సంగీత పూదోటలో విరిసిన వేయి రేకుల గులాబీ ఈ ఠుమ్రి – యాద్ పియాకి ఆయే . మన హైదరాబాదీ హిందుస్తానీ సంగీత విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ ఠుమ్రి పాదుషా . పెద్ద పెద్ద విద్వాంసులే ఆయనలా పాడలేమని ఠుమ్రి లు పాడడం తగ్గించారుట. ఖాన్ సాబ్ స్వయంగా రాసి, పాడినది అజరామరమైన ఈ గీతం.
మామూలుగా ఠుమ్రిలు ప్రేమ, భక్తి భావనలతో వుంటాయి. ఇందులో కూడా ప్రేమే – కానీ విరహం తో కాలి పోతున్న ప్రేమ. 1932 లో ఖాన్ సాబ్ సతీ మణి మరణించారు. అప్పటికి ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆ వియోగం ఈ ఠుమ్రిలో నిండింది .
యాద్ పియాకి ఆయే
ఏ దుఖ సహ నహి జాయే హాయ్ రామ్
సహచరి వియోగం మిగిల్చినది జ్ఞాపకాలు, భరించలేని దుఃఖం.
బాలీ ఉమరియా సూనీరే సజరియా
జోబన్ బీతీ జాయే హాయ్ రామ్
వయసు తక్కువే. ప్రియతమ పక్కన లేకుండా ఈ రాత్రి గడచి పోతోంది.
వహా బైరీ కోయిలియా కూక్ సునాయే
ముఝే బీర్ హల్కాజొయరా జలాయే
హ ప్రీత్ న జాన్ జగాయ్ హాయ్ రామ్
ఆ కోయిల ఎంత దుర్మార్గురాలో! కూ కూ అంటూ ప్రియతమ పాటలే వినిపిస్తోంది. ఈ విరహం నన్ను కాల్చి వేస్తూ పగలు , రాత్రి కూడా నిద్ర లేకుండా చేస్తోంది.
ఈ పాట పంజాబీ ఠుమ్రి బాణీలో నడుస్తుంది. భిన్న షడజ్ అని ఉత్తర భారతీయులు పిలుచుకునే ఈ రాగం, ఆ విరహానికి రూపం యిచ్చింది. ఖాన్ సాబ్ గొంతులో పలికే విషాదం మన మనసు లోపల పొరల్లో కి కూడా వ్యాపించి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆయన విషాదాన్ని అందమైన గమకాలతో , రాగ ఆలాపనతో ముడి వేస్తారు . నేనింకా వయస్సులో ఉన్నాను – ఒక్క వ్యక్తే కాదు – ప్రేమ కొరకు తపనకు ,కోల్పోయిన విషాదానికి ప్రతీక . అందుకే ఎన్ని తరాలు గడచినా ఈ పాట ఈ నాటికి శ్రోతల ఆదరణ పొందుతోంది .
అంతేలా హృదయాన్ని కదిలించిన మరో గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్. జగజీత్ సింగ్ జ్ఞాపకార్థం చేసిన కచేరీలో ఆయన పాడిన ఈ పాట అటు మన వ్యక్తిగత జ్ఞాపకాలే కాకుండా జగజీత్ సింగ్ మృదు మధురమైన గీతాలను గుర్తుకు తెచ్చింది. యాద్ పియా కి ఆయే అని పలికనప్పుడు ఆ గంభీరమైన గొంతులో విషాదపు జీర . కళ్ళలో నీరు రాక మానదు . శొక దేవతలా కూర్చున్న చిత్ర సింగ్ మనస్సు ని పాట రూపం అయ్యిందేమో అనిపిస్తుంది .
ఇక ఇదే పాటను కొంచెం హుషారుగా పాడింది- అజయ్ చక్రవర్తి, కౌశిక్ చక్రవర్తి. సుడులు తిరిగే కౌశిక్ గొంతులో కోయిల కూతలు పలుకుతాయి. కోయిలే ఆమె గొంతులో నివాసముండి పాడుతోందా అనే భావన కలుగుతుంది. అదో గొప్ప ఫీట్ . అయితే పాట అంతా విన్నాక మనకు కలిగేది అబ్బురం! ఆమె విద్వత్తుకి, స్వర విన్యాసం కి మధుర గానానికి ఆశ్చర్యం, ఆనందం. ఆ రాగానికి మరో పేరు- కౌశిక ధ్వని!!ప్రహర్ అనే సినిమాలో కూడ ఈ పాట వుంది . ఠుమ్రి మహారాణి శొభా గుర్తు పాడారు .
వ్యాక్యాన్ని జతచేయండి