తెలుగులో అంత్యానుప్రాస తొలి నిఘంటువు రూపకర్త -గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయ పాత పుస్తకాల డిజిటలైజేషన్ యజ్ఞం -తెలుగు వెలుగు జాతీయ సదస్సు నిర్వహణతో అరుదైన గుర్తింపు – బహుముఖంగా సాహితీ సేవలు కొనసాగిస్తున్న డా. అరిపిరాల వారితో బివి రాఘవరావు ఇంటర్యూ

డా. అరిపిరాల .. ఆయన ఇల్లే ఓ గ్రంథాలయం.. గ్రంథాలయమే ఆయనకు దేవాలయం .. నరసాపురం శ్రీ వై ఎన్ కళాశాల అధ్యాపకునిగా ‘తెలుగు వెలుగు’ పేరిట జాతీయ సదస్సుల నిర్వహణ.. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు స్వీయ చరిత్ర ఛాయాచిత్రాలతో సమగ్ర పునర్ముద్రణ గావించి, ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కళాశాలలకు తెలుగు రాష్ట్రాల, విశ్వవిద్యాలయాలకు వాటిని చేర్చిడం, గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో పాత పుస్తకాలను డిజిటలైజేషన్ యజ్ఞం పూర్తిచేయడం.. తెలుగులో తొలి అంత్యానుప్రాస నిఘంటువు నిర్మాణం.. ఆంధ్రకేసరి యువజన సమితి, సాహితీ వేదిక వంటి సంస్థల్లో ఎన్నో పుస్తకాలను రూపొందించడం.. ఇలా ఎన్నో ప్రక్రియలతో సాహితీ సేద్యాన్ని నిరంతరం సాగిస్తున్నారాయన.. ఎన్నో సత్కారాలు, సన్మానాలు, అవార్డులు అందుకున్న ఆయన తాజాగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా సాహిత్య విభాగంలో పురస్కారం అందుకున్నారు. ఇంతవరకు తెలుగులో లేని ‘శైలి శాస్త్రం’పై కూడా ఓ పుస్తకం తీసుకొచ్చే పనిలో నిమగ్నమై, కొత్త ఆవిష్కరణల వైపు సమాలోచన చేస్తున్న డా అరిపిరాల నారాయణరావు ప్రస్థానం ఇదీ
కుటుంబ నేపథ్యం వివరిస్తారా?
రాజమండ్రి సమీపంలోని ఉండేశ్వరపురంలో సత్యవతి, బ్రహ్మాజీరావు దంపతులకు 1949 జూన్ 10న జన్మించాను (రికార్డు ప్రకారం). మేం ముగ్గురు అన్నదమ్ములం. నలుగురు అక్కచెల్లెళ్లు. ఇంటికి పెద్ద నేనే. పెరిగింది రాజమండ్రిలోనే, రాజమండ్రికి సమీపంలోని తొర్రేడు వాసి మహాలక్ష్మి తో 1970 ఏప్రియల్ 30న వివాహం అయింది. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరు జీవితాలలో స్థిరపడ్డారు.
చదువు .. ఉద్యోగం విషయాలు ఏమిటండి ?
ఉండేశ్వరపురం, రాజమండ్రి రివర్డేల్ స్కూలు, మున్సిపల్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తిచేశాను. రాజమహేంద్రిలోని శ్రీ గౌతమీ విద్యాపీఠం ఓరియంటల్ హైస్కూలు విద్య, అక్కడే ఓరియంటల్ కళాశాలలో కళాశాల విద్య పూర్తిచేశాను. ఆంధ్రవిశ్వవిద్యాలయంనుండి ప్రైవేటుగా ఎం ఏ. పూర్తిచేశా. అనంతరం 1970లో వివాహం అయ్యాక అదే ఏడాది సెప్టెంబర్ లో ఉద్యోగం రావడంతో ఎన్.ఆర్.పి. అగ్రహారం, గరగపఱ్ఱు, దొడ్డిపట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ లో పనిచేస్తూ, సెలవుపై కాశీలోని బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో పరిశోధనకు వెళ్లాను. 19వ శతాబ్ది సాహిత్య శైలి వికాసం -గురజాడ అప్పారావు సాహితీ సేవ’ అంశంపై పరిశోధన చేసి, డాక్టరేట్ అందుకున్నాను. చాగల్లు జిల్లాపరిషత్ హైస్కూల్ లో 1980 నుండి 1981 జులై వరకు పనిచేసాక, 1981 ఆగస్టులో నరసాపురం శ్రీ వై.ఎన్. కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చేరాను. 1994 నుంచి తెలుగు రీడర్ గా, 1995 నుంచి తెలుగు శాఖాధిపతిగా విధులు నిర్వహించాను, 1998లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది, కందుకూరి వీరేశలింగం పురస్కారం, గురజాడ ఫౌండేషన్(అమెరికా) పురస్కారం, సర్ ఆర్థర్ కాటన్ పురస్కారం, పెనుగొండ కళాశాల నుంచి ‘సెమినార్ పితామహ’, మలికిపురం కళాశాల సదస్సుల పితామహ’ బిరుదులూ లభించాయి. ఇంక ఎన్నో సత్కారాలూ అందుకున్నాను. 2007 జూన్ 30 వ తేదీన పదవీ విరమణ చేశాను.

తెలుగు వెలుగు సదస్సుల వెనుక ఉద్దేశ్యం?
నేను శ్రీ వైఎన్ కళాశాలలో పనిచేస్తున్న సమయంలో 1985లో యుజిసి నేషనల్ సెమినార్ కి నన్ను డైరెక్టర్ గా నియమించారు. తెలుగు బాషా సాహిత్యంపై ఇతర భాషల ప్రభావం అంశాన్ని తీసుకుని సెమినార్ నిర్వహించినపుడు ‘తెలుగు వెలుగు’ అనే పేరు పెట్టాను. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా చినమిల్లి సత్యనారాయణ రావు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మధురై, బెంగుళూరు,మద్రాసు, బెనారస్, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల నుంచి పేరెన్నికగన్న ఆచార్యులు అనేకమంది వచ్చారు. అందులో ఆచార్య రోణంకి అప్పలస్వామి, ఆరుద్ర వంటివారు రావడం నిజంగా విశేషమే. మూడు రోజులపాటు సాగిన తెలుగు వెలుగు సదస్సుల సందర్భంగ పగటి పూట సదస్సులు, రాత్రివేళ తెలుగు సంస్కృతి ప్రతిబింబించే కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఆ విధంగా మొదటి రోజు కవనవిజయము, ‘నన్నయ డాక్యుమెంటరీ డ్రామా’, రెండో రోజు ‘కళాకృష్ణ ఆంధ్ర నాట్య ప్రదర్శన’, మూడవరోజు అధ్యాపక బృందంతో ‘వరవిక్రయం’ నాటకం తో రక్తికట్టించాం. తెలుగు సాహిత్యానికి పట్టంకట్టే విధంగా నాటికీ నేటికీ అంత పెద్ద ఎత్తున ఏ కళాశాలలలో, విశ్వవిద్యాలయంలో ఇలాంటి సదస్సులు నిర్వహింపబడలేదని చెప్పాలి. ప్రత్యేక సంచిక ఆవిష్కరించాం. నాటి సదస్సులో సమర్పించిన పత్రాలను, ఉపన్యాసాలను ‘వ్యాసమంజూష తెలుగువెలుగు వ్యాస సంకలనం’ పేరిట బృహద్గ్రంథంగా ప్రచురణ చేసాం. నాటి నుంచి నేను పదవీ విరమణ చేసేదాకా అంటే 2007 వరకు ప్రతియేటా తెలుగు వెలుగు సదస్సు ఒకరోజు జరిపాం, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం నుంచో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు పండితులను ఆహ్వానించి, ఉపన్యాసాలు ఇప్పించాం. ఆ ఒరవడి ఇప్పటికీ నా సూచనతో కొనసాగడం నిజంగా నా అదృష్టం. అప్పటివరకు మారుమూల ప్రాంతంలో ఉన్న శ్రీ వై.ఎన్. కళాశాల ఈ జాతీయ సదస్సుల నిర్వహణతో ఒక్కసారిగా దేశవ్యాప్తమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో రెండు రోజులు అన్నమాచార్య సాహిత్యంపై సదస్సు నిర్వహించాం.
ఆంధ్రకేసరి యువజన సమితితో అనుబంధం ఎలాంటిది?
ఆంధ్రకేసరి యువజన సమితితో 1980 నుంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా సమితి వ్యవస్థాపకులు శ్రీ వైఎస్ నరసింహారావు అలాగే శ్రీ పున్నమరాజు నాగేశ్వరరావు వంటివాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించారు. సమాచారమ్ సుబ్రహ్మణ్యం నేను చేసే ప్రతికార్యక్రమానికి అండగా నిలిచి, ప్రోత్సహించారు. అంతేకాదు, నర్సాపురంలో చేసిన కార్యక్రమాలకు కూడా తన వంతు సహకారం అందించారు. సేవా కార్యక్రమాల్లో మిత్రుడు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి నాకు నిరంతరం సహకారం అందించారు. 1983లో గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో 1862లో ముద్రితమైన ‘హితసూచని’ గ్రంథం దొరికింది. అది చాలా అపురూపమైన పుస్తకం. వీరేశలింగం గారికంటే ముందే ప్రచురితమైన వ్యాస సంపుటి అది. దాన్ని ప్రతిరోజూ గ్రంథాలయంలో మిత్రబృందంకలిసేవాళ్ళం. అందరం కలసి హితసూచని పునర్ముద్రణ చేయడం చెప్పుకోదగ్గ సంఘటన, దానికి ఆరుద్ర గారు 28 పేజీల పీఠిక రాసారు. తర్వాత నుంచి అనేక ప్రత్యేక సంచికలు వేసాను. ముఖ్యంగా ఆంధ్రకేసరి యువజన సమితి రజతోత్సవ ప్రత్యేక, స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికలు చెప్పుకోదగ్గవి. స్వర్ణోత్సవ సమయంలో నేను అధ్యక్షునిగా సమితికి వ్యవహరించాను. 56రోజులు అన్ని రంగాలను స్పృశించే వºధంగా కార్యక్రమాల రూపకల్పన చేసాను. సిఐఐఎల్,మైసూరు తరపున ఆంధ్రకేసరి యువజన సమితి రెండు రోజులు జానపద కళలపై జాతీయ సదస్సు నిర్వహించాం. అలాగే సిఐఐఎల్,మైసూరు ఆర్థిక సహకారంతో ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షునిగా ప్రత్యేకంగా రచయిత్రుల సదస్సు రెండు రోజులు నిర్వహించాం. ఆంధ్రకేసరి యువజన సమితిలో తెలుగులో గజల్స్ గురించి కార్యక్రమాన్ని నిర్వహించాం. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి ‘జీవనరేఖలు సాహితీ లేఖలు’ పుస్తకానికి, ప్రకాశం’ పుస్తకానికి సంపాదకత్వం వహించాను. ‘గీతావళి’ కి సంపాదకత్వం వహించాను.

ఇంకా ఏ సంస్థలతో సంబంధం ఉందండి?
భారతీయ సాహిత్య పరిషత్ తో సంబంధం ఉంది. పరిషత్ అధ్యక్షునిగా పందిరి మల్లికార్జునరావు సాహిత్యంపై రెండు రోజులు సదస్సు నిర్వహించి, ఆ సదస్సుకి సమర్పించిన పత్రాలను ‘సంహిత’ పేరిట ముద్రించాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసాం.
గౌతమీ గ్రంథాలయ అభివృద్ధికి చేసిన కృషి ఎలా ఫలించింది?
1980నుంచి గౌతమీ గ్రంథాలయంతో పరిచయం ఉన్న కారణంగా అక్కడున్న ప్రాచీన పుస్తకాలు, ప్రాచీన పత్రికలు గురించి తెలుసు. అవి ఎక్కువగా ఇంగ్లీషు, తెలుగు విభాగాల్లో ఉంటాయి. శిథిలావస్థకు చేరిన బాబాయమ్మ మెమోరియల్ హాలు గురించి 2017లో అప్పటి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకులసత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాను పునర్నిర్మాణం చేయాలని కోరాను. ఆయన వెంటనే అంగీకరించి, అప్పటి ఎంపి శ్రీ మాగంటి మురళీమోహన్ ను సంప్రదించి, ఎంపీ లాడ్స్ నుంచి 75లక్షలు, అప్పుడు కూడా సీఎం గా ఉన్న శ్రీ చంద్రబాబు స్పెషల్ గ్రాంటు నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరుచేయించారు. కార్పొరేట్ స్థాయిలో గ్రంథాలయ భవనం నిర్మించాలని సంకల్పించి, పలు నమూనాలు చూపించాను. డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు మున్సిపల్ ఇంజనీర్లను పిలిపించి, ‘ డా. నారాయణరావు గారు చెప్పిన ప్రకారం భవన నిర్మాణం చేయండి. ఒకవేళ ఈ నిధులు సరిపోకపోతే సొంత నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధం’ అని చెప్పేసారు. ఆ విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో గ్రంథాలయ భవనం రూపుదిద్దుకుంది. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకుని అక్కడ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించాను.
డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పం ఎలా కల్గిందండీ?
గ్రంథాలయ భవన నిర్మాణం సాగుతున్న సమయంలోనే ఇక్కడున్న ప్రాచీన పుస్తకాలు గ్రంథాలయానికి ‘ నిధి’ లాంటిదని డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారికి చెప్పాను. వీటిని డిజిటలైజేషన్ చేస్తే మరో వెయ్యేళ్ళు చూసుకొనవసరం లేదని చెప్పాను. అప్పటికే ముట్టుకుంటే పొడుంలా మారిపోతున్న పుస్తకాలను చూసి, డిజిటలైజేషన్ కి అవసరమైన సహకారం అందించడానికి ముందుకొచ్చారు. నాకు ఫొటోషాపు వర్క్ రావడం వలన డిజిటలైజేషన్ ప్రారంభించాం. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సొంత డబ్బులు 8లక్షల రూపాయలు వెచ్చించి స్కానర్లు, కంప్యూటర్లు, సమకూర్చడంతో పాటు వర్క్ చేస్తున్న 7మందికి ఏడాదిపాటు జీతాలు కూడా అందించారు. 2019 నాటికీ ఆయన పదవీకాలం పూర్తవడంతో డిజిటలైజేషన్ పనిని ఆపడం ఇష్టంలేక నాటి నుండి నా సొంత డబ్బులు వెచ్చించి, ముగ్గురికి జీతాలు చెల్లిస్తూ, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగించాను. రోజూ లైబ్రెరీకి వచ్చి స్వయంగా పర్యవేక్షించడం వలన అనుకున్న విధంగా 50లక్షల పేజీలను డిజిటలైజేషన్ చేయగలిగాను. అమూల్యమైన వివేకవర్ధని, వాసవి, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక సంచికలు, 1771లో ముద్రితమైన ఎన్ సైక్లోపీడియా సంపుటాలు, వ్రాతప్రతులు, హేండ్ మేడ్ పేపర్లపై రాసిన ముద్రితమైన పుస్తకాలూ ఇలా చాలా డిజిటలైజేషన్ అయ్యాయి. రిఫెరెన్స్ విభాగంలో గల అన్ని పుస్తకాలను డిజిటలైజేషన్ చేసాం,

ఈ సమయంలో ఇంకేం చేసారు…
ఇదే సమయంలో వీరేశలింగం పంతులు గారు చేసిన త్యాగాలు, సంస్కరణలు నేటి యువతకు తెలియజేయాలన్న సంకల్పంతో 1954 తర్వాత ముద్రితం కాని స్వీయ చరిత్రను మరోసారి ముద్రించాలని భావించాను. స్వీయ చరిత్ర సమగ్రంగా చదివి, సంబంధిత ఫొటోలన్నీ జోడించి 700 పేజీలతో పుస్తకం పునర్ముద్రణ చేసాను. దీనికి డాక్టర్ ఆకుల సత్యనారాయణ తొలిసహకారం అందించగా, తర్వాత మిత్రబృందం సహకరించారు. ఈ పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ కళాశాలలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని, విశ్వవిద్యాలయాలకు మెడికల్ కాలేజీలకు కొరియర్ ద్వారా పంపించాను
ఇక అప్పుడప్పుడు నేను రాసిన వ్యాసాలను క్రోడీకరించి ‘ వ్యాస కదంబం’ గా తీసుకొచ్చాను. వీరేశలింగం స్వీయ చరిత్ర ఆధారంగా కొన్ని విభాగాలుగా చేసి, ‘ఎదురీత’పుస్తకాన్ని తెచ్చాను. మనసు ఫౌండేషన్ రాయుడు గారు ఆవిష్కరించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ పంపిణి కార్యక్రమానికి శ్రీకారమ్ చుట్టారు. అదేవిధంగా గూడూరి నమశ్శివాయగారు రాసిన ప్రకాశం జీవిత చరిత్రలోని అనేక సంఘటనలను క్రోడీకరించి ‘ప్రకాశం’పేరుతో పుస్తకం ప్రచురించాం. దీనికి శ్రీ బుద్ధప్రసాద్ గారు ఆర్థిక సహకారం అందించారు.

అంత్యానుప్రాస నిఘంటువు నిర్మాణానికి ప్రేరణ ఏమిటండి?
మద్రాసు యూనివర్సిటీ వారు 2005లో ఇంటర్నేషనల్ “లెక్సికో గ్రఫీ” పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో రైమింగ్ డిక్షనరీ పేరిట పత్ర సమర్పణ చేసాను. అప్పటికే ఆంగ్లంలో రైమింగ్ డిక్షనరీలు ఉన్నాయి. హిందీలో కూడా ప్రారంభించారు. తెలుగులో కూడా చేయాలనే ఆలోచన కల్గింది. ఎందుకంటే నేను పదవీ విరమణ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూరు వారి సహకారంతో కొన్ని వర్క్ షాపులు నిర్ వహించాను. అపుడు సమకూరిన పద సంఖ్య 13 వేలకు మించలేదు. డిజిటలైజేషన్ లో భాగంగా 1934లో ముద్రించిన ‘శబ్ద రత్నాకరం’ పుస్తకం 2018లో దొరికింది. దాని ఆధారంగా అంత్యానుప్రాస నిఘంటువు తయారుచేయాలన్న సంకల్పం బలపడింది. దాదాపు 6 సంవత్సరాలు దృష్టి పెట్టి, 700 పేజీలతో 50 వేల పదాలతో నిఘంటువు తయారుచేసాను. 2024 ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, రాజమండ్రి ఎంపి శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు ఆవిష్కరించారు. తెలుగులో తొలి అంత్యానుప్రాస నిఘంటువు ఇది.
సాహితీవేదికతో సంబంధం ఎలా ?
కొంతమంది మిత్రులు 1982లో ప్రారంభించిన సాహితీ వేదికలో నేను సైతం పాల్గొనేవాడిని. వృత్తిరీత్యా నరసాపురంలో ఉన్న కారణంగా ప్రతి సమావేశానికి రాలేకపోయినప్పటికీ ఎక్కువ సభల్లోనే పాల్గొన్నాను. నా ఆధ్వర్యాన ‘కన్యాశుల్కం’పై రెండురోజుల సదస్సు సాహితీవేదికలోనే జరిగింది. నేను ఉన్నపుడు ఇష్ట కవితా పఠనం వగైరాల్లో పాల్గొనేవాడిని. ఇక 40 ఏళ్ల తర్వాత సాహితీ వేదిక సమావేశాలు పునః ప్రారంభించాలనే సంకల్పం కలిగినపుడు స్థానికంగా నేను బాధ్యత వహించి, గడిచిన మూడేళ్ల నుంచి సమావేశాలు నిర్వహించడం జరిగింది. పుస్తక ప్రచురణలో కూడా నేను బాధ్యత తీసుకున్నాను.
తర్వాత ప్రాజెక్ట్ ఏమైనా ఉందా ?
నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న సమయంలో ‘శైలి శాస్త్రం’పై కృషి చేయాల్సి వచ్చింది. నేను పరిశోధన ముగించి 45 ఏళ్ళు అయినప్పటికీ ‘శైలి శాస్త్రం’పై తెలుగులో పుస్తకం రాలేదు. దీన్ని ఎలాగైనా పూర్తిచేయాలన్న ఆలోచన ఉంది. దాదాపు 400 పేజీలతో ‘శైలి శాస్త్రం’ పుస్తకం వచ్చే అవకాశం ఉంది.
నమ్ముకున్న అక్షరం ఆర్థికంగా ఆదుకోకపోయినా ఆ అక్షరంతోనే నిరంతరం ప్రయాణం చేస్తూ..వివిధ ప్రయోగాలు చేస్తూ హార్దికతను ఆణువణువునా నింపుకున్న నిబద్దత కలిగిన పాత్రికేయుడు రాఘవరావు అక్షర ప్రయాణం నిత్య నూతనంగా సాగాలని కోరుకుంటూ…. గోదావరి తీరం గర్వించదగ్గ సాహితీవేత్త డా. ఆరిపిరాల నారాయణ రావు గారి హృదయావిష్కరణ చేసిన రాఘవరావుకు శుభాభినందనలు 👍👍💐🌹
So much value in this one post. Keep sharing amazing content like this!