
బలివాడ కాంతారావు
(1927 జూలై 3—2000 మే 6)
కళింగాంధ్ర రచయితల్లో ప్రముఖుడు.శ్రీకాకుళం దగ్గర వంశధార నది ఒడ్డున ఉన్న మడపాం గ్రామంలో జన్మించారు. భారత రక్షణ శాఖ (ఎన్ఏడి) లో వివిధ హోదాల్లో ఉద్యోగం చేశారు. దాదాపు 300 కథలు 32 నవలలు నవలికలు రాశారు. వీరి అనేక రచనలు ఇంగ్లీష్ తో పాటు ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘దగా పడిన తమ్ముడు’ నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. పుణ్యభూమి నవలకు 1972లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, వంశధార నవలకు 1986లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 1998లో బలివాడ కాంతారావు కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి.ఇవి కాక చాలా పురస్కారాలు ఆయనకు లభించాయి.
కాంతారావు గారు మధ్యతరగతి సంక్లిష్ట జీవితం గురించి, ముఖ్యంగా మానవత్వం, మంచి చెడుల మధ్య ఘర్షణ, వేదన గురించి రాశారు. సామాన్యుడి ఈతి బాధలనుంచి రెండవ ప్రపంచం యుద్ధ కాలంలో ఏర్పడిన స్థితిగతుల ప్రాతిపదిక పైన కూడా ఆయన కథలు రాశారు.
“తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని (అదే జీవితాలకు సమగ్రతను ఇవ్వడంలో) కాంతారావు గారు తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారు” అన్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి మాట అక్షరాలా అక్షరాలా నిజం.
తన 20వ యేట రాసిన మొదటి నవల శారద, మొదటి కథ పరివర్తన నుంచి 1997 వరకు ఎత్తిన కలం దించుకుండా రచనలు చేశారు. ఆయన రాసిన మనిషి పసువు ,శ్రామికుడు, వరద వెల్లువ, శిశు విక్రయం, చక్రతీర్థ, ముంగిసకథ, నైజర్ తేనె, ఓట్ల సంబరం, బేడా ఘాట్ మొసలి ముఖ్యమైనవి.
‘బేడా ఘాట్ ముసలి’ కథలో శ్రమ దోపిడీ జరిగిన తీరు గురించి చాలా సీదా సాదాచెప్తారు. ఆయన కథ చెప్పే తీరు కూడా చాలా సాధారణంగానే ఉంటుంది.
బేడా ఘాట్ వెళుతుంటే మిత్రుడు మధుసూదన్ అక్కడ ఉన్న మొసలిని కూడా తప్పకుండా చూడమని సలహా ఇస్తాడు. చూసి రమ్మంటే అతడు కాల్చి వస్తాడు. అతడు నిజంగా మొసలిని చూశాడా?
మిత్రుడు మధుసూదన్ రైలు కదులుతుండగా “జబల్‌పూర్ వెళుతున్నావు – భేడాఘాట్ తప్పకుండా వెళ్ళు” అన్నాడు.
అంతటితో వూరుకోకుండా ప్లాట్‌ఫారం మీద రైలుతోపాటు కదులుతూ “భేడాఘాట్ మొసలిని చూడకుండా రావద్దు” అని అరిచాడు.
వివరాలు అడగడానికి రైలు ప్లాటుఫారం వదిలింది. భేడాఘాట్‌లో చలువరాతి గుట్టలున్నాయని విన్నాను. కానీ అక్కడొక మొసలి వుందనీ, అది అందమైన చలువరాతి గుట్టలకన్నా చూడతగ్గదని విన్నాక యెలాగైనా అక్కడకు వెళ్ళడానికే నిశ్చయించాను.
ఒకనాటి సాయంత్రం ఒక టెంపో మీద పదుగురితో పాటు జబల్ పూర్ నుంచి భేడాఘాట్ చేరుకున్నాను. చూడ్డానికి మామూలుకొండ ప్రదేశంలానే వుంది, తప్పితే యెదరగా వున్న గుట్టలు అక్కడక్కడ సున్నం పులుముకున్నట్లు కనిపిస్తున్నాయ్. ఇంత దూరం వచ్చి మొసలిని చూడకుండా తిరిగి పోలేను. నది గట్టుకు వెళ్ళాను. బారులుతీరి పడవలు ఉన్నాయి.
నవంబరు నెల – నర్మదానది నవ వధువు గృహప్రవేశం చేస్తున్నట్లు నెమ్మదిగా కదులుతోంది. నది ఒక సరోవరమై అక్కడక్కడ తెల్లకలువల్లా చలువరాతి గుట్టలు తలెత్తి చూస్తున్నయ్.
పడవమీద పోవడానికి కదలుతుంటే నేనూ ఆ యెనమండుగురిలో ఒకడినయ్యాను. ఇందులో యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గురూ, ఫించనీదారులు యిద్దరు, వ్యాపారస్తులు యిద్దరు, నేనూ ఒకరి నొకరు పరిచయం చేసుకున్నాం. మాకోసం పడవ రాబోతోంది.
“డబ్బు తిరుగుదలలో యిస్తాం” అన్నాను ఆ పడవల పెద్దతో, ఎందుకంటే, నా దగ్గర నాలుగు రూపాయల చిల్లర లేదు.
“మీరే దయచేసి అందరి దగ్గర వసూలు చేసి తిరిగి వచ్చేక యిచ్చేయండి” అన్నాడు.
చూడ్డానికి వందనంగా వున్నాడు. వేసుకున్న బట్టలు తెల్లగా వున్నయ్. తలమీద తెల్లని టోపీ వుంది. నెమ్మదైన పలుకులు. ముఖంలో కళ వుంది. అలాంటి వానితో నా కోరిక చెప్పుకుంటే తీరుతుందని –
“ఇక్కడ మొసలి వుందట – ఎక్కడండీ?” అన్నాను. అక్కడే వున్న గైడ్‌ని పిలిచాడు.
“ప్రశ్నలు అందరూ అడగరు. ప్రశ్నలు అడిగిన వారికి సమాధానం చెప్పలేని వాళ్ళకు ఈ బిజినెస్‌లో చోటులేదు. చూపించు-ఆ మొసలిని చూపించు” అన్నాడు.
“చిత్తం” అన్నాడు గైడు.
పడవకోసం అందరం ఒడ్డున ఆగాం. గైడ్ ప్రక్కన నిల్చొని “అంత గౌరవం యిస్తున్నావు -అతగాడు ఈ పడవలకు పెద్దా? లేక పెద్దకు చుట్టమా? నౌకరా?” అన్నాను.
“అతనే పెద్ద. స్వయంగా అంతా చూసుకుంటాడు. అతను లేకపోతే భేడాఘాట్లే” దన్నాడు.
“అంటే…?”
“అది గదిగో చూడండి. ఆ కోవెల ఈ భక్తుడు కట్టించిందే..”
“మరి మీరు దిగారే… ఆ బస్సు స్టాపులన్నీ యితని ధర్మమే….”
ఇంకేదో చెప్పబోతుంటే బోటు ఎదరగా వచ్చింది. ఇద్దరే ఇద్దరు నడుపుతున్నారు. చిన్నగా చలిగాలి వీస్తోంది. ఇద్దరి శరీరాల మీద కట్ బనియన్లు చిరిగి వున్నయ్. బాగా మాసిపోయివున్నయ్. బోటు కదులుతోంది. గైడ్ చంకలో గొడుగు పెట్టుకుని ఒక మూల కూర్చున్నాడు. ఎక్కిన యెనమండుగుర్లో బరువుల తేడాలున్నాయి. కాబట్టి పడవ నడిపే వాళ్ళు మనుషులను సర్దుతున్నారు. ఐనా పడవకాస్త యిటూ అటూ జోగుతోంది. గైడ్ అరిచాడు
“ఇది భేడా ఘాట్.. భేడా అంటే?”
“గొర్రెపోతు” అని ఒక యాత్రికుడు అరిచాడు.
“తెల్ల గొర్రెలు పోట్లాడుకోబట్టే ఈ తెలుపు” అని యింకొకడు వ్యాఖ్యానించాడు. “కాదు కాదు” అని అథారిటీతో చెప్తూ-
“భేడా అంటే కూడలి. ఇక్కడ దేవతలంతా కూడారు! ఎందుకు? నర్మదాదేవి తన త్రోవకు అడ్డంగా వున్న ఈ కొండను కోసుకుని పోతాను అని పంతం పట్టింది. అది అంత సులువా? అప్పుడు శివుడు ఆమె సహాయానికి వచ్చి తన మహత్యంతో ఈ కొండను రెండున్నర రోజులు వెన్నముద్దగా మార్చేసి ఆపైన అతను కళ్ళు మూసి తపస్సు చేసుకున్నాడు” అన్నాడు గైడ్.
ఇంతలో యూనివర్సిటీ కుర్రాడు అరిచాడు – “ఆ కాకమ్మ కబుర్లెవరికి కావాలి?”
“అవి దేవతల కబుర్లు-తప్పు తప్పు – అలా అనకు” అన్నాడు పింఛనీదారు.
“ఓ గైడ్ – చెప్పు. బాబీ సినిమాలో ఆ ఆఖరిసీను ఎక్కడ తీశారు? చూపించు” విద్యార్థి అడిగాడు.
“అదిగో అక్కడే” అంటూ గైడ్ తూర్పువేపు చూపించాడు గొడుగుతో.
“సినిమా దేవతల కబుర్లెందుకు? నర్మదాదేవి అప్పుడు యేం చేసింది?” యింకో పింఛనీదారుడు అనగానే యిక బోటులో రెండు పార్టీలు లేచాయి.
“అదిగో – అక్కడే దత్తాత్రేయుడు, భృగుముని తపస్సు చేశారు” అన్నాడు గైడు.
“ఆపవయ్యా ఆపు. ప్రాణ్ డింపుల్‌ని రక్షించడానికి యెక్కడనుంచి గెంతాడు చూపించవయ్యా” యింకో స్టూడెంట్ అరిచాడు.
ఈ ఉద్రేకాల్లో బోటు యిటూ, అటూ కదలిపోతూంటే బోటు నడిపే వాళ్ళిద్దరి చేతులూ తమాషాగా కదులుతున్నాయి. నేను ఆ కదిలే చేతుల అందం ముందు ఈ కథలని ప్రకృతిని పట్టించుకోలేదు. ఊహలు కదిలిపోతున్నాయ్. చెంతనున్న ఒక బోటు నడిపేవానితో అన్నాను.
“నీకేమిస్తారు?”
“ఒకోసారికి రూపాయిన్నర.”
“అంటే ఈ ముప్పయి రెండు రూపాయల్లో నడిపే మీ యిద్దరికీ వృత్తి మూడు రూపాయలే!”
“అదీ మీలాంటి మారాజు లొచ్చిన్నాడుంటాది, లేకపోతే లేదు.”
“నీ కెంతమంది పిల్లలు?”
“ఇద్దరుపోగా మిగిలినవాళ్ళు ముగ్గురు.”
“వాడికో…?”
“వాడిది పెద్ద సంతానమండీ! ఆరుగురు పుట్టారు – ఆరుగురూ మిగిలే వున్నారు!”
“పెళ్ళాన్ని- ఆరుగుర్నీ ఈ బత్తెంతోనే పోషిస్తున్నాడా?”
“అందులో ముగ్గురడుక్కుంటున్నారండి!”
టెంపో దిగగానే మిమ్మల్ని చుట్టుముట్టిన దిగంబర బిక్షకుల్లో వీడి పిల్లలూ వుంటారనుకున్నాను.
“అదిగో చూడండి. నది మధ్యలో ఆ గుట్ట, ఈ గుట్టమీద ఒక ఋషి పుంగవుడుండేవాడు. అతనొక మొసలిని…” గైడ్ చెప్పబోతుంటే యూనివర్శిటీ విద్యార్థి గైడ్ నోరు మూసాడు.
“అవిగో – ఆ కొండల గురించి చెప్పు గానీ ఈ సన్నాసుల గురించి చెప్పావో చూడు ఏం చేస్తామో?” అని బెదిరించాడు.
“చిత్తం – చిత్తం… ” అంటూ –
“చూడండి బాబూ అటు చూడండి. ఆ వైభవం చూడండి. తాజ్ మహల్ చూసినా మీ శరీరం యిలా వుప్పొంగదు. చూడండి – తనివితీరా చూడండి” అన్నాడు గైడ్.
పడవ ఆ గుట్టచుట్టి మలుపు తిరగగానే గెడలా సన్నగావున్న నదికి రెండు గట్లూ చలువరాతివి. క్రుంగుతున్న పొద్దు పొగలా కక్కుతున్న వెలుగు ఈ రంగు రంగు చలువరాతి ఫలకంపై పడుతుంటే అద్దంమీద వెల్తురు పడ్తున్నట్లుంది. ప్రతిబింబిస్తున్న వెలుగు మీది కెగసి నింగిలోని చందమామకు మెరుగులు దిద్దుతోంది.
“అవిగో మనుషుల ఆకారాలు – ఏనుగులు, కోతులు- అవి మనుషులు చెక్కినవి కావు – దేవతలు కూర్చినవి” అన్నాడు గైడు.
“దేవతల పేరెత్తకు, ప్రవాహం శిల్పియై చెక్కిందయ్యా!” అని ఒక స్టూడెంటు అరిచాడు.
పడవ ముందుకు పోతోంది. పొద్దు క్రుంగిపోయింది. స్నానంచేసి ముఖానికి పౌడరు ఒత్తుకున్న యౌవ్వనిలా చందమామ సింగారించుకుంటోంది..
“చూడు – మీ అమ్మ అడగంది అన్నం పెట్టిందా?” అన్నాను బోటువానితో.
“లేదు.”
“నీ పెళ్ళాం నువ్వు తెస్తేకదా నీకూ, పిల్లలకూ రొట్టె కాల్చి పెట్తుంది?”
“అవును.”
“రావలసింది రాబట్టుకోలేనివాడు అమాయకుడు కాడు చాతకానివాడు.”
“నాకు దేముడు రాసింది ఎవడూ తప్పించలేడు.”
“నీలాంటి వాళ్ళను దోచుకుని హాయిగా బ్రతుకుతున్న వాళ్ళే ఆ దేముడ్ని సృష్టించారు. ఆ దేవుడి మీద భక్తి పేరిట మీలో భయం సృష్టించారు. అసలు దేవుడికి పిరికివాళ్ళంటే అసహ్యం. చేతకాని మీలాంటి వాళ్ళవేపు చూడేచూడడు.”
“ఏం చెయ్యమంటారు బాబూ? మాలాటి పేదోల్లని పాములైనా కరుస్తాయి. ఏనుగులైనా మట్టేస్తాయి.”
“మీరంతా చీమల్లా కష్టపడుతున్నారు. మీరంతా యేకమైతే – పాము చస్తుంది! మీరంతా గడ్డిపోచలే – ఒకటై ఒక తాడులా ఏనుగును బంధించలేరా? మీరెంతమందిక్కడ?”
“మీరంతా యేక మవ్వండి. అడగండి – మీకు న్యాయంగా రావలసింది అడగండి.”
“సేఠ్ గట్టోడండి. అధికారులు, పోలీసులూ ఆడి పక్కేనండి. అందర్నీ కొనీశాడండి.”
“మీ మాంసం కండలు కుళ్ళిపోయాయా? మీ యెముకలు చెదపట్టాయా?”
“అయితే మేమంతా కలిసి అడిగితే నెగ్గుతామండీ?”
కొత్త భావాన్ని సంఘం అంత చులకనగా స్వీకరించదు. కొత్త కోరికని యజమాని ఔననడు. అందుకే అన్నాను.
“మీరంతా కలసికట్టుగా అలజడి చేస్తేగానీ… సేఠ్ మీ జీతాలు పెంచాలని అనుకోడు! వాడికేం? సుఖంగా వున్నాడు. మీ బాధలు వాడికేం తెలుసు? ఇది భేడాఘాట్. ఇక్కడ కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు ఈ కొండలతో ఢీకొన్నాయట – ఆ పొట్టేళ్ళ బలానికి చిహ్నాలు ఈ మార్బుల్ రాక్స్. ఊ మీరంతా ఒకే గొంతుకతో అడగండి – రూపాయిన్నర కాదు – మూడు రూపాయలు. ఎలా యివ్వడో ఎన్నాళ్ళివ్వడో చూద్దాం.”
పడవ తిరుగుముఖం పట్టింది. ఇదివరకటి కంటే స్పీడుగా పోతోంది. మిగతా పడవలు కూడా తిరుగుముఖం పడ్తున్నాయ్. చప్పున నేను వచ్చిన పని గుర్తుకొచ్చింది. గైడ్‌తో అన్నాను.
“ఏదీ భేడాఘాట్ మొసలి.. ఎక్కడ?”
“ఉండండి, ఇంకా ఓపికపట్టండి, చూపిస్తాను.”
“ఆ గైడే మొసలిలా ఆ పళ్ళతో కనిపిస్తుంటే” అని ఒక స్టూడెంట్ చమత్కరిస్తే – ఇంకొకడు :
“అదేపనిగా ఏనుగును నమిలేస్తున్నాడు.”
గైడ్‌కు కోపం వచ్చినట్లుంది. నములుతున్న ఖారా ఖిల్లీని వుమ్మేశాడు.
పడవ కదులుతోంది. కదలకుండా తొమ్మండుగురం కూర్చున్నాం. మా నోళ్లు కూడా కదల్లేదు. చలువరాతి గుట్టల అందం అంతా అపురూపమైన దేవకన్యలా మారి ప్రత్యక్షమైంది. చప్పున చిన్న శబ్దం. ఏ చలువరాయి బెడ్డ నీట్లో ఒరిగిందో! లేక ఆ దేవకన్య ఒకసారి. డుబ్బున మునిగిందో? గైడ్ అరిచాడు “అదిగో అదిగో – అదే మొసలి.”
“ఏదీ – ఏదీ?” అని లేచి నిల్చోబోయాను. పడవవాడు నా చెయ్యి పట్టుక కూర్చోబెట్టేశాడు. ఒకనాడు సాధువున్న గుట్ట, ఆ గుట్టమీద వున్న మొసలి మనుషుల చప్పుడికి నీటిలోకి దూకిందట! చేతులు నీట్లో పెట్టకండని అరిచాడు గైడు. కళ్ళు చించుకుని చూసినా మొసలి కనపడలేదు. చెవులు రిక్కించి విన్నా ఆ శబ్దం వినపడలేదు.
“అది మొసలి కాదు – మోసం” అని అరిచాడొక విద్యార్థి.
“ఇది మొసలే. తప్పు – తప్పు – పాపం! అలా అనకండి” అరిచాడొక పడవ నడిపేవాడు.
ఇంకో విద్యార్థి “అదిగో మొసలి” అని అరిచాడు. చిన్న శబ్దమయింది. ఆతృతగా చూశాను.
“పదిపైసలు విసిరాను నీట్లో – మొసలి నోట్లోకి” అన్నాడా విద్యార్థి.
అదిగో పులి అని అపహాస్యం చేసి అరుస్తున్నాం గానీ, నిజంగా మొసలి దగ్గరగావస్తే గజగజలాడేవాళ్ళం కదా? గజరాజునే గజగజలాడించి, కుయ్యో మొర్రోమని విష్ణుమూర్తితో “కలడందురు దీనుల యెడ…” అని మొరపెట్టుకో నిచ్చింది కదా – అసలు మా మధుసూదన్ మొసలిని చూడకుండా నన్ను తప్పక చూడమంటాడెందుకు? ఈనాడు ఏప్రిల్ ఒకటో తేదీ కాదు. నన్ను అనవసరంగా పూల్ చేస్తాడెందుకు? నిరాశతో ఒడ్డు చేరుకున్నాను. పోనీ మొసలిని చూడక పోయినా యేదో ఒక పని చేశాననిపించుకుందామని బోటు పెద్ద దగ్గరకు వెళ్ళి,
“ఇదిగో ముప్పయి రెండు రూపాయలు. ఇందులో కనీసం చెరో మూడు రూపాయలు బోటువాళ్ళకి చెందాలి. ఆరు రూపాయలు మినహాయించి యిరవై ఆరు రూపాయలిస్తున్నా తీసుకోండి” అన్నాను.
“మీరంతా కలసి వాళ్ళకేం యిచ్చా” రన్నాడు.
“మేం యెందుకివ్వాలీ?” అన్నాను.
వాడి పేరేమిటోనని తడుముకుంటుంటే గైడ్ “ధర్మస్వరూప్‌జీ! వీళ్ళంత అలజడి జట్టు, పిసినారి జట్టునూ యెప్పుడూ నేను బోటుమీద తీసుకవెళ్ళలే” దన్నాడు.
“ఇలా సూటిగా అడిగిన మనిషి యిదివర కెప్పుడూ యిక్కడకు రాలేదు” అంటూ నావేపు తిరిగి నా చేతులు పట్టుకుని “తప్పక ఆరురూపాయలు వాళ్ళిద్దరికీ యివ్వండి” అన్నాడు.
గెలిచానని ముందుకు వెళ్ళాను. వారిద్దరూ ఆ డబ్బు తీసుకోలేదు. సేఠ్‌కు యిచ్చేయండి అన్నాడొకడు. నా వొళ్ళంతా కుంచించుకు పోయింది. సేఠ్ నన్ను యెగిరిపోతున్న దూదిలా చూశాడు.
“ఏయ్ – ఇతగాడికి మొసలిని చూపించావా?” అని అడిగాడు గైడు.
“చూపించాను కానీ, వాళ్ళు నమ్మితేనా?”
ధర్మస్వరూప్ నా దగ్గరగా వచ్చాడు. చేతులు పట్టుకున్నాడు. “నాకు మీ మీద గౌరవం లేకపోతే యిలా మీ చేతులు పట్టుకోను. ఈ లోకం ఈ చెరువు లాంటిదే. ఇందులో పెద్ద చేప చిన్న చేపను మింగి బతుకుతాది. వ్యాపారంలో వున్నవాళ్ళు అదే చేస్తారు. అరే బాపురే! ఇందులో వున్న కాంపిటేషన్ యింకెందులోనూ లేదు. ఎంతకు వేలాంపాట పాడానో, నాకెంత మిగిలిపోతుందో అన్నీ వివరంగా లెఖలు రాశాను. మీరు దయచేసి ఈ రాత్రి నా ఆతిథ్యం స్వీకరించి ఆ లెఖలు చూడండి. మీరెలా సెటిల్ చేస్తే అలాగే ఒప్పుకుంటాను. ఈ కార్మికుల మేలు కోరేవారైతే వుండండి. అదిగో, ఆ వొడ్డునే కూర్చోండి. మొసలి యిలాగే వస్తుంది. ఇంకా టైముంది. ఈ వెన్నెల రాత్రిలో కనిపిస్తుంది. మీకు చూపించి మరీ యింటికి తీసుకవెళ్తాను” అని ప్రాధేయపడ్డాడు.
ఇతను నేను వూహించినంత చెడ్డమనిషిలా కనపడలేదు. మానవత్వం మీద విశ్వాసం. తోటి మనుషుల కష్టాలకు సానుభూతి వున్నట్లుంది. తనకున్న యిబ్బందులు తనకు వున్నట్లు. నేనెవరో తెలుసుకోకుండా నా చేష్టలకు విలువ ప్రసాదించి నన్ను బ్రతిమాలి శాంతపరచిన వాడిని కాదనలేకపోయాను.
నది ఒడ్డునే కూర్చున్నాను. రెండు కాళ్ళు నీటిలో పెట్టాను. చల్లగా వుంది. మొసలి వస్తుందేమోనని చప్పున కాళ్ళు ఒడ్డుకు తీసేశాను.
తూర్పు గురుగ్రహం కనకపుష్య రాగంలా వుంది. పశ్చిమంలో శుక్రగ్రహం వజ్రంలా మెరిసిపోతోంది. నడి నెత్తిమీద అర్ధచంద్రుడు కడిగిన విరిగిన ముత్యంలా మెరుస్తున్నాడు. ఈ మూడే మూడు ఆకాశాన్నంతా ఆక్రమించేశాయి. ఏ మూలనైనా ఒక మబ్బుతునక కనిపిస్తుందేమోనని వెతికాను. చప్పున ఆ దిగువకు నైఋతి దిశలో ఒక మెరుపు మెరసినట్లయింది. ఆ మెరుపు మెరిసిన ఓ క్షణం వెన్నెల్లో కన్నా అందంగా కనిపించాయి గుట్టలు. నింగిలో నీ కదిలింది. అక్కడ కూర్చోనే పడవల మూకలన్నీ ఒకచోట చేరటం చూస్తున్నాను. పడవలు నడిపే మనుషులు నల్లని నీడల్లా కదులుతున్నారు. ఆకాశంలో మేఘాలు పేరుకుంటున్నాయి. హాయిగా కదులుతున్న చందమామను వెంటాడుతున్నాయి. ఈ మనుషులంతా గుంపుగా యజమానివేపు కదులుతున్నారు.
ఒక మెరుపు మెరిసింది. కొద్దిసేపట్లో ఉరుము వినపడింది.
“రేపటినించి ఈ పడవలు నడపం!” అంతా అరిచారు ఏక కంఠంతో.
“ఏం?”
“మనిషికి మూడు రూపాయలిస్తేగానీ పడవ నడపం” అని అరిచిందొక గొంతుక.
“ఎవరూ? నివ్వా శ్యామ్లాల్! నీ పెళ్ళాం రోగంతో చచ్చిపోతుందంటే యేభయి రూపాయలు మందులుకొని వూరకనే యిచ్చాను. నివ్వే నామీద కత్తి కట్తున్నావురా? నివ్వు లీడరయి పోతున్నావురా?” అరిచాడు యజమాని.
“ఏది ఏమైనా అంత కూలి యిస్తేగానీ మేం పనిలోకి రాం.”
“రాకండి – రావద్దు, మీరు రాకపోతే రూపాయికి వచ్చేవాళ్ళు వందలకొద్దీ వున్నారు!”
“ఒక్క పిట్టను యిటువేపు రానివ్వము.”
“పిట్టను రానివ్వకపోతే పోలీసులను రానివ్వరురా – వాళ్ళు తుపాకులను పేలుస్తారు. మీలో ఎవరు చచ్చినా నాకే బాధ. ఇది మీలో పుట్టిన బుద్ధి కాదు. ఎవరో మీకు నూరిపోశారు. ఎవరోకాదు- వాడే- వాడి మాట విన్నారూ రోజుకో రొట్టె ముక్కయినా లేకుండాపోతారు. నా మాట వినండి. పాడైపోకండి” అంటూ నావేపు ఛర్రున వస్తుంటే అందరూ నావేపు రాకుండా వాడ్ని అడ్డుకున్నారు. ఈ రాత్రికి ఆతిథ్యం స్వీకరించమని నమ్మించి, నన్ను కోతిని చేశాడే అనుకున్నాను. స్ప్రింగులా ఒక్కగెంతు గెంతి నన్ను పక్కకు తోశాడు శ్యామ్‌లాల్.
“బాబూజీ కనిపించిందా? భేడాఘాట్ మొసలి కనిపించిందా? అదిగో – అదిగో భేఘాట్ మొసలి. ఆ కన్నీరు అసలు కన్నీరు కాదర్రో! ఆ మొసలి కన్నీరుని చూసి మోసపోయాం యిన్నాళ్ళు. ఇలాగే ఒకేమాట మీద వుండి అడిగి, మా హక్కులను రక్షించుకుంటాం. చూశారా బాబూ, భేడాఘాట్ మొసలిని చూశారా?” అని అరుస్తూ నన్ను బస్సు స్టాపుదాకా వచ్చి దిగబెట్టారు శ్యామ్‌లాల్, యింకా కొంతమంది పడవవాళ్ళు.
*
ఆంధ్రజ్యోతి వీక్లీ, 8.6.1979
కథా దీప దారి:
నిర్వహణ; జి ఎస్ చలం
చక్కని శీర్షిక, మంచి కథ పరిచయం చేసారు.