళ్లిరిగిన శూన్యంతో నింపలేక…
ఎంత బాగుందో!
చాలా సున్నితంగా పువ్వులాగే వుంది
అద్భుతం