ఇచ్ఛామతి

మనిషి కథలే- ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు

 ఈ మధ్యకాలంలో కథల పుస్తకాలను  నేనుచదవడం తగ్గించిన కారణాలు అనేకం ఉన్నాయి.  వంశీ గారు రాసిన   మా దిగువ గోదారి కథలు, నల్ల మెల్లూరి పాలెం కథలు, అదేవిధంగా అమరావతి కథలు, ప్రళయ కావేరీ కథలు, మిట్టూరోడి కథలు.. ఇలా చాలా ప్రాంతాలకు సంబంధించిన భౌగోళిక సామాజిక ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితులను, సంఘర్షణలను, రుచులను అభిరుచులను  కళ్ళకు కట్టినట్లు దృశ్యమాన సదృశ్యంగా  రాసిన ఎన్నో కథలను చదివి ఆనందించడం జరిగింది.

  ఇప్పుడు  పలమనేరు బాలాజీ  రాసిన’ ఏకలవ్య కాలనీ’ ఎరుకుల జీవన గాథలు పుస్తకం తెప్పించుకుని చదవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది సమాజంలోని పూర్వపు పరిస్థితులను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుందని భావించడం, రెండు వారి కథల్లో వారే చెప్పినట్టుగా నిజానికి దగ్గరగా  కథా కల్పనకు దూరంగా వారు రాసే శైలి ఇష్టపడడం.  ఇటీవల కాలంలో పలు కారణాల చేత ప్రతి ఒక్కరూ దూరంగా  ఉన్న వాటి గురించి చాలా దగ్గరగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు.

వాస్తవిక పరిస్థితులకు దూరంగా తల్లిదండ్రులు అమాయకులనుకోవడం, టెక్నాలజీ మాత్రమే నాగరికత అనుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే మనిషికి మనిషి అందనంత దూరంగా వారి వారి ప్రపంచాల్లో ప్రతి ఒక్క మనసు ఒక కేంద్రపాలిత ప్రాంతం లాగా తయారు చేసుకుని సమూహంలో ఏకత్వం అనే విచిత్రమైన లక్షణాలను అలవర్చుకుంటూ నేను నాది అనే భావన పెంపొందించుకుంటూ కనీసం పక్కింట్లో ఏమి జరుగుతుంది అన్న స్పృహ కూడా లేని దయనీయ పరిస్థితులలో , అనేక కుటుంబాలు కలసి చేసిన ప్రయాణమే ఈ 

” ఏకలవ్య కాలనీ ” ఎరుకుల జీవన గాధలు. దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం పరిస్థితులను అప్పటి వ్యక్తుల, వ్యవస్థల భావజాలాన్ని సున్నితంగా సునిశితంగా చెప్పడం బాలాజీ గారికే చెల్లింది.

 మనం ఈ కథల్లో మనుషుల మధ్య ఆప్యాయతలను చూడొచ్చు. వ్యవస్థలో ఉన్న లోపాలను చూడొచ్చు. అప్పటి మనుషుల అమాయకత్వం, ఆ అమాయకత్వం వెనక ఉన్న  జీవన లక్షణాలు, నిజాయితీ, మనుషుల పట్ల నికార్సైన ప్రేమలు, ఇంట్లోని వారి పట్లా, కాలనీలోని వారి పట్లా సాటి మనుషులకు ఉండే బాధ్యతలు.. ప్రతి కథలోనూ  గమనించవచ్చు.

 పలమనేరు బాలాజీ  గుండె చప్పుళ్ళే ఈ కథలు. బ్రతికిన ప్రాంతపు గుండెచప్పుడు, ఆయన అనునిత్యం తలుచుకునే జ్ఞాపకాల గుండెచప్పుడు ఈ కథా సంపుటిలోని  ప్రతి కథలో మనకు వినిపిస్తుంది.ఎందుకంటే  ఆయన చాలా దూరం ప్రయాణం చేశారు. అడవికి వెళ్లి కట్టెలమోపును సైకిల్ వెనక కట్టుకొని వచ్చే స్థాయి నుండి ఒక మండల అభివృద్ధి అధికారిగా, కవిగా ,రచయితగా ,విమర్శకుడిగా ఆ ప్రాంతంలో అప్పుడున్న పరిస్థితులలో పుట్టిన ఒక పిల్లవాడు ఇంత దూరం ప్రయాణించడమే ఒక మంచి  జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాలే‌ అలాంటి వాస్తవ జీవితాలే ఈ కథలు.

 ఇందులో చాలా గొప్పగా వర్ణించడానికి గ్రాఫిక్స్ చిత్రంలాగా ఏమి కనపడదు.అక్షరాలను రంగులరాట్నంలో తిప్పి పదప్రయోగాలు చేసి తాను గొప్ప కవిని , రచయితని అని  నిరూపించుకోవాలనే తాపత్రయం కనపడదు. ఒక మనిషిగా,  మానవత్వం ఉన్న తల్లిదండ్రులను ప్రేమించే కొడుకుగా, తను పుట్టిన ప్రాంతాన్ని మనుషులంత ఇష్టంగా ప్రేమించగలిగిన వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి తన జ్ఞాపకాలను ఒక పండగ పూట సాయంత్రం ఆరుబయట చాప వేసుకుని తన మనవలకు, మనవరాళ్లకు చెప్పినట్లుగా ఉంటుంది ఇందులోని  ప్రతి కథా. కళ్ళ ముందర ఆనాటి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి, వాళ్ల మాటలు వినపడుతూ ఉంటాయి.ఎరుకల  జీవితం కళ్ళ ముందర కదలాడుతుంది. మనం ఈ కథలను  చదువుతున్నంత సేపూ మనం ఏకలవ్య కాలనీలోనే తిరుగాడుతూ ఉంటాం.

 ఒక ఇంటిని నిర్మించుకోవడం ఒక పొలాన్ని కాపాడుకోవడం ఒక పంటను పండించుకోవడం పిల్లల్ని చదివించుకోవడం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవడం, అధికారులతో ఉన్నత కులాల వారితో ఏనుగులతో, పరిస్థితులతో, అధికారులతో, రాజకీయ నాయకులతో, అప్పుల వాళ్లతో ఎదురయ్యే నిత్య సంఘర్షణలు.. వాళ్ల నవ్వులు, దుఖాలు, గాయాలు,ఆటలు,పాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎలాంటి కల్పనా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా జీవితాన్ని దృశ్యమానం చేసినప్పుడు ఆ కథలు అపూర్వంగా అనిపిస్తాయి. జీవితం తప్ప ఈ కథల్లో ఇంకేమీ లేదు. ఈ కథలు  స్వచ్ఛంగా స్వచ్ఛందంగా సహజంగా వచ్చినవి.చాలా చాలా సింపుల్ కథలివి. గదిలోపలి గోడ, చిగురించే మనుషులు, ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు… కథా సంపుటాల ద్వారా మనకు ఇప్పటికే పరిచితమైన బాలాజీ వేరు,ఈ ఎరుకల కథల్లో కనిపించే బాలాజీ వేరు.

*

ఎరుకల వాళ్ళు బాగుపడాలి బాగుపడి తీరాలి అన్న ఆలోచన ఆశయం ఆచరణ  ప్రతి కథలోనూ కనిపిస్తుంది. ఒక విధ్వంసం, ఆ విధ్వంసం వెనక ఉన్న కారణాలు, విధ్వంసం జరుగుతున్న తీరు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణం కావాల్సిన వ్యవస్థ, ఒక పరిణామ క్రమం  మొత్తం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

 చాలామంది రచయితలు బయట దూరం నుండి చూసిన పరిస్థితులను అటు సినిమాల్లోనూ ఇటు   రచనల్లోనూ కొన్ని లోటుపాట్లను అప్పుడున్న పరిస్థితులకి కొంత  నాటకీయత ను  కలిపి చూపించడం వల్ల సమాజంలో కొంత నిజం తెలుసుకునే అవకాశం తగ్గిందని చెప్పవచ్చు. అయితే  ఇందులో రచయిత స్వయంగా    ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల,   ఆ ప్రాంతంలో జీవించే, బ్రతికే మనుషుల జీవన శైలిలోంచి  మంచి చెడులను రెండింటినీ స్పృశించడం వల్ల ఈ కథలలో పారదర్శకత ఉందనిపిస్తుంది.

 కంచ ఐలయ్య గారు వ్రాసిన  నేను హిందువునెట్లయిత  పుస్తకం అంకితంలో ఒక మాట చెబుతారు. “అనామకులుగా పుట్టి అనామకులుగా పెరిగి అనామకులుగా చనిపోయిన నా తల్లిదండ్రులకు ఈ పుస్తకం అంకితం” అని.

 అదేవిధంగా రచయిత పలమనేరు బాలాజి”ఏకలవ్య కాలనీ”  పుస్తకాన్ని ఇలా అంకితం ఇచ్చారు.

“ప్రేమించడం నేర్పించిన నాన్నకు,  భరించడం నేర్పించిన అమ్మకు నిండా కనికరం కలిగిన వాళ్ళిద్దరి హృదయాలకు ప్రేమతో ..”.

 ఆ ఒక్క మాట ఈ పుస్తకానికి వేరే పరిచయం  అవసరం లేదేమో అనిపిస్తుంది.

 ప్రేమించడం మాత్రమే తెలిసిన హృదయాల మధ్య, వ్యవస్థ చేసిన లోపాల వల్ల  మనసున్న మనుషులకు ఎదురయ్యే సమస్యలు కష్టాలు పరిస్థితులు వ్యధలను, మనుషుల జీవితాలను ఏకలవ్య కాలనీ పేరుతో “ఎరుకుల జీవన గాథలుగా” మలచిన తీరు ప్రశంసనీయం.

    సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం ఒక మార్గదర్శకం అవుతుంది. విస్మరించిన మనుషుల చరిత్ర ఇది. వెదురుతట్టలు, బుట్టలు అల్లి అమ్ముకునేవాళ్లు, ఎర్రమన్ను ముగ్గు పిండి అమ్ముకునే వాళ్ళు, పందులు మేపే వాళ్ళు, కొత్త ఉపాధుల కోసం వలసలు వెళుతున్న వాళ్ళు, దేశాంతరం తిరిగి తిరిగీ మళ్లీ స్వస్థలాలకు చేరుకున్న వాళ్ళు, ఇంకా అడవులపై ఆధారపడిన వాళ్లు, వ్యవసాయం చేసిన రైతు అనిపించుకోవాలని తాపత్రయపడే వాళ్ళు, రిజర్వేషన్ కారణంగా పదవులు వచ్చినా అధికారం అంటే ఏమిటో తెలియని వాళ్ళు.. పోటీ పరీక్షల కోసం పోటీ ప్రపంచంలో నిలబడాలని ప్రయత్నం చేస్తున్న యువజనులు.. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని నిత్యం పోరాటాలు చేస్తున్న మహిళలు.. ఈ కథల నిండా కనిపిస్తారు.

*

 రాయలసీమ ప్రాంతంలో అప్పటి పరిస్థితులను గాని ఆ తరువాత కాలంలో  ఎరుకల జీవన విధానాల్లో వచ్చినటువంటి మార్పు కానీ సుస్పష్టంగా చాలా సున్నితంగా, నిరాలంకరంగా రచయిత వివరించిన తీరు  అద్భుతం అనిపించింది.

 కాలం మారింది, పరిస్థితులు మారాయి, అవకాశాలు పెరిగాయి.ఈ దేశపు మూలవాసులుగా ఉండి ఈ దేశం కోసం ఎన్నో ఆవిష్కరణలను చేసి ఈ దేశపు అభివృద్ధిలో వారి చమటను, రక్తాన్ని,  త్యాగం చేసిన ఎరుకల జీవన విధానాలను  అధ్యయనం చేయడం ఒక సామాజిక అవసరం.  సమాజం లోని అట్టడుగు వర్గాలకు చెందిన అభివృద్ధికి దూరంగా నిలిచిన ప్రతి ఒక్కరి పట్లా అందరికీ ఉండవలసిన కనీస మానవత్వాన్ని” ఏకలవ్య కాలనీ” మరొకసారి గుర్తు చేసింది. కేవలం సమాజం పట్ల బాధ్యతనే కాకుండా తల్లిదండ్రుల ఆప్యాయతను అన్యోన్యతను ప్రేమలను చూపిస్తూ ఈ కథలు చదివే పాఠకులందరికీ వారి బాల్యాన్ని, వారి తల్లిదండ్రులను గుర్తుచేస్తుంది ఈ పుస్తకం. 

ఏడవకుండా ఈ కథలు చదవడం సాధ్యం కాదు. జయమ్మ  ,కాంతమ్మ, , పదకొండు నెలల జీతగాడు లాంటి వాళ్ళు ఈ సమాజంలో మరింత మంది ఉంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలకే మనస్పర్థలు రావడం విడిపోవడం లాంటివి జరగవు అనిపిస్తుంది. ఎన్నో కుటుంబాలు ఎంతో బాగుపడతాయి కదా అనిపిస్తుంది. మనుషుల  మరమ్మతుకు సంబంధించిన ప్రయోగాలు, ఫలితాలు ఎన్నో  ఈ కథల్లో కనిపిస్తాయి.

 ఇది పలమనేరు బాలాజి  చేసిన  బహుదూరపు ప్రయాణం. ఈ కథల ద్వారా  పాఠకులు ఏకలవ్య కాలనీలోకి ప్రవేశిస్తారు. అక్కడ మనుషులు కనిపిస్తారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు తాపత్రయపడే వాళ్లు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధ్యత వహించే వాళ్లు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసే వాళ్లు కనిపిస్తారు. 

 ఈ తరానికి ఈ సమాజానికి ఇలాంటి కథలు చాలా చాలా కావాలి. ఇంకా ఇంకా ఎన్నో కథలు ఇలాంటివి రావాలి.  మానవత్వం మనిషితనం  జీవితపు అసలైన అర్థాలని  ఈ కథలు చెపుతాయి.

 ఈ కథలు మనసుకు జ్వరం వచ్చినప్పుడు ఒంటరిగా మనకు తెలియకుండానే మనం గుర్తు తెచ్చుకొనే  జ్ఞాపకాలు. ఈ కథలు తను పుట్టిన ప్రాంతానికి  వినమ్రతతో రచయిత పెట్టుకున్న నమస్కారాలు.ఈ కథలు రచయితకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో రచయితకు ఉన్న రుణాలు.

ఈ కథలు మనిషి కథలు, 

ఈ కథలు మన కథలు.

Spread the love

3 వ్యాక్యలు

  • జీవితం పట్ల… అట్టడుగు… అణగారిన వారి బాధలు… జీవన సౌందర్యం… మనుషుల పట్ల ప్రేమ… బాధ్యతలు… సమస్యలు ఎదుర్కొనే పోరాట పటిమ… చక్కగా… హాయిగా చెమరించే కనులతో చదువుకోగలిగే… పుస్తకం… పుస్తక రచయితకు… పరిచయ కర్తకు అభినందనలు 💐💐💐

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!