నాకు ఐదేళ్ళప్పుడు తనకీ ఐదేళ్ళవయసే అన్నాది నాగావళి
నాతో గొంతుకలిపి ఓ న మాలు , అఆ,లు, గుణింతాలు, ఎక్కాలూ చదువుతూ వొచ్చింది.
నేను మా ఇంటి గడపలో దూలానికి కట్టిన అమ్మ కోక ఉయ్యాల ఊగుతున్నప్పుడు తనూ కెరటాల ఉయ్యాల ఊగేదట,
అంతెత్తు ఒడ్డునుండి దభాల్న ఏట్లో దూకడం చూసి
తనూ పొద్దుపొడుపుకొండమీది నుంచి దూకేవాడు సూర్యుడు,
కెరటాలకు నేను బారీత నేర్పుతుంటే నాకంటే వెనకబడిపోయినందుకు సిగ్గుతోనో, అవమానంతోనో ఎర్రబడిన ముఖాన్ని ఏటివొడిలో దాచుకునేవాడు,
మా బావు హార్మణీ మెట్లమీద పాడి నాకు నేర్పిన పాటలు నన్నడిగి తనూ నేర్చుకుని
అలలమెట్ల మీద ఎంత బాగా పాడి వినిపించేదో ఏరు,
నాతో పాటు ఎదుగుతూవొచ్చిన నాగావళికి ఎంత పొగరో !
వానాకాలం పొడవునా పూలకెరటాల చేతులతో నన్ను ఎదుర్కొన్నప్పుడే తెలిసింది.
‘ఒకే ఈడోళ్ళం కదా’ అని నాతో పందెం వేసి నన్నోడించడానికే చూసీది,
‘మా తాతకీ, ముత్తాతకీ ఇలాగే చెప్పేవా ఒకే ఈడోళమని? అనడిగితే
అలలమునివేళ్ళతో కితకితలు పెట్టీది,
గుసగుసగా ఊసులాడుకుని కిందామీదా పడేవాళ్ళం,
మమ్మల్ని చూసి తెల్లబోయి పూలప్రవాహమై పరుగులుతీసీది రెల్లుబాడవ,
చిరుగాలి తువ్వాలతో మా ఇద్దరివొళ్ళూ తుడిచి ఒడ్డెక్కమని బతిమాలేది ఏరు అచ్చం అమ్మలాగే,
సాయంత్రం రాత్రిలోకి జారుతున్నప్పుడు మెల్లగా మాతో వొచ్చి కలిసేవాడు వెన్నెలరాగంతో చందమామ.
ఉండీ ఉండీ వెండితునకల్లా ఎగిరి పడుతూ అలల గమకాలకు సంగతులు కలిపీవి పిత్తపరిగెలు.
ఏరూ.. వెన్నెలా పాడే యుగళగీతాన్ని చెవులొగ్గి ఆలకించేవి చుక్కలు,
ఏటిపాటా.. వెన్నెలరాగం ..కర్పూరధూపంలా సుడిరేగి ..గాలిలో సుగంధం నింపి ఏ అర్థరాత్రికో కచేరీ ముగిసీది
చిరుచలిచేతులతో వేకువమ్మ మేలుకొలిపేదాకా నేనొక్కణ్ణీ ఆ ఇసుకతిన్నె పరుపుమీద..!
వ్యాక్యాన్ని జతచేయండి