ఇచ్ఛామతి

వెంటాడే కన్ను 

Edgar Allan Poe

January 19, 1809 – October 7, 1849

రచయిత పరిచయం : Edgar Allan Poe. డిటెక్టివ్, హారర్ కథలకూ, సైన్స్ ఫిక్షన్ కూ అమెరికన్ రచయితలలో ఆద్యుడు. ఇతడి ‘The Raven’ అనే కవిత ఇతనికి తన దేశంలోనే కాక యూరపంతా కూడా గొప్ప ఖ్యాతి తెచ్చి పెట్టింది. ప్రపంచ ప్రఖ్యాత imagist కవి ఛార్ల్స్ బోద్లేర్ అతి పెద్ద అభిమాని ఆలన్ పో కు. యురోపియన్ ఇమేజిస్ట్ కవులందరికీ ఇతనే ఆది ఆరాధ్యుడు. డిటెక్టివ్, గోథిక్ సాహిత్యం గా ప్రాచుర్యం వచ్చినా, పో కథలను నిజానికి మానవ మనస్తత్వ పరిశోధనాశాస్త్ర గ్రంధాలు అని చెప్పవచ్చు. ఫ్రాయిడ్ కంటే యాభై సంవత్సరాల ముందే మానవ స్వభావాన్ని, ఆ మనో సంక్లిష్టతలనూ, ఉన్మాద లక్షణాలను, కారణాలను తరచి చూపించిన రచయిత ఎడ్గర్ ఆలన్ పో.
ప్రస్తుత కథ The Tell-Tale Heart లో కథకుడు శ్రోతలతో ( వీళ్ళెవరనేదీ – పోలీసులా, న్యాయస్థానంలోని న్యాయాధిపతులా, లేక మానసిక చికిత్సాలయంలో వైద్యులా, లేక కేవలం ఆ పాత్ర ఇరుగు పొరుగు మనుషులా, పాఠకులకు తెలియదు) తనకు మనోవ్యాధి లేదని వాదించడమే విషయం.

అవును! నాకు జబ్బే, భయంకరమైన నరాలజబ్బు. కానీ నా మతి నా స్వాధీనం లో లేదని ఎందుకంటున్నారు, నాకు పిచ్చి  అని ఎందుకంటున్నారు మీరు? నా మతి, నా పూర్తి స్వాధీనం లో ఉందని మీకు కనిపించటం లేదా? నాకు పిచ్చి లేదు, అని మీకు తెలియటం లేదా?

నిజానికి,  నా తెలివి, నా బుద్ధి, నా జ్ఞానం వీటన్నింటినీ బహు చురుకు గా చేసింది నా జబ్బు, బ్రహ్మాండం గా పనిచేస్తున్నాయి ఈమధ్య అవి. ముఖ్యంగా నా వినికిడి జ్ఞానం ఎన్నడూ లేనంతగా అద్భుతం గా ఉంది ఇప్పుడు. అంతకుముందెప్పుడూ వినిపించని శబ్దాలు వినగలిగాను. 

స్వర్గం నుంచి శబ్దాలు విన్నాను! నరకం నుంచి విన్నాను!

వినండి! వినండి, అసలు ఇదంతా ఎట్లా జరిగిందో అనే కథ పూసగుచ్చినట్లు చెప్తాను, స్పష్టంగా, మెలికలేం లేకుండా క్లుప్తంగా చెప్తాను మీకు. చూద్దురుగాని, మీరే విందురుగాని  నా మానసికారోగ్యం ఎంత బాగా ఉందో. 

అసలూ,  ఎప్పుడు మొట్టమొదటి సారిగా ఆ ఆలోచన నా బుర్రలోకి దూరిందో చెప్పడం కష్టం. నిజానికి కారణమేమీ లేదు నేను చేసిన పనికి. నేను ఆ ముసలాయన్ను ద్వేషించలేదు; వాస్తవం గా అయితే అతడంటే ప్రేమే నాకు. వాడు నాకు ఏ హానీ చేసుండలేదు. వాడి డబ్బూ నాకు అక్కరలేదు. నేననుకోవడం ఇదంతా వాడి కన్ను వల్లే. వాడి కన్ను రాబందు కన్ను లా ఉండేది, కొన్ని క్రూరమైన పక్షుల కన్నుంటుందే, ఏదైనా జంతువు చచ్చిపోబోతుంటే దాన్నే కాపుకాసి చూస్తుంటుంది, అది చావంగానే దానిమీద పడి ముక్కలు ముక్కలుగా చీల్చి తినడానికి,  అట్లాంటి కన్ను వాడిది. ఆ ముసలాడు ఆ రాబందు గుడ్లేసుకుని నావైపు చూసినప్పుడల్లా చల్లగా నా వీపంతా ఏదో పాకుతున్నట్లు ఉండేది; నా రక్తం గడ్డకట్టేది కూడా. అందుకే, ఇంక నేను నిశ్చయించుకున్నాను ఈ ముసలోణ్ణి వేసెయ్యాలని, ఆ కంటిని శాశ్వతంగా మూసెయ్యాలని!

కాబట్టి నాకు పిచ్చి అనుకుంటారా మీరు? పిచ్చివాడు పథకాలు వెయ్యలేడు. అయినా, మీరసలు నన్ను చూడాల్సింది. ఆ వారమంతా నేను ఆ ముసలాడితో ఎంత స్నేహంగా, మర్యాదగా, ప్రేమగా, నా శక్తివంచన లేకుండా మంచిగా ఉండినాను.

రోజూ, రాత్రి పన్నెండు గంటలకు మెల్లిగా వాడి తలుపు తెరిచేవాణ్ణి. చెయ్యి లోపలికి దూరే మాత్రం తెరుచుకోంగానే, ముందు చెయ్యి, తర్వాత నా తల లోపలికి పెట్టేవాణ్ణి.  గుడ్డ చుట్టూ కప్పేసి ఒక దీపం పట్టుకునేవాణ్ణి చేతిలో, వెలుతురు బయటకు రాకుండా.  అప్పుడు నిశ్శబ్దంగా నిలుచునేవాణ్ణి అక్కడ. కాసేపు తర్వాత మెల్లిగా, జాగ్రత్తగా ఆ గుడ్డను కొంచెం పైకి, చాలా కొంచెం జరిపేవాణ్ణి, కేవలం ఒకే ఒక, చిన్న, సన్నటి వెలుతురు వాడి కంటి మీద పడేట్టు. ఏడురాత్రుళ్ళు చేశాను ఈవిధంగా, ఏడు సుదీర్ఘమైన రాత్రులు, ప్రతిరోజూ సరిగ్గా అర్ధరాత్రి. ఎప్పుడూ ఆ కన్ను మూసుకోనే ఉండేది, నన్ను నా పని చేసుకోనివ్వకుండా. ఎందుకంటే నాకు చంపుదాం అనిపించింది ఆ ముసలాణ్ణి కాదు; వాడి ఆ కన్నును , వాడి ఆ దౌష్ట్యపు కన్నును.

మళ్ళీ,  ప్రతి ఉదయం వాడి గదికి వెళ్ళేవాణ్ణి, స్నేహంగా, వాత్సల్యంగా, సరిగా నిద్ర పోయావా నిన్న రాత్రి అని వాణ్ణి అడిగేవాణ్ణి. రోజూ రాత్రి పన్నెండుకు నిద్రపోతుండిన వాణ్ణి నేను వచ్చి చూశాననే సంగతి, వాడికి ఊహామాత్రంగా  కూడా తెలియలేదు.

ఎనిమిదో రోజు రాత్రి, నేను ఎప్పటికంటే మరింత జాగ్రత్తగా ఉన్నాను తలుపు తెరిచేటప్పుడు. నావేళ్ళకంటే గడియారం ముళ్ళు వేగంగా కదుల్తాయేమో. నాది ఎంత గొప్ప చాకచక్యమో మునుపెప్పుడూ లేనంతగా తెలిసొచ్చింది నాకు;  ఇక నాకు విజయమే అని తెలిసిపోయింది.

నేను వాడి వాకిట్లోనే ఉన్నానని ఏమాత్రమూ  తెలీని ఆ ముసలాడు పడుకుని ఉన్నాడు. ఉన్నట్టుండి వాడు పక్కమీద కదిలాడు. నేను భయపడుంటానని మీరనుకోవచ్చు. లేదు. వాడి గదిలో చీకటి చిక్కగా, నల్లగా ఉంది. నాకు తెలుసు వాడు చూసుండడు తలుపు తెరుచుకోవడం. నెమ్మదిగా, సున్నితంగా తలుపు లోపలికి నెడుతునే ఉన్నాను. తల లోపలికి పెట్టాను. కప్పేసిన లైట్ పట్టుకున్న నా చెయ్యి లోపలికి పెట్టాను. తటాల్న ముసలోడు పక్కమీద నిటారుగా లేచి కూచున్నాడు, “ఎవరక్కడ??!” అని అరిచాడు.

కదలకుండా నిల్చున్నాను నేను. ఒక గంటసేపు చిటికెన వేలు కూడా  కదిలించలేదు నేను. నాకు  వాడు మళ్ళీ పక్క పైన పడుకున్నట్టు అలికిడి కాలేదు. అట్లాగే కూచున్నాడు వాడు ఒళ్ళంతా చెవులు చేసి వాటిని రిక్కించి, వినపడని శబ్దం ఏమైనా వినవస్తుందేమో అని. భయంతో కీచుగా వాడు వేసిన కేక వినిపించింది నాకు. వొణుకుతూ మంచం మీద కూచుని ఉన్నాడు వాడని తెలుస్తోంది; నేనక్కడ ఉన్నానని వాడికి కచ్చితంగా తెలిసిపోయింది అని నాకు తెలిసింది. వాడు అక్కడ నన్ను చూడలేదు.  నేను వాడికి వినపడను. అయినా అక్కడ నేను ఉన్నట్లు మటుకు వాడికి తెలుస్తోంది, యముడు వాడి పక్కనే నిలబడున్నాడనీ తెలిసిపోతోంది . 

మెల్లిగా, కొంచెం కొంచెంగా దీపం మీదనుంచి గుడ్డ తొలగించాను, ఒక సన్నటి, చిన్న వెలుతురు అందులోంచి జారేట్టు దాని మీదకు, అదే, ఆ రాబందు కన్ను మీదకు పడేట్టు! ఆ! ఇప్పుడు! ఇప్పుడు ఆ కన్ను తెరిచి ఉంది  ౼  విప్పార్చి, బాగా విప్పి తెరిచుకుని, నా కోపం పెరిగిపోయింది ఆ రాబందు కన్ను నన్ను నేరుగా కళ్ళలోకి చూస్తుంటే. ముసలోడి మొహం కనపడలేదు నాకు. ఆ కన్ను ఒక్కటే, ఆ కఠినమైన కన్ను, ఊదారంగు కన్ను, అంతే, నా ఒంట్లో నెత్తురు గడ్డకట్టి మంచులా అయిపోయింది. 

నేను మీకు చెప్పలేదూ నా వినికిడి శక్తి చిత్రం గా చాలా చురుగ్గా అయిందని? నాకిప్పుడు చటుక్కున, మెల్లని, మెత్తని ఒక చప్పుడు, గోడ అవతల కొట్టకునే గడియారం చప్పుడులాటిది వినపడింది.  అది ముసలివాడి గుండె కొట్టుకుంటున్న చప్పుడు. నిశ్శబ్దంగా నిలుచోవడానికి ప్రయత్నించాను. కానీ ఆ శబ్దం పెరిగింది. ఆ ముసలి వాడి భయం మహా దొడ్డది అయుంటుంది. ఆ చప్పుడు పెరిగే కొద్దీ నా కోపం హెచ్చుతోంది, దుర్భరమౌతోంది. నిజానికి అది వట్టి కోపమే కాదు. ఆ నిశ్శబ్దపు రాత్రి లో, ఆ గది నల్లటి నిశ్శబ్దం లో నా కోపం భయం అయ్యింది ౼ ఎందుకంటే, గుండె అంత గట్టిగా కొట్టుకోవడం తప్పకుండా ఎవరికైనా వినిపిస్తుందనిపించింది. ఇంక ఆలశ్యం చేయకూడదు! గదిలోకి గబుక్కున జొరబడ్డాను, “చచ్చిపో, చచ్చిపో!” అంటూ. వాడి పైకి దూకేసి బలంగా దుప్పట్లతో కప్పేస్తుంటే ముసలివాడు భయంతో గట్టిగా కేక పెట్టాడు. ఇంకా కొట్టుకుంటూ ఉణ్ణింది వాడి గుండె;  నేను చిన్నగా నవ్వుకున్నాను నాకు విజయం దక్కబోతోందని తెలిసింది. చాలా నిమిషాల వరకూ ఆ గుండె కొట్టుకుంటూనే ఉంది; కానీ చివరికి ఆ కొట్టుకోవడం ఆగిపోయింది. ముసలాడు చచ్చిపోయాడు. దుప్పట్లు తీసేసి, వాడి గుండె దగ్గరగా చెవి పెట్టి విన్నాను. ఏ శబ్దం లేదు ఇప్పుడు. అవును. వాడు చచ్చాడు.  చచ్చి కట్టెలా ఉన్నాడు. ఇహ మీదట వాడి కన్ను నన్ను విసిగించదు!

ఇప్పుడు చెప్పండి, నాకు పిచ్చా? అసలు మీరు చూసుండాల్సింది, నేను ఎంత జాగ్రత్తగా, శ్రద్ధగా ఆ శవాన్ని ఎవరూ పసిగట్టే వీల్లేకుండా దాచి పెట్టానో. ముందు తలకాయ కోసేశాను, తర్వాత చేతులు, ఆ తర్వాత కాళ్ళు. ఒక్క చుక్క నెత్తురు నేలపైన పడకుండా జాగ్రత్త పడ్డాను. నేల గచ్చు పలకలు మూడిటిని పీకి తీసేసి శవం ముక్కలు నేలలో పాతేసి పెట్టాను. అప్పుడు మళ్లీ, ఏ మానవమాత్రుడి కన్నూ ఆ బండలను కదిలించారని కనిపెట్టే వీల్లేకుండా, వాటిని మెళుకువ గా, చాలా మెళుకువ గా మునుపున్నట్లు గానే పరిచాను. 

ఈ పని ముగించేటప్పటికి ఎవరో వాకిట్లో కి వచ్చిన్నట్లు వినిపించింది. అది తెల్లవారుజాము. గడియారం నాలుగు గంటలు కొట్టింది, కానీ ఇంకా చీకటి గానే ఉంది. అయినప్పటికీ తలుపు తీయడానికి వెళ్లినప్పుడు నాకేం భయం వెయ్యలేదు. ముగ్గురు మనుషులు ఉన్నారు తలుపు దగ్గర, ముగ్గురు పోలిస్ ఆఫీసర్ లు. పక్కిళ్ళ వాళ్ళెవరో  ముసలాడి అరుపు విన్నారు, పోలీసులను పిలిచారు; ఈ ముగ్గరూ వివరాలు అడుగుదామనీ, ఇల్లు సోదా చేద్దామనీ వచ్చారు.

ఆ పోలీసులను లోపలికి రమ్మన్నాను. “ఆ అరుపు, అది నేనే, కలలో అరిచాన”న్నాను. “ఆ ముసలాయన ఇంట్లో లేడు, ఊరికి వెళ్ళాడు స్నేహితుణ్ణి ఒకణ్ణి కలవడానికి” అన్నాను. వాళ్ళను ఇల్లంతా తిప్పాను, వెతుక్కోండి మొత్తం, బాగా వెతకండి అంటూ. చివరకు ముసలోడి పడక గదికి తీసుకెళ్ళాను. వాళ్ళను ఓ ఆట పట్టిద్దామన్నట్లు ఇలా ఇక్కడ కూచోని మాట్లాడండి అన్నాను. 

నేను అంత మామూలుగా, నిబ్బరంగా ఉండడంతో పోలీసులు నా కధను నమ్మారు. అంచేత వాళ్ళు నాతో చాలా కలివిడిగా మాట్లాడుతూ కూచున్నారు. నేనూ అంతే మామూలు గా వాళ్ళకు జవాబులు ఇస్తున్నా, ఇంతలోనే, వాళ్ళింక వెళ్తే బాగుండు కదా అనిపించింది.  ఒకటే తల పోటు, చెవుల్లో ఓ వింత శబ్దం.  మాట్లాడుతూనే ఉన్నాను ఆపకుండా.  ఊపిరి సలపనీయనంతగా హడావుడి గా మాట్లాడుతూనే ఉన్నాను. ఆ వింత చప్పుడు మరికాస్త స్పష్టంగా వినిపిస్తోంది. అయినా వాళ్ళు అలాగే కూచుని ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు.

ఉన్నట్టుండి నాకనిపించింది, ఆ రొద నా చెవుల్లో కాదు, నా తలలోది మటుకే కూడా కాదు అది. ఆ క్షణంలో నేను కచ్చితంగా వెలాతెలా పోయుంటాను. నేను ఇంకా వడిగా వడిగా, బిగ్గరగా మాట్లాడాను. ఆ రొద కూడా పెద్దదయింది. అది అదే చప్పుడు, ఆ చటుక్కునయ్యే, మెల్లటి, మెత్తటి చప్పుడు, గోడ అవతలి గడియారం చప్పుడు, నాకు బాగా తెలిసిన చప్పుడు. అది పెరుగుతోంది, ఆ చప్పుడు మరింత పెరుగుతోంది. ఈ మనుషులు ఎందుకు పోలేదు?  రొద పెద్దదవుతుంది, ఇంకా, ఇంకా పెద్దది అవుతోంది. నేను లేచి నిల్చున్నాను, గదంతా అటూ ఇటూ నడిచాను. గచ్చు మీద నా కుర్చీని బర్రుమని శబ్దం చేస్తూ లాగాను, దుర్భరమైన “ఆ” చప్పుడు వినపడనివ్వకుండా. ఇంకా గట్టిగా మాట్లాడాను. అయినా ఆ మనుషులు దయ్యాల్లా కూచోనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, ముసి ముసిగా నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళకు వినిపించకుండా ఉండి ఉంటుందా??

లేదు! వాళ్ళు విన్నారు! అనుమానం లేదు. వాళ్ళకు తెలిసిపోయింది. ఇప్పుడు, వాళ్ళు ఆడుతున్నారు నాతో చెలగాటం. వాళ్ళ నవ్వులూ, ఆ చప్పుడూ  నాకు భరించ శక్యం కాకుండా ఉన్నాయి. బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, ఇంకా, ఇంకా బిగ్గరగా!

ఉన్నట్టుండి, ఇక నా వల్ల కాదనిపించింది అది భరించడం. ఆ గచ్చు పలకల వైపు చూపించి అరిచాను, “ఆపండి! అవును! అవును, నేను వాణ్ణి చంపాను. ఆ బండలు తీయండి,  కనిపిస్తుంది మీకు! నేను వాణ్ణి చంపాను. కానీ వాడి హేయమైన గుండె ఇంకా ఎందుకు కొట్టుకుంటోంది?! అదెందుకు ఆగదు!?” 

Spread the love

Suraparaju Padmaja

సూరపరాజు పద్మజ గారు చెన్నై నివాసి. సాహిత్య విమర్శకురాలు, అనువాదకురాలు.

1 వ్యాక్య

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!