రహదారి మధ్యలోనో..
దారేలేని అడవి మధ్యలోనో
ఎవరూ చూడని పూలచెట్టు..
ఎవరూ మతించని పూలచెట్టు.
మంచు కౌగిలిలో బొట్లు బొట్లుగా కరిగాక
ఎండపొరల దుస్తులు తొడిగాక
గ్రీష్మదాహానికి ఒడలు వడిలాక
గాలి తరగల స్పర్శకు పరిమళంగా తూగాక
మత్తువెన్నెల తాగి తావి తూలాక
ఎవరు మతించినా లేకున్నా
పూలచెట్టు దేని కోసమూ చేయి చాచదు.
చాచిన చేతుల్లో తనే
నాలుగు పూలకాడలు రాలుస్తుంది.
సీతాకోక అదాటున వాలి
కాళ్ళకు పుప్పొడి అద్దుకొని పోతుంది.
గాలివానకు గూడులో
పక్షిజంట చలికాగుతుంది.
పండ్లు రాల్చుకొని
పథికులు ఆకలిని తోలేస్తారు.
కొమ్మలు విరుచుకొని సంచారులు
తుకతుక అన్నం వాసనౌతారు.
ఈ పూలచెట్టు వున్నప్పుడు
ఎవరూ మతించరు.
లేనప్పుడు కాసింత నీడ దొరక్క
కాసింత ఆదరవు దొరక్క
మలమల మనసు మాడినపుడు
గుండె ఎండిన బెరడు అయినపుడు
పూలచెట్టు పచ్చదనం పదేపదే
కలలో సలపరిస్తుంది.
పూలు పండ్లు ఇవ్వడమే
తెలిసిన మనసుకు
తను తీసుకోవడం కూడా ఇవ్వడానికే కదా..
ఎవరూ చూడని
చెట్టు ఒరిగిపోయినా
అనాధపక్షులు మర్చిపోవుగా..
నీడలు నడుములు విరిగి నవ్వినపుడు
నేల చిరునవ్వుతుంది బదులుగా..
జ్ఞాపకాల వేర్లు అల్లకున్న ఈ చెట్టు
ఎవరూ చూడని ఎవరూ మతించని
ఈ పూలచెట్టు
మా అమ్మేమో..
వేర్లు తెంచుకు వెళ్ళలేక
కనులు వాల్చిన వేయి పూలతో
కనిపెట్టుకున్న ఈ పూలచెట్టు
మా అమ్మే..
Kavitvam Ananda tandavam chesindi
Subhajankshalu Srinivas Goud Garu
మంచి భావుకత