“నది దోచుకుపోతోన్న నావని ఆపండి.
రేవు బావురుమంటూంది” అని ఒక మార్మిక , మాంత్రిక స్వరం తో గుంటూరు శేషేంద్ర శర్మ పదాలు పేర్చినా…
नैतिकता नष्ट हुई, मानवता भ्रष्ट हुई निर्लज्ज भाव से बहती हो क्यूँ ? इतिहास की पुकार, करे हुंकार ओ गंगा की धार, निर्बल जन को सबल-संग्रामी, समग्रोगामी बनाती नहीं हो क्यूँ ?…
అని భూపేన్ హజారికా నిలదీసి ప్రశ్నించినా,
వొంటరి లక్ష్మణ స్వామి కి ఊర్మిళ నే తలపించితివో… అని భద్రిరాజు గారు ఆత్మీయంగా పలకరించినా,
నది… ప్రవాహం… మనకు వొక పురా ప్రతీక.
స్థల కాలాల కు అతీతంగా తన పని అది చేసుకుంటూ వెళ్లి పోతుంది. నీకేం జరుగుతుందని పట్టించుకోకుండా పోతుంది. యీ ప్రతీకతోటి స్నేహం చేస్తాము. యేదో వొక రిలేషన్ షిప్ యేర్పరచుకొంటుoటాము. దాన్ని పర్సనలైజ్ చేసుకుంటాము. యేదో కావాలని అడుగుతాము. వినిపించుకోకుండా వెళ్ళిపోతుందని బాధపడతాము. అది చిన్న ప్రవాహం కావొచ్చు పెద్ద ప్రవాహం కావొచ్చు.
ప్రస్తుతం వున్నటువంటి ప్రపంచంలో అన్ని నదులూ కూడా యీ కాలాతీతమైనటువంటి వొక లక్షణాన్ని కోల్పోతున్నాయి. నిన్న మొన్నటి కాలుష్యమంతా నదిలో కనిపిస్తోంది. నిన్న వేసిన దిబ్బడ, మొన్న వేసిన దిబ్బడ, యివాళ వచ్చిన వరదా నది యిలా దర్శనమిస్తోంది.
కవిత్వంలో కథలో కానీ… సాహిత్యంలో సమకాలీన పరిస్థితి స్పందించటం వొక ముఖ్యమైనటువంటి కంపల్షన్. దానికి మనందరం రెస్పాండ్ అవుతూనే వున్నాం. కానీ వీటికి కొంచెం అతీతంగా జీవితమంటే యేమిటసలు?! యీ సమకాలీన పరిస్థితికి కొంచెం అతీతంగా యేముంటుoది ? అని ప్రశ్నించుకుంటే…
పురాణ వైరాగ్యం అనొచ్చు. స్మశాన వైరాగ్యం అనొచ్చు. ప్రసూతి వైరాగ్యం అనొచ్చు. మరేదైనా అనొచ్చు. గత సంవత్సరకాలంలో ప్రతిరోజూ కూడా భీభత్సంగా జరిగిపోయినటువంటి గందరగోళాల నుంచి కొంచెం వెనకా ముందు యేమయింది అన్నది తెలుసుకోవాలి దాన్ని అందుకోవాలన్న దాంతో వొక రిలేషన్ షిప్ వుండాలనే కోరిక కలగుతోంది.
దానికి రెస్పాన్స్ గా వస్తోంది “ఇచ్ఛామతి పబ్లికేషన్. “ఇచ్చామతి”లో యేముంటాయి అంటే వొక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ యేమి వుండదు. యే నెల కానెల ప్రస్తుతం వున్నటువంటి భీభత్సం నుంచి తల పైకెత్తుకొని నిలబెకోడానికి యేది వుపయోగపడుతుంది అనుకుంటే దాన్నల్లా పోగుపెట్టుకొంటాం. అదే “ఇచ్ఛామతి”. నది చిన్నదైనా పెద్దదైనా దానికి వుండేటటువంటి వొక ప్రధానమైన లక్షణం స్థలానికి, కాలానికి అతీతంగా ప్రవహించిపోవటం. “ఇచ్చామతి” అనంటే తన యిష్టానుసారంగా వెళుతుంది అంటే అల్లర చిల్లరగా పోతుందని కాదు కానీ స్థలానికి కాలానికి కొద్దిపాటి అతీతంగా యేదో వొక విలువల్ని అందుకోవాలనే ప్రయత్నం. కోరిక. వొక కొత్త రిలేషన్ షిప్ ని జీవితంతోటి యేర్పరుచుకోవాలి. అది యిప్పుడు అవసరం వున్న వారందరికీ యిది నచ్చుతుంది.
సాహితీనదీ నిత్యనూతన నవ్యరమ్య ప్రవాహి. జీవితానికి జీవనాన్ని కానుక చేసే.. ఆలోచనల్ని.. ఆకాంక్షల్ని.. కలల్ని.. భావాల్ని.. What not.. సమస్త భావోద్వేగాలనీ ప్రేమైకబాధ్యతతో ప్రవహింపచేద్దాం యీ ‘ఇచ్ఛామతి’ లో…
హృదయ పూర్వక కృతజ్ఞతలతో,
మీ స్నేహితులు,
అనంత్ మరింగంటి
కుప్పిలి పద్మ
12th September 2021