ప్రముఖ కథా, నవలా రచయిత సాహిత్య దిగ్గజం రాచకొండ విశ్వనాధ శాస్త్రిగారి శతజయంతి సంత్సరం 2022 లో వారి పేర కొత్త రచయితలకు పురస్కారాలు ప్రతీ సంత్సరం యివ్వాలని భావించారు ప్రముఖ కథకులు, జర్నలిస్ట్, ఉదయిని ఆన్లైన్ మ్యాగజైన్ ఎడిటర్ కూనపు రాజు కుమార్ గారు. యీ 2025 యీ అవార్డ్ కి యెంపికైన కరుణ కుమార్, రూబీనా పర్వీన్, మహి బెజవాడ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. యీ యేడాది యీ అపురూప పురస్కారం అందుకుంటున్న పురస్కారగ్రహీత కథా రచయిత రూబీనా పర్వీన్ గారితో ఇంటర్వ్యూ.
1. మీ నేపథ్యాన్ని పంచుకోండి…
నేను రుబీనా పర్వీన్, కథా రచయిత్రిని మాత్రమే కాదు, ఫిల్మ్ మేకర్‌ను, సోషల్ ఆంత్రప్రెన్యూర్‌ను కూడా. పుట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లా, బయ్యారం మండలం, ఇర్సులాపురం అనే చిన్న గ్రామంలో అయినా… నా కలల పరిధి మాత్రం ప్రపంచం అంతా అనే అనుకుంటాను.
ఒక్కటే జీవితం… దాన్ని చాలా రంగాల్లో అర్థవంతంగా మార్చుకోవాలన్న ఆలోచనతోనే నేను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా 17 ఏట జర్నలిజంలొ అదుగు పెట్టాక ఒక వైపు చదువుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్లాను. జర్నలిజంలో మాస్టర్స్,పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్, ఫినాన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసాను. ఈ ప్రయాణంలో యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, కథా రచన, సోషల్ ఆత్రప్రెన్యూర్ – ఇలా ఎన్నో దిశలలో నా దారిని వెతుక్కున్నాను. 12 ఏళ్లు జర్నలిజంలో పని చేసాక “ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ “ నుంచి చదువుకున్నాను.
ఫిల్మ్ మేకర్‌గా 540 పైగా డాక్యుమెంటరీలు, 380 కి పైగా యాడ్ ఫిల్మ్స్ రూపొందించాను. ఇవన్నీ కూడా సామాజిక సమస్యలపై ప్రజల దృష్టిని సారించేందుకు, చర్చకు తావిచ్చేవిగా రూపొందించాను. రచయిత్రిగా ‘జమిలీ పోగు’ అనే కథా సంకలనాన్ని తీసుకొచ్చాను. నా కథ ‘ఖులా’ పలు భాషల్లోకి అనువాదమైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘తెలుగు ప్రతినిధి కహానియా’లో చలం నుంచీ 2018 వరకూ వచ్చిన ఉత్తమ కథల్లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. ఆదేవిధంగా జర్నలిజంలో పని చేసిన అనుభవమే నన్ను గ్రామీణ అభివృద్ది దిశగా నడిపించింది. సోషల్ ఆంత్రప్రెన్యూర్‌గా ఇప్పటివరకు 5000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించాను. 7000 మందికి పైగా యువతను ఆంత్రప్రెన్యూర్‌లుగా తీర్చిదిద్దాను. 150 స్టార్టప్స్‌కు మెంటర్‌గా ఉండే అవకాశం లభించింది. 2017-18 సంవత్సరానికి భారత ప్రభుత్వం నుండి “బెస్ట్ సోషల్ ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” అందుకున్నాను.
యునైటెడ్ నేషన్స్ ఆహ్వానంతో UN హెడ్ క్వార్టర్స్ జెనీవాలో జరిగిన జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత్ తరపున ప్రసంగించాను. అంతే కాకుండా ఆ సదస్సు కోసం ఐదు ఖండాల నుండి 30 సంవత్సరాల లోపు 40 మంది సోషల్ ఆంత్రప్రెన్యూర్స్ ని మెంటర్ చేసాను. ప్రస్తుతం సంవత్సరానికి కనీసం 2 లేదా 3 UN కాన్ఫరెన్సుల్లో మెంటర్‌గా పాల్గొనబొతున్నాను. గత నాలుగేళ్లుగా రాజస్తాన్‌లో సోలార్ కుసుం ప్రాజెక్ట్ కోసం పని చేసాను. అయితే మొదట్లో నేను వెళ్ళినప్పుడు చాలా అననుకూల విషయలను గమనించాను. వాటిల్లో ముఖ్యమైనది రైతులకు బ్యాంకులుకానీ ఇతర ఫైనాన్షియ ఇన్స్టిట్యూట్స్ గానీ రుణాలు ఇవ్వటానికి ముందుకు రాకపోవడం. వీరందరినీ ఒప్పించి మార్జిన్ మనీ కోసం కొంతమంది HNI, స్థానిక వ్యాపారులతో మార్జిన్ మనీ ఇన్వెస్ట్ చేయించి, బ్యాంకులను ఒప్పించి కొన్ని రుణాలను సమీకరించి మొదటి కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా మొదలు పెట్టగలిగాం.తరువాత రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ 1000 మెగా వాట్లకు చేరుకొని ఇవాళ దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచింది.
మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌లో బిల్డింగ్ సస్టెయినబుల్ ఎంప్లాయ్‌మెంట్ మోడల్స్: The prospects and chalenges of Social entrepreneurship అనే అంశం మీద PhD చేస్తున్నాను. నా విశ్వాసం ఒక్కటే – “జీవనోపాధిని అందించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి నిజమైన బాటలు వేయవచ్చు.” అందుకే ‘పవర్ ఉమెన్’ పేరుతో సోలార్ రంగంలో మహిళా వ్యాపార వేత్తలను తయారు చేయడం, గ్రామీణ యువతకు ఉద్యోగాలను కల్పించే ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాను.
2. రావి శాస్త్రి గారి అవార్డు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు.
చాలా సంతోషంగా, కాస్త భయంగా… ఎందుకంటే రావిశాస్త్రి గారిలా ఆలోచించటం, ఆ ఆలోచనని అలా రాయటం దాదాపు ఇంకొకరికి అసాధ్యం అనుకుంటాను. బలమైన వ్యగ్యం, దానితో పాటే గట్టి సోషల్ సెటైర్. దుఃఖాన్ని కూడా మనసులోకి చేరేలా రాసిన రచయిత ఆయన. రచయితగా ఎంత నిబద్దతతో ఉన్నారో ఒక వ్యక్తిగా కూడా అంతే నిబద్దతతో బతికారు. ఆఖరికి పోలీసు కేసులని ఎదుర్కోవటానికి కూడా సిద్దపడ్ద మనిషి, అంత జరిగినా ఇసుమంతైనా తన ఆలోచననీ, ఆచరణనీ మార్చుకోని మనిషి ఆయన.
అలంటి గొప్ప రచయితా, మనవతా వాది పేరు మీద అవార్దు తీసుకోవటం అంటే కాస్త జంకుగానే ఉంటుంది కదా. లోలోపల గర్వంగా అనిపిస్తున్నా, సంతోషం కలుగుతున్నా ఈ పురస్కారానికి అర్హత సాధించటమే కాదు ముందు ముందు దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచన కాస్త భయపెట్టింది.
3. మీ పుస్తకం గురించి మీరు మీ మాటల్లో ఏమనుకుంటున్నారో చెప్పండి
నా కథా సంపుటి పేరు జమిలి పోగు, అంటే పెనవేసుకున్న కొన్ని రంగుల దారాలు అని అర్థం. ఈ కథల్లో పన్నెండు విభిన్న స్త్రీ జీవితాలని పరిచయం చేసే ప్రయత్నం చేసాను. ఏ రంగమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు అక్కడ ఉండే స్త్రీల జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కునే ప్రయత్నాలూ, దానికి కావాల్సిన తెగింపూ ఉండే స్త్రీల పాత్రలే నా కథల్లోని పాత్రలు.
ఏ కథలోనూ కేవలం సమస్యని మాత్రం చెప్పి వదిలేయలని అనుకోలేదు, సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కచ్చితంగా ఉండి తీరుతుంది. దానికోసం కొంచం శ్రమ, కొంత ప్రయత్నం అవసరం అందుకే బలంగా నిలబడే స్త్రీ పాత్రలనే చూపించాను. అందరికీ తలాఖ్ మాత్రమే తెలుసు కానీ, ముస్లిం స్త్రీ కూడా విడాకులు పొందే అవకాశం ఉందన్న విషయం అతి కొద్దిమందికే తెలుసు. అందుకే ముస్లిమ్‌లలో ఉండే స్త్రీలకు మరోసారి ఆ విషయాన్ని గుర్త్ చేయాలనే ఉద్దేశంతో ‘ఖులా’ గురించి కూడా చెప్పాలనుకున్నాను. ఈ కథ పలు భాషల్లోకి అనువాదమైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘తెలుగు ప్రతినిధి కథానీయాలు’లో కూడా చోటు సంపాదించుకుంది. “దేవ్లీ” కథలో పేద స్త్రీ ఆర్థిక స్వేఛ్చ గురించీ, “అబ్బా జాన్” కథలో… స్వేచ్ఛగా పెంచిన తండ్రి కూతురు ఎలా ఎదగగలుగుతుందో, “శోక ప్రకటణ” కథలో రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో అప్పుడే పుట్టిన ఆడపిల్లలని నిరాకరించే ఆచారాన్నీ కథా వస్తువులుగా తీసుకున్నాను. ఆ కథల్లో చర్చించిన పరిస్థితులని ఎదుర్కొని, వాటిని జయించే రోజు ఒకటి వస్తుందన్న ఆశా భావంతో ఆ కథలు రాసుకున్నాను.
అలాగే బుర్ఖా, మక్సూదా కథలు కూడా మైనారిటీలుగా ఉన్న మతంలో కూడా మరింత మైనారిటీలైన స్త్రీల మీద ఆంక్షలని ప్రశ్నిస్తూ రాసుకున్నాను. ఇవి చాలా లోపలి అంశాలు… మిగతా సమాజాలకి ఈ విషయాలు తెలిసే అవకాశం తక్కువ. ఈ కథలు రాయటానికి కారణం కూడా అదే… మరికొంత మందికి ఈ విషయాల మీద ఎంతో కొంత అవగాహణ వస్తుందేమో అనే ఆకాంక్ష.
మిగతా కథల్లోనూ ఏ పాత్రనీ వాస్తవానికి దూరంగా తీసుకువెళ్లకుండానే, తన పరిధిలో, సామాజిక కట్టుబాట్ల మధ్య కూడా ఎదిరించి ఎలా సాగాలో నాకున్న ఆలోచనతో తీర్చిదిద్దుకున్నాను.. ముఖ్యంగా నేను నమ్మేది, ఆ మార్పు కోసం పనిచేసేది మహిళలు సంపాదించిన రూపాయి పై వాళ్ళకు పూర్తి నిర్ణయాధికారం, వాళ్ళ పూర్తి హక్కు రావాలని. తరువాత రాసిన కథల్ని ఒకసారి చూసుకున్నాక, మిత్రుల సలహా వల్ల పుస్తకంగా వేయాలన్న అలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇవాళ ఇక్కడ నన్ను నిలబెట్టింది. ఈ కథలకు ఇదివరకే ప్రతిష్టాత్మకమైన ‘వెంకట సుబ్బు అవార్డు’ రావటం, ఇవాళ రావిశాస్త్రి అవార్దు రావటం సంతోషాన్నిచ్చింది. ఈ ప్రయాణంలో నన్ను గుర్తించిన, ప్రోత్సహించిన పాఠకులకు, మిత్రులకు కృతఙ్ఞతలు.
4. రావి శాస్త్రి గారి రచనల్లో మీకు నచ్చినవి కొన్నిటిని పంచుకుంటారా…
ఒక రచయితగానే కాదు, సామజిక అంతరాలని ధిక్కరించిన మనిషిగా కూడా ఆయన మీద గౌరవం ఉంది. సామాన్యుల జీవితాల నుంచే కథా వస్తువును ఎంచుకోవడం, జీవితంలో దెబ్బతింటున్నా, మోసపోతున్నా నిలబడాలని ప్రయత్నం చేసే పాత్రలని ఎంచుకున్న తీరూ నాకు ఎక్కువగా నచ్చే విషయాలు. ఎంతో వ్యంగ్యంగా, కోపంగా కూడా ఈ సమాజాన్ని పీడించే వ్యవస్తలను విశ్లేషించీ విమర్శించడం ఆయనకు తప్ప ఎవరికీ సాధ్యం కాదనదేది నా అభిప్రాయం. అన్నిటికీ మించి ఆయన ఎంచుకున్న భాష నన్ను బాగా ఆకర్శించింది. ప్రజలు మాట్లాడుకునే భాషలోనే రచనలు చేసిన ఆయన ప్రభావం ఎంతో కొంత నామీద ఉందని అనుకుంటాను. అందువల్లే నా ప్రాంతపు భాషని నేనూ నాకథలో వాడానేమో. ఆయన ఉత్తరాంధ్ర భాష వాడినట్టు, నేనూ నా ప్రాంతపు మండలీకాన్ని వాడుకున్నాను.
ఆరు సారా కథలు కావచ్చు, సొమ్ములు పోనాయండి, ఋక్కులు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, రత్తాలు-రాంబాబు, రాజు మహిషీ ఇలా మళ్లీ మళ్లీ చదువుకున్న కథలు ఎన్నో. ఇక ఆయన నవల అల్పజీవి గురించి నేను కొత్తగా ఏం చెప్పగలను. ఆ నవలని చదవని, ఎప్పుడో ఒకప్పుడు దాని గురించి చిన్న చర్చ అయినా చేయని తెలుగు పాఠకులు, రచయితలూ ఉంటాని అనుకోను. మరో నవల “ఇల్లు” చదువుతున్నప్పుడు కూడా ఆ కథనీ, పాత్రలనీ ఆయన నడిపించిన తీరు ఎంతగా మనల్ని ఆకర్శిస్తుందో, రచయితగా ఎన్ని నేర్చుకోవచ్చో ఒక పాఠం లాంటిది అనిపిస్తుంది.
ఇక రచయిత తన రచనల్లోనే కాదు జీవితంలోనూ ఎలా ఉండాలో ఆయన నాకు ఒక ఉదాహరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రకటించిన ‘కళాప్రపూర్ణ’ను తిరస్కతించడం, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డును వెనక్కు ఇచ్చేయటం లాంటివి ఆయన ధిక్కరాన్నీ, ప్రజల వైపే నిలబడ్డాను అనే సందేశాన్ని ఇచ్చినట్టుగా అనుకుంటూ అలాంటి మనిషిగానే నిలబడాలని చెప్పినట్టుగా నిలబడ్డ ఆయన నిజమైన జీవితం రచనలతో సమానంగా మనం గుర్తించాల్సిన అంశం అనుకుంటాను.
“తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకరిస్తుందో అని అలోచించాల్సిన అవసరం ఉంది. మంచికి హాని, చెడ్డకు సహాయము చెయ్యకూడదని నేను భావిస్తున్నాను”… అని ఆయన చెప్పిన మాటలని ఎప్పుడూ మననం చేసుకుంటూ, అంతటి గొప్ప రచయిత పేరు మీద అవార్డు రావటం నాకు సంతోషాన్నీ, కొంత భయాన్నీ కలిగించాయి. ఇలాంటి అవార్డు తీసుకున్నప్పుడు దానికి అర్హత పొందేలాగానే ఉండాలి. ఇంతకు ఉన్నట్టుగానే… ఇక ముందు కూడా నా ఆలోచనలు మారకుండా జాగ్రత్త పడుతూ, రాయటం అనేది ఏదో ఆశించి చేసే పని కాదని నమ్ముతూ ఉంటానని నాకు నేనే మాట ఇచ్చుకుంటున్నాను.
వ్యాక్యాన్ని జతచేయండి