ఇచ్ఛామతి

ధీర విదుషీమణి – డా.పి.చిరంజీవిని కుమారి

డా. చిరంజీవినికుమారి విద్యావేత్త, అభ్యుదయవాది, కవయిత్రి, అనువాదకురాలు, సాహిత్య-సామాజికాంశాలపై అద్భుతమైన వక్త, సాహితీ కార్యకర్త, సమాజసేవకురాలు అన్నింటికీ మించి అనన్యసామాన్యమైన వ్యక్తిత్వం, నిత్యచైతన్య శీలత కలిగిన ధీర.  

చిరంజీవినికుమారి గారి తల్లి, తండ్రి ఇరువైపులా పండిత కుటుంబాలు. వీరి మాతామహులు తిమ్మరాజు శేషగిరిరావు. ప్రముఖ ఉపాధ్యాయులు. ప్రఖ్యాత రచయిత బోయి భీమన్న వీరివద్ద విద్యాభ్యాసం చేసారు. ఒకసారి భీమన్న అద్భుతంగా చేసిన ఒక అనువాదానికి ముచ్చటపడిన  తిమ్మరాజు శేషగిరిరావు అతనిని బెంచిపైకి ఎక్కించి “అందరూ వాడిని చూడండి, అసలైన బ్రాహ్మణుడంటే వాడు” అని అన్నారని భీమన్న గారు ఒక వ్యాసంలో రాసుకొన్నారు.చిరంజీవినికుమారి నాయినమ్మ పులుగుర్త లక్ష్మీనరసమాంబ, విద్యాధికురాలు.  అనేక బెంగాలి నవలలను తెలుగు చేసారు. వాటిలో కొన్ని హైస్కూలు నాన్ డిటైల్డ్ పాఠ్యాంశాలుగా పెట్టారు. 1902-1908 మధ్యకాలంలో వీరు ‘సావిత్రి’ అనే పత్రికను నడిపారు. స్త్రీ విద్యను ప్రోత్సహించటానికి ఈమె వ్యవస్థాపక కార్యదర్శిగా 1903 జనవరి 30 న ‘శ్రీ విద్యార్ధిని సమాజము’ పేరుతో కాకినాడలో ఒక సంఘాన్ని స్థాపించారు.  ఈ సంఘాన్ని కందుకూరి వీరేశలింగం, బండారు అచ్చమాంబల చేతులమీదుగ ప్రారంభించారు.  1923 లో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సభలలో పులుగుర్త లక్ష్మినరసమాంబ చురుకైన కార్యకర్తగా పనిచేసారు. ప్రముఖ నాయకురాలు దుర్గాభాయ్ దేశ్ ముఖ్ తో వీరికి  గొప్ప స్నేహం ఉండేది.  పులుగుర్త లక్ష్మీ నరసమాంబకు ఏకైక సంతానం   పులుగుర్త బృందావనం.

పులుగుర్త బృందావనం, బాలాత్రిపుర సుందరి దంపతులకు  చిరంజీవినికుమారి 30-3-1931 న అమ్మమ్మగారి ఊరైన రామచంద్రపురంలో జన్మించారు. వీరి తండ్రిగారికి ఆరుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు సంతానం.  వీరిలో చిరంజీవినికుమారి పెద్ద.  తండ్రిగారు కాకినాడ పి.ఆర్. కళాశాలలో గణితశాస్త్రం బోధించేవారు.    చిరంజీవినికుమారి విద్యాభ్యాసం కాకినాడలో జరిగింది. స్కూలుఫైనలు దాకా పి.ఆర్. హైస్కూలులో చదివారు.  బి.ఎ. తెలుగు పి.ఆర్. కళాశాలలో పూర్తిచేసి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ పొందారు. 1959  ఆంధ్రా యూనివర్సిటీ   నుండి ఎమ్.ఎ. ఇంగ్లీషు లిటెరేచర్ తరువాత బి.ఇ.డి. చేసారు.  పాట్నా యూనివర్సిటీలో “Social and Ethical Philosophy in Valmiki Ramayana” అనే అంశంపై 1969 లో పిహెచ్.డి చేసి డాక్టరేట్ పొందారు.

చిరంజీవినికుమారి ఉద్యమాల నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినందున విద్యార్ధిదశనుంచే సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఈ దశలో కమ్యూనిష్టుపార్టీ అనుబంధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లో చురుకుగా పాల్గొనే శ్రీ పి.ఎస్. శర్మ గారితో పరిచయం ఏర్పడింది.  శర్మగారు అప్పటికి చాలాకాలం క్రితమే  నేతాజి సుభాష్ చంద్రబోస్ ను కాకినాడ రప్పించి ఉత్తేజపూర్వక ఉపన్యాసం ఇప్పించిన ఘనత సంపాదించుకొన్నారు.  వీరిరువురు అనేక విద్యార్ధి ఉద్యమాల్లో  కలిసి పనిచేసారు. ఆ సాన్నిహిత్యం కాలక్రమేణా ప్రేమగా మారింది. ఇరువురూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.  వరుడు కమ్యూనిష్టు భావాలు కలిగి ఉన్నాడని, ఇద్దరికీ 14 ఏళ్ళ వయో బేధం ఉందని, పైగా వధువు MA చదవగా, వరుడు చదువు ఇంటర్ తో ఆపేసి సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నాడనే కారణాలతో  చిరంజీవినికుమారి తల్లిదండ్రులు ఈ వివాహానికి మొదట్లో అంగీకరించలేదు. కాని వారి ప్రేమ,  అన్యోన్యతలను చూసి ఒప్పుకోకతప్పలేదు.  అలా ఇరుకుటుంబాల అంగీకారంతో చిరంజీవినికుమారి, పిఎస్ శర్మ అక్టోబరు 1953 లో  రిజిష్టరు మేరేజ్ చేసుకొన్నారు.  చిరంజీవినికుమారి వివాహానంతరం కూడా తన ఉన్నతవిద్యను కొనసాగించారు.

డా.చిరంజీవినికుమారి తన ఉద్యోగజీవితంలో అనేక మైలురాళ్లు ఏర్పరచుకొన్నారు.  1959 లో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఎం.ఏ పట్టా అందుకొన్న వెంటనే, కాకినాడలోని ప్రతిష్టాత్మకమైన  రంగరాయ మెడికల్ కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్లో MBBS మొదటి సంవత్సరంలో ఇంగ్లీషు భాష బోధనలోభాగంగా ఉండేది.  ఆ తర్వాత, మూడు సంవత్సరాలపాటు సత్యదేవ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా సేవలందించారు.   1969 లో డాక్టరేట్ పూర్తయిన తరువాత మళ్ళీ రంగరాయ మెడికల్ కాలేజీలో చేరి 8 సంవత్సరాలపాటు  లేడిస్ హాస్టల్ వార్డెన్ గా పనిచేసారు.

1977లో రంగరాయ కాలేజ్ నుంచి డిప్యుటేషన్ మీద ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. అప్పటినుంచి ఐడియల్ విద్యాసంస్థలే వీరి కార్యక్షేత్రంగా మారాయి.  వీరి అవిశ్రాంత కృషి, నాయకత్వం వల్ల   ఐడియల్ విద్యాసంస్థలు  విస్తరించి నేడు జిల్లాలోనే అత్యుత్తమ  సంస్థలుగా నిలిచాయి.

ఐడియల్ విద్యాసంస్థలు  డా.చిరంజీవినికుమారి అచంచలమైన అంకితభావం, దూరదృష్టి, నిబద్దతకు ప్రతీకగా నిలుస్తాయి. వీరు ఈ విద్యాసంస్థల అభివృద్ధికి, విద్యార్ధుల శ్రేయస్సుకి తన సమస్త శక్తిని, జీవితాన్ని వెచ్చించారు.   ప్రముఖ వైద్యులు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవవైద్యులుగా సేవలందిస్తున్న డా. పివిఎన్ రాజు వ్యవస్థాపక అధ్యక్షుడుగా డా.చిరంజీవినికుమారి సెక్రటరీగా 1970లో ఐడియల్ జూనియర్ కాలేజిని స్థాపించారు.  ఈ సంస్థ 1974 లో డిగ్రీ కళాశాలగా, 1992 నుంచి పీజి కళాశాలగా, 2009 నుంచి ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాలగా అంచెలంచెలుగా విస్తరించుకొంటూ వచ్చారు. ఒక చిన్నకళాశాలగా ప్రారంభించి బహుళ విద్యాసంస్థల సముదాయంగా తీర్చిదిద్దటంలో డా. చిరంజీవినికుమారి కృషి, నాయకత్వం కీలకమైనవి.  డా. చిరంజీవినికుమారి ఈ విద్యాసంస్థలకు సెక్రటరీ మరియు కరస్పాండెంట్ గా జీవితాంతం సేవలందించడమే కాక ఐడియల్ కళాశాలకు 16 సంవత్సరాలపాటు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసారు.   

“మానవ వనరులు పుట్టవు, సంస్కృతి, సంప్రదాయం, విద్య ద్వారా తయారవుతాయి”– అనే సత్యాన్ని నమ్మిన వీరు, ఈ విద్యాసంస్థలను ఉత్తమ మానవ విలువలతో కూడిన విద్యార్థులను సమాజానికి అందించే కేంద్రంగా నడిపారు. ఈ సంస్థలు అలా విలువలు నైపుణ్యాలు కలిగిన లక్షలాది విద్యార్ధులను సమాజానికి అందించాయి. ఐడియల్ కళాశాల జిల్లాలో NAAC, Autonomous  గుర్తింపు పొందిన మొట్టమొదటి ఎయిడెడ్ విద్యాసంస్థగా నిలిచింది.

డా. చిరంజీవినికుమారి ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంస్థలలో కీలక పదవులను నిర్వహించారు.  వాటిద్వారా ఎన్నో  గొప్ప కార్యక్రమాలు చేసారు.   ఐడియల్ కాలేజిని వేదికగా ఇచ్చారు.

1. అభ్యుదయ రచయితల సంఘం: అరసం ప్రారంభం నుంచి దానిలో ప్రముఖ పాత్ర పోషించారు.  గుజ్జుల యల్లమందారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ వంటి సాహిత్యవేత్తలు వీరిని అరసంవైపు నడిపించారు.  తుమ్మల వెంకటరామయ్య, పరకాల పట్టాభిరామారావు వంటి పెద్దలు, డా.చిరంజీవినికుమారిని పిలిచి కాకినాడలో అరసం మహాసభ పెట్టాలని కోరారు.  అలా 1972లో కాకినాడలో అరసం రాష్ట్ర మహాసభను వీరు నిర్వహించారు. ఈ సభకు చాగంటి సోమయాజులు ఆవంత్స సోమసుందర్, మహీధర రామమోహన్ లాంటి ప్రబృతులు  హాజరయ్యారు.  రాష్ట్ర అభ్యుదయరచయితల సంఘానికి వీరు చాలాకాలం గౌరవాధ్యక్షురాలిగా పనిచేసారు.

2. ఇండో సోవియట్ కల్చరల్ సొసైటి(ఇస్కస్): ఇది ఇండియా సోవియట్ యూనియన్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించే సంస్థ. ఇరుదేశాల ప్రజలమధ్య సాంస్కృతిక అవగాహన, స్నేహాన్ని పెంపొందించడం ఈ సంస్థ లక్ష్యం.  ఈ సంస్థ తరపున  డా. చిరంజీవినికుమారి 1970 లో సోవియట్ యూనియన్ పర్యటించారు.  ఆ దేశం సాధించిన ప్రగతిని, అక్కడ సామాన్య మానవుని జీవన విధానాన్ని అధ్యయనం చేసి తమ అనుభవాలను ప్రజలకు వివరించి, భారత్ -సోవియట్ మైత్రి మరింత బలపడేందుకు తోడ్పడటం ఈ బృంద పర్యటన ముఖ్యోద్దేశం. 

డాక్టర్లు, న్యాయవాదులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, యువకులతో మొత్తం భారతదేశంలోని ఐదు రాష్ట్రాలనుండి 72 మంది సభ్యులు గల ఈ బృందానికి ఇస్కస్ రాష్ట్రకార్యదర్శి హోదాలో  డా.చిరంజీవినికుమారి నాయకత్వం వహించారు.  ఈ బృందం ఇరవై రోజులపాటు సోవియట్ లో మాస్కో, లెనిన్ గ్రాడ్, ఆర్మేనియా ప్రాంతాలను సందర్శించి, అక్కడి రచయితలు, మేధావులు, సామాన్యప్రజలతో సంభాషించారు. అక్కడి ప్రజల జీవన విధానాలను పరిశీలించారు. ఆ స్పూర్తితో  తిరిగి ఇండియాకు వచ్చాక డా.చిరంజీవినికుమారి కొన్ని రష్యన్ రచనలను తెలుగులోకి అనువదించారు.

ఇస్కస్ సంస్థలో ఉండగా  1970లో Lenin and Universal Brotherhood అనే ఇంగ్లీషు వ్యాసం రాసారు.  దీనిలో The Basis of this analysis is the proposition that the Economic Structure of the man Determins the social relationships of the members of that society అనే వాక్యం ఆనాటి విశ్లేషకులను ఆకర్షించింది.

డా.చిరంజీవినికుమారి ఇస్కస్ కు 1977లో ఉపాధ్యక్షురాలిగా పనిచేసారు

3. తూర్పుగోదావరి జిల్లా హిస్టరీ కాంగ్రెస్: ఈ సంస్థకు  డా. చిరంజీవినికుమారి, చాన్నాళ్ళు సెక్రటరిగా పనిచేసారు.  ఈ సంస్థ తరపున “తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి” అనే 650 పేజీల గొప్ప బృహత్ గ్రంథాన్ని తన సంపాదకత్వంలో తీసుకొచ్చారు. దీనిలో వివిధ అంశాలపై నిష్ణాతులైన వారిచే రాయించిన 66 వ్యాసాలు కలవు.  ఈ వ్యాసాలు జిల్లాకు సంబంధించిన ప్రాచీనచరిత్ర, మతపరమైన పరిణామాలు, వలసపాలనలు, సంస్కరణోద్యమాలు, స్వాతంత్రోద్యమాలను మదింపువేస్తాయి. ఈ ప్రాంత చరిత్రను సమగ్రంగా ఆవిష్కరిస్తాయి.

ఈ గ్రంథంలో డా. వకుళాభరం రామకృష్ణ, జాస్తి దుర్గాప్రసాద్, కె.ఎస్. కామేశ్వరరావు వంటి లబ్దప్రతిష్టులైన చరిత్రకారుల పత్రాలు; ఆవంత్స సోమసుందర్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ,  అద్దేపల్లి రామమోహనరావు, కాశీభట్ల సత్యన్నారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తల వ్యాసాలు ఉన్నాయి.

ఈ పుస్తకం జిల్లా చరిత్రను అధ్యయనం చేయాలనుకొనేవారికి ఒక కరదీపిక. 

4. తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం: ఈ సంస్థకు వీరు కార్యదర్శి.  స్వీయ సంపాదకత్వంలో 2018 లో “తూర్పుగోదావరి జిల్లా సాహిత్య చరిత్ర (1880-2015 వరకు) పేరుతో ఒక అధ్యయనాత్మక గ్రంథాన్ని ఈ సంస్థతరపున వెలువరించారు. ఈ గ్రంథం జిల్లాకు చెందిన శాసనసాహిత్యం, ప్రాచీన సాహిత్యం, సంస్కరణలు, ఆధునిక సాహిత్యం, ప్రక్రియలు, సాహితీవేత్తలు, పత్రికలు, సాహితీ సంస్థలు, సాహిత్యవిమర్శలాంటి వివిధ అంశాలను  సమగ్రంగా విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణ ఒక ప్రాంత సాహిత్యఅస్తిత్వపు  సమగ్ర అధ్యయనం. ఆ కోణంలోంచి ఈ పుస్తకం ఇతరజిల్లాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది.

మాజీప్రధాని పివి నరసింహారావు శతజయంతి సందర్భంగా ఆయన రచించిన ‘గొల్లరామవ్వ’ కథపై ప్రాంతాలకు అతీతంగా ప్రముఖ సాహితీవేత్తల అభిప్రాయాలతో ‘అభిప్రాయమాలిక” ను తీసుకొచ్చారు.

ఇదే సంస్థ తరపున జిల్లాకుచెందిన కథా రచయితల కథలతో తీసుకొచ్చిన “కథలు-అలలు” సంకలనానికి సంపాదకత్వం వహించారు.

తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం తరపున 2024 లో యువకథకులకు దిశానిర్ధేశం చేయటానికి ‘కథ ఎందుకు ఏమిటి ఎలా’ పేరుతో 2024 లో ఒక జాతీయ సదస్సు నిర్వహించారు

వీరి సహచరుడైన శ్రీ పి.ఎస్. శర్మ రచించిన సాతంత్ర్యసంగ్రామంలో తూర్పుగోదావరి అనే పుస్తకాన్ని పునర్ముద్రించారు.

జిల్లా సాంస్కృతిక సాహిత్య వారసత్వాన్ని రికార్డు చేయటంలో డా. చిరంజీవినీ కుమారి  కృషి విశేషమైనది.

4. జనవిజ్ఞాన వేదిక: వీరు  జనవిజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా సేవలందించారు. 1953 ప్రాంతంలో కమ్యూనిష్టు నాయకుడు ఎస్.ఎ డాంగే రచించిన “From Primitive Communism to Slavery”  అనే గ్రంథం చదివి వామపక్ష భావవాదం, మార్క్సిష్టు సిద్ధాంతాలను లోతుగా  అర్ధం చేసుకొన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు . జీవితాంతం వామపక్షభావజాలంతో మెలిగి అనేకమందికి ఆదర్శంగా నిలిచారు.  జెవివి నిర్వహించిన అక్షర గోదావరి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు.

5. ఇవే కాక – శ్రీవేణుగోపాల సంస్కృత ప్రచారసభ, ఈశ్వర పుస్తక భాండాగారం, కాకినాడకు సెక్రటరీగా; జిల్లా గ్రంధాలయ సంఘానికి సెక్రటరీగా; జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కు పాతికేళ్ళు వివిధ హోదాలలో; గిరిజన ప్రాంతాలలో వారి అభివృద్ధికై పనిచేసే ‘స్పందన’ అనే సంస్థకు ప్రెసిడెంట్ గా; ఎపి స్టేట్ ప్రైవేట్ విద్యాసంస్థల మేనేజ్ మెంట్ అసోసియేషన్ కు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వివిధ పదవులలో ఆ సంస్థల వికాశానికి, ఉన్నతికి తనవంతు సహకారం అందించారు.  

6. ఆదికవి నన్నయ యూనివర్సిటీని జిల్లాకు సాధించటానికి ఏర్పడ్డ గోదావరి యూనివర్సిటీ సాధన సమితికి డా. చిరంజీవినికుమారి వైస్ ప్రెసిడెంటుగా పనిచేసారు.  ఆంధ్రాయూనివర్సిటి పిజి సెంటరు, అన్నవరం సత్యదేవి మహిళా కళాశాల లాంటి విద్యాసంస్థలు కాకినాడకు రావటంలో కృషిచేసి వాటికి వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు.  తూర్పుగోదావరి జిల్లాను విద్యా, సాహిత్య, సాంస్కృతిక హబ్‌గా మార్చడంలో డా. చిరంజీవినికుమారి కీలకపాత్ర పోషించారు.

1. శ్రీశ్రీ సప్తతి సభ: డా. చిరంజీవినికుమారి ఆధ్వర్యంతో1980 మార్చి 2వ తేదీన కాకినాడలో శ్రీశ్రీ సప్తతిపూర్తి (70వ జన్మదిన) సభలు  అత్యంత వైభవంగా జరిగాయి.  ఈ సందర్భంగా శ్రీశ్రీకి అయిదువేల రూపాయిలు బహుమతిగా అందచేసారు.  ఆయన రచనలను పునర్ముద్రించి అమ్మారు. అభినందన సంచిక వెలువరించారు. ఈ సభకు శ్రీ హరీంద్రనాథ్  ఛటోపాధ్యాయ ముఖ్య అతిధిగా, సభాధ్యక్షునిగా వ్యవహరించారు. వీటన్నిటి వెనుక చిరంజీవినికుమారి  మెటిక్యులస్ ప్లానింగ్  ఎగ్జిక్యూషన్ ఉన్నాయి. 

ఈ సభ జరగటానికి మూడునెలల ముందు డా. చిరంజీవినికుమారి, శ్రీ మిరియాల రామకృష్ణ 1979 డిశంబరు మొదటివారంలో మద్రాసులోని శ్రీశ్రీని కలిసి సప్తతి కార్యక్రమం గురించి చర్చించి ఆహ్వానించారు

ఈ ఫంక్షన్ గురించి శ్రీశ్రీ సతీమణి శ్రీమతి సరోజ తనపుస్తకం ‘సంసారంలో శ్రీశ్రీ’ లో ఇలా రాసారు—”మార్చి రెండవ తేదీ ఫంక్షన్ కి కాకినాడ వెళ్ళాం. అందరూ  మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు చిరంజీవినీ కుమారిగారు అన్ని పనులు తనే  చేస్తూ, చచ్చేటంత  బిజీగా  వుండి కూడా అడుగడుక్కి  వచ్చి నన్ను పలకరించి వెళుతూవుండేవారు”.

సరోజ శ్రీశ్రీ రాసిన  పై వాక్యాలు డా.చిరంజీవినికుమారి కార్యదీక్షకు, ఆదరణకు అద్దంపడతాయి.

శ్రీశ్రీ సప్తతి సభలు తెలుగుసాహిత్యరంగంలో  గొప్పగా నిలిచిపోయిన సంఘటన.  శ్రీశ్రీ షష్తిపూర్తి సభ భిన్నాభిప్రాయాలు, నిరసనలవల్ల రసాభాస అయింది.  కాని సప్తతి సభలు మాత్రం ఏ రకమైన నిరసనలు లేక అంగరంగవైభవంగా జరిగాయి.  

2. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యపు వెలుగులు: తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం తరపున, 1989 డిసెంబరు 29, 30, 31 తేదీలలో ఐడియల్ కళాశాలలో,  “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యపు వెలుగులు” అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు తెలుగు సాహిత్య చరిత్రను సమగ్రంగా చర్చించే వేదికగా నిలిచింది. ఈ సదస్సుకి దేశం నలుమూలలనుంచి లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు హాజరయ్యారు.

3. గరికిపాటి నరసింహారావు మొదటి సహస్రావధానం కార్యక్రమం డా. చిరంజీవినికుమారి ఆధ్వర్యంలో జరిగింది.. ఈ కార్యక్రమం తెలుగు సాహిత్యంలో అవధాన కళను ప్రోత్సహించడంలో, గరికిపాటి నరసింహారావు  సాహిత్య ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో ఒక ముఖ్యమైన సంఘటన.

డా. చిరంజీవినికుమారి కవిగా, అనువాదకురాలిగా, వ్యాసకర్తగా, వక్తగా  సాహిత్య రంగంలో విశిష్టమైన కృషి సలిపారు.

డా. చిరంజీవినికుమారి మూడు స్వీయ కవితా సంపుటులను వెలువరించారు. ఈ సంపుటులు ఆమె సాహిత్య సృజనాత్మకత, సామాజిక చైతన్యం, మరియు స్త్రీవాద దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి

సోవియట్ రష్యాను సందర్శించినపుడు ఆర్మేనియాలో హోవనేస్తు మన్య అనే రచయితతో పరిచయం కలిగింది. ఆయన  కథలపుస్తకం తెచ్చుకొని వాటిని “ఆర్మేనియా కథలు గాథలు” పేరిట తెలుగులోకి అనువదించారు.  ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర వారు ప్రచురించారు.

సోవియట్ యూనియన్‌కు చెందిన 32 మంది మహిళా రచయిత్రుల కవితల సంపుటి Tender Muse ని వీరు “లేత మందారాలు-రక్త సింధూరాలు” పేరిట తెలుగులోకి అనువదించి ప్రచురించారు

80 పైన వివిధ సాహిత్య సాంస్కృతిక, స్త్రీవాద సంబంధ వ్యాసాలు రాసారు. వక్తగా వివిధ వేదికలపై కొన్ని వందల ప్రసంగాలు చేసారు. అనేక  రేడియో ప్రసంగాలు చేసారు.  మహిళాసమస్యలపై టివి చర్చాగోష్ఠులలో  పాల్గొన్నారు.

1. డా. చిరంజీవినికుమారి  విద్య, సాహిత్యం, సామాజిక సేవ, సాంస్కృతిక రంగాలలో చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలను అందుకున్నారు.

2.సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు: భారత్-సోవియట్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసినందుకు, ముఖ్యంగా వీరు చేసిన రష్యన్ అనువాద రచనలు, ఇస్కస్ సంస్థలో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

3.విద్యారంగంలో విశేషమైన సేవలు అందించినందుకు SHE, ఫౌండేషన్, హైదరాబాద్ వారిచే ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్‌మెంట్ అవార్డు (2012)  హైదరాబాద్ రవీంద్ర బారతిలో, రాష్ట్ర గవర్నరు సతీమణి శ్రీమతి విమలా నరసింహన్  చేతులమీదుగా అందుకొన్నారు.

4.ఇంటిగ్రల్ హ్యూమనిస్ట్ అవార్డు (2014), పుల్లెల తాతయ్య మెమోరియల్ అసోసియేషన్

5.తుమ్మల వెంకట్రామయ్య సాహితీ సత్కారం, హైదరాబాద్

                డా. చిరంజీవినికుమారి భర్త పిఎస్ శర్మ 25, డిశంబరు 2000 న మరణించారు.  వీరికి ఇద్దరు కుమారులు. డా. పిబిఎస్ గోపాల్ హైదరాబాదులో వైద్యుడిగా పనిచేస్తున్నారు.  పిఎస్. కిరణ్  ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారాలు చూస్తున్నారు. 

    డా. చిరంజీవినికుమారి విద్య, సాహిత్యం, సామాజిక సేవ, సాంస్కృతిక పరిరక్షణలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తి. విద్యావేత్తగా, కవిగా, అనువాదకురాలిగా, సాహితీ కార్యకర్తగా, సమాజ సేవకురాలిగా  చేసిన సేవలు తూర్పుగోదావరి జిల్లా సాహిత్య, విద్యా రంగాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.  వివిధ సంస్థల నిర్వహణలో, డా.చిరంజీవినికుమారి అసాధారణమైన నాయకత్వ పటిమను ప్రదర్శించారు. విద్య, సాహిత్యం, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆమె నిర్వహించిన కార్యక్రమాలు ఆమె సమర్థ నాయకత్వానికి,  ప్రణాళికా నైపుణ్యానికి, అంకితభావానికి నిదర్శనం. వామపక్ష భావజాలాన్ని జీవితాంతం ఆచరించారు.  సమాజ అభ్యున్నతికి, ముఖ్యంగా మహిల అభ్యున్నతికి కృషి చేసారు.

    ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు:

    “మనమూలాల్ని మరచిపోకూడదు. వారసత్వంగా ఆస్తులు పంచినట్టే మన పిల్లలకు మన మూలాలను కూడా పంచి ఇవ్వాలి.  వాటిని వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొనేట్టు చేయాలి…. అప్పుడే జీవితానికి ఒక విలువ ఏర్పడుతుంది”

    ఈ వాక్యాలు సాహిత్య, సాంస్కృతిక, విద్యారంగాలలో వీరి జీవితకాలకృషిని ప్రతిబింబిస్తాయి.  డా. చిరంజీవినికుమారి గారి జీవితం పరిపూర్ణమైనది.  అందరిలో ఆదర్శప్రాయమైన స్ఫూర్తిని కలిగిస్తుంది.

    బొల్లోజు బాబా

    కాకినాడ


    Spread the love

    Bollōju Bābā

    తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నివసించే కవి, రచయిత, అనువాదకుడు. వృత్తిరీత్యా డిగ్రీకళాశాల అధ్యాపకుడు.  ఆయన , కవిత్వం, అనువాద సాహిత్యం, విమర్శ, చారిత్రిక రచనలో విశేష కృషి చేశారు.  ఆకుపచ్చని తడిగీతం, వెలుతురు తెర, మూడో కన్నీటి చుక్క వంటి కవితా సంపుటాలు యానాం విమోచనోద్యమం, ఫ్రెంచి పాలనలో యానాం, మెకంజీ కైఫియ్యతులు, ప్రాచీన పట్టణాలు వంటి చారిత్రక రచనలు, కవిత్వ భాష అనే సాహిత్య వ్యాస సంపుటి,  థేరీ గాథలు, స్వేచ్ఛా విహంగాలు, ప్రాచీనగాథలు వంటి అనువాదాలు ఆయనకు పేరుతెచ్చిన రచనలు. విభిన్న సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేశారు.
    శిలపరశెట్టి సాహితీ ప్రశంసా పురస్కారం, ఇస్మాయిల్ సాహితీ పురస్కారం, రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు, పెన్నా సాహిత్య పురస్కారం వంటి సాహితీ గౌరవాలు పొందారు.సృజనాత్మక కవిగా, చారిత్రిక పరిశోధకునిగా,  అనువాదకునిగా సాహిత్యరంగంలో తన ప్రత్యేక ముద్ర వేశారు.

    వ్యాక్యాన్ని జతచేయండి

    Follow us

    Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

    Most popular

    Most discussed

    error: Content is protected !!