1 . ప్ర) మీకు చాలా యిష్టమైన రచయితలు యెవరు? యెందుకు యిష్టం?
జ) ముగ్గురిని ఎంపిక చేసుకుని చెపుతాను. నాకు ఇష్టమైన రచయితల్లో ముఖ్యులు దోస్తోవిస్కీ, చలం, టాగోర్.
మనసును తరచి చూసి దాని యొక్క అమరికను, గమనాన్ని, తీరుని, దానిలోని సకల సంక్లిష్టతలను దోస్తోవిస్కీ స్థాయిలో ఏ మానసిక శాస్త్రవేత్త, తత్వవేత్త అర్థం చేసుకోలేకపోయారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ యుంగ్ లాంటివారు సైతం చొరబడలేకపోయిన మనసు యొక్క చీకటి మూలలని సైతం ఆయన స్పష్టమైన అంతర్దృష్టితో దర్శించాడు. అటువంటి మనసు లోతుల్ని అంత స్పష్టంగా అర్థం చేసుకున్న వ్యక్తి గతంలో పుట్టలేదు, ఇకపై పుట్టబోడు.
ఇక చలం ఎందుకు ఇష్టమంటే మనిషిగా జీవితం అనివార్యంగా విధించే సమస్యలన్నింటినీ ఆయన స్వయంగా అనుభవించి పూర్తి నిజాయితీతో వాటిపై వెలుగును ప్రసరింపజేశాడు. ఫ్రాయిడ్ లో అటువంటి నిజాయితీ కొంత ఉన్నప్పటికీ ఆయన చలంలా గొప్ప తత్వవేత్త, సౌందర్యస్పృహ ఉన్న వ్యక్తి, కళాకారుడు కాదు. ఫ్రాయిడ్ మనస్తత్వ విశ్లేషణలో ఆధ్యాత్మిక లక్షణం లోపిస్తుంది. ఆ విషయాన్ని కార్ల్ యుంగ్ కటువుగా విమర్శించాడు. వారి మధ్య ఘర్షణ జరగడానికి అది కూడా ఒక ముఖ్య కారణం.
చలం ఉన్నతశ్రేణి తత్వవేత్త. గొప్ప తత్వవేత్తలు చాలా మంది ఉంటారు. కానీ వారిలో ప్రేమికులు మనకు తారసపడడం అరుదు. ముఖ్యంగా చలం గొప్ప ప్రేమికుడు. అతని కన్ను సౌందర్యాన్ని స్పష్టంగా చూడగలదు. ఆయన హృదయం మానవ వేదనను అత్యంత దయతో వినగలరు. ఆయన తాత్వికత అత్యంత సరళం. మామూలు జీవితాన్ని, ఆశల్ని, ప్రేమని అది తనలో నింపుకుని ఉంటుంది. గంభీరమైన, గుహ్యమైన మార్మిక విషయాల జోలికి పోదు. అది సాదాసీదా మానవ హృదయానికి దగ్గర.
యుగాల నుండి గొప్ప తత్వవేత్తలు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. కానీ ప్రతీ దానిని పరీక్షించి, స్వయంగా తన జీవితంలో అనుష్టించి, ఆ విధంగా తాను తెలుసుకున్న దాన్ని అత్యంత నిజాయితీతో తెరలు లేకుండా బహిర్గత పరచినవారు చరిత్రలో ఎవరూ లేరు. మనిషికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన అనుభవించి ఫలితాలను మనకు విశ్లేషించి చూపించారు, అదీ ఆధ్యాత్మిక కాంతిలో. అది మనకు ధైర్యాన్ని ఇచ్చింది. మన జీవితాల్ని మనం జీవించే విధానం తప్పు కాదనీ, ఎవరు ఏమని విమర్శించినా మనం మన హృదయాన్ని అనుసరించి ముందుకు వెళ్ళవచ్చనీ ఆయన వెలి పడిన జీవితం తెలిపింది. ఆయన సత్యం కోసం, సౌందర్యం కోసం జీవితమంతా శిలువను మోసారు. అవమానాలు పడ్డారు. ఆఖరికి రాష్ట్రాన్ని విడిచి అరుణాచలం అడవుల్లోకి నిష్క్రమించారు.
అందువల్ల చలం లేకపోతే సాధారణ ప్రజలకు అంతుచిక్కని నా జీవనవిధానం, నా భావాలూ, నిర్ణయాలూ సరైనవేనని నాకు ఎవరూ ధైర్యం చెప్పగలిగి ఉండేవారు కాదు. చెప్పినా ఆచరణాత్మకంగా ఆచరించి చూపించని విషయాల్ని, అవి ఎవరు ప్రతిపాదించినా నేను వాటిని స్వీకరించలేను. అందువల్ల మనిషిగా ఈ లోకంతో ఒక భయంకరమైన ఘర్షణలో నేను జీవించాల్సిన పరిస్థితి నుండి చలం కాపాడారు.
‘నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” అని దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో రాశారు.
గొప్ప రచయితల్లో తాము ఏమి చెప్పారో దానిని ఆచరణలో చూపినవారు ఉన్నారు. కానీ ఎలా జీవించారో దానిని – ఆదర్శవంతుల పరిభాషలో చెప్పాలంటే – నిస్సిగ్గుగా, క్రూరమైన నిజాయితీతో బయటి ప్రపంచానికి బహిర్గత పరచిన వారు అరుదు. అంటే జీవితంలోని వైరుధ్యాలను సమాజం అర్థం చేసుకోలేదు. ప్రాకృతికమైన, సహజమైన విషయాలను సైతం కృత్రిమమైన నీతి సూత్రాలను అనుసరించే సమాజం వైరుధ్యాలుగా చూస్తుంది. సమాజం ఒక ఆదర్శ కోణాన్ని మాత్రమే కోరుకుంటుంది. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని లేదా మానవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి జీవన వైరుధ్యాలను కలిపివున్న సమగ్ర వ్యక్తీకరణ అవసరం. అటువంటిది సమాజానికి ఇవ్వాలంటే రచయిత వీధిలో నగ్నంగా నిలబడాల్సి ఉంటుంది, పైగా సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ అనివార్యంగా కొంత దాస్తారు. అలా దాయకుండా రాసిన ధీరుడు చలం.
జీవితం గురించి చలం ఇచ్చిన వివరాలు మానవ జీవిత సంక్లిష్టతను, జీవన వైరుధ్యాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఆంతరిక, బాహ్య జీవితాల గురించి అంత నిజాయితీతో రాసిన ఒకే ఒక్క తాత్వికుడు ఆయన. గ్రేట్ టాల్ స్టాయ్ కథల్లో మాత్రమే రాయడానికి ధైర్యం చేసిన విషయాల్ని చలం ఆత్మకథల్లో రాశాడు. మన ఆదర్శ భావనల పునాదులను కూల్చేశాడు. మనం ఒట్టి భ్రమల్లో బ్రతుకుతున్నామన్న నిజాన్ని వెల్లడి చేశాడు.
టాగోర్ కాలానికి-కాలాతీతానికి నడుమ చంద్రకాంతిలాంటి ఒక వారధి. చంద్రకాంతి అని ఎందుకు అంటున్నాను అంటే అది ఈ లోకానికి చెందినది కాదు. కానీ ఈ లోకమంతా దయతో పరచుకుని ఉంటుంది.
ఈ లోకం ఎంతో అందమైనదనీ, ఈ లోకంలో మరల మరల జన్మించడానికి ఇష్టపడతాననీ చెప్పిన మొదటి వ్యక్తి ఆయన. ఎవరికి కావాలి ముక్తి? భగవంతుడే ఈ బంధనాలన్నింటినీ తన ఆనందం కోసం సృష్టించుకున్నాడు. అది అతని విలాసం, లీల అని జీవిత రహస్యాన్ని బహిర్గతం చేసిన, ఈ జీవితాన్ని ప్రేమించడంలో ఎటువంటి అపరాధ భావనకు లోనుకావాల్సిన అవసరం లేదని తెలియజేసిన జ్ఞాని ఆయన.
2 ప్ర) ఈ రచయితల భావాలు మీలో అప్పటికే వున్నాయా లేక అవి మీకు నచ్చాయా…
జ) నా జీవితం, నా ప్రశ్నలు, నా దుఃఖాలు వారి రచనల్లో ప్రతిఫలించడం వల్లనే వారు నాకు అత్యంత ఆప్తులుగా, సహచరులుగా, మిత్రులుగా మారిపోయారు అనుకుంటాను.
3 . ప్ర) మీకు యిష్టమైన యీ రచయితల్ని మీరు మీలోకి నింపుకున్నారా? నింపుకుంటే యెలా మీ లైఫ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు వారిని?
జ) వీరినే కాదు, నాకు ఇష్టమైన ఏ రచయితనీ, నేను నా జీవితంలోకి నింపుకోలేదు. వారి నుంచి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ – నేర్చుకోవడం, నింపుకోవడం అనేవి పూర్తిగా భిన్నమైన విషయాలు. ఎప్పుడూ నా శోధన నాదే. నా అన్వేషణలో నేను ఎవరి ప్రభావాలను, బోధనలను ఆమోదించలేను. ఎందుకంటే విశాలమైన ఈ లోకం అంతులేని ఆశ్చర్యాలతో, రంగులతో, ఎప్పుడూ కొత్తగా విచ్చుకుంటూనే ఉంటుంది.
“ప్రతి ఒక్కరూ ప్రపంచంలో కల్లా అత్యంత అందమైన అమ్మాయినే ప్రేమిస్తారు” అని టాల్ స్టాయ్ చెప్పినట్టు, మనం ఈ లోకాన్ని మన స్వంత అవగాహనలోంచి స్పృశించాలి, స్వీకరించాలి, ప్రేమించాలి. ఎవరు ఏమి చెప్పినా, అది అప్పటికే సెకండ్ హ్యాండ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అది గతానికి సంబంధించింది. వర్తమానంలో మాత్రమే సజీవమైనది, నూతనమైనది, అద్భుతమైనది ఉండడం సాధ్యం. అందువల్ల పూర్తి కొత్త జీవితాన్ని మనం జీవించాలి, ఏ ప్రభావాలు లేని జీవితం. An inventive life.
ఎందుకంటే నేను ఈ లోకంలో జన్మించింది నా స్వంత జీవితాన్ని జీవించడానికి, మరొకరి జీవితాన్ని అనుసరించడానికి కాదు.
రచయితలు సైన్ బోర్డ్స్ లాంటి వారు, మనం సరియైన దారిలోనే వెళుతున్నాము. ఏం ఫరవాలేదు. మనం ఈ అన్వేషణలో ఒంటరివారం కాదు అని చెప్పడం వరకే. దిశ, గమనం మనమే ఎంచుకోవాలి. రచయితలు, తత్వవేత్తల మీదే కాదు, ఎవరి మీదా ఆధారపడకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి వారి రచనల ప్రయోజనం ఏమిటి? ఒంటరి బాటల్లో మేమూ నీలాగే ప్రయాణించాము, అన్వేషించాము, జీవించాము, సమాజం సిద్ధంచేసి ఉంచిన మృత నమూనాలకు భిన్నంగా. నీకు మేము తోడుగా ఉన్నాం, నువ్వు ఈ కొత్త దారుల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళు. భయపడకు. నువ్వు జీవితంలో తెలుసుకోగలిగింది అన్వేషించి తెలుసుకో అని భుజం తట్టి భరోసా ఇచ్చే స్నేహితులు వారు. అంతులేని ఆశ్చర్యాలతో నిండిన జీవనయానాన్ని మనం మన అవగాహనను మాత్రమే అనుసరించి కొనసాగించాలి, పూర్తి స్వేచ్ఛతో. అందువల్ల రచయితల్ని, తత్వవేత్తల్ని జీవితంలో నింపుకోవడానికి నేను వ్యతిరేకం.
వారు వారి జీవితాన్ని ఎలా జీవించి, శోధించి తెలుసుకున్నారో, మనమూ అలాగే మన జీవితాల్ని జీవించి శోధించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ రెండు సత్యాలూ ఒకటి కాదు. సత్యం నిరంతర గతిశీలమైనది.
మీరు ప్రపంచంలోకల్లా అందమైన, అద్భుతమైన ఈ గ్రహం మీదకి ఒక original experience పొందడానికి వచ్చారు. అది పొందాలంటే అన్ని ప్రభావాల నుండీ మనసుని ఖాళీ చేసుకోవాలి.
4. ప్ర) చుట్టూ విపరీతంగా… వేగంగా అనేక విషయాలు కీర్తి పరుగు పందెంలో తలపడుతుంటే కీర్తికి దూరంగా మీరు యెలా నిలబడగలిగారు?
జ) జీవనయానంలో మనం అనేక ఉచ్చులను జాగ్రత్తగా, శ్రద్ధగా పరిశీలిస్తూ వాటిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కీర్తి, కెరీరిజం, సంపాదనేచ్ఛ, ఎదగాలనే ఆతృత, పోటీతత్వం లాంటి వాటిలో ప్రపంచం ఇరుక్కుపోయి ఉంది. వీటన్నిటి భారాన్ని మనం నిరంతరం మోస్తూ ఉంటాము. కానీ భారరహితమైన జీవితం ఒకటి ఉంది. ఆ జీవితం జీవించగలగాలంటే స్వీయజ్ఞానం అవసరం. నమ్రత, సరళత, వివేకం, అమాయకత్వం అవసరం.
హృదయస్థానం నుండి మనం జీవించగలిగితే మన అవసరాలు తగ్గిపోతాయి. Balance of holding and letting go అనేది సహజంగా, effortless గా మనకు అర్థమవుతుంది. ఆ అవగాహనే విముక్తి అంటాను. అదే జీవితంలో విప్లవాత్మకమైన మార్పులను తెస్తుంది.
సరళమైన జీవితం జీవించగలగాలంటే అతి సున్నితమైన మనసు ఉండాలి. జీవితం యొక్క నశ్వరతకు సంబంధించిన ఎరుక మనలో ఉండాలి. Inner richness ని మనం అనుభవిస్తూ ఉంటే మనకి భౌతిక విషయాలు అంత ముఖ్యం అనిపించవు. హంస పాలు-నీరు వేరు చేయగలిగినట్టు మనం లోతులేని విషయాల్ని సహజంగానే విడిచి పెడతాం.
మన అవసరాలు, కోరికలు qualitative గా ఉండాలి, quantitative గా ఉండకూడదు. అత్యంత శ్రేష్ఠమైనవి మితంగాగా ఎంచుకోవాలి. భౌతిక విషయాలైనా, ఆశలైనా అవి నాణ్యమైనవిగా మారినప్పుడు సహజంగానే పరిమితం అయిపోతాయి. ఆ విధంగా మనకు సొంతానికి ఉపయోగించుకోవడానికి సమయం దొరుకుతుంది. మనకోసం మనం గడపడంలో సంతోషం ఉంటుంది. మనకోసం అంటే మన జీవితానికి నిజంగా ఏది అవసరమో దానిని గ్రహించి ఆ విధంగా జీవించగలగడం.
మనం మన ఆశలను పరిశీలిస్తే వాటిలో చాలా వరకు నిజమైన ఆశలు కాదని అర్థమవుతుంది. కోరికలే ఆశల ముసుగు వేసుకొని తిరుగుతుంటాయి.
ఆశ, కోరిక భిన్నమైనవి. ఆశ లేకపోతే జీవితమే లేదు. కోరికలే దుఃఖానికి కారణం. ఈ రెండిటి మధ్య నన్ను తేడాను మీరు స్పష్టంగా గమనించాలి. అప్పుడే మీ జీవితం సరళతరం అవుతుంది.
సాధారణంగా కోరికలే అవసరాలుగా మారుతాయి. కోరికల తీరుని మీరు గమనిస్తే అవసరాలు కూడా పరిమితమవుతాయి. కోరికలే దుఃఖానికి కారణం అని బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు కదా!
మీరు సాధించడానికి, సంపాదించడానికి జీవితం మొత్తాన్ని వెచ్చించడంలో ఏ సంతోషం ఉండదు. అందుచేత 35 ఏళ్లు వచ్చేలోగా ఎంతో కొంత సంపాదించుకొని రిటైర్డ్ అయిపోయి పూర్తి సమయాన్ని మీ కోసం మీరు బ్రతకాలి. జీవితంతో ప్రయోగాలు చెయ్యాలి. నేర్చుకోవాలి. యాత్రలు చెయ్యాలి. సంపాదన కాకుండా ఇంకేమైనా విషయాలు జీవితంలో ఉన్నాయా అని అన్వేషించాలి. అప్పుడు జీవితాన్ని సఫలం చేసుకునే ద్వారాలు ఎన్నో తెరచుకుంటాయి. గొప్ప intensity తో మీరు జీవించడం మొదలు పెడతారు. మీ శక్తులన్నీ జీవన వ్యాపారాల్లో చెదిరిపోకుండా మీకు పరిపూర్ణంగా అందుబాటులో ఉంటాయి. అప్పుడు కాంతి ద్వారాలు మీ హృదయంలో తెరుచుకుంటాయి. మీ జీవితం యొక్క నాణ్యత ఉత్కృష్టమైన ఎరుకగా రూపాంతరం చెందుతుంది.
ప్రకృతిలో జీవిస్తున్నప్పుడు, దానితో స్థిరంగా connect అయి ఉన్నప్పుడు మనం inner richness ని అనుభవిస్తూ ఉంటాము. ప్రకృతి నుండి మనం ఎంత దూరం జరిగితే అంతగా సారవంతమైన, నిజమైన జీవితం నుండి దూరమైపోతాము.
“One of the first conditions of happiness is that the link between man and nature shall not be broken.” అని టాల్ స్టాయ్ చెప్పారని తెలియక మునుపే, బాల్యం నుండే ప్రకృతితో నాకు ఆ connection ఏర్పడింది. అది నన్ను జీవనమూలం నుండి తప్పిపోకుండా నిరంతరం కాపాడుతూ వస్తోంది. Source నుండి జీవించడం, రాయడం , ఈ క్షణంలో మాత్రమే జీవించగలగడం – అన్నీ ప్రకృతితో నాకు ఉన్న connection ని నిరంతరం నిలుపుకోగలగడం వల్లనే సాధ్యం అయ్యాయి.
ప్రకృతిలో, ఈ క్షణంలో జీవించగలిగితే – అది కలగా కాదు, ఒక ఊహగా కాదు – ఒక అనుభవంగా అలా జీవించగలిగితే ఇక ఏం అవసరాలు ఉంటాయి! అక్కడ total completeness ఉంది. Inner richness కోసం సంగీతం, సాహిత్యం, కళలు – వీటి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. ఏ వెలితి మీకు తోచదు. Hypothetical గా నేను చెప్పడం లేదు. నా అనుభవమిది. కారణరహితమైన ఆనందంతో నృత్యం చేసే సూఫీలు, కూనిరాగాలు తీసే కాపరులు, ఊరికే సరదాగా, ఆనందంగా తోటి పక్షులతో కలిసి చక్కెర్లు కొట్టి తిరిగి గూడు ఉన్న చెట్టు మీద వాలే పక్షులు – అటువంటి తేలికైన పరిపూర్ణ జీవితమే జీవిస్తున్నారు. పూర్తి శక్తితో పరుగులు తీసే కజక్ గుర్రాలూ, అపరిమితమైన బలంతో రంకెలు వేసే ఆఫ్రికన్ అడివి దున్నలు, ప్రశాంతతను భగ్నం చేసే కార్లను బంతిలా తిరగేసే శక్తివంతమైన ఖడ్గ మృగాలు – ప్రకృతిలోనివన్నీ పూర్ణ శక్తితో జీవిస్తున్నాయి. మనిషిలో ఆ నాణ్యమైన శక్తి యొక్క వ్యక్తీకరణ లేదు. What he has is mutated and pervasive energy. Not pure. అటువంటి inferior energy అనేది inferior art ని సృష్టిస్తుంది. ప్రపంచంలో 99% కళగా పరిగణించబడింది అటువంటి inferior energy నుండి సృష్టించబడిందే. నా వరకూ నేను pure energy నాలో ఉన్నప్పుడే నేను కళను సృష్టిస్తాను. కవిత్వం రాస్తాను.
Life is simple. Happiness is simple. If you have nectar inside your heart, what you need more! పరుగులన్నీ ఆగిపోయినప్పుడు స్థిరమైన, స్థితమైన ఎరుకలో కరిగిపోతాం.
5 . ప్ర) యెన్నో అవకాశాలు వున్నా, టాలెంట్ వున్నా మీరు మీ వూరిలోనే వున్నారు? సాహిత్య వాతావరణాన్ని మిస్ అయిపోతున్నానని బెంగ మీకు లేదా?
జ) నేను చెప్పబోయే మాటలు చాలా మందికి కష్టంగా అనిపిస్తాయి. ప్రతిభ మనిషిని బానిసగా మార్చుకుంటుంది. అది ఒక భూతంలాంటిది. అది ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని తినేసింది. జీవితాల్ని అశాంతిమయం చేసింది. నేను స్వేచ్ఛాపరుడిని. ఏ బంగారు సంకెళ్ళూ నన్ను బంధించలేవు. కళాకారుడిని పీడించే మరొక దురదృష్టం ఏంటంటే ప్రతిభకు సంబంధించిన స్పృహ అతనిలో అహంకారాన్ని పెంచుతుంది. అతన్ని అసహజంగా మారుస్తుంది. అతడు పొలంలో పని చేసుకునే ఒక రైతులాగా సహజంగా ఎప్పటికీ జీవించలేడు. అతడు తనను తాను మిగతా వారి కంటే గొప్పవాడినని భావించుకుంటాడు. ఎంత ప్రయత్నించీ ఆ స్పృహ నుండి అతడు దూరంగా పోలేడు. అందువల్ల అతడు స్వచ్ఛమైన జీవితానికి దూరం అవుతాడు. కళ సాయంతో తన జీవితంలో జీవాన్ని నింపుకోవాలని వ్యర్థo గా ప్రయత్నిస్తాడు. జీవం అనేది జీవించడంలో మాత్రమే ఉంటుంది.
కళలు, సంగీతం, సాహిత్యం; వీటన్నిటికీ ఆధారం జీవితం. అయితే ఎంత ప్రయత్నించీ కళలు జీవితాన్ని ప్రతిఫలించలేవు. జీవితం యొక్క లోతుని కళలు అందుకోలేవు. జీవితంలో ఏముందో దానిని ప్రత్యక్ష అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోవడం సాధ్యం. అందుచేత ఆ జీవన మూలంతోనే నేను connect అయి ఉన్నాను. Always my priority is experiencing life, understanding life. Life is a first-hand experience. Arts are second-hand.
కళల్లోకి జీవితం translate అయినప్పుడు loss of translation అనేది చాలా ఎక్కువ. నిజానికి సారవంతమైనదేదీ అనువాదానికి లొంగదు. నిజానికి అనువాదాల్లో జీవం ఉండదు.
జీవితంలో ఉన్న uncontaminated జీవధారను వదిలేసి, జీవితానందాన్ని విడిచిపెట్టి మనం నిర్జీవమైన కళలు, సాహిత్యం, సంగీతాల వెనుక పడతాం. అదే మనిషి దురదృష్టం. ఇవన్నీ అర్థం అవ్వాలంటే లోతైన insight అవసరం.ఆ insight నిరంతరం పని చెయ్యాలి. మీ హృదయం సుసంపన్నం అయితే మీరు ఈ క్షణంలో నాణ్యతను అనుభవిస్తూ ఉంటే ఇంకా మీకేం అవసరాలు ఉంటాయి?
నేను సాహిత్య వాతావరణాన్ని miss అవుతున్నానని ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే సాహిత్యం నాకు least priority. జీవితమే నా first priority. రాయాలనిపిస్తే రాస్తాను. మళ్ళీ నా నిశ్చలతలోకి, ప్రకృతిలోకి నిష్క్రమిస్తాను. ఏ విషయాలకూ ఎక్కువ సమయం ఇవ్వలేను, ప్రకృతిలో నిశ్శబ్దంగా గడపడానికి తప్ప. ప్రకృతిలో ఉన్నదాన్ని నేను ఎందులోనూ చూడలేదు, ఇంకెందులోనూ అనుభవించలేదు. In nature, I experience completeness of life. The totally of life. It is timeless.
మాటలు వ్యక్తం చేయలేనిది, కాలాతీతమైనది అయిన దాని స్పర్శ మిమ్మల్ని అన్ని బంధనాల నుండి తెంచుతుంది. తామరాకు మీద నీటి బొట్టులా జీవన సామరస్యాన్ని సహజంగా మీరు సాధిస్తారు. ఘర్షణ లేని జీవితం, ప్రశాంతమైన జీవితం, లోతైన జీవితం, సరళమైన జీవితం.
6. ప్ర) యాత్రలు చేస్తున్నప్పుడు మీ హృదయం దేనిని అన్వేషిస్తూ వుంటుంది?
దేనినీ అన్వేషించదండి. విశ్వశక్తిలో ఊరికే భారరహితంగా తేలియాడుతూ ఉంటుంది. యాత్ర అంటే విస్మయం. అర్థం చేసుకోలేని అనుభవం. నా పేరు, నా గతం, నా దేహం, నా identity, నా భాష, నా ఉనికి అన్నీ కోల్పోతాను యాత్రలో. అదొక స్వచ్ఛమైన, విస్తారమైన ఎల్లలు లేని ఎరుక. ఏమీ మిగలకుండా కరిగిపోవడమే యాత్ర. అవ్యక్తంలోకి చేసే ప్రయాణమే యాత్ర. గతాన్ని కొంత కాలమైనా పూర్తిగా త్యజించడమే యాత్ర.
Sometimes I cry with happiness, sometimes with sorrow, and at other times, I’m left with nothingness, merely by experiencing the beauty and immensity of this endless, vast world.
యాత్రలో ఏమి అనుభవిస్తానో ఎప్పటికీ నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే చేతన అక్కడ కూలిపోతుంది. ఆ అనుభవాన్ని అక్షరాల్లోకి అనువదించలేము.
7 . ప్ర) దాదాపు కళలు అన్నిటి పట్ల మీకు బోలెడంత అవగాహన, యిష్టమూ వున్నాయి… మీకు అత్యంత యిష్టంగా అనిపించేది యే కళ… యెందుకు?
జ) బహుముఖీయమైన ప్రజ్ఞ ఎలా నాకు సాధ్యపడింది అని గానీ, కళలకి సంబంధించి దాదాపు అన్ని రకాల ప్రక్రియలను నేను లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాను లేదా సృష్టించగలుగుతున్నాను అని గానీ ఎవరైనా అంటే గనుక, జీవనమూలంతో లేదా source తో నా connection స్థిరంగా ఉండడం వల్లనే అని చెబుతాను. అందువల్ల ఏ కళ అయినా, దాని స్వరూపాన్ని సునాయాసంగా అవగతం చేసుకోగలను, సృష్టించగలను. కారణం కళకి ఆధారం జీవితం కనుక. Prism కి చేరకముందు కాంతి ఏకవర్ణంలోనే ఉంటుంది.
ఉదాహరణకు సంగీతాన్ని నోట్స్ తో నేను అర్థం చేసుకోలేను. నోట్స్ నడుమనున్న నిశ్శబ్దాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి సంగీతం యొక్క గమనం, దాని అనుభూతి, స్వరూపం నాకు స్పష్టంగా అర్థమవుతాయి. గొప్ప సంగీత జ్ఞానం గల సంగీతజ్ఞుల కంటే మెరుగైన రీతిలో సంగీతాన్ని నేను అర్థం చేసుకోగలనని నా నమ్మకం. సంగీత పరిభాషలో కాదు, జీవన పరిభాషలో, భావోద్వేగ పరిభాషలో, spiritual quality యొక్క వ్యక్తీకరణకు సంబంధించిన అభివ్యక్తి పరంగా, ధ్వని లక్షణ పరంగా. సంగీతం యొక్క వ్యుత్పత్తి జీవితం నుండి జరగాలి. అటువంటి సంగీతాన్నే నేను సంగీతంగా పరిగణిస్తాను. అటువంటి సంగీతం సైతం జీవితంలో ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయం కాదు. మీరు నిజమైన జీవితాన్ని జీవిస్తే అన్నీ మీకు అర్థమవుతాయి, సహజంగానే. జీవితాన్ని ఎవరు అర్థం చేసుకోగలరో వారే గొప్ప కళను సృష్టించగలరు. So my work is not in art, but in life. Thus, art naturally comes to me, in its best quality and depth.
సరిగమలు తెలియక ముందు నుండీ పాట ఉంది. అక్షరాలు కనిపెట్టక ముందు నుండీ కథ ఉంది. అన్నీ జీవన హృదయంలోంచి వచ్చేవే. మీరు అక్కడ స్థితమైతే సరస్వతి మీలోనే ఉంటుంది.
అన్ని కళలనూ అమితంగా ప్రేమిస్తాను. అందుకే అన్ని కళలూ కలగలిసిన సినిమాను ఎక్కువ ఇష్టపడతాను. ప్రపంచ సాహిత్యాన్ని, ప్రపంచ సంగీతాన్ని, ప్రపంచ సినిమానూ ఎంతగానో ఇష్టపడతాను. అలాగే ఆధునిక సాంకేతికతను ఇష్టపడతాను. నన్ను నేను నిరంతరం update చేసుకుంటాను. రాబోయే సాంకేతికతకు సిద్ధంగా ఉంటాను. అంతర్జాతీయ వ్యవహారాలను, ప్రపంచ రాజకీయాలను ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉంటాను. ప్రపంచ గమనాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం వేరు, ఈ ప్రపంచం వేరు కాదు.
నేను ఎంతగానో ప్రేమించే కళ కోసం వెచ్చించడానికే నాకు సమయం చాలడం లేదు. ఇక కీర్తి కోసం దుబారా చేసుకునేంత సమయం ఎక్కడిది? మనకి ఉన్న సమయం 24 గంటకేగా!
8. ప్ర) మీలోని నిశ్శబ్దాన్ని మీ చుట్టూ వున్న దైనందిన జీవితంలోని లౌకిక విషయాలను మీరు యెలా సమన్వయం చేస్తూ వుంటారు?
జ) మీరు నిశ్శబ్దంలోకి బలంగా పాదుకున్నాక అది మీలో స్థిరపడిపోయింది. లౌకిక విషయాలు కేవలం నీడల్లా వచ్చిపోతుంటాయి. అవి ప్రభావం చూపలేవు.
మీరు ఎటు వెళ్లినా వెంటనే తిరిగి మీ original state కి తిరిగి రావలసిందే.
రానురాను జన సందోహాల నడుమ, వత్తిడి కలుగజేసే పనులలో కూడా నిశ్శబ్దాన్ని అనుభవించడం మొదలు పెడతారు. అయితే వాటి నుండి త్వరగా మీరు వెనక్కి వస్తూ ఉండాలి.
Source తో మీరు connect అయి ఉన్నంత కాలం లోక విషయాలు వట్టి నీడలు మాత్రమే. మేరు పర్వతంలా మీరు నిశ్శబ్దంలో బలంగా, స్థిరంగా ఉండగలుగుతారు.
నిజమైన నిశ్శబ్దం భౌతికమైనది కాదు. ఆంతరికమైనది. బయట నిశ్శబ్దం కొంత వరకు మాత్రమే దానికి సహాయం చెయ్యగలుగుతుంది.
ఆంతరికంగా మీలో నిశ్శబ్దం లేనప్పుడు భౌతికమైన నిశ్శబ్దం మిమ్మల్ని మరింత చికాకు పరుస్తుంది. కాబట్టి బయట నిశ్శబ్దం గురించి ఎక్కువ ఆందోళన చెందకండి. లోపలి నిశ్శబ్దం పట్ల శ్రద్ధ వహించండి.
9. ప్ర) దైనందిన జీవితంలో అడివి అంటే మీకేమిటి?
జ) అడవి మానవుడి యదార్ధ గృహం. మానవుడికే కాదు సకల జీవరాశికి అడవే గృహం. మిలియన్ల సంవత్సరాలుగా మనిషి అడవిలోనే జీవించాడు. నగరీకరణ అసహజమైనది. అది దేహాన్ని, మనసుని ఛిద్రం చేసి, వ్యాధుల విజృంభణకు, మానసిక రుగ్మతలకు కారణం అవుతుంది. ప్రకృతితో అనుసంధానం లేకుండా మనిషికి ఆనందం, పరిపూర్ణ ఆరోగ్యం అనేవి అసాధ్యం. ఎందుకంటే మనిషి అడవిలో భా9. గం.దేహానికి బయట గుండె ఎలా మనలేదో మనిషి జీవితమూ అడవికి బయట మనలేదు. రాబోయే రోజుల్లో కృత్రిమ గుండెను బ్యాగ్ లో పెట్టుకుని వీపుకి తగిలించుకొని పైపు ద్వారా దేహానికి అనుసంధానం చేసుకొని దీర్ఘకాలం జీవించవచ్చని అంటున్నారు. అటువంటి జీవితమూ ఒక జీవితమేనా? అటువంటి జీవితంలో మీరు ఆనందంగా జీవించగలరా? అటువంటిదే నగర జీవితం కూడా.
అడవుల నుండి మానవ సమూహాలలోకి వచ్చిన కుక్కల జీవన నాణ్యత దయనీయమైన స్థాయికి పడిపోయింది. అవి అనూహ్యమైన, తీవ్రమైన వ్యాధులతో స్వల్ప కాలంలోనే చనిపోతున్నాయి.
City life is a perversion from what is natural. Urbanisation is a mutation. It’s cancer.
10 ప్ర) ‘పరమ గీతం‘ చక్కని ఘాడత వున్న అ కవితా సంపుటి. మీరు ఆ సంపుటిని అడివిలో ఆవిష్కరించారు. మీకు అడివి యెప్పుడు యెలా పరిచయమైంది.
జ) కొన్ని నగరాలు చక్కగా తీర్చిదిద్దబడి అందంగా ఉంటాయి కదా అంటారు కొందరు. నిజమే నేనూ సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, ఖాట్మండు, ఫోక్రా లాంటి నగరాల్లో ultra modernization, sophistication ని enjoy చేస్తాను. కానీ కొన్ని రోజులు మాత్రమే అలాంటి చోట్ల ఉండగలను. నగరాల సౌందర్యం నకారాత్మకమైనది. దానికి ఆత్మను కృగదీసే గుణం ఉంటుంది. జీవంతో నిండి ఉన్నదేదైనా అక్కడ క్రమంగా కృశిస్తుంది.
ఇదే కారణం అడవిలో పుస్తకాన్ని విడుదల చెయ్యడానికి. ఈ పుస్తకంలోని కవితలు చాలా వరకూ నేను ఒక మహానగరంలో జీవించినప్పుడు కలిగిన కుంగుబాటు, అస్తిత్వ సంక్షోభం, ఆధ్యాత్మిక అనుభవాల(జీవితానికి సంబంధించిన దర్శనాలు) నుండి పుట్టాయి. ఆ సమయంలో అక్కడ నాకు లభించిన జ్ఞానం, క్లారిటీ ఏదైతే ఉందో అదే నా తరువాతి జీవితానికి ఆధారం. ప్రకృతి నా గమ్యమని అప్పుడే నాకు అవగాహన కలిగింది. తరువాతి కాలంలో అవగాహన యొక్క గాఢత పెరుగుతూ వచ్చింది. అది నన్ను తిరిగి ప్రకృతి ఒడిలోకి చేర్చింది.
ఇదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. పరమగీతంను నగరంలో రాసినా దాని గమ్యం అడవి. అందుకే అడవిలో ఆవిష్కరించాను.
నా 5వ ఏట నుండి నేను అడవుల్లోనే జీవించాను. ఉద్యోగరీత్యా మా కుటుంబం మారుమూల అడవుల్లో, పర్వతాల్లో నివసించాల్సివచ్చేది. నేను ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి అరణ్యాలను, పర్వతాలను అన్వేషిస్తూ నా బాల్యాన్ని గడిపాను. ఇంటర్ నుండీ తిరిగి అడవి ఒడిలో చేరేవరకు ఒక సుదీర్ఘమైన అస్తిత్వ సంక్షోభం. అడవిని విడిచి పెట్టినప్పుడు పోగొట్టుకున్న శాంతిని తిరిగి అడవి ఒడిలోకి చేరాకా పొందాను. నా ఇల్లు ఎక్కడో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది.
“You must go back HOMEt
hat’s where you belong…”
Sinead O’Connor రచించి, పాడిన “Back Where You Belong” గీతాన్ని వినండి.
11 . ప్ర) ‘పరమగీతం‘ కవితా సంపుటిని ప్రచురిస్తున్నప్పుడు మీ మనసు యెలా వుండేది. అసలు ఆ కవిత్వం నిండుగా ఉన్న తాత్వికతకు మూలమేమిటి?
జ) “Nothing I want. Nothing I need.” ఇదే సాధారణంగా నా మనసు యొక్క స్థితి.
పరమ గీతాన్ని ప్రచురించాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఏదీ పూనుకుని చెయ్యాలి అనుకోను. దానికది జరగాల్సిందే ఏదైనా. ఒక స్నేహితుని పట్టుదల వల్ల దాని ప్రచురణ జరిగింది.
నా మనసు లోతైన శాంతితో నిండి ఉంటుంది. అలలు దానిని చెదరగొట్టడాన్ని ఇష్టపడను. అందుకే విషయాల్లోకి వెళ్ళేముందు ఇది అవసరమా అని విచారణ చేస్తాను. ఆ విధంగా జీవన వ్యాపారాలను పరిమితం చేసుకుంటాను.
ఊరికే ఉండడానికి ఇష్టపడతాను. అదే అన్నిటికంటే కష్టం అంటారు. కానీ నాకు అదే సులభంగా అనిపిస్తుంది.
నేను ఏదైనా చేస్తే ఎవరి కోసమైనా చెయ్యాలి తప్పితే నాకోసం కాదు. దేని మీదా నాకు కోరిక ఉండదు.
ఒక రోజు రాత్రి ఒక స్నేహితుడు “జీవితంలో నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని ఎవరితోనూ పంచుకోకుండా మరణించే హక్కు నీకు లేదు” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
నేను తెలుసుకున్నది కొద్దో గొప్పో ఇతరులతో పంచుకోవాలని నాకు అప్పుడే అనిపించింది. అలాగని దానికోసం నేనెప్పుడూ ప్రయత్నించను. బహుశా సమయం వచ్చినప్పుడు దానికదే జరుగుతుందని అనుకుంటాను. దానిని నేను అడ్డుపెట్టను. అలా అని ముందుకూ తొయ్యను. విషయాల పట్ల నా స్పందన indifferent గా ఉంటుంది.
పరమగీతంలోని తాత్వికతకు మూలం ఏమిటని చాలా మంది అడిగారు. ఎన్నో భరింపరాని రహస్య దుఃఖాలతో నిండి ఉంటుంది కవి జీవితం. నల్లటి చీకటి సుడిగుండాలలో చిక్కుకుని అగాధాల్లోకి జారిపోతూ కనిపించిన కాంతిరేఖను ఆధారం కోసం ఆర్తిగా పట్టుకుంటాడు కవి.
నా దుఃఖం భౌతిక విషయాల కోసం కాదు. అది అస్తిత్వ సంక్షోభానికి సంబంధించినది. ఈ జీవితానికి అర్థం ఏమిటో తెలియక అల్లాడిన సంవత్సరాల దుఃఖం, అలాగే నేను దర్శించిన కాంతీ ఈ పరమ గీతంలో కనిపిస్తాయి.
ఈ పుస్తకం ప్రగాఢమైన ఆత్మవిచారణలోంచి వచ్చింది. దానిలోని తాత్వికతకు మూలం నా జీవితానుభవాల్లో ఉంది.
టాగోర్ అంటాడు “నా దుఃఖం భరింపరానిది” అని. ఆయన కవిత్వంలోని లోతు, మాధుర్యం ఆయన అనుభవించిన క్రూరమైన దుఃఖాల నుండి వచ్చింది.
*****
వ్యాక్యాన్ని జతచేయండి