గది నిండా వచ్చి నిలబడ్డ
యేనుగులు
గోడల మీద పాప గీసిన
సగం సగం బొమ్మలు
కళ్లు పెద్దవిగానూ
శరీరం చిన్నదిగానూ
తొండం తోకా మరీ పెద్దదిగానూ
కనిపించాయి నాకు
పొట్టలో పెట్టిన నల్లని చుక్కలు
యేమిటా అని చూస్తే
నల్లని అందమైన చారలు
దిగులుగా వంచిన తల
ఆ పక్కనే మరికొన్ని నిలబడి వున్నాయి
అక్కడక్కడా అడవి
మధ్యమధ్యలో చిన్న చిన్న రాళ్లూ
యింకా చాలా మైదానమూనూ
మరింకెదో గోడ చివరగా గీసి వుంది
దంతాల కిందుగా సింధూరం అద్ది వుంది
రక్తానికి గుర్తుగా
పాప చేతులతో తుడుస్తోంది
యేనుగులన్నీ పూర్తిగా యేర్పడ్డాయి
నేను చూస్తూ నిలబడ్డాను
కొన్నాళ్ళకి యింటికి రంగులేశారు
గదిలోకి కొత్త రంగులొచ్చాయి
యేనుగుల గుంపు మాయమయింది
నాలో జ్ఞాపకాలుగా చేరాయి.
చాలా బాగుంది. గోడలపై వేసిన పిల్లల బొమ్మలు ఎన్నో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. వాటికి చేరువ కాలేక మనమే చెరుపుకుంటాం. చాలా రోజుల తరువాత మీ కవిత చదివాను. Thank you.