ఇచ్ఛామతి

శతపత్ర సుందరి

సంగీత పూదోటకు మా ఆహ్వానం! ఈ పూదోట నేను పెంచింది కాదు. ఎందరో కవులు, గాయకులు తమ కలాన్ని, గళాన్ని ఈ పూదోట కి అర్పించారు. మనం చేసుకున్న అదృష్టం– అక్కడో గులాబీ, ఇక్కడో మల్లి, అలా ఒక కమలం – చూస్తూ, వింటూ ఆనందించడమే !

        ఏ పాట ఎందుకు, ఎప్పుడు మనకి నచ్చుతుందో ఖచ్చితమైన కారణం చెప్పలేము. అది పూర్తిగా సబ్జెక్టివ్ . ఒక్కోసారి దారి తప్పి గంధర్వులు దిగి వస్తే అన్ని మర్చిపోతాం. నాకు సంగీత శాస్త్ర జ్ఞానం శూన్యం. వచ్చిందల్లా వినడమే. 

       ఆ మాట చెప్పేసాను కనుక ఈ రోజు నేను చెప్పబోయే పాట లోకి వస్తాను.

      సినిమా సంగీతం తో పాటు మనకు రేడియో పుణ్యమా అని మంచి లలిత సంగీతం విన్నాము, వింటున్నాం. అలాంటి లలిత సంగీతంకి ఆద్యుల లో ప్రముఖులు బాలాంత్రపు రజనీకాంతా రావు గారు. రజనీ గా ఆయన పాపులర్. 1940 ల నుండి 2003,2004  దాకా కూడా పాటలు రాశారు,వరుసలు కట్టారు. ఆయన రాసిన అనేక పాటల్లో ఒకటి ‘ శతపత్ర సుందరీ ‘. ఇది 1941 లో రాసారు, 1942 లో టంగుటూరి సూర్యకుమారి గారు పాడారు. నిండైన స్వరంతో స్పష్టమైన ఉచ్చారణ తో ప్రతి పదం, ప్రతి స్వరం శ్రోతల మనసులకు కవి భావం చేరవేస్తరావిడ 

       శివరంజని రాగంలో సాగే  ఈ పాట మాటలు — 

శతపత్ర సుందరీ ఓహో శతపత్ర సుందరీ 

సురభిళ భ్రాంతి లో సుందర నయన దళ కాంతిలో 

ఈ ఉదయ సాంధ్య వేళ మెరిసెలే 

నా హృదయ భావ వేల విరిసెలే !

— ఇందులో రజనీ గారు ఉపయోగించిన ‘ భ్రాంతి ‘ , వేల — రెండూ కొంచెం ఆలోచింప చేస్తాయి.

   ఇక్కడ భ్రాంతి అంటే మాయ కాదు. ఆపేక్ష, వాంఛ. వేల అంటే ఉప్పెన. ఇప్పుడు మనకి కవి హృదయం అర్ధం అవుతుంది. సువాసనలు వల్ల కవి మనసులో ఉప్పెనలా భావాలు పొంగుతున్నాయి.

    అరుణ దరహాసమో , చందన మరున్నిశ్వాసమో 

నీ మృదుల దళ శతమ్ము తెరచెలే

నీ హృదిని మధురసమ్ము పరచెలే ! 

అనంగ వాద్యములో యౌవన తరంగ లాస్య ములో నీ మధువు మధుకరాళి మరగెలే 

      అనంగ అంటే మూడు అర్థాలు వున్నాయి. ఆకాశం, హృదయం, మన్మధుడు. కవి చాతుర్యం- ఈ మూడు ఇక్కడ సరిపోతాయి. పొద్దున్నే విన వచ్చే సంగీతం- ఆకాశం నుండా? మన హృదయం నుండా? లేక ఆ మన్మధుడు కలిగించిన కోరిక వల్ల వినపడుతోందా ? 

     ఇక సంగీత రచన — మృదుల దళ శతమ్ము – అన్నపుడు ఆమె గొంతులో స్వర గమకం వెల్లువ. అదే ఆ పాటకి అందం. భావాల వెల్లువ, పువ్వు విచ్చుకుంటున్న కదలికలు రెండూ స్వరంలో వుంచారు. ఇక ముందు వచ్చే స్వర మేళం తెలవారు జామును సూచించే కదలిక వాయిద్యం లో చూపారు. 

   తుమ్మెదలు ఆ పువ్వు చుట్టూ తిరగకుండా ఎలా వుంటాయి?

    ఇది ఒక అందమైన పద చిత్రం.ఆ పాట వింటూ మన మనో ఫలకం మీద– ఒక చక్కని సరస్సు . తెలతెలవారుతుండగా లేత సూర్యకిరణాలు తాకి ఆ సరస్సు లోని ఎర్రని కమలం తన రేకులు విప్పి తొంగి చూస్తోంది . ఆ పువ్వు నుంచి వచ్చే పరిమళం ఆ ప్రదేశమంతా నిండిపోయింది. తుమ్మెదలు గుంపులుగా ఆ పువ్వు చుట్టూ తిరుగుతూ సంగీతం పాడుతున్నాయి!

  ఇంత హాయి అయిన చిత్రం మనకిచ్చిన కవికి , సంగీత కళాకారులకు నమస్సులు

Spread the love

Prasuna Balantrapu

ప్రసూన బాలంత్రపు:
ఇంగ్లీషు సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న ప్రసూన బాలంత్రపు సాహిత్యంపై అవగాహన కలిగిన విద్యావేత్త. కళలపై , సాంస్కృతిక అంశాలపై ప్రగాఢమైన ఆసక్తి. విమర్శకురాలిగా, వ్యాఖ్యాతగా చదువు, కళల పట్ల పిల్లలలో, విద్యార్థులలో ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు.
పుస్తకాలు, సంగీతం పై ఆమెకున్న అభిరుచి, విమర్శకురాలిగా గుర్తింపు పొందడానికి కారణం అయింది.
'ది హిందూ' పత్రికకు ఆమె కొంతకాలం పాటు సాంస్కృతిక అంశాలపై అందించిన సమీక్షల్లో, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలపై చేసిన సమీక్షలు లోతుగా, స్పష్టంగా, చారిత్రక దృష్టితో ఉన్నవిగా గుర్తింపుని పొందాయి.
పిల్లలలో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. విజయవాడ పుస్తక ఉత్సవం నిర్వాహకులలో ఒకరిగా, ఆమె ప్రతి సంవత్సరం జరిగే పిల్లల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు.
పత్రికలకే కాకుండా, ప్రసూన బహుళ ఆకాశవాణి ప్రసంగాలు ఇచ్చారు. అలాగే  అనేక ప్రముఖ తెలుగు ఈ-మేగజైన్లకు వ్యాసాలు, పుస్తకాల సమీక్షలు అందించారు. డిజిటల్ వేదికలపై కూడా, ఆమె పుస్తకాలపై చేసే సమీక్షలు, సాహిత్యంపై చర్చలకు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!