ఇచ్ఛామతి

అవకాశమిస్తే…

వట్టి కోట ఆళ్వారు స్వామి 

(1/11/1915 — 5/2/1961)

అవకాశమిస్తే…

“ఏమండీ. ఇది మీరు చదివారా?”

“చదివుంటాను. కాని ఏమిటదీ?”

“పండిత నెహ్రూ ఉపన్యాసమండీ”

“ఏ సందర్భాన?”

“ఢిల్లీలో శిశుసహాయక సంఘములో నండి”

“ఓహో! అదా. అవునే చాలా చక్కగా చెప్పాడు. సమస్యల లోతుపాతులు తెలిసికోవడంలో నెహ్రూది అందెవేసిన చెయ్యి. ఏమనుకున్నావు? సరేకాని విన్నాక దర్శించిన ఆ విషయ మేంటో చదువు”.

“ఇదిగో వినండి. నిజానికి మనదేశంలో జేళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 85 మంది నేరవృత్తి గలవారు కారు. తక్కిన 15 మంది కూడా స్వభావతః నేరకాండ్రుకారు. పరిస్థితులే వారి నావిధంగా చేశాయి. 10 ఏండ్లు శిక్ష అనుభవిస్తున్న మామూలు నేరగాడు. జేలు వెలుపల వున్న పెక్కుమంది కంటే ఉత్తముడే.

(నవ్వి) “ఓహో! అదా?”

“కౌమ్‌కె గమ్‌మే డినర్ ఖాతే హైఁ హుక్కాంకేసాథ్

రంజ్ లీడర్‌కో బహుత్‌హై మగర్ ఆరామ్‌కేసాథ్”

నీవు చాలా అసాధ్యురాలవవుతున్నావు సరూ దినదినం. ఆ ఉపన్యాసం చదువుతుంటే నాకొక వ్యక్తి కండ్లల్లో ఆడుతున్నాడు సరూ”

“అతని జీవితం అంత బాధాకరమైందా?”

“బాధాకరమా? హృదయం బ్రద్దలైపోతుంది”

“అయితే చెప్పండి వింటాను”

“చెప్పమంటావా? అన్యాయంగా అసువులు బాసిన ఒక యువకుని జీవితగాథ. అది పది ఏండ్ల క్రింది సంగతి.”

“కొంచెంసేపు ఆపండి. పూర్తిగా చెప్పేముందు ఒక షరతు”

“ఏమిటదీ?”

“మధ్య, మధ్య కండ్ల నీరుబెట్టడం, తరువాత ఒకటి, రెండు రోజులవరకు బాధపడ్తుండడం మాత్రం బాగుండదు.”

“సరూ! ఓ విధంగా చూస్తే నీవు అదృష్టవంతురాలవు”

“మంచి అదృష్టమే. మిమ్ముల నర్థము చేసుకోక, మీ బాధలను తెలిసికోజాలక అన్నిటికి దూరంగా వుండి అజ్ఞానిగా జీవించడం కూడా అదృష్టమే అంటారా?”

“అవును, పరిష్కరించజాలని అసమర్థులు సమస్యలను అర్ధము చేసుకోకపోవడములోనే శాంతి ఉంది. ఏమి తెలియక నాలుగు గోడల మధ్య కాలక్షేపం చేయవచ్చు.

“భర్త భావాలను, బాధలను అర్థం చేసుకొని అందులో భాగస్థులై వుండక అంటి అంటనట్టు ఉండే భార్య జీవితం మీరనుకున్నంత సుఖమయం కాదు సుమండీ. తెలిసో తెలియకో మీ బాధలవల్ల, భావాలవల్ల ప్రభావితులు కాక తప్పదు. అందువల్ల మీ అశాంతి, ఆందోళనకర జీవితములో భాగస్తులు కాక తప్పదు. సరే కానీయండి. మీరు మహాసమర్థులండీ. మాటమార్చి అసలు విషయాన్ని ఆవల తోయడానికి ఆ యువకుని గురించి వివరంగా చెప్పండి.”

“చెప్పమంటావా?”

“తప్పకుండా. కాని రెండు నిమిషాలు ఆగండి. సుధకు పాలిచ్చి వస్తాను”

***

“సరూ! సమాజములోని కుళ్ళును, అందలి లోతుపాతులను తరచి చూడడం అందరికి సాధ్యంకాదు. సమాజాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడికే అది సాధ్యం సుమా!”

“అదిగో మళ్ళా ప్రక్కతోవ పట్టారు. దయచేసి ఆ పత్రిక అక్కడ పడేసి అసలు విషయానికిరాండి”

“చెపుతాను కాని కొంచెం కళ్ళెం చేతిలో పట్టుకొని మధ్యమధ్య ఈ విధంగా లాగుతుండాలె సుమా!”

“మీ ఆజ్ఞ అయిన తర్వాత వెనక ముందు ఉండదనుకోండి. నూటికి నూరువంతులు అధికారాన్ని ఉపయోగించుకుంటాను.

“కోతికి బెల్లం దొరికినట్టు”

“అసలు మీ మగవాండ్లు మమ్ముల అణచిపెట్టారు. కాని లేకుంటే మీకంటే అన్ని విషయాల్లో మేమే సమర్థులము. కావాలంటే మా చేతికి అధికారమివ్వండి. చూపిస్తాము మా శక్తి సామర్ధ్యాలు”

“నేను ప్రక్కదోవకు పోతే కళ్ళెం గుంజగల సరోజమ్మగారు తామే ప్రక్కదోవ పట్టారే?”

“అవును కాదు మరి. ఆడవాండ్లకు అధికారమనగానే మీకు ప్రక్కతోవ అనిపించింది. ఎంతైనా మగవాండ్లు.”

“స్వార్థులు కదూ?”

“అబ్బెబ్బే! స్వార్థులు కాదండీ. తియ్యతియ్య మాటలుచెప్పి కట్టుబాట్లు, సమాజము, సాంప్రదాయాల పేర అడుగడుగుకు ఆటంకాలు కల్పించి అంతకు మించితే అనుమానాలు పెంచుకొని అవస్థలుపడే అవతారమూర్తులు”

“ఓహోహో! సరోజమ్మగారికి ఉపన్యాసధోరణి కూడా అలవడిందే?”

“ఎంత ఆడదానివైనా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ…. శాస్త్రిగారి భార్యనుకదూ!”

“అవునుగాని నీ కళ్ళెమెక్కడ పోయినట్టు?”

(నవ్వి) “బాగుంది. తెలివిపాడుగాను. ఇద్దరమూ అసలు విషయాన్ని వదలి వాదానికి దిగాము. ఇకనైనా మొదలు పెట్టండి.”

“బహుశ, నీకు చెప్పి ఉంటాను సరూ!”

“ఏమోనండి జ్ఞాపకంలేదు. మళ్ళీ చెప్పితే అరిగిపోతారుగాఁమాలు”

(గొంతు సవరించుకొని) “అయితే యిక విను, కొంచెం మంచినీళ్ళు ఇస్తావు?”

“మంచినీళ్ళతోటే పోతుందా?”

“నీకు నిద్రకళ్ళు పడ్డట్టుందే?”

“మీకా? నాకా?”

“సరేకాని మంచినీళ్ళయితే యివ్వు. తర్వాత సంగతి ఆలోచిద్దాము.”

“తర్వాత సంగతి కూడా ఉందీ!…. ఇదిగో మంచినీళ్లు”

“సరూ! చాలా ఉబ్బరంగా ఉందే ఆ కిటికీ తీసేసి, లైటు ఆపెయ్యి”

“ఓహో! శాస్త్రిగారి కండ్లు నిద్రపోదామంటున్నట్టుందే?”

“అవును. చలిపెడ్తున్నది. ఆ రగ్గు ఇటుతే.”

“మీరు చెప్పదలచుకున్నదేమాయె?”

“చెప్పినట్లు జ్ఞాపకముంది నాకు” అదే పఠానువాడు పిచ్చోడు కాలేదా? జేలులో?”

“అదా? ఐతే మాత్రం ఇంకొకసారి చెప్పకూడదుటండీ?”

“నీకు నిద్రరాకపోతేసరి. నిద్ర వచ్చేదాకా వేదిస్తుంటావు. అయితే విను”

“అమ్మ! అయ్యగారి రథం యిప్పుడు కదిలిందన్నమాట.”

“రథంగుంజే భక్తులా విధంగా వున్నారు. నేనేంజేసేది? సరూ! నిజంగా నీకు వినాలనివుంటే, ఇదిగో ప్రారంభిస్తున్నాను”

“శ్రీగణేశాయనమః ఆఁ ఇక కానీయండి”

“ఒక పఠాను, సరిహద్దు రాష్ట్రానికి చెందినవాడు”

“శాస్త్రిగారు క్షమిస్తే ఒక మనవి. సరిహద్దు రాష్ట్రమంటే జ్ఞాపకమొచ్చింది. సరిహద్దుగాంధీ జ్ఞాపకమొచ్చాడు. ఇప్పుడు పాపమాయన ఊరూ, పేరూ వినబడటం లేదే?”

“సరూ! నీ సంగతి చూస్తే గురివిందతత్వం జ్ఞాపకమొస్తున్నది. అసలు విషయాన్ని వదలి ప్రక్కతోవలు పట్టేవాడనని వద్దించే నీవు నన్ను ముందుకు సాగనీయడం లేదు.”

“క్షమించమంటే ఉరిశిక్షలు రద్దు చేసినవారున్నారు. జుర్మానాలు కొట్టివేసిన వారున్నారు. కాని మీరు మాత్రం ఇంత ఫాసిస్టుగా ప్రవర్తించడం ఏమి బాగులేదు. ఇది ప్రజాస్వామ్యయుగమని తెలిసికోండి. అదిగాక ఆడదాన్ని. అబలను, విజ్ఞాన నిధులగు మీనుండి వివరాలు తెలిసికొని, వికాసముపొంది వివేకినై వీర భారత భూమిలో వీరాంగననై విహరించాలని విర్రవీగుతుంటే ఏమిటీ మీ విసుగు?”

“ఆపండి. ఆపండి. సరోజమ్మగారూ! ఆపండి. మీ కవితా ప్రవాహాన్ని అరికట్టండి”

“అన్నిటిని అరికట్టేవారు పురుషులు. స్త్రీలు ఎల్లప్పుడూ పురోగాములే ఎప్పుడూ ముందడుగే”

“అనుచరులు లేకుండా ముందడుగేమీ లాభం లేదు. నన్నైనా నీవెంట తీసికెళ్లు.”

“ఆఁ. సరిహద్దు రాష్ట్ర పఠాను. తర్వాత?”

“తర్వాత…. తర్వాత…. పొట్టగడవక మిలిటరీలో చేరేడు.”

“పొట్టగడవకపోవడమంటే తిండిలేక చావడమన్నమాటేగా! అయితే మిలిటరీలో చేరడమంటే చావుకు సిద్ధమయ్యేగా. అనగా ఒక చావుకు భయపడి యింకో చావుకు సిద్ధమైనాడన్నమాట”

“కాదు సరూ! మిలిటరీలో చేరినవాళ్ళంతా చావడం, చదివినవాళ్ళంతా పాసుకావడం, మందు తిన్న రోగులంతా బాగుపడటం అంటూ ఉండదు. ఎవడి ప్రాప్తం వాండ్లది.”

“దీనితోపాటు యింకొకటి చేర్చబడాలని నా అభిప్రాయం”

“ఏమిటదీ?”

“ఉద్యోగం చేసేవారందరికి జీతాలు విధిగా ఇవ్వబడటం కూడా ఉండ కూడదు”

“చంపావు. గాలితిని, నీళ్లుతాగి గంగలో కలవడమన్నమాట”

నిజానికాలోచిస్తే నేను పొద్దస్తమానం చేసే చాకిరికి మీకిచ్చే జీతం అంతగాక ఇంకేమిటండీ?”

“భార్యాభర్తల సంబంధం, కుటుంబజీవనం జీతానికంటే, విధికంటె అతీతమైంది. వర్ణించవీలుగాని ఆత్మీయత అది. దానికి వెలలేదు. వర్ణనాలేదు.”

“అట్లాగా? ప్రపంచమంతా ఒక కుటుంబమని, ప్రపంచ ప్రజలంతా ఒక కుటుంబీకులని అప్పుడప్పుడు మీరు చెప్పే ధర్మసూత్రాల ప్రకారము, ఈ విశాల కుటుంబమునకు చెందిన మీరు మీ కుటుంబములో నేను నిష్కామకర్మ చేస్తున్నట్టే. 1500(రూ.లు) రాళ్లు తీసుకోకుండా ఎందుకు మీరు ఉద్యోగం చేయకూడదు?”

“ఓహో! అటుతిప్పి, ఇటుతిప్పి నా ఉద్యోగానికే నీళ్లు తెచ్చావు? సరూ! నేను జీతం కోసం ఉద్యోగం చేయడంలేదు, ఉద్యోగం చేసినందుకు జీతం తీసుకుంటున్నాను.”

“కాని ఆ పఠాను జీతం కొరకు ఉద్యోగంలో చేరాడు. ఆఁ. తర్వాత ఏమైంది?”

“పాపము, అతను ఉద్యోగములో చేరిన ఆరునెల్లకే స్వస్థానం నుండి చాలా దూరం మార్చబడ్డాడు.”

“మీరు లండన్ వేంచేసినట్టు”

“సరూ! ప్రతిదానిని నాకే అన్వయింపచేయడం బాగుండలేదు”

“శాంతిః. శాంతిః శాంతిః కోపం తెచ్చుకోకండి శాస్త్రిగారూ! పాపము ఆ పఠాను భార్య ఎంత తల్లడిల్లిందో? అతనికేమైనా పిల్లలా?”

“ఒక ముసలితల్లి, 10 నెల్ల కొడుకు, భార్య! అతని కుటుంబము, యితనొక్కడే వాండ్లకు దిక్కు”

“పాపము”

“మిలిటరీ క్యాంపులో ఏదో జగడం జరిగింది. ఇతనుకూడా పాల్గొన్నాడేమో. చాలా తీవ్రమైన జగడంగాఁమాలు పాపము ఆ పఠానుకు 12 ఏండ్ల జేలుశిక్ష అయింది.”

“12 ఏండ్లే? మీరు 2 ఏండ్లు జేలులో ఎట్లా గడిపారా అని నేను పడ్డ దిగులు అంతింత కాదు సుమండీ. అతడు 12 ఏండ్లు అనుభవించడం సామాన్యమంటారా?”

“కాదు సరూ! సామాన్యముకాదు. చాలా దుర్భరం. జేలుకు వెళ్ళిన రెండు నెల్లకే అతడు గుండె పగిలాడు. అతని కుటుంబస్థితి యితనికి తెలియదు. ఇతని స్థితి వాండ్లకు తెలియదు. గుండె పగిలి యిక్కడ, తిండికెళ్ళక అక్కడ బాధపడ్డారు. జేలు అధికారులతో వీలున్నప్పుడల్లా తాను నిర్దోషినని, కనీసము తన స్వరాష్ట్రపు జేలుకైనా మార్చాలని ప్రాధేయబడ్డాడు. అవి యుద్ధపు రోజులు. చావు బ్రతుకులు తేల్చే మహాసంగ్రామ వాతావరణములో ఇతని మొర ఎవరు వింటారు? నెలలు గడిచాయి ఫలితం లేదు. తుదకు అపీలులో కూడా శిక్ష ఖాయమైంది.. (గద్గద స్వరంతో) తుదకు అతని మతిపోయింది”

“తిరిగి మొదలుపెట్టారు కదూ! నన్ను చంపుకున్నట్టే, నా తెలివి పాడుగాను. ఎందుకు చెప్పమంటినో. కంటనీరు పెట్టకండి దయచేసి”

(గద్గదస్వరంతో) “సరూ! అతడు నా కండ్లలో ఆడుతున్నాడు. చేతిలో జపమాల, ఎవరితో మాట్లాడడు. తిండి తినడు, బట్టలు మార్చడు. ఎప్పుడైనా మాట్లాడితే ఒకటేమాట ‘నేను నిర్దోషిని. నాయింటికి పంపండి. తుదకు అతను పిచ్చివాడుగా పరిగణింపబడ్డాడు. రోజూ అతను తినే దెబ్బలకు, తిట్లకు అంతులేదు. తిండి తినకపోవడం జేలు నియమోల్లంఘనం. ఇంతో, అంతో నోట్లోకెక్కిస్తేగాని విధి నిర్వహణ పూర్తికాదు….. ఇక చెప్పలేను సరూ!”

“తుదకేమైందో?”

(గద్గదస్వరంతో) “పిచ్చివాడుగా చచ్చాడు. ఆ సంగతి మాత్రం అతని కుటుంబీకులకు తెలుపబడ్డది. అన్నట్టు అతనికి అవకాశం కలిగితే రాణించగలవాడే. అతనావిధంగా తయారుకావడానికి పరిస్థితులే కారణం. పండిత నెహ్రూ అన్న ఆ రెండు మాటల్లో ఇంత అర్థం ఇమిడి ఉంది సరూ! అందుకే అంత బాధపడ్డాను సరూ! నీవు కూడ కంటనీరు పెట్టావు? అవును! హృదయంగల ప్రతిజీవి అదే చేస్తుంది.”

             -దేశోద్ధారక గ్రంథమాల 1952             

Spread the love

జి.ఎస్.చలం

పుట్టింది కొత్తపల్లిలో. పాఠశాల విద్య పార్వతీపురంలో. పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో కళాశాల విద్య, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య.
వృత్తి: విజయనగరం జిల్లాలో మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు భాషా బోధన.
రచనలు:
రజకుల జీవిత నేపథ్యంలో" రేవు" నవల, కళింగాంధ్ర మాండలిక పదకోశం, మృచ్ఛకటికం (అనువాదం), కన్యాశుల్కంలో వాడుక మాటలు, తెలుగు నవల విస్తరించిన వివిధ కోణాలు, భూషణం మోనోగ్రాఫ్, కళింగాంధ్ర కవితా సంకలనం "తిత్తవ"కు భూషణం సమగ్ర కథా సంపుటికి సంపాదకత్వం.

నటుడు, దర్శకుడు.
సంపూర్ణ కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు, సంక్షిప్త నాటకంలో రామప్ప పంతులు పాత్రలు ధరించి దర్శకత్వం వహించారు. కొన్ని వ్యాసాలు రాశారు. ప్రసంగాలు చేసారు.విద్యార్థుల్లో భాషా సాహిత్యాల పట్ల అభిరుచి కలిగించేందుకు కృషి చేస్తున్నారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!