‘సరళాదేవి రచనలలో ప్రత్యేకమైనదీ, తనదీ అనే దస్తకత్ ఉన్నది. నిండైన తెలుగుదనం ఉన్నది. అనుకరణ ఛాయలకు పోకుండా మౌలికంగా ఆలోచించి చిత్రీకరించే నేర్పు ఉన్నది. నిశితమైన పరిశీలనాసక్తి, కరుణామయమైన హృదయమూ ఉన్నాయి’ అంటారు,1962 లో వచ్చిన ‘కుంకుమరేఖలు’ సంపుటికి రాసిన ముందుమాటలో గోరాశాస్త్రి.

1977లో ‘యువ’ మాసపత్రికలో ‘కొమ్మా-బొమ్మా’ ‘పేరున నవలిక ప్రచురితమైంది. అదే ఏడాది “చిగురు” అనే మరో నవల కూడా అదే పత్రికలో ప్రచురితం అయ్యింది. ఈ రెండు నవలలూ కలిపి 2004 లో ” చిగురు, కొమ్మా-రెమ్మా ” పేరిట పుస్తకం రూపంలో వచ్చాయి. ప్రస్తుతం కొమ్మా-రెమ్మా నవలా గురించి మాత్రమే తెలుసుకుందాం.
జగన్నాథం తండ్రి స్వాతంత్రోద్యమం నాటికే ప్లీడరు చదివి బాగా సంపాదించి ఉద్యమంలో పాల్గొన్నవాడు . బ్రిటిష్ చదువులు వద్దని పిల్లల్ని చదివించకపోవటంతో జగన్నాథంకి చదువూ లేదు.తండ్రి తదనంతరం ఉన్నది ఖర్చుపెట్టి చిన్న గుమాస్తా గిరి చేసినవాడు.
అతని పెద్దకూతురు నాలుగో కాన్పుకు వస్తుంది. తర్వాత కూతురు మంగ, కొడుకు గోపి. ఆ ఇంట్లోనే ఉండే జగన్నాథం చెల్లెలు మీనాక్షమ్మ బాలవితంతువు .ఆమె తన బంధువుల అబ్బాయితో పధ్నాలుగేళ్ళు ఐనా లేని మంగకి పెళ్ళి కుదురుస్తుంది. అయితే మందమతి అయిన పెళ్ళికొడుకు పెళ్ళి జరిగిన రాత్రే పారిపోతాడు.పెద్దకూతురు పాపని కని చనిపోతుంది.అల్లుడు పెద్ద పిల్లలిద్దర్నీ తీసుకుని వెళ్ళిపోతాడు.
తమ్ముడు గోపి పదోతరగతి కాగానే డబ్బున్న స్నేహితుడి తండ్రి చదివించి కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తానంటే ఇల్లొదిలి వాళ్ళింటికి పోతాడు. మంగతల్లి కుటుంబంలో జరుగుతోన్న సంఘటనలన్నీ చూసి బెంగ పెట్టుకొని చనిపోతుంది.అందరూ పిచ్చివాడి సంబంధం తెచ్చినందుకు మాటలంటున్నారని మీనాక్షమ్మ కోపంతో బంధువుల ఇంటికి వెళ్ళిపోతుంది. అక్క పిల్లలిద్దర్నీ, రిటైరైన తండ్రినీ సంరక్షిస్తూ నిర్లిప్తంగా కాలం గడుపుతుంది మంగ. పక్కింటి వాళ్ళ సలహాతో మెట్రిక్ పరీక్షకట్టి పాసై టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం సంపాదిస్తుంది మంగ.అలా పదిహేను ఏళ్ళు గడిచిపోతాయి.ఈ లోగా తండ్రి కూడా చనిపోవడంతో ఒంటరిగా అక్క పిల్లలతో జీవితం కొనసాగిస్తుంది మంగ.
సహోద్యోగి మణి అన్న ఆనందరావు ,మంగ పట్ల ఆకర్షితుడౌతాడు.కాని మంగ ఒప్పుకుంటుందో లేదో అని సంశయిస్తాడు. ఆఖరుకు ఎలాగో మంగని పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇంతలో మంగ బావ వచ్చి తనవెంట వచ్చి పిల్లలను చూసుకోమని ఒత్తిడి చేస్తుంటాడు. ఇది చాలలేదని ఒకరోజు ఒక ముసలామె తనతో బాటూ తీసుకొచ్చిన అతడ్ని మంగ భర్త అని ముందుకి పరిచయం చేసి నీదే బాధ్యత అని ఇంటి అరుగుమీద కూర్చుంటుంది. ఆ ముసలామె మాటలు విని చుట్టూ పట్ల వాళ్ళందరూ భర్తనే నమ్ముకోమని మంగకు ఉపదేశాలు ఇస్తారు.అప్పుడే ఆనందరావు వస్తే అందరూ నిరసనగా చూస్తారు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో మంగ తీవ్రమైన మానసిక సంఘర్షణలో అతలాకుతలం అయిపోతుంది. కానీ ముసలామె మాటలకి మాత్రం లొంగిపోదు.
దాంతో మంగ భర్త అని తీసుకువచ్చిన అతణ్ణి తీసుకుని ముసలామె తమ ప్రయత్నం ఆ ఇంట్లో సాగదని అర్థమై పక్క దుప్పట్లతో సహా ఎత్తుకు పోతుంది. ఈ విషయమంతా తెలిసిన మంగ తండ్రి స్నేహితుడు ప్లీడర్ రంగారావు వచ్చి” నువ్వు అదృష్టవంతురాలివి.నీ నెత్తిన మరో బండ పడకుండా తప్పించుకున్నావు.” అని ప్రశంసిస్తాడు. మంగ బొమ్మలా ఉండిపోయింది అని రచయిత్రి పి.సరళాదేవి కొమ్మా- బొమ్మా నవలని ముగించారు.
జగన్నాథం తాత కట్టించిన ఇల్లు మాత్రమే మిగిలిందంటూ ఇంటిని వర్ణిస్తుంది రచయిత్రి.స్వా తంత్రానికి ముందు ఆర్థిక స్తోమతగలవారి ఇళ్ళు ఎలా వుండేదో కళ్ళకి ఒక ఫ్రేమ్ లో రూపు కట్టి చూపిస్తుంది. ఈ నవలని మొదలు పెట్టడం ముసలామె ఒక మందమతిని తీసుకువచ్చి అతనే నీ భర్త అని మంగని ఒత్తిడి చేయటంతో మొదలై పదిహేనేళ్ళ క్రితం గతంలోకి కథని మళ్ళించి చివరికి వచ్చేసరికి మళ్ళా ప్రస్తుతం లోకి తీసుకు రావటం చాలా ప్రతిభావంతంగా రాసారు.
పద్నాలుగేళ్ల మంగకి అప్పుడే పెళ్ళేంటి అని ప్రశ్నించిన స్నేహితుడికి ” ఆడపిల్ల పెళ్ళి బాధ్యత ,మగపిల్లాడి పెళ్ళి హక్కు” అంటాడు తండ్రి .ఆ రోజుల్లో ఆడ,మగ పిల్లలు మధ్య వివక్షని రచయిత్రి వ్యక్తీకరించారు.
మంగ మొదటినుండి చివరివరకూ ఎక్కడా ఎదిరించినట్లు,గొడవలు పెట్టుకోవటం కనిపించదు.మాట్లాడదు,ప్రశ్నించదు.కానీ నిర్ణయాధికారం ఆమెదే అన్నట్లుగా మంగపాత్రని చిత్రించడం వలన సాధికారత గల పాత్రగా కనబడుతుంది.
తొమ్మిదో తరగతిలో చదువు మాన్పించి పిచ్చివాడితో పెళ్ళి జరిపించి,అతను పారిపోయినందుకు మొదట్లో ఆమె తప్పే అన్నట్లుగా అందరూ దెప్పుతుండటంతో చిన్నబుచ్చుకున్నా తన కర్తవ్యమేమిటో మంగ తెలుసుకుంటుంది.
తండ్రి బాధ్యత దింపుకోవడానికి తనసోదరిమాటని నమ్మినా కానీ,భార్య సలహా వినకపోవడంలో పురుషాహంకారమే చూపుతాడు.
మంగ తమ్ముడు గోపీ స్వార్థపూరిత భావంతో బాధ్యతలకు దూరంగా తన స్వార్థంతో తనని చదివించి పెళ్ళిచేస్తామన్న స్నేహితుని ఇంటికి ముందే వెళ్ళిపోతాడు.అక్క భర్త తన లైంగికావసరాలకై తన దగ్గరే వచ్చి మంగని వుండమంటాడు. ఇలాంటి అవకాశవాదులైన పురుషపాత్రల్నీ వేటినీ కూడా మంగతో గానీ ఇతరులతో గానీ నిందిస్తూ రచన చేయకుండా చాలా సంయమనంతో ఆ పాత్రల స్వభావాల్ని తెలుసుకునే అవకాశాన్ని పాఠకుల ఆలోచనకీ, నిర్ణయానికే వదిలేయటం సరళాదేవి రచనా శైలిగా చెప్పుకోవచ్చు. నవలలో కుటుంబ,ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో స్త్రీ జీవితాలగురించి, వైవాహిక బంధాలగురించి, మానవస్వభావాల గురించి మంచి విశ్లేషణలు ఉంటాయి.అక్కడక్కడ సమయానుకూలంగా సామెతలను కూడా వుటంకించటం పాఠకులకు ఆసక్తికరంగా రచన సాగుతుంది.
ఆ నాటి కుటుంబాలలో అందులోనూ ఉత్పత్తి కులాలలోని ఆడపిల్లలకు చదువు, ఉద్యోగం అందుబాటులోకి రాలేదు. వరకట్న సమస్య వలన ఆడపిల్ల వివాహం పెనుభారంగా మారింది. దిగువ మధ్య తరగతి కుటుంబాలలో ఆడపిల్లలకు ఒంటినిండా బట్టా, తిండికీకూడా కష్టమై వారు కోరుకున్న అతి చిన్న కోరికలుకూడా తీర్చుకోలేని పరిస్థితులు. బహుశా అందువలనేకావచ్చు సరళాదేవి రచనలో కూడా చాలావరకూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పెళ్ళిచూపులు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్ని పొదుపు మంత్రంతో సమతూకంచేయటం వుంటుంది. సంసారాల్ని ఒక ఒడ్డుకు తీసుకురావడానికి ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలు సతమతమవ్వటం వంటి అంశాలు కన్పిస్తాయి.
1956 నుండి 1960 వరకూ స్వాతంత్య్రానంతరకాలం రెండో ప్రపంచయుద్ధ ప్రభావం నుండి కోలుకోలేని ఆర్ధిక సంక్షోభం, దుర్భిక్షం వంటి అనేకానేక కారణాల వలన – మధ్య తరగతి కుటుంబీకులలో ఇంటిపెద్ద మాత్రమే సంపాదించే చిరుద్యోగి కావడం, బహు కుటుంబీకులు కావటం కారణంగా – ఆడపిల్లలకు చదువు, పెళ్ళి వంటివి పెనుభారాలుగా మారాయి. కొద్దిపాటి చదువుకున్న ఆడపిల్లలు అప్పుడప్పుడే తమ గురించి ఆలోచించడం మొదలెట్టిన కాలం అది.
డెబ్బయ్యో దశాకానికి వచ్చేసరికి మధ్యతరగతి ఆడపిల్లలు కూడా ఆర్థికావసరాలకై చదువు, ఉద్యోగాల వైపు దృష్టి సారించడం తన నవలలో క్రమానుగతంగా రచయిత్రి రచన కొనసాగించారు.అందులోనూ ఆరోజుల్లో మహిళలు టీచర్ వృత్తినే చేయటం ఎక్కువగా వుండేది.ఇది రచయిత్రి పరిశీలనాత్మకతకు తార్కాణం.
మధ్యతరగతి ఆడపిల్లల ఆలోచనలు, ఆత్మాభిమానాలు, ఆశయాలూ, ఆదర్శాలతోసహా ఇంటిని ఉన్నదాంట్లో అప్పులపాలుకాకుండా ఎలా తీర్చిదిద్దు కోవాలనే తపన, నిరాశా నిస్పృహలకు లోను కాకుండా మంగ నిబ్బరంగా కొనసాగించిన వంటరిజీవితాన్ని ఈ నవలలో రచయిత్రి పి.సరళాదేవి ప్రతిభావంతంగా చిత్రించింది.
డెభ్బైల నాటికి తెలుగునాట సాహిత్యంలో స్త్రీవాద థోరణి పొడచూపకముందే సమాజంలోనూ, మానవమనస్తత్వాలలోనూ వేళ్లూనుకున్న స్త్రీల పట్ల జరుగుతోన్న వివక్షని,అన్యాయాలనీ ప్రశ్నించి నిలదీసే అతి కొద్దిమంది రచయిత్రులలో పి.సరళాదేవి ఒకరు.
ఆ విషయాన్ని సాహిత్య రంగం కూడా గుర్తించిందనే చెప్పొచ్చు. అందుకే గోరాశాస్త్రి “మొదటిది రచయిత్రి సంస్కృతి, వ్యుత్పత్తి, రెండవది భాషపై వున్న అమోఘమైన స్వాధీనం, మూడవది నిశితమైన మానవ మనస్తత్వ పరిశీలన ముప్పేట జడవలె సమన్వయపరుచుకుని రచనలను అందిస్తున్న సరళాదేవిని అభినందిస్తున్నాను’ అన్నారు ఒక సందర్భంలో.
వివాహ వ్యవస్థ స్త్రీ జీవితంతో ఎలా ఆడుకుంటుందో చూపటమే లక్ష్యంగా, స్త్రీ జీవితంలోని ఇతర పార్శ్వాలనుకూడా చిత్రించే సరళాదేవి మరిన్ని రచనలు చేసి వుంటే బాగుండేదని ప్రశంసించారు ఈ నవలలో ముందుమాటలో మృణాళిని.
***
— శీలా సుభద్రాదేవి
వ్యాక్యాన్ని జతచేయండి