ఇచ్ఛామతి

అందమైన అక్షరవాన

‘అసలు రాయడమంటేనే అందంగా రాయడం కదా’ అన్నారు ముందుమాటలో ఖదీర్‌బాబు. ‘వాక్యాన్ని అందంగా రాయండి’ అని రైటర్స్‌మీట్‌లో యువ రచయితలకు సలహా ఇవ్వడం విన్నాను. నా మటుకు వచనం అంటే విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా రాయటమే. ఆయన మాటలు విన్నాక వాక్యం అందంగా ఉండాలని ఇంత తాపత్రయంతో రాస్తారా అనిపించింది. ఈ పుస్తకం చదువుతుంటే పదేపదే ఆయన మాటే గుర్తొచ్చింది. ఇందులో చాలాచాలా విషయాలు చెప్పారు. ఎంతో అందంగా చెప్పారు. పాకంలో ముంచి చెప్పారు. చదువుతుంటే ఆ తీపే హాయిగా, అలవోకగా ముందుకు తీసుకెళ్ళింది. ఫేస్‌బుక్ వ్యాసాలే కదా అనుకొని మొదలు పెట్టిన పుస్తకం ఎన్నెన్నో కథలు చెప్పింది. ఆనందంలో ఓలలాడించింది. వివిధ సందర్భాల్లో ఆయన పొందిన అనుభూతి నాకూ అనుభవంలోకి వచ్చింది. ఈ గొప్పతనం ఖచ్చితంగా అందమైన, మృదువైన వాక్యానిదే.

ఇంట్లో కురిసే వానతో మొదలవుతుంది ఈ వ్యాసాల జల్లు. తర్వాత పాటల నౌకలో ప్రయాణం చేసి, టైంమెషిన్‌లో బాల్యపు కావలిలో తిరిగొచ్చి, హఠాత్తుగా కరోనా లాక్డౌన్‌లో తేలుతాం. ఆ తర్వాత ఆయన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను దగ్గరగా చూసి, పరిచయం చేసుకొనొస్తాం. ఆయన కళ్ళతో కొన్ని సినిమాలు చూస్తాం. చివరిగా జీవితానికి ఆయన చెప్పుకున్న కృతజ్ఞత మనకూ అనుభవమై ఆ ఆనందాన్ని పంచుకుంటాం.

వ్యాసాల్లోకి వస్తే…

వాన ఎన్ని రకాలో అన్ని పదచిత్రాలు కళ్లముందు కురిసాయి. వాన గురించి నానమ్మ నోట నానుడినీ బచ్చన్న నోట వేదాంతాన్నీ విని తీరాల్సిందే. ఖదీర్ వాననూ వానలో ఒక్కొకరి అనుభూతినీ ఎంత అద్భుతంగా వర్ణించారో, విడిచిపోని దుఃఖమంటూ ఉండదు విడిచి వెళ్ళని ముసురు కూడా ఉండదని సాటి మనిషికి అంతే ధైర్యం చెప్పారు.

గాయకులనూ, సంగీత దర్శకులనూ, కవులనూ, పాటల రచయితలనూ పరిచయం చేస్తూ ఎన్నో పాటలను గుర్తుచేసారు. ఒకో పాట దగ్గర ఆగి, పాటను వెతుక్కొని వింటూ చదివాను. ఎన్నోసార్లు విన్న పాటలు, ఎప్పుడూ వినని పాటలు, చాలా ఏళ్ళ క్రితం విన్న పాటలు, మంచిమంచి పాటలు, ఖదీర్‌బాబు గంపలో పెట్టుకొని సిటీకి తీసుకొచ్చిన పాటలను మళ్లీమళ్ళీ విన్నాను.!!

చిన్నప్పటి ఎండాకాలాన్నీ, ఇంటికొచ్చే మనుషులనూ, క్షురకున్నీ ఆఖరికి ఊర్లో ఉన్న పిచ్చివాళ్లను కూడా ఆర్తితో తలుచుకున్నారు. ఈ వ్యాసాల్లో మనిషి మీద ప్రేమా, గతం మీద గౌరవంతో పాటు ప్రస్తుత కాలానికి జరిగిన కొన్ని మార్పులను చూసి చిన్నబోయిన హృదయమూ కనిపిస్తుంది.

కరోనా లాక్డౌన్‌లో బంధాలను ఎలా బలపరుచుకోవాలో చెబుతూ… ఎడమొగం పెడమొగం ఇల్లు ఇప్పుడు మనలేదనీ, మంచి స్నేహితులు ఉన్నవారు ఈ సమయంలో సగం విజేతలనీ అన్నారు. చుట్టూ నలుగురు ఉండటమే ఉత్సవం అయిన కవి శివారెడ్డి గారిని ఆ ఒంటరి సమయంలో పలకరించి, వారితో అనుబంధాన్ని  ఆర్తిగా రాసుకున్నారు. ఆ రోజుల్లో ఈ పోస్టులు చదవలేదు కానీ ఇప్పుడు చూస్తే ఎంత అవసరమైన విషయాలున్నాయి అనిపించింది. ఈ వ్యాసాలతో కరోనా రోజులు రికార్డయ్యాయి కూడా.

‘పుష్పగుచ్ఛం’ నుండి ‘ఆపా’ వరకూ తన 25ఏళ్ళ కథా ప్రయాణాన్ని “నా కథకు రెక్కలు తొడిగి నేను కూడా వాటిపైనుండి దుముకుతూ వెళ్ళాను” అని ఉద్వేగంతో పంచుకున్నారు. ఆ పాతికేళ్ళలో తను కృతజ్ఞత ప్రకటించాల్సిన వాళ్ళ గురించి రోజుకో వ్యాసం రాశారు.

ఖదీర్ రాసిన కథలో దుఃఖాన్ని చదివి వేమన వసంతలక్ష్మి ఏడిస్తే, వారిద్దరి అనుబంధాన్ని చూసి నాకు కన్నీళ్ళొచ్చాయి. అకా.. నువ్వెంత మంచిదానివి.

నామినిని చదివిచదివి మురిసిపోయా ఇన్నాళ్లూ. ఇప్పుడు నామిని అంటే వాళ్ళింటి చికెన్ మాత్రమే గుర్తొచ్చి నోరూరేలా రాసేసారు కదండీ ఖదీర్‌బాబూ..!!

దారిన ఆర్భాటంగా వెళ్లే రాజుగారు కాసింత ఆగితే ‘ఆ’ చెట్టు నీడ. ఎండకు సొలసిన పేదవాడు కాసింత ఆరాం చేస్తే ‘అదే’ చెట్టు నీడ. ఆ చెట్టు ఆర్టిస్టు మోహన్ గారట.

మృణాళిని గారు మనకు తెలిసిన రచయిత్రి, వక్త, అనువాదకురాలు మాత్రమే కాదు వీటన్నిటితోపాటు హిందీ పాటల ఎన్‌సైక్లోపీడియా‌ కూడా. ఆమెను అడగాలి అంతే ఎవరికైనా సాయం చేస్తారట.

ఓల్గా తనకు కొత్త దృష్టిని ఇచ్చారు అన్నారు. ఎవరినుండి ఏ జ్ఞానం, ఆలోచన తీసుకోవాలో బాగా తెలుసాయనకు.

చూపు కాత్యాయని గారు పొగడనవసరం లేదు. ఆమె రివ్యూ రాయడమే ఒక పొగడ్త అన్నారు.

అనంత్ ఇంటి గురించి రాస్తూ బృందాలు దొరకడం అదృష్టం అన్నారు. అవును రైటర్స్ మీట్లో చూసాను, బృందం ఉండడంలో ధైర్యాన్నీ సంతోషాన్నీ!!

వివిధ పత్రికల్లో తనతో పాటు పని చేసిన పతంజలి, లేపాక్షి, ఆర్టిస్ట్ అక్బర్, ఉమా మహేశ్వర్ రావులాంటి వారి ప్రత్యేకతలనూ, వారితో అనుబంధాన్నీ ఆవిష్కరించారు. ముళ్లపూడి వెంకట రమణ, ముక్తవరం పార్థసారధి, బి. చంద్రశేఖర్, స్మైల్, జంపాల చౌదరి, శ్రీ రమణ, కేతు విశ్వనాథ రెడ్డి, డా.చంద్రశేఖర్ రావు, ఎం. రాజేంద్రల గురించిన వ్యాసాలూ ఉన్నాయి. ఒక్కొక్కరితో తనకున్న పరిచయాలనే కాకుండా చిన్న వ్యాసాల్లో వారి గురించి పూర్తి అవగాహన వచ్చేలా రాసారు.

పతంజలి గారూ.. నవల రాస్తాను మీకంకితం ఇవ్వడానికైనా అన్నారు. నవల కోసం ఎదురుచూడాల్సిందే.. ఏ మిఠాయి పొట్లం దొరుకుతుందో!!

ఉచల్యా రాసిన లక్ష్మణ్ గాయ్‌క్వాడ్ , జ్ఞానపీఠ్ గ్రహీత దామోదర్ మౌజో, ఐ.ఏ.ఎస్ అధికారి గుర్రాల శ్రీనివాస్, మహీ, వెంకట్, తాడి ప్రకాష్ , సురేష్‌ల గురించి రాసి… కలవండి వీళ్ళను చదివినా సరే అన్నారు.

సినిమాల్లోలా కట్టుకథలు కాదు, సినిమా వాళ్ళ గురించి గొప్ప జీవకథలు చెప్పారు ఖదీర్. “గోల్కొండ వజ్రానికీ నాకూ ప్రత్యామ్నాయం లేదు” అన్న తొలితరం హిందీ సినీనటుడు అజిత్ కథ ఎంత బాగుందో. “సులువుగా దరికొచ్చేది గమ్యం కాదు, అలసి చతికిలపడేవాడు బాటసారి కాడు” అని మొండిగా ముందుకు సాగిన సూర్మా భోపాలీ గురించిన కబుర్లు చదివితీరాల్సిందే.

సాహిత్యాన్ని బాగా చదివి చిన్నచిన్న కథలనుండి గొప్ప సినిమాలు సృష్టించిన బాసూ ఛటర్జీకి కథకుల తరఫున నమోవాకాలు చెప్పిన సూక్ష్మ దృష్టి ఖదీర్‌బాబుది. అమితాబ్‌ నటనను పొగుడుతూనే ఆయన మీదున్న ఫిర్యాదులనూ చెప్పారు. ‘వంద మంటోలు ఉదయించనీ, వేయి మంటోలు ప్రభవించనీ’ అంటూ మంటో గురించిన వ్యాసం చదివాక మంటో కథలు వెతుక్కొని మళ్ళీమళ్ళీ చదువుకోవల్సిందే, ఆయన పేరుతో వచ్చిన సినిమా చూడాల్సిందే !

తెలుగు ప్రాంతాల్లో, కేరళలో కలిసిన ‘న్యూ బాంబే టేలర్స్’ నాటక కుటుంబం గురించి మురిపెంగా రాసుకున్నారు. ఈ సారి నాటకం చూసే అవకాశం వస్తే అస్సలు మిస్ అవకూడదు అనుకున్నాను.

దర్గామిట్ట కథలు, పోలేరమ్మ బండ కథలు, ఫుప్పుజాన్ కథలు, న్యూ బాంబే టైలర్స్, బియాండ్ కాఫీ, మెట్రో కథలు.. ఇన్ని కథల్లో ఖదీర్‌బాబు గార్ని చదవని తెలుగువాళ్లుంటారా? ఏదో ఒక కథతో ప్రేమలో పడని వారుంటారా? అందుకే ఊహించని అభిమానులు ఆయన్ని ఆనందంలో ముంచెత్తారు. వేదం చదివే ఒక కుర్రాడు తెనాలిలో ఒక ఫుడ్‌కోర్ట్‌లో కలిసాడు. మీ కథలన్నీ వెతుక్కొని చదువుతానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తిరుపతిలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ రిటైర్మెంట్ సభకు ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఎందుకంటే ఆమె ఖదీర్ కథల అభిమాని అనీ, ఆమెకు మంచి జ్ఞాపకంగా ఉండాలని డిపార్ట్ మెంట్ అంతా కలిసి అలా నిర్ణయించుకున్నామని చెప్పారట. ఈ సందర్భాలను పంచుకోవటంతో పుస్తకం ముగిసింది.

ఇలా ఈ వ్యాసాలన్నీ సరదాగా చదివిస్తూనే, కొత్త విషయాలు తెలిపాయి. మరిన్ని విషయాలను వెతుక్కుని మరింత సంతోషాన్ని మూటగట్టుకునేలా చేసాయి.

Spread the love

శ్రుతకీర్తి

శ్రుతకీర్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లా తోటపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్. ఎస్సీ కెమిస్ట్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ తెలుగు పూర్తి చేసారు. కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకుంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. చిన్ననాటి నుండి ఉన్న సాహిత్యాభిలాషతో అనేక పుస్తక పరిచయాలు రాసారు. ఫిలాసఫీ, కవిత్వం చదవడం, రాసుకోవడం తనకు నచ్చిన వ్యాపకాలు.

1 వ్యాక్య

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!