ఇచ్ఛామతి

ఒడిశాలో తెలుగు సాహితీ వికాస విజ‌య‌చంద్రుడు

                ‘మనం మనం బరంపురం’ అనే లోకోక్తి మనందరికీ తెలిసిందే. ఇది ఒడిశాలో భాగమైనా తెలుగువారు అత్యధికంగా నివసించే పట్టణం. బరంపురంలోని తెలుగువారు భాషాపరంగా మైనారిటీలు. వారి సాంస్కృతిక వికాసానికి ఊతం కావాల్సిన అక్కడి మాధ్యమాలకు తెలుగు భాషా సాహిత్యాల మీద అంత పట్టింపు ఉండదు. వేరే రాష్ట్రం కావటాన తెలుగురాష్ట్రాల నుంచి భాషా సాంస్కృతిక  సహకారానికీ అంతగా అవకాశాలు లేవు. ఈ రాజకీయ కారణాలతో నిమిత్తం లేకుండా వికాసం వంటి సంస్థకు  క్రియా శీలక సభ్యుడుగా తెలుగు సాహిత్య వికాసం కోసం నిరంతర కృషి చేస్తున్నారు ‘విజయచంద్ర’.  

చరిత్రలో కళింగాంధ్ర, ఉత్కళాంధ్ర… ఇలా ఏ పేరుతో పిలిచినా అందంతా నైసర్గికంగా అటు ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలు, ఇటు ఆంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వర్తిస్తుంది. ఈ ఐదు జిల్లాల్లో తెలుగు, ఒడియా భాషా సంస్కృతులు పాలూనీళ్లలా కలిసిపోయే ఉంటాయి. తెలుగునాట సంఘసంస్కరణ ఉద్యమాలు మొలకెత్తిందీ ఈ ఉత్కళాంధ్రలోనే. బరంపురంలో 1909లో ఏర్పడిన ఆంధ్ర భాషాభివర్ధని సమాజం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, తాపీ ధర్మారావు, ఉప్పల లక్ష్మణరావు వంటివారి క్రియాశీలక సాహిత్య సంస్కరణ వాతావరణం, కుల, మత వ్యవస్థలకు నిరసనగా ఆ రోజుల్లో జరిగిన సహఫంక్తి భోజనాలు… ఇలా ఎన్నో ఘటనలు చైతన్య పూరితమైన బౌద్ధిక వాతావరణాన్ని కల్పించాయి. సాహితీ సృజనకు అంకితమైన ఉత్కళాంధ్ర రచయితలు ఈ దారిని మరింత విస్తృతం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. వారిలో వొకరైన విజయచంద్ర గారు  బరంపురం కేంద్రంగా తెలుగు సాహిత్య పరిమళాల్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. వారి సాహిత్య ప్రస్థానం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దగ్గర కొత్తూరులోని తాతగారి ఇంట్లో 1955, జనవరి 2వ తేదీన పుట్టాను. నా అసలు పేరు రొక్కం చంద్రశేఖరరావు. మా నాన్న నివాసం బరంపురం కావడం వల్లా నా బాల్యమంతా బరంపురం ఫస్టు మిలటరీ లైనులో గడిచింది. సంతపేట స్కూలు, సిటీ హైస్కూల్‌, ఖల్లికోట కళాశాలల్లో ఎంకామ్‌ వరకూ నా విద్యాభ్యాసం కొనసాగింది. మా నాన్న రొక్కం సూర్యనారాయణ నూనె డబ్బాల మీద పైకప్పులు (మూతలు) అతికే కార్మికుడు. వీధుల్లో కరెంటు లేని ఆ రోజుల్లో ఎన్నో వీధిదీపాల్ని అత్యంత ఆకర్షణీయంగా మా నాన్న, మావయ్యలు తయారుచేసేవారు. ఆ కార్మికవర్గ నైపుణ్యం, కళా కుశలత శ్రద్ధ నా కవిత్వంలోకి కూడా ప్రవేశించాయి. పేదరికం నా జీవితంలో మొదటి గురువు. నేను చదువుతున్న రోజుల్లోనే నాన్న చనిపోతే ముగ్గురు తమ్ముళ్ళని, చెల్లిని, అమ్మను పోషించడానికి స్నేహితుడు ఇచ్చిన సైకిల్‌ మీద తిరిగి, రోజంతా ట్యూషన్లు చెప్పేవాడిని. ఎన్ని సమస్యలు ఎదురైనా చదువుని మధ్యలో ఆపలేదు. నాతోపాటు తమ్ముళ్లనీ చదివించి, వారు జీవితంలో నిలదొక్కుకునేలా చేశాను. 

బ్రహ్మపుర లేక బరంపూర్ ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని ఒక ప్రాచీన పట్టణం. ఈ నగరాన్ని సిల్క్ సిటీ (పట్టు నగరం) అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బ్రిటిష్ పాలన కాలంలో బ్రహ్మపుర మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. 1936లో బ్రహ్మపూర్ (బరంపూరం)ను ఒడిశాలో విలీనం చేశారు. అప్పట్లో ఒడిషాలో మరో తెలుగు ప్రాంతం పర్లాకిమిడిని కూడా ఒడిశాలో కలిపారు. ఈ విలీనానికి ముందు వీటిని ఆంధ్రప్రాంతంలోనే ఉంచాలని వ్యవహారికాంధ్ర ఉద్యమకర్త గిడుగు రామమూర్తి ఆయన తనయుడు గిడుగు సీతాపతి ఎంతో పోరాటం చేశారు. లండన్ లోని ప్రీవీ కౌన్సిల్ వరకూ వెళ్ళారు. కానీ ఫలితం లేకపోయింది.  

1976లో బ్యాంకు ఉద్యోగంలో చేరాను. ఒడిశాలోని ఖుర్దాలో మొదటి పొస్టింగు ఇచ్చారు. అక్కడ తెలుగువారు ఉండరని రైల్వే కార్మికులు అధికంగా ఉండే ఖుర్దా రోడ్డుకు కుటుంబం మొత్తాన్ని తరలించి, నివాసం ఏర్పర్చుకున్నాను. ‘కవిత’ అనే సాహితీ సంస్థ స్థాపన అక్కడే జరిగింది. గతేడాది మరణించిన రామతీర్థ మా ‘కవిత’లో సభ్యుడు. అంచెలంచెలుగా మా యువతరం అంతా జీవితంలోను, సాహిత్యంలోను ఎదిగింది. జ్వాలాముఖి, శ్రీశ్రీ, చిరంజీవినికుమారి లాంటి సాహితీ పెద్దలను ఆహ్వానించి, సభలు జరిపాం. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితల మీద మా ‘కవిత’ సభ్యుడు బి. సూర్యారావు చిత్రాలు వేశాడు. ఆ చిత్ర ప్రదర్శనని శ్రీశ్రీ స్వయంగా ఆవిష్కరించారు. ఈ చిత్రాలను లండన్‌, చైనాలకూ తీసుకువెళ్ళారు. అనేకచోట్ల ఈ మహాప్రస్థానం చిత్రాల ప్రదర్శనలు జరిగాయి.

నేను పీయుసీ చదువుతున్న రోజుల్లో మా బరంపురం ఫస్టు మిలటరీ లైనులో నా సహధ్యాయి మండపాక సూర్యారావు అన్నయ్య మండపాక కామేశ్వరరావు, అతని మిత్రుడు సేతుపతి ఆదినారాయణ శ్రీశ్రీ, ఆరుద్ర, నారాయణబాబు తదితర కవుల కవిత్వాన్ని వారి ఇంటి వరండాలో కూర్చొని, బిగ్గరగా చదువుతూ ఉండేవారు. నేను నా సహాధ్యాయి కోసం వారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ లయ బద్ధమైన కవిత్వం చెవిన పడి నాకూ అలా రాయాలనిపించింది. అప్పటికే అవసరాల రామకృష్ణారావు 1970, నవంబరు 14న బరంపురంలో ‘వికాసం’ అనే పేరుతో సాహితీ సంస్థను స్థాపించారు. వికాసం ప్రథమ వార్షికోత్సవానికి డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా వచ్చి ‘మాది భాగ్య నగరం, మీది బరంపురం’ అని ఒక అనర్గళ ఉపన్యాసం చేశారు. ఆ ప్రసంగాన్ని నేను సభికుల్లో కూర్చొని విన్నాను. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. నన్ను ‘వికాసం సంస్థ’లో సభ్యుడిగా చేర్పించమని నా మిత్రుడి అన్నయ్యను కోరాను. కానీ వారు మరొక ఏడాది పాటు నన్ను చేర్చుకోకుండా నిరీక్షణలో ఉంచారు. బహుశా నేను ‘వికాసం’లో సభ్యుడిని కావడానికి అర్హుడినా? కానా? అన్న దానికి అదొక కాల పరీక్ష. 1973లో నేను మా ఖల్లికోట కళాశాల తెలుగు సాహితీ సమితి కార్యదర్శిగా ఎన్నికై, ప్రముఖ యువకవి కె.శివారెడ్డి, విద్వాన్‌ విశ్వం గార్లను ఆహ్వానించి, సాహితీసభ నిర్వహించాను. ఆ సభ చాలా చారిత్రాత్మకమైనది. యువకవి శివారెడ్డిని విద్యార్థులు మోటర్‌ సైకిల్‌ ర్యాలీతో ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!’ అంటూ రైల్వేస్టేషన్‌ నుంచి హోటల్‌ వరకూ నినాదాలు ఇచ్చుకుంటూ తీసుకువచ్చారు. ఇంతటి గౌరవం ఏ తెలుగు కవికీ దక్కి ఉండదని అనుకుంటాను. సభ బాగా జరిగింది. వెయ్యికి పైగా సభికులు హాజరయ్యారు. సభ విజయవంతం కావడంతో నన్ను గుర్తించి, ‘వికాసం’లో సభ్యుడిగా చేర్చుకున్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ ‘వికాసం’తో మమేకమైన సాహిత్య జీవితం నాది.

వికాసం  సాహితీ  సంస్థ పేరు వికాసాంధ్ర సాహితీ సాంస్కృతిక సంవేదిక. బి.ఎల్.ఎన్.స్వామి, తాతిరాజు వెంకటేశ్వర్లు,గరికిపాటి దేవదాసు, మురళీ మొహన్,దేవదాసు రవి,వై.ఎన్.జగదీష్,దేవి బచ్చు సుభద్రామణి, పోతా ప్రగడ ఉమదేవి, సుశీల తదితరులు అప్పటి సభ్యులు. తదనంతరం “మనం మనం బరంపురం” కధల సంపుటిలోని ఇతర రచయతలు సంస్థలో చేరారు. మాచిరాజు, ఏకాంబరం, నిర్మలరావు, చిట్టిబాబు, కేదారి, మండపాక కామేశ్వర రావు, వై.ఎస్.ఎన్.మూర్తి,  మల్లాప్రగడ రామారావు, దేవరకొండ సహదేవరావు, పొట్నురు శంకర రావు, పుష్పలత మొదటి తరం సభ్యులు. అవసరాల గారు ఉండగానే వికాసం “మనం మనం బరంపురం” కధా సంపుటి వెలువరించింది. ఉద్యోగ విరమణ కారణంగా అవసరాల వారు విశాఖ వెళ్ళిపోయేక సంస్థ అధ్యక్ష బాధ్యతలు రష్యా నుంచి భార్యా వియోగం తట్టుకోలేక బరంపురం స్వగృహానికి మరలివచ్చిన ఉప్పల లక్ష్మణ రావు సభ్యుల కోరికపై స్వీకరించారు. ఇది వికాసం చరిత్రలో ఒక గుణాత్మక పరిణామం. లక్ష్మణ రావు ముక్కాకలు తేరిన అభ్యుదయ రచయిత. తెనాలిలో జరిగిన మొదటి అభ్యుదయ రచయతల సంఘం  మహాసభలకు ఆయన ఆహ్వాన సంఘం అధ్యక్షులు. పార్టీ మిత్రుల కోరిక మేరకు గతంలో  సోవియట్ రష్యాలో ప్రగతి ప్రచురణాలయం లో తెలుగు అనువాదకులుగా చాలా సంవత్సరాలు పనిచేసారు. సోవియట్ సాహిత్య జగత్తులో విశ్వవిఖ్యాతులైన రచయతల పుస్తకాలు, చెంగిజ్  అయిత్మాతోవ్ రాసిన జమిల్యా, తొలి ఉపాధ్యాయుడు లాంటి  నవలలు, గోగొల్ కధలు,సిద్ధాంత గ్రంధాలు, రష్యన్ తెలుగు నిఘంటువు వాటిలో ప్రధానమైనవి. ఆయన సామ్యవాది.సౌమ్యులు. నిగర్వి.  బొటనీ లో విత్తనం అంకురించడం లో కాంతి పాత్ర ” అనే అంశం మీద డాక్టరేట్ చేసారు. సర్ జగదీష్ చంద్ర బోసు దగ్గర కొంతకాలం పని చేసారు. తన గురించి తన ప్రతిభ గురించి ఏనాడూ ఆయన వికాసం సభ్యులకు చెప్పలేదు. అనేక దినాల సాన్నిహిత్యం తరువాత సభ్యులకు ఆయన గురించి తెలిసింది. సామ్యవాదమే ప్రపంచం లోని అన్ని సమస్యలకు ఒక సామంజస్య పరిష్కారం అని గాఢంగా  విశ్వసించేవారు. వికాసంలో మేము పిన్న వయస్కులమైనా మమ్మల్ని మీరు అని సంభోధించేవారు. ఆయన మూడు తరాల సభ్యులను తన రచనలతో వ్యక్తిత్వంతో ప్రభావితం చేసారు. తాను డబ్బై ఐదు సంవత్సరాల ప్రాయం లో ఉన్నా సభ్యులతో పాటు నేల మీదే చాప మీద కూర్చొనేవారు. వికాసం లో ఉండగానే చిన్నతనంలో తాను మొదలు పెట్టిన “అతడు ఆమె నవల ” మిగిలిన భాగాలు రాసి సమావేశాల్లో చదివి వినిపించారు. ఈ నవలే తెలుగు సాహిత్యంలో పది ఉత్తమ నవలల్లో ఒకటిగా పేరెన్నిక పొందింది.వందేళ్ళ బరంపురం, స్వాతంత్రోద్యమం చరిత్ర, ఆనాటి జీవన పరిస్థితులు తన జీవిత సంఘటనలతో మమేకం చేస్తూ “బతుకు పుస్తకం” స్వీయ చరిత్ర రాసారు.

వికాసం గురించి మరింత చెప్పాలంటే ముందు బి.ఎల్.ఎన్ స్వామి గారి గురించి మొదటిగా చెప్పుకోవాలి. ఆయన కార్యదర్శిత్వలో వికాసం అత్యంత క్రమశిక్షణాయుతంగా ఉన్నత పధంలో నడిచింది. విస్తరణ చెంది వికసించింది. తదనంతర కాలంలో ఆయనతో పాటు దేవరకొండ  సహదేవరావు, ధర్మాచార్యులు,  ధర్మపురి క్రిష్ణమూర్తి, ప్రస్తుతం మండపాక కామేశ్వరరావు అధ్యక్షకులుగా, వికాసం కార్యదర్శి గా  రవి శర్మ   బాధ్యతలను  స్వీకరించారు. వికాసం మలి ప్రచురణ “ఉండండుండండి ” కవితా సంపుటి పురిపండా అప్పలస్వామి సంపాదకత్వంలో వెలువడింది.

వ్యక్తుల్లోని ప్రతిభను వెలికి తీసి రచనల్లో ప్రతిభావంతులుగా తయారు చేయడం,ఉత్తమ సంస్కారం,సమస్యల పట్ల సరి అయిన అవగాహన చర్చలు గోష్టుల ద్వారా కల్పించడం, రచయితలను కవులను ఆహ్వానించి సభలు సమావేశాలు జరపడం, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సాహిత్య అభిలాష, పఠనాసక్తత పెంచడం మొదలైన లక్ష్యాలతో మొదలైన సంస్థ అయిదు దశాబ్దాల ప్రయాణం లో అత్యంత మానవీయంగా ఒక ఆదర్శ సమూహంగా ఎదిగింది.

ఇక వికాసంలో ఎన్నో మైలురాళ్ళు. వికాసం అయిదు దశాబ్దాల చరిత్ర కళింగాంధ్ర సాహిత్యకారుల సాహిత్య, సాంస్కృతిక కృషితో  ముడిపడి ఉంది. ఇది ఎవరు ఔనన్నా కాదన్నా ఒప్పుకోవలసిన విషయం.  విజయ చంద్ర, ఉమాదేవి, పన్యాల జగన్నాధ దాసు, సేతుపతి ఆదినారాయణ, అగ్ని ఆవేష్, రొక్కం కామేశ్వర రావు, జామి తిరుమల, దాసరి జీవన కుమార్, కె.ఎల్.ప్రసాద్, మల్లా ప్రగడ రామారావు, కోకా సావిత్రి, దినకర్,  కెనారా,  రఘునందన గార్గేయ, కేదారినాథ్,ఆర్.ఎన్.వెంకటేశ్వరన్, కిషొర్ దాస్,రమేష్ రాజు, దేవరకొండ  సహదేవరావు, ధర్మాచార్యులు,  వికాసం అనురూప సంస్థ కవిత నుంచి రామతీర్థ, జగధాత్రి, రాయగడ ప్రగతి నుంచి ఆనందరావు పట్నాయక్, బరంపురం లో మా మిత్రులు ఎం.ఎస్.వీ గంగరాజు, తుర్లపాటి రాజేశ్వరి  ఉపద్రష్ట అనురాధ, విజయనగరం నివాసి అయినా మాతో ఆత్మీయంగా మెలిగే చాసో గారి తనయ చాగంటి తులసి, అర్ధి రఘునాధ వర్మ, దూసి పద్మజ, మధులత  కళింగాంధ్ర ఉపరితలం మీదకు ప్రతిభావంతులైన రచయతలుగా ఉనికిలోకి వచ్చారు.

వారి రచనలు మనందరికీ విదితమే. వికాసం పూర్వ అధ్యక్షులు దేవరకొండ సహదేవరావు “మనస్సులొనే అంతా ” కధా సంకలనం,చురుక్కులు కవితా సంపుటి, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి  మీద పరిశోధనా గ్రంధం, ధర్మపురి క్రిష్ణమూర్తి జీవిత చరిత్ర పుస్తకాలుగా ప్రచురించారు. వికాసం కవిగా నేను (విజయచంద్ర) తొమ్మిది కవితా సంపుటాలు వెలువరించాను. ఆహ్వానం, మౌనలిపి,మహాఘోష, నరకస్రుష్టి, ప్రేమిస్తూ, జై గంగే,అసంఖ్యాక నక్షత్రాలు ఒక ఆకాశం,నీలి లాంతరు, ఊదారంగు కలలు ప్రముఖమైనవి.హింది,బెంగాలి, ఒరియా భాషల్లోకి కవిత్వం అనువాదమైంది.  కవితల ఆంగ్ల అనువాదం “విండ్స్ ఆర్ అలివ్ ” విడుదలయింది. పోతాప్రగడ ఉమాదేవి తమ రచనలు క్రోడీకరించి “ఉమాదేవి సాహితీ సుమాలు” పేరిట కధలు కవితల సమాహారం పుస్తక రూపంలో  ప్రచురించారు.

 1979 లో వికాసం, ఆంధ్ర భాషాభివర్ధిని సమాజం కలిసి ‘అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం’ నిర్వహించాయి. అత్యంత వైభవంగా  జరిగిన ఈ సభల్లో శ్రీ శ్రీ, చెరబండ రాజు, జ్వాలా ముఖి, కుందుర్తి, వాకాటి పాండు రంగా రావు, ఏండ్లూరి సుధాకర్… ఇంకా ఎంతో మంది రచయతలు, కవులు పాల్గొన్నారు. తెలుగు సాహితీ సంస్థ ల్లో స్వర్ణోత్సవాలు జరుపుకున్న అతి కొద్ది సంస్థల్లో  వికాసం వొకటి. ఇటీవల వికాసం తన 50వ సంవత్సరాల పండుగని గత ఏడాది జరుపుకుంది. రెండు రోజులు జరిగిన ఈ సభలు నగరం లో  కొత్త చైతన్యం సృష్టించాయి.

సాక్షిలో ఉప సంపాదకులుగా ఉన్న మా సభ్యులు పన్యాల జగన్నాథ్ దాస్  తొలి కవితా సంపుటి  “ఏడవ రుతువు కోసం” ప్రచురించారు

ఆకాశవాణి లో కార్యనిర్వహణా అధికారిగా చాలా కాలం పనిచేసిన రొక్కం కామేశ్వర రావు బ్లొ అవుట్, పదహారు, అంతర్వీక్షణం,చిదాకాశం,గ్యానా మ్రుతం,అంతర్ముఖం, క్షతగాత్ర అనే కవితా సంపుటాలు రచనలుగా వెలువరించారు.

” ఇన్నర్ విజన్” ఆంగ్ల అనువాదం, ముఖారి స్వీయ వచన కవిత్వం, అంతర్ముఖం -హింది తమిళ్ అనువాదాలు, గ్యానామ్రుతం లైఫ్ స్టైల్ వ్యాసాల హిందీ అనువాదం ప్రచురించారు.

బరంపురం లో వికాసం చరిత్ర చెప్పేటప్పుడు “స్పృహ” పత్రిక గురించి కూడా చెప్పాలి. కవి విజయ చంద్ర, రమేష్ రాజు, దేవరకొండ సహదేవరావు  ఆధ్వర్యం లో స్పృహ పత్రిక సుమారు రెండున్నర సంవత్సరాలు నడిచి అనేక మంది కళింగాంధ్ర రచనలు వెలుగులోకి తెచ్చిన స్పృహ పత్రికని  చాలా కాలం నిర్వహించాం. 

పత్రిక ఆవిష్కర్త మహా కవి శ్రీశ్రీ, బాలాజీ, కెనారా, మోహన్,రవి,సుందర్, శ్యాం ప్రసాద్,మంగ,ప్రబ్రుతులు ఆకుల వీధిలో బాలాజీ గారి ఇంటిలో ఒక సమూహ శక్తిగా పనిచేసి పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నారు. “స్పృహ” ఆఫీసును మహా కవి శ్రీశ్రీ, శివారెడ్డి,నందిని సిద్ధారెడ్డి, వంగపండు ప్రసాద్ దర్శించారు. శ్రీశ్రీ  మేడ మీద తన కవితలు మాముందు చదువుతూ వినిపించారు. కవిత సభ్యుడు శ్రీ బోరా సూర్యా రావు శ్రీ శ్రీ మహాప్రస్థానం గేయాల మీద చిత్రాలు వేసారు. ఈ చిత్రాలను శ్రీశ్రీ లండన్, చైనా తీసుకు వెళ్ళారు. అనేక నగరాల్లో ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. 

క్లుప్త గోష్టి, మావి ప్రశ్నలు మీవి జవాబులు, కధానికల పై చర్చలు గత వారం వచ్చిన ప్రక్రియల మీద విమర్శలు, ఒక అంశం ఇచ్చి దానిపై కవితలు రాయడం, అనేక సామాజిక అంశాలు పై  చర్చలు, గోష్టులు, సంస్థ లో జరిగేవి. వార్షికోత్సవాలకు  వచ్చే ముఖ్య అతిధిలతో 

ప్రత్యేక సమావేశాలు కేవాలం సభ్యులతోనే జరిగేవి. సాయంకాలం బహిరంగ సభ ఉండేది.

నా  మీద చెరగని ముద్రవేసిన వారు  ఉప్పల లక్ష్మణరావు గారు . సామాజిక నిబద్ధతే లక్ష్యంగా సాగే నా సాహిత్య ప్రస్థానంలో వికాసంతోనే ముడిపడి ఉంది.  ఉప్పల లక్ష్మణరావు  సుమారు ఒక దశాబ్దానికి పైగా ఇంచుమించు తన జీవిత చరమాంకం వరకూ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన మార్గ దర్శనంలో మా యువతరం ఎంతగానో ప్రభావితమైంది. సామ్యవాద సమాజ స్థాపన… దానికోసం రచయితలు చేయాల్సిన కృషి ఏమిటో మాకు తెలిసి వచ్చింది. ఒక మామూలు రచయిత నుంచి నేనొక నిబద్ధ రచయితగా మారాను. మార్క్సిజాన్ని అధ్యయనం చేసి, గతి తార్కిక దీప్తిలో నా కవిత్వాన్ని సానబెట్టాను. ఈ సాహితీ ప్రస్థానం ఇప్పటికి కొనసాగుతూ వస్తోంది. నిజ జీవిత అనుభవాలు, శరవేగంగా మారిపోతున్న ప్రపంచం. ఎదురవుతున్న వివిధ ఘటనలు, విరివిగా సాహిత్య గ్రంథాల అధ్యయనం, నాలో ప్రగతిశీల ఆలోచనలను పెంచాయి.

నాలుగున్నర దశాబ్దాలు దాటిన నా సాహిత్య జీవితంలో ఇప్పటివరకు తొమ్మిది కవితా సంపుటాలు వెలువరించాను. అవి… ‘ఆహ్వానం (1998), మౌన లిపి (2001). మహా ఘోష (2004), నరకసృష్టి (2006), ప్రేమిస్తూ (2010), జై గంగే (2012), అసంఖ్యాక నక్షత్రాలు ఒక ఆకాశం (2014), నీలి లాంతరు (2015), ఊదా రంగు కలలు (2017)’ అనే పేర్లతో వచ్చాయి. ఎంతోమంది సాహిత్య విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. నా రచనలు ఇతర భాషల్లోనూ అనువాదమయ్యాయి.

‘నిశ్శబ్ద నది’ పేరులో బెంగాలీలోకి రామానందసేన్‌, ప్రాణేష్‌ సర్కార్‌లు అనువాదం చేశారు.

‘బిజయ చంద్రొరొ కొబితా’ పేరుతో ఒరియాలోకి ఉప్రదిష్ట అనురాధ అనువదించారు. హిందీలోకి ‘ఏక్‌ అపరిచిత్‌ కి మౌథ్‌ అన్య కవితాయే’ పేరుతో నాగసూరి అన్నపుర్ణ అనువాదం చేశారు. “ఊదా రంగు కలలు ” కవితా సంపుటికి  హిందీ ఆనువాదం “బైగన్ రంగ్ కి స్వపనే” పేరుతో పార్నంది నిర్మల చేశారు. 

పురస్కారాల విషయానికొస్తే 1998లో ఉమ్మడిశెట్టి సాహితీ ఆవార్డ్‌, 2014లో ఉత్తమ తెలుగుకవి స్వగతికా అవార్డు, 2016లో అరసం విరియాల లక్ష్మిపతి ఆవార్డు, అదే ఏడాది అక్షర గోదావరి పురస్కారం, 2019లో వి.వి. కూర్మారావు స్మారక పురస్కారం లభించాయి. ఒడిశాలోని తెలుగు రచయితలను సంఘటితం చేసే దిశగా 1979లో ‘ఒడిశా రాష్ట్ర తెలుగు రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాము. మిత్రులు రమేష్‌రాజు, సహదేవరావుతో కలిసి ‘స్పృహ పత్రిక’ని బరంపురం నుంచి నిర్వహించాం.  దీనికి ఆవిష్కర్త   శ్రీశ్రీ కావడం విశేషం. “విండ్స్ ఆర్ ఎలైవ్” పేరుతో ఎంపికచేసిన కవితల ఆంగ్లానువాదం వచ్చింది. త్వరలో నా కొత్త కవితా సంపుటి

” ఓంకార ” విలువడనుంది.

రచయితలు సత్యానికి కట్టుబడి ఉండాలి. ప్రజలకు నిబద్ధులుగా ఉండాలి. కొత్త సమాజం కోసం నూతన విలువలు ఆవిష్కరణ దిశగా రచనలు చేయాలి. జాతి పేరు మీద.. మతం పేరు మీద.. కులం పేరు మీద.. ప్రజలను చీల్చే శక్తుల పట్ల ప్రజలను అప్రమత్తులను చేయాలి. ఇదే నేడు రచయితల ముందున్న ఏకైక కర్తవ్యం.

నాలుగు దశాబ్దాలకు పైగా బరంపురంలోని ప్రముఖ సాహితీ సంస్థ ‘వికాసం’లో సభ్యత్వం. ఉప్పల లక్ష్మణరావుగారితో పదేళ్ళకు పైగా సాన్నిహిత్యం.. శిష్యరికం.. నా జీవితాన్ని అవిశ్రాంత అక్షరయాత్రగా మార్చాయి. 2015లో ఉద్యోగ విరమణ తరువాత సాహిత్యమే జీవితం. అసలు పేరు చంద్రశేఖరరావు కన్నా 1972 నుంచీ నేటి వరకూ ‘విజయచంద్ర’ అనే పేరుతోనే అందరికీ నన్ను పరిచయం చేసినవి నా అక్షరాలే. ఈ జీవన పయనంలో నా భార్య శారద, అమ్మాయిలు శాంతి, శ్వేతల తోడ్పాటు మనసుని ఎప్పటికప్పుడు అనిర్వచనీయంగా పరిపూర్ణం  చేస్తుంటుంది.

                                                                                   **********

Spread the love

Bendalam krishnarao

శ్రీకాకుళం జిల్లాలోని కవిటి గ్రామంలో సెప్టెంబర్ 17 1971లో జన్మించారు. ప్రసారమాధ్యమాలకు తెలుగులో రాయడంపై పిజి డిప్లమో చేశారు. విద్యార్థి దశ నుంచే వివిధ పత్రికలకు రచన చేయటం ప్రారంభించారు. పత్రిక రంగంపై ఆసక్తి పెంచుకొని 1992లో గ్రామీణ విలేకరిగా పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రజాశక్తి లో ఫీచర్స్ రైటర్ సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలను నిర్వహించారు. వసంత సమీరం, స్వప్న గీతం -నీలో నేనే, వార్తలు ఎలా రాయాలి, బుద్ధుని జీవితము బోధలు, బుద్ధ ధర్మం, కలింగాంధ్ర అడుగుజాడలు, న్యూక్లియర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ప్రభావం, నడిచే నీడలు, కలాల వనంలో కలుపు మొక్కలు, ప్రవక్త, రవీంద్రుని గీతాంజలి, వెన్నెల వెలుగు - మపాసా కథలు, సుభాష్ చంద్రబోస్ సమరశీల జీవితం, చైతన్య స్రవంతి అంబేద్కర్ మొదలుకొని అనేక పుస్తకాలని రాశారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!