అమ్మకు ప్రేమతో…
అమ్మకు నివాళిగా పిల్లలు పుస్తకాలు తీసుకురావడం మన సాహిత్య ప్రపంచంలో వుంది. అమ్మ స్మృతిలో జ్ఞాపకాలు వెలువరించడమూ వుంది. సాహితీ ప్రపంచానికి సుపరిచితులైన జంపాల చౌదరి గారు వారి తల్లి జంపాల విమలాదేవి గారి స్మృతిలో తెచ్చిన పుస్తకం యీ వరుసలో భిన్నమైనది.
తక్కువ పేజీలతో యెంతో అర్థవంతమైన కూర్పుతో వున్న యీ పుస్తకం తల్లికి గొప్ప నివాళి. యిది ఆధ్యాత్మిక, ఆత్మికమైన సాహితీ నివాళి.
యిందులో ‘వాయుపురాణం’లో తల్లి ఔన్నత్యాన్ని తెలిపి ‘మాతృషోడశి’ శ్లోకాలను బాపు బొమ్మలతో యివ్వడం గొప్ప ఔచిత్యం. దీని తర్వాత సాహిత్యంలో తల్లి ప్రస్తావన వున్న రచనలను యిచ్చారు. శ్రీ రమణ గారి ’అమ్మ’, సత్యం శంకరమంచి ’తల్లికడుపు చల్లగా…’, నామిని ’బతుకుగోరే తల్లి’, కొడవటిగంటి కుటుంబరావు నవల ‘చదువు’ నుంచి కొంత భాగం– ’అక్షరాలు దిద్దించిన అమ్మ’, సుమన్ ప్రసాద్ జంపాల గారి ’నానమ్మ ’, మహమ్మద్ ఖదీర్ బాబు ’మా అమ్మ పూల యాపారం’ , పొత్తూరి విజయలక్ష్మి ‘అమ్మ ఫోటో’ వున్నాయి. అన్నీ అమ్మకు కట్టిన అపురూప పటాలే.
అక్షరాలను ప్రేమించిన, యెప్పుడూ పుస్తకాలు చదివే విమలాదేవి గారిని ప్రేమతో… ప్రేమగా గౌరవించుకొన్నారు. యీ పుస్తకంలో జంపాల చౌదరి గారు తన తల్లి గురించి రాసినది యిక్కడ ప్రచురిస్తున్నాం.
– ఎడిటర్
*****

మా అమ్మ విమలమ్మ
…………
అమ్మ,
జీవాన్ని ఇచ్చింది.
జీవనవిలువలు నేర్పింది.
ప్రేమించడం నేర్పించింది.
నా జీవితంలో చదువును భాగంగా చేసింది.
నేను నేనుగా ఎదగటంలో ముఖ్యపాత్ర వహించింది.
అని ఆమె పిల్లలం ముగ్గురమూ అంటాము.
ఆమె తల్లితండ్రులు, తోబుట్టువులు, బంఢువులు, మా చంటమ్మ / చంటక్క సాత్వికురాలు, అందరితోనూ మంచిగా ఉంటుంది, ఎవరినీ నొప్పించదు అనేవారు. నాన్నగారు మాటలుగా ఏమీ చెప్పకపోయినా చేతల్లోనే తన ప్రేమని చూపించేవారు. చాటపర్రు, దుగ్గిరాల, రాజమండ్రి, కొలచనకోట, ఈపూరు, పెరవలి, ఇంటూరు, నందివెలుగు, గుంటూరుల్లో తనకు పరిచయమైన ఎవరైనా విమలమ్మ గారంటే హుషారైన మనిషి, మంచి స్నేహపాత్రురాలు, సంస్కారం ఉన్న వారు అంటూ ప్రేమ, ఆత్మీయత, గౌరవం కురిపించేవారు. నాన్నగారి ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళలో ఉండవలసి వచ్చింది. ఏ ఊరిలో ఉన్నా కొద్దికాలంలోనే బోలెడు స్నేహితులని సంపాదించుకొనేది; వారందరూ జీవితకాలమంతా ఆత్మీయబంధువులయ్యేవారు. ప్రభుత్వ చిరుద్యోగి భార్యగా మధ్యతరగతి ఒడిదుడుకులను నేర్పుగా, ఓర్పుగా భరించి ముగ్గురు పిల్లలను పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేసింది. నాన్నగారికి ఆఖరిక్షణందాకా అన్నుదన్నుగా నిలచింది. అందరితోనూ మంచిగా ఉండటం, అవసరమైనప్పుడు చేయగల సహాయం చేయడం ఆమె సహజలక్షణాలు – మాకు ఆదర్శనీయమైన మార్గాలు.
అమ్మకు చదువంటే ఇష్టం. చాటపర్రులో వీధిబడిలో అయిదోతరగతి వరకూ చదువుకుంది. ఊర్లో హైస్కూల్ లేకపోవటంతో పాఠశాల చదువు అక్కడే ఆగిపోయింది కానీ తాను చదవటం ఆపలేదు. వీలైనప్పుడల్లా దొరికిన పుస్తకాలన్నీ చదువుతూ ఉండేది. నోట్సులు రాసుకునేది; పత్రికలలో తనకు నచ్చిన విషయాలను కత్తిరించి దాచి ఉంచేది. ప్రయాణం చేస్తే అక్కడి విశేషాలన్నీ ఓపిగ్గా డైరీగా రాసేది. పత్రికలలో చదివి కేకులు, షర్బత్తులూ చేయడం, కొత్త వంటలు వండటం, సబ్బులు తయారు చేయడం, అల్లికలు, కుట్లు, వంటివన్నీ చేస్తూ ఉండేది. క్లియరెన్స్, చైనీస్ చెకర్స్ వంటి ఆటల్లో ఆవిడతో గెలవడం కష్టంగా ఉండేది. తొంభయ్యో సంవత్సరంలోకి వచ్చాక కూడా, చనిపోయే రోజు వరకూ ఆవిడ పుస్తకాలు చదువుతూనే ఉంది. ఆవిడ స్ఫూర్తి వల్లనే కాబోలు ఈ చదివే అలవాటు మా అమ్మ మునిమనుమలలో కూడా కనిపిస్తుంది.
అమ్మ నేర్పిన విలువలతో జీవించడానికి నిరంతరం ప్రయత్నించటం, ఆ విలువలను తర్వాత తరాలకు అందించటమే మేము ఆమెకు ఇవ్వగల నివాళి.
– జంపాల చౌదరి.
వ్యాక్యాన్ని జతచేయండి