ఇచ్ఛామతి

స్నేహ  సౌరభాల రుచి అభిరుచి ‘మన శాకాహార షడ్రుచులు’…  

ఫేస్  బుక్ లో  యెన్నెన్నో  గ్రూప్స్ లో నలుదిక్కుల నుంచి  యెన్నో  విషయాల్ని  అంతా పంచుకుంటున్నారు. వయస్సుతో  నిమిత్తం లేకుండా  రోజువారి  జీవితంలో విషయాల్ని అక్షరీకరిస్తున్నారు.  అటువంటి  వో  గ్రూప్  ‘మన శాకాహార షడ్రుచులు’.  దాదాపు లక్ష మంది సభ్యులకి   చేరువగా వున్న  యీ  గ్రూప్  అడ్మిన్  ఇందిరా  ప్రియదర్శిని  గారితో ‘ఇచ్చామతి’  యింటర్వ్యూ.    

ముఖ పుస్తక మాధ్యమంలో చాలానే ఆహారానికి సంబంధించిన సమూహాలు ఉన్నాయి. చాలా వాటిని గమనించాము. కొన్నింటిలో ఎక్కడో ఎవరో చేసిన వంటలని యధాతథంగా కాపీకొట్టి పెట్టేయడాలు, గూగుల్ లో వున్న ఫోటోలు పోస్ట్  చెయ్యటం …  ఇలా కొన్ని గమనించాము. అప్పుడు వచ్చింది ఈ ఆలోచన. మనమే ఒక చక్కని ఆరోగ్యకరమైన, స్నేహపూరితమైన ఒక శాకాహార షడ్రుచుల సమూహం ఎందుకు పెట్టకూడదనుకున్న వెంటనే అమలు పరిచేసాము. అలా 22 సెప్టెంబర్ 2021 న మొదలైయింది.  ఈ గ్రూపులో తాము కోరుకున్నవన్నీ ఒకచోటే లభిస్తున్నాయి అనుకున్న ఆత్మీయ మిత్రులు పదులు, వందలు, వేలు, ఇప్పుడు లక్షకు చేరువలో  ఈ సమూహము లో చేరడం జరిగింది..  జరుగుతోంది కూడా. 

ఈ గ్రూపు  ఓపెన్ చేస్తే చాలు  నోరూరించే, కనువిందు చేసే వంటలు ఒకటిని మంచి మరొకటి దర్శనమిస్తూ వుంటాయి. కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తాయి. పాత రుచులను గుర్తుకు తెస్తాయి. చాలా మంది వారివారి అమ్మమ్మ, నానమ్మలని ఈ గ్రూపు ద్వారా తలచుకుంటూ వుంటారు. వంటలలో, ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇక్కడ ఇలా అడగ్గానే చిటికెలో ఓ ఇరవై మంది సమాధానాలు, సలహాలతో అలా క్లియర్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత కామెంట్ల సునామి మొదలు. కూరలు, పప్పులు, పులుసు, పచ్చళ్ళు, ఆవకాయలు, రకరకాల తినుబండారాలు, ఆరోగ్యానికి దోహదం చేసే పౌష్టికాహారాలు, మిల్లెట్స్ తో రుచికరమైన టిఫిన్లు, ఒకటి కాదు రెండు కాదు చిన్ని కృష్ణుని నోటిలో అండ పిండ బ్రహ్మాండమే కనిపించిన రీతిలో ఈ సమూహము లో సమస్త దేశవిదేశ శాకాహార వంటలు కనిపిస్తుంటాయి అనడంలో సందేహం ఏమాత్రం లేదు. 

ఈ గ్రూపులో కనుక చేరితే దూర దేశాలలో వున్న అమ్మాయిలకి  కానీ, అబ్బాయిలకి  కానీ అమ్మ పక్కన లేకపోయినా అమ్మలాంటి వారే ఇక్కడ వున్నారు.  వంటలు గురించి ఎటువంటి సలహాలు కావాలన్నా అడిగితే చాలు చిటికెలో చెప్పేసి, మన సందేహాలన్నీ తీరుస్తారు అనే నమ్మకం ఈ గ్రూపు మీద వుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలు శాకాహారపు వంటల రెసిపీలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వుండే శాకాహారానికి సంబంధించిన వంటకాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రూపులో వున్న సభ్యుల్లో చాలా మంది ఇండియాతో పాటుగా విదేశాలలో వుంటున్నవారు కూడా వున్నారు. వారందరూ ప్రతిరోజూ కూడా ఈ గ్రూపులో తమ తమ వంటకాలతో పార్టిసిపేట్ చేస్తూంటారు. సాంప్రదాయ వంటలు తెలుసుకోవాలన్నా, ఆధునిక వంటకాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ గ్రూపు ఒక డిక్షనరీ, ఒక మార్గదర్శకంగా వుంటుంది. ముఖ్యంగా ఇక్కడ అడ్మిన్లు, సభ్యుల మధ్య సహకార ధోరణి, స్నేహవాతావరణం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో అడ్మిన్లు వేయికళ్ళతో గ్రూపును పహారా కాస్తూంటారు. ఎక్కడా కూడా అనుచిత, అసభ్య కామెంట్స్ కానీ, గ్రూపుకు రిలేటెడ్ కాని పోస్టులను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. 

ఈ గ్రూపు అడ్మిన్ లలో ఒకరినైన  నా పరిచయం, ఇందిరాప్రియదర్శిని, హైదరాబాద్. జేపీ డిజిటల్ మీడియా కంపెనీకి డైరెక్టర్,  డామ్నిక్స్ గ్రూప్ ఆఫ్ institutions కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్, ఇంగ్లీష్ లిటరేచర్ ఎన్ పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిజి డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్, పార్ట్ టైం కంటెంట్ రైటర్, ట్రాన్స్ లేషన్ పనులు, కవితలు రాయడం హాబీ.

తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించిన పోటీలో మూడవ బహుమతి పొందిన జిమ్మెదారి అనే షార్ట్ ఫిలింకి డైలాగ్స్, గిడుగు రామ్మూర్తి గారి అవార్డు, గిన్నిస్ 36గంటల కవితల ఫీట్ లో పాల్గొని గిన్నిస్ రికార్డ్ అవార్డు తో పాటు పలు సంస్థల నుండి ప్రశంసా పత్రాలు, షీల్డ్స్ , telugu book of రికార్డు award అందుకున్నాను. Mauritius government telugu department రెండు సార్లు రేడియో ఇంటర్వ్యూ చేశారు.  కొన్ని ప్రముఖ  వార్తా పత్రికల వారు  ఇంటర్వ్యూ చేశారు.  లక్ష మంది ఉన్న ఫేస్ బుక్ మనశాకాహార షడ్రుచులు గ్రూపుకి  అడ్మిన్ గా బాధ్యతలు. “ప్రియ రాగాలు” పేరుతో కవితలు, సీతారామం సిరీస్, సినిమా, బుక్ రివ్యూలు, ఉత్తరాలు పుస్తకం, 83ఏళ్ల తన నాన్న గారి ఉద్యోగ, జీవిత అనుభవాలను “చిగురించిన జ్ఞాపకాలు” పేరిట ప్రచురించాను.

మా ముగ్గురిలో మరొకరు కలవల గిరిజారాణి. ముంబైలో  వుంటారు. ఆరోగ్యకరమైన వంటలు చేయడంతో పాటుగా, సాహిత్యాన్నీ కూడా అభిలషిస్తాను. ‘భావుక’ అనే సాహితీ సమూహము కి కూడా అడ్మిన్ గా వ్యవహరిస్తున్నారు. హాస్య కథలు రాయడమంటే చాలా ఇష్టం. చాలా కథలే వ్రాసారు. ఈ హాస్య నేపథ్యంలో జగడాల జలజాక్షి, అత్తగారు అమెరికా యాత్ర పేరిట రెండు హాస్య పుస్తకాలను ప్రచురించారు. ముంబై సాహితీ వర్గాల్లో రచయిత్రిగా మంచి స్థానం, పలుకుబడి కలిగి శాకాహార షడ్రుచులు గ్రూపు కి, మాకు కూడా పెద్దక్కగా ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారు. 

శిరీష మంత్రవాది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, ఎంతో బిజీగా ఉన్నా ఇంటి వంటకు, అవసరం వున్నవారికి తన వంతు సహాయం చేస్తూ, చక్కటి వంటలతో బృందాన్ని అలరిస్తూ, ఏ మంచి పనికైనా ముందుంటూ, తన ఇద్దరు పిల్లలను  బాధ్యతాయుతంగా పెంచుతూ ఆదర్శవంతంగా  తీర్చిదిద్దుతున్న మాతృమూర్తి.

ఒక వసుధైక కుటుంబం ఏర్పర్చుకోవాలన్న నా కోరికకు బలమైన పునాది ఈ గ్రూప్ సభ్యుల సహకారం వల్ల సాధ్యమయింది.

గ్రూపులో సభ్యులు పెట్టిన పోస్టులు అన్నిటికీ కూడా అడ్మిన్ బృందం ప్రోత్సాహం ఇస్తూ, వారిని ఎంకరేజ్ చేస్తూ  స్పందించడం జరుగుతుంది.  సభ్యులు కూడా ఒకరితో మరొకరు ఒక ఆత్మీయ అనుబంధం పెంచుకుని, అక్కా, చెల్లీ, అన్నా, తమ్ముడూ, బాబాయ్, పిన్నీ ఇలా వరసలు కల్పించుకుని మాట్లాడుకోవడం, కొందరైతే పరిచయాలు పెంచుకుని పరస్పరం కలుసుకోవడం కూడా జరుగుతుంది. అడ్మిన్ లు కూడా ఏవైనా వూళ్ళు వెళ్ళినప్పుడు, అక్కడ వుండే సభ్యులని వీలైనంత వరకు కలుసుకుని, ఆత్మీయ  సమావేశం జరుపుకోవడం వలన కూడా ఒకరి మధ్య మరొకరికి స్నేహపూరిత వాతావరణం కలుగుతోంది. 

అన్నిటి కన్నా ముఖ్యంగా  ప్రతీ ఏటా గ్రూపు ఒక ఆత్మీయ సమ్మేళనం జరుపుతుంది. హైదరాబాద్ లో ఏదైనా ఆహ్లాదకరమైన హోటల్ ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేస్తాము. గత మూడు సార్లు జరిగిన సమావేశాలలో కూడా, ప్రతీ ఏటా దాదాపు  రెండు వందల మంది పైగా సభ్యులు హాజరయి, అప్పటివరకూ కేవలం ముఖపుస్తక పరిచయం వున్నవారే.. కానీ ఇప్పుడు ముఖాముఖి కలుసుకుని, ఆటలు పాటలు, పోటీలు, బహుమతులు, సమూహములో ఎక్కువగా పాలుపంచుకునే వారికి బహుమతులు సరదాగా, సంతోషంగా గడపడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు  సభ్యుల మధ్య స్నేహపూరిత వాతావరణం పెంపొందిస్తాయి కదా!  చాలా మందికి ఉదయం లేవగానే గ్రూపును ఒకసారి చూసుకుని, పలకరించనిదే మాకు  తోచదు అంటారు. ఎవరైనా రెండు మూడు రోజులు వారి పోస్టులతో కనిపించకపోతే వెంటనే వారికి ఫోను చేసి కుశల సమాచారం కనుక్కునేదాకా ఆగలేరు ఇక్కడ సభ్యులు.

అలాగే ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిని గ్రూపు నుండి బ్లాక్ చేస్తాం. మాకు quantity కన్నా quality ముఖ్యం. రెగ్యులర్ గా పోస్ట్స్ పెట్టేవారిలో సెలెబ్రిటీలు కూడా ఉంటారు. ఏ భేషజాలు లేకుండా పోస్ట్స్ పెట్టడమే కాకుండా అవసరమైన చోట సలహాలు కూడా ఇస్తూ కామెంట్స్ పెడతారు. మా గ్రూప్ లో ఉన్నంత స్నేహపూరిత వాతావరణం బహుశా బయట ఇళ్లల్లో, బంధువర్గాల్లో కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇళ్లల్లో జరిగే పెళ్ళిళ్ళు పేరంటాలకు ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ సుహృద్భావ వాతావరణం సృష్టించుకుంటూ వుంటాము.

ముందుగా చెప్పుకున్నట్టుగా ‘మన శాకాహార షడ్రుచులు’  గ్రూపు అంటే ఒక కుటుంబం, మన పుట్టిల్లు అనే భావన ప్రతి సభ్యురాలు, సభ్యుడు అనుకునే విధంగా మా అడ్మిన్లం కూడా వారితో మమేకం అవడం వల్ల అరమరికలు లేకుండా సుఖ దుఃఖాలు, కష్టనష్టాలు, సంతోషాలు, సరదాలు పంచుకోవడం తో మొదలై ఇక రోజూ ఏదో ఒక విశేషం పంచుకోకపోతే సభ్యులు వెలితిగా భావిస్తుంటారు. ఆరోగ్యం సహకరించక వంటింట్లోకి వెళ్లడం మానినా గ్రూపులోకి రావడం మటుకు మానరు . 

ఇక, మామూలుగా శనివారం, ఆదివారం రోజులలో సభ్యుల వంటలు పోస్టులతో పాటుగా, వారి వారి టాలెంట్లు, ఏదైనా మంచి విషయాలు చెప్పదలుచుకున్నది వాటినన్నింటినీ లేదా వారి వారి అనుభవాలు, అనుభూతులు ఇలా వంటలతో పాటు  పంచుకోవచ్చు అని అనుమతి ఇవ్వడం జరిగింది. ఇలా కొందరు పంచుకునే కొన్ని విషయాలు, కొందరి అనుభవాలు, మరి కొందరి యాత్రా విశేషాలు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త ప్రదేశాల విహార వివరాలు, ఆలయాలు వాటి విశిష్టతలు, ఆద్యాత్మిక పరిమళాల పోస్టులు ఇలా ఒకటా రెండా ఎన్నని చెప్పమంటారు…  వయసుతో సంబంధం లేకుండా అనుబంధం పంచుకునే వారు ఎందరో.

బాపు గారి సీత కళ్యాణం సినిమాలో శత్రుఘ్నుడిగా నటించి ప్రస్తుతం ముంబాయి లో స్థిరపడ్డ డెబ్భై ఏళ్ల రాయచోటి కృష్ణమూర్తి గారు గ్రూప్ కి బాబాయ్ గారు గా ప్రసిద్ధి. రకరకాల వంటలను, హాస్యం జోడించి ప్రేమతో పెట్టే పోస్ట్స్, ఎవరైనా తప్పు చేస్తే వేసే మొట్టికాయలు గ్రూప్ లో నిత్య కార్యక్రమం, జెవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు గారు, మొత్తం ప్రపంచ చరిత్ర, ప్రసాదాలు ఔపాసన పట్టి గ్రూపులో పంచే సైకాలజిస్ట్  పృథ్వీ, అమెరికాలో టీచర్ గా తన అనుభవాలు, పిల్లల కబుర్లు ఆసక్తిగా చెప్పే నిరుపమా, వయసులో పెద్దయినా హుషారులో టీనేజర్లు సైతం వెనక్కి వెళ్ళిపోయే బొంబాయి యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అమెరికా లో ఉండే రోహిణి గారు, 

ఆరోగ్యం సహకరించక ఆగుతారు కానీ మనవరాలి కబుర్లు చెబుతూ ప్రతి పోస్ట్ కి మొదటి లైక్. కామెంట్స్ పెట్టీ ఎంకరేజ్ చేసేవారిలో మొదటి పేరు కుళ్ళాయమ్మ గారిదే, ప్రముఖ రచయిత్రి, సెన్సార్ బోర్డు మెంబర్ బలభద్ర పాత్రుని రమణి గారు, మాధవి దేవరకొండ అనగానే పూజలు వ్రతాలు, ఒక సంధ్యా ఎల్లాప్రగడ సాక్షాత్తు అమ్మవారి అంశ, తెలంగాణ చరిత్ర రాసే నళిని గారు, ఆయుర్వేదం, ఆకులు వాటి గుణగణాలు తెలియజెప్పే కళ్యాణి శాస్త్రుల గారు, తెలంగాణ భాష సంస్కృతి కళ్ళకు కట్టినట్టు పోస్టు లు పెట్టే ప్రొఫెసర్ సంపత్ కుమార్ మట్టా గారు, రిటైర్ అయి సులువుగా జీవిత పాఠాలు చెబుతూ వంటలు చేసే సుబ్రమణ్యం కొడుగంటి గారు, ముగ్గులు అనగానే టక్కున మెదిలే రూపం బిల్వమంగళ, ఎంతో అందంగా అలంకరణ చేసి మామూలు వంటలకు కూడా వన్నె తెచ్చే రాధామాధవి గారు, Dr. రాఘవేంద్ర గారు, ఉండ్రాళ్ళు post వచ్చిందంటే బుధవారం సీత ఆకెళ్ళ గారు గుర్తుకు రావలసిందే, పచ్చళ్ళు అనగానే టక్కున దమయంతి పోలిన గారు, కృష్ణమూర్తి గారు, కనకదుర్గ గారు గుర్తుకు రావలసిందే, స్వీట్లు అనగానే శ్రీనువాసా గారు గుర్తు రావాల్సిందే.

కోడళ్ళ కబుర్లతో అలరించే విజయశ్రీ భమిడిపాటి గారు, భార్గవి జాగర్లమూడి, సాంబార్ అనగానే ఉష గరికపాటి గారు, కమ్మని కథలు రాసే యామిని గారు, రాజ్యలక్ష్మి శర్మ గారు, పాటలు పాడే లక్ష్మీ కందుల, గడియారం ప్రసన్న లక్ష్మీ గారు, గుణోతమ గారు, యాత్ర కబుర్ల రామసూరి గారు, పద్మజ గారు…  ఓహ్…   ఇలా ఎందరి పేర్లు చెప్పమంటారు! ఎందరెందరో ఎన్నెన్నో సంగతులు చెపుతుంటే వాటి నుంచి అందరూ కూడా, ఎంతో మోటివేషన్, విజ్ఞానం, మరెన్నో వివరాలు,  ఇంకా ఎంతో తెలుసుకోతగిన సంగతులు, అసలు మనం ఎలా వుండాలి? ఎలా వుండకూడదు అవ్వన్నీ కూడా ఇలాంటి పోస్టుల ద్వారా సమూహ సభ్యులకి తెలియజేస్తున్నాయన్నది ఎంత నిజమో…   వీరందరి పోస్టుల కోసం అందరూ ఎదురు చూస్తూ వుంటారన్నది అంతకంటే నిజం. సభ్యుల్లో ఎందరో ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు, కళాకారులు, ప్రముఖ  రచయిత్రులు, రచయితలు, సినీ ప్రముఖులు, గాయకులు ఇలా ఎందరో ఇక్కడ వుండడం ముదావహం. నిజానికి వంటల కోసమే ఈ గ్రూపు పెట్టినప్పటికీ వంటలతో పాటుగా ఎన్నో విషయాలు తెలియవస్తున్నాయి కనుక అటువంటి పోస్టులకు కూడా అడ్మిన్ బృందం అనుమతి ఇవ్వడం జరుగుతోంది. 

నేటి భారతదేశం లో పెద్దవారు వినోదం కోరుకుంటున్నారు. వారి కోసం ఇంకా తోటి సభ్యులను ముఖ్యంగా గ్రూప్ ద్వారా చాలా మందికి బంధుత్వాలు కలిసాయి, చిన్నప్పుడు school డేస్ లో విడిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ గ్రూప్ ద్వారా కలుసుకోవడం ఇలా ఇతరత్రా కారణాలు ఏమైతేనేమి మన శాకాహార షడ్రుచులు గ్రూపు ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఏటా పండుగలా తిరునాళ్ళలా జరుపుకోవడం, దాని కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి కూడా శ్రమ అనుకోకుండా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయం. 

కోవిడ్ సమయంలో ఎందరో ఉపాధి కోల్పోయి చిరు వ్యాపారాలు మొదలుపెట్టిన వారికి, తమ వ్యాపారాలు స్ధిరపరుచుకునే సమయంలో కొందరికి ఈ శాకాహార షడ్రుచుల గ్రూప్ అండదండగా నిలబడి చేయూత నిచ్చింది. ఈ గ్రూపు ద్వారా వారివారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని నిలదొక్కుకుని నిలబడగలిగారు. ఇళ్ళలో తయారుచేసే పచ్చళ్ళు, స్వీట్స్, స్నాక్స్, పొడులు వగైరాలు తయారీ చేసి, ఈ గ్రూపు ద్వారా అమ్మకాలు చేసుకుని లాభాలు పొందిన, పొందుతున్న వారు ప్రస్తుతం కూడా ఈ సమూహములో వున్నారు. 

ప్రతి సంవత్సరం గ్రూపు మీట్ సమయంలో కూడా ఇటువంటి వ్యాపారాలకు స్టాల్స్ ఏర్పాటు చేసి, వారి అమ్మకాలకు ఒక వేదికను ఏర్పాటు చేసింది ఈ గ్రూపు. ‘అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న’ అనే మాటకి కట్టుబడి ఎన్నోసార్లు అనాధ ఆశ్రమాలలోనూ, అంధ బధిర విద్యార్థులకి అన్నదానం, క్లాస్ రూమ్ లలోకి బెంచీలు, గోవులకు గ్రాసం, వృద్ధాశ్రమానికి fridge సమకూర్చడమే కాక గుప్త దానాలు కూడా చేస్తూ వుంటాము మా అడ్మిన్లము.

ప్రత్యేకమైన పండుగ రోజుల్లో గ్రూపులో పోటీలు నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులను పంపడం కూడా ఈ గ్రూపు ప్రత్యేకత. 

స్పాన్సర్లు కూడా మేము నోరు తెరిచి అడిగే పని లేకుండా పోటీలు అనౌన్స్ చెయ్యగానే వారంతట వారే డబ్బు రూపేణా లేదా వస్తు రూపేణా బహుమతులు అందజేస్తారు. అలాగే ప్రతీ మహిళా దినోత్సవం సందర్భంగా సమూహములోని ఒక  విశిష్ట మహిళని ఎంపిక చేసి, వారిని సముచిత రీతిన సత్కరించుకోవడం ఈ గ్రూపుకి అలవాటు. ప్రతీ ఏటా జరిగే గ్రూపు మీట్ లో గ్రూపులో అత్యుత్సాహంగా పాలుపంచుకునే ప్రతీ ఒక్కరికీ బహుమతులు అందజేయడం ఈ గ్రూపు పద్ధతి. 

ఒకటే మాట ఒకటే మార్గం అనేది ముగ్గురు అడ్మిన్ల మంత్రం. ఆ ప్రకారంగ క్రమశిక్షణతో, ఆప్యాయతానురాగాలతో, ప్రేమానుబంధాలతో ఒక పధ్ధతిగా, ఒక ప్రత్యేకమైన సమూహముగా తీర్చిదిద్దబడుతున్న ఈ ‘మన  శాకాహార షడ్రుచులు’ గ్రూపు అంటే అందరికీ మహాప్రీతి.

అడ్మిన్లు అందుబాటులో ఉండడం. ‘మన శాకాహార షడ్రుచులు’ గ్రూపు కి అదే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఉంది. మా వీడియోలుతో పాటు సభ్యులు పంపిన వీడియోలు కూడా అందులో పెడతాము. అడ్మిన్లకు, సభ్యులకు కూడా ఒకే రూల్స్ . ఇక్కడ ఎవరూ ఎక్కువ తక్కువ కాదు అందరూ సమానమే. ప్రముఖ దినపత్రికల్లో  మన శాకాహార షడ్రుచులు గ్రూపు ను కీర్తిస్తూ ఆర్టికల్స్ ప్రచురించారు. మారిషస్ ప్రభుత్వం, అమెరికా, ఆస్ట్రేలియా రేడియో లలో గ్రూప్ అడ్మిన్లతో, సభ్యులతో విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. మా వంటల గ్రూప్ లో  కుల, మతాల ప్రసక్తి,  పట్టింపు లేకుండా అందరూ కూడా తమ శాకాహార వంటలను సభ్యులతో  పంచుకుంటారు.  పండుగలు

అన్నింటికి అడ్మిన్లము శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్స్ పెడతాము.

భారత దేశానికి సంబంధించి విశేష దినాలకు ప్రత్యేక పోస్ట్స్ పెట్టడమే కాక ఏదైనా ఘనత సాధించిన వారికి అభినందనల పోస్ట్స్ పెడతాము. గ్రూపులో ఆక్టివ్ గా ఉండి దివికేగిన పెద్దవారిని గౌరవిస్తూ అంజలి ఘటిస్తూ పోస్ట్స్ పెడతాము. 

మాకంటూ కొన్ని వేలమంది ఆత్మీయులను ఇచ్చింది గ్రూప్. ఇటీవల జనవరిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో మా అతిథులను సభ్యులు చీరలు, పసుపు కుంకుమలతో సత్కరించడం మరపురాని మధుర జ్ఞాపకం. బయట వెళ్ళినప్పుడు మీరు ఫలాన కదా అంటూ మా దగ్గరకు వచ్చి ప్రేమతో పలకరిస్తుంటే ఆనందభాష్పాలు రాలిన సందర్భాలు మనసుకు తృప్తిని ఇస్తాయి. ఇవన్నీ సొంతం అవడంలో మా కుటుంబ సభ్యుల సహకారం ఎనలేనిది. వారి తోడ్పాటు లేనిదే ఇదంతా ఏమాత్రం సాధ్యం కాదు. వారికి కృతజ్ఞతలు.

——-

Spread the love

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!