రామాయణంలో బాలకాండ నుంచి అరణ్యకాండదాకా నదులు కనిపిస్తాయి. అయోధ్యాకాండనుంచి సుందరకాండ దాకా అడవి కనిపిస్తుంది. సుందరకాండనుంచి యుద్ధకాండదాకా సముద్రం. ఇక కొండలు రామాయణమహాకావ్యం పొడుగునా కనిపిస్తాయి.
రామాయణ కథ మొదలవుతూనే సరయూ నది కనిపిస్తుంది. ఆ నది ఒడ్డున ఒడ్డాణంలాగా అయోధ్య. ఆ సరయూ నది ఒడ్డునే దశరథుడు పిల్లల కోసం యాగం చేసాడు. ఆ సరయూ నది ఒడ్డునే విశ్వామిత్రుడు రాముడికి బల, అతిబల అనే విద్యలు నేర్పాడు. విశ్వామిత్రుడి యాగసంరక్షణకోసం బయలుదేరిన రాముడు గంగా-సరయూ సంగమాన్ని చూస్తాడు. ఆ నది ఒడ్డునే వారు విశ్రమిస్తారు. సీతాస్వయంవరానికి మిథిలకు వెళ్ళే దారిలో శోణ నది కంబడుతుంది. ఆ దారిలోనే విశ్వామిత్రుడిమీద ప్రేమతో ఆయన సోదరి నదిగా మారిన వృత్తాంతం వింటాం, నదులన్నిటిలోకీ శ్రేష్టురాలైన కౌశికిని చూస్తాం.
ఆ దారిలోనే వారొక రాత్రి గంగ ఒడ్డున విశ్రమిస్తారు. గంగావతరణ కథ వింటారు. ఆ రాత్రంతా ఆ అద్భుతమైన కథనే మననం చేసుకుంటూ గడిపానని చెప్తాడు రాముడు విశ్వామిత్రుడితో.
ఇక వనవాసానికి బయలుదేరిన మొదటిరాత్రి రాముడు,లక్ష్మణుడు, సీత తమసా నది ఒడ్డున గడుపుతారు. వనవాసంలో మొదటిరాత్రి కాబట్టి ఇన్ని నీళ్ళు తప్ప తాను మరే ఆహారమూ స్వీకరించలేనని చెప్తాడు రాముడు. ఆ తర్వాత వారు వేదశ్రుతి అనే నదిని దాటతారు, ఆ తర్వాత ఆవులు సంచరించడం వల్ల నదిగా మారిన గోమతిని దాటతారు. ఇక కోసల రాజ్యపు చివరి సరిహరిద్దుల్లో నెమళ్ళూ, హంసలూ కేరింతలు కొట్టే స్యందిక నదిని దాటతారు.
అప్పుడు రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించి తనను వెన్నంటి వస్తున్నవారినుంచి అశ్రుపూర్ణముఖంతో సెలవుతీసుకుని కోసల దేశపు పొలిమేరలు దాటి మళ్ళా గంగానదిని చూస్తాడు. అక్కడ వాల్మీకి చేసిన గంగానది వర్ణన లాంటిది ప్రాచీన భారతీయ సాహిత్యంలో మరొకటి కనబడదు.
ఆ వర్ణన నా తెలుగులో:,
దేవపద్మిని
అక్కడ చూసాడు రాముడు
గంగని, పుణ్యనదిని.
ఆమె త్రిపథగ, శివతోయ,
శైవాలరహిత, ఋషిసేవిత.
2
అవిదూరస్థమైన ఆశ్రమశోభ
ఆ నదీతీరమంతటా.
అప్సరసల జలక్రీడల
సంతోషంతో ఆ నది శివమయం.
3
దేవదానవ గంధర్వ
కిన్నరీగణశోభిత
గంధర్వపత్నీసేవిత
గంగ, సతత శివమయం.
4
దేవతాక్రీడాశతాకీర్ణ
దేవోద్యాన శతాయుత.
దేవతార్థ ఆకాశవాహిని
గంగ, దేవపద్మిని.
5
జలఘాత అట్టహాసోగ్ర
పేననిర్మల హాసిని,
కొన్ని నీళ్ళు జడపాయలు
కొన్ని నీళ్ళు సుడిగుండాలు.
6
కొన్నిచోట్ల స్తిమిత గంభీర
కొన్నిచోట్ల వేగజలాకుల
కొన్నిచోట్ల గంభీర నిర్ఘోష
కొన్నిచోట్ల భైరవనిస్వనాలు.
7
కొన్నిచోట్ల మునకలేస్తున్న దేవతలు
కొన్నితావుల నిర్మలోత్పలశోభిత.
కొన్నిచోట్ల విశాలమైన ఇసుకతిన్నెలు
కొన్ని చోట్ల నిర్మలమైన ఇసుకరాశులు
8
హంససారస కలరవాలు కొన్నిచోట్ల
చక్రవాకకూజితాలు మరికొన్నిచోట్ల
సదామత్తిల్లిన విహంగాల
సన్నాదితధ్వనిసందోహం.
నదిమెడలో దండవేసినట్టు
చూడు, ఆ ఒడ్డమ్మట చెట్లు.
9
కొన్నిచోట్ల నదిని కప్పివేస్తున్నవి
నల్లకలువలు, తామరపూలు.
తెల్లకలువల్తో, విడీవిడని మొగ్గల్తో
రెట్టింపవుతున్నది నది శోభ.
10
కొన్నిచోట్ల విరజిమ్మిన పూలపుప్పొడి
కొన్నిచోట్ల ఆమె తాగిమత్తెక్కిన మగువ
ఎక్కడ చూడు, మాలిన్యం కనిపించదు
రాశిపోసిన మణుల్లాగా నిర్మలజలాలు.
11
దిగ్గజాలు కూడా ఇక్కడికి వచ్చినట్టు
దేవతాగజాలూ, అడవి యేనుగులూ
ఒక్కటిగా ఆడుకుంటున్న ఘీంకారాలు
అడవులంతటా నినదిస్తున్న ప్రతిధ్వనులు.
12
ఆ పండ్లు, ఆ పూలు, ఆ లేతచిగుళ్ళు
ఆ పొదలు, ఆ తరువులు, ఆ పక్షిగణాలు
చూడు, వాటన్నిటినీ అలంకారాలుగా
ధరించి అలరారుతున్నది అతివలాగా.
13
మొసళ్ళు, పాములు, నీటిజంతువులు-
విష్ణుపాదాలమీంచి కిందకి ఒలికిన కాంతి
అలసటలేనిది, అలసట తీర్చేది, శంకర
జటాజూటం నుంచి జారిన సాగరతేజస్సు.
14
సముద్రమహిషి, గంగ
సారసక్రౌంచ సన్నాదిత.
అడుగుపెట్టాడు రాముడు
ఆమె తీరాన, శృంగిబేరపురాన.
(రామాయణం, అయోధ్యాకాండ, 50:12-25)
వ్యాక్యాన్ని జతచేయండి