ఇచ్ఛామతి

మగపురుగు

(1జులై1923 – 14నవంబర్1980)

సభా పూర్తి పేరు కనకరత్న సభాపతి పెళ్లై. చిత్తూరు జిల్లా తమిళనాడుకు సరిహద్దులో ఉన్న కొట్రకోన గ్రామంలో జన్మించారు. రాయలసీమ నుంచి వచ్చిన తొలి తరం కథకుల్లో ప్రముఖుడు సభా.

ఉపాధ్యాయుడిగా, రైతుగా, జర్నలిస్టుగా అపార అనుభవం ఉన్న వ్యక్తి. సుమారుమూడు వందల కథలు, మూడు నవలలు, పిల్లల కోసం ఆరు సంపుటాలుగా నాటకాలు, ఏడు నవలలు,వెయ్యికి పైగా గేయాలు రాశారు.

బంగారు, పాతాళగంగ,నీటి దీపాలు ముఖ్యమైన కథా సంపుటాలు. 

 భిక్షుకి,మొగిలి, దేవాంతకుడు నవలలు.

 ఇంతే కాకుండా 

దయానిధి ,వేద భూమి వంటి పద్య కావ్యాలు రాశారు.

 రైతు రాజ్యం,పాంచ జన్యం అనే బుర్రకథలు కూడా రాశారు.

దేశీయ వాస్తవికత ఆయన కథల్లో ప్రత్యేకత. స్వాతంత్ర్య అనంతరం గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయ,పర్యావరణ,రాజకీయ,

సామాజిక రంగాలలో వచ్చిన మార్పులను కథల్లో కళ్ళకు కట్టారు. సామాన్య మానవుడి జీవన వేదన అడుగడుగునా ఆయనరచనల్లో కనిపిస్తుంది. 

ఈనెల ఆయన కథ “మగ పురుగు”

“కొడుకుల్ పుట్టరటంతు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై” అని అలనాడేనాడో ధూర్జటి మహాకవి వాపోయాడు. 

కానీ నేటికీ ఆడపిల్లల విషయంలో మార్పు ఏమీ లేదు.

పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షించేవాడని, వంశాంకురమని ఇలాంటి పనికిమాలిన గుడ్డి నమ్మకాలతో మూర్ఖంగా వ్యవహరించే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు విద్యావంతుల్లో కూడా.

అలాంటి తల్లిదండ్రుల కథే మగ పురుగు. 

వరుసగా పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్నిఈసడించుకొంటూ కోటి నోములు నోచి కన్న కుమారుడు తల్లిదండ్రులకి ఏ రకమైన సత్కారం చేశాడో ఈ కథలో చూడవచ్చు.

‘‘పుట్టిందీ… మళ్ళీ ఆడపిల్లే… నాలుగు వడ్ల గింజలు తీసుకొని గొంతులో వేయండి.’’ ‘‘గొంతుమీద కాలేసి తొక్కేద్దురూ!’’

‘‘ఋణం. ఏదో ముందు జన్మలో చేసిన అప్పు!’’

‘‘ఎంత పెంచినా ఓనాటికి చక్కా యింకో యింటికి వెళ్ళీపోయేదే.’’

‘‘ఎందుకూ ఉన్నవారు చాలకనా? వంశం పేరు చెప్పడానికో మగపురుగు లేకుండా వందమంది ఆడపిల్లలు పుడితే మాత్రం!’’

‘‘ఎన్నేళ్ళు పెంచితేనేం ఇంకో అయ్య చేతిలో పెట్టవలసిందే.’’

‘‘అమ్మ బాబో… దాని గయ్యాళితనం చూడవే నేల మీద పడిందో లేదో లంకించుకొన్నది నీలి ఏడుపు.’’

‘‘అంతా వాళ్ళయ్యను ఒలుచుకొని పుట్టిందే.’’

బిడ్డ పుట్టీ పుట్టగానే ఆ తల్లి చుట్టూ ఉన్న మహిళా మండలి ఇన్ని విధాలుగా దీవించింది.

‘‘ఏదో కన్నదానికి తెలుసుగా ఆ కడుపు తీపి. అయ్యగారిని పిలిచి కనుగుర్తు రాయించరా పెద్దబ్బా’’ అన్నది ముసలమ్మ.

‘‘ఏడ్చినట్టే ఉంది. దీనికి జాతకం కూడా. సుక్కల్దశ సక్కగా సాగుతుందిలే తొంబై ఏళ్లు’’ పంచె దులిపి పైన వేసుకొని వెళ్ళిపోయాడు పెద్దబ్బ.

పురుడు తీరింది. ‘‘నిరుడు పుట్టిన బిడ్డకంటే ఈ బిడ్డ బాగుందమ్మా అన్నది సింగారం.

‘‘దానికేం ఏటా బాలింత. ఇంకో ఏడుమంది ఆడబిడ్డల్ని కన్నా కంటుంది’’ అంటూ జోస్యం చెప్పింది బంగారం.

‘‘తొలి చూలు మగబిడ్డ పుట్టినా, తొలి కార్తెకే చెరువు నిండినా ఫలితం ఉంటుంది గానీ ఇదేం కర్మం తల్లీ నిరుడూ ఆడబిడ్డే, నేడూ ఆడబిడ్డే’’ అంటూ సానుభూతిని ప్రకటించింది మాణిక్యం.

                   అసలేం పేరు పెట్టాలనుకొన్నారే చింతాయమ్మా’’ అని ప్రశ్నించింది మరకతం.

‘‘ఏదో ఒక పేరు. పెద్దదానికేమో నా పేరు పెట్టారా. దీనికి వాళ్ళమ్మ పేరు ‘వరహా’లంటే సరిపోయింది’’ అంటూ పెదవి విరిచింది చింతాయమ్మ. వరహాలు పుట్టాక మూడు సంవత్సరాలు బిడ్డలు పుట్టలేదు.

ఇక బిడ్డలే పుట్టరేమోనని అనుమానించింది చింతాయమ్మ.

‘‘అయితే ఎట్లా?’’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నాడు పెద్దబ్బ.

 ‘‘నా కోడలుకు నెల తప్పిందే’’ అన్నదోనాడు చింతాయమ్మ.

‘‘అవునా!’’ అంటూ సంతోషాన్ని ప్రకటించింది బంగారం.

‘‘ఒక్క పని చెయ్యవే. ఈసారి మగబిడ్డ పుడితే ఆరిమాని గుడిలో ఉయ్యాల గడుతానని మొక్కో’’ అన్నది సింగారం.

‘‘ముత్యాలమ్మకో పొట్టేలుగొట్టి ఊరేగింపు చేస్తానని నోములనెల్లో నెల్లికాయల అక్కమ్మ మొక్కున్నది. ఓసి దానిల్లు బంగారంగానూ పనసపండు లాంటి మగబిడ్డ పుట్టాడే. నా మాట విని ముత్యాలమ్మకే మొక్కుకో. ఆ తల్లి అందరిలాంటిది గాదు. పొద్దే మీదెత్తు కట్టి చూడవే నా మాట వినూ’’ అన్నది మరకతం.

‘‘ఇవ్వన్నీ ఎందుకే నేనొక్కటే చెబుతాను. ఎందరు దేవుళ్ళయినా ఏల్యమోడికి రద్దే. మగబిడ్డ పుడితే తిరుపతికి ఇలుదీర్థం వెడతామని, నిలువు దోపిడిస్తామని, తల నీలాలు కూడా యిస్తామనీ మొక్కుంటే సరిపోతుంది. మొన్న చూడూ ఆ జానకమ్మకు చందమామ లాంటి బిడ్డ పుట్టాడు.

‘‘ఊరికే పుట్టాడేం’’ అన్నది మాణిక్యం.

‘‘ఎందుకొచ్చిన తంటాల్లెండి. మీరు చెప్పిన దేవుళ్ళకంతా మొక్కుంటే మాత్రం పోయేదేముంది’’ అని చింతాయమ్మ అందరి దేవుళ్ళకూ మ్రొక్కుకుంది.

‘‘ఏల్యమోరు కళ్ళు తెరచి పాలూ నీరూ వేరైతే పది మందికీ పంచదార పంచుతా’’నని మ్రొక్కుకున్నాడు పెద్దబ్బ.

ఆ రోజు కూడా సమీపించింది. ఆ దినం అందరూ యింట్లోనే వున్నారు. ఆ యిరుగు పొరుగు కూడా మేలుకొన్నారు అర్థరాత్రి సమయాన.

‘‘ముందు తలకు పోయండి నా మాట విని’’ అన్నది సింగారం.

‘‘నిన్ననేగా పోసుకొంది శుక్రవారం. యింతలో ఎందుకే’’ అన్నది

చింతాయమ్మ.

                 “సరేలే. సూరమ్మను పిలవలేదేం” అన్నది బంగారం.

“అయ్యొ నా బంగారా. నేనొచ్చి జాము సేపయింది గదే” అన్నది సూరమ్మ.

అంతా హడావిడిగా ఉంది. పెద్దబ్బ గొడ్ల చావిడిలో నులకమంచ మీద వెల్లకిలా పడుకొని చుక్కలు లెక్కబెడుతున్నాడు.

కెవ్వుమన్న ఏడుపు వినబడింది.

“మగబిడ్డే… మగబిడ్డే..”

“ఒహోహో… దేవేంద్రుడు పుట్టాడేయమ్మా”

“అసలు వాని పుటకే పుట్టక నవమన్మధుడే నవమన్మధుడు.”

“ఎక్కువ అదిమేస్తున్నావ్ ముక్కు అదెంత చిన్నదో చూడు సంపంగి మొగ్గ లాగా”

“ఒరేయ్ పెద్దబ్బా! ఏమిటా మొద్దు నిద్ర. ఆ శామయ్య గారింటి కెళ్ళి గంటెంతో కనుక్కో” కేకేసింది చింతాయమ్మ.

పెద్దబ్బ ఉలిక్కిపడి “నేనెక్కడ నిద్రపోయానే ఇదో కనుక్కొంటా”నని పరుగు తీశాడు చీకటిని చీల్చుకుంటూ.

మగబిడ్డ పుట్టడంతో ఆ యింటి వాతావరణం మారిపోయింది. కొడుకును కన్నతల్లికి కొండంత గౌరవం వచ్చింది.

జాతకం వ్రాశారు.

పురుడు పోశారు.

నామకరణం చేశారు.

అక్షరాభ్యాసం చేయించారు.

అబ్బాయి పేరు రామలింగం.

అరటాకుల్లో పెట్టి పెంచారు.

ఆవు నేతితో అన్నం తినిపించారు.

అడుగులకు మడుగులొత్తారు.

అడిగిందల్లా తెచ్చి పెట్టారు.

తొడిగిందల్లా కోరి కుట్టించారు.

చింతాయికి బుద్ధి తెలిసింది.

వరహాలు కూడా పుష్పవతి అయింది.

                    ఆ యిద్దరికీ పెండ్లిండ్లయినాయి.

అంపకాలపుడు ఆ యిద్దరూ ఎన్నో అడిగారు.

నాకో కాసుల పేరు కావాలన్నది చింతాయమ్మ.

నాకో గజ్జెలడ్డిగ కావాలన్నది వరహాలు.

‘‘కొంపను కాళీ చేయండి. ఉన్నదంతా ఊడ్చుకపోతే ఎట్లా?’’ అన్నాడు పెద్దబ్బ.

‘‘ఎంత పెడితే నేం. ఆడబిడ్డల ఆశల కంతుందా? మీ ఎత్తు భారం ఈనాటితో తీరదుగా, ఏడాదికోసారి ఏడవాల్సిందెంతో ఉంది’’ అన్నది స్వంత తల్లే.

‘‘అసలు మీకు పసుపూ పూలు కుంకం యివ్వాలంటే ఈ యిల్లు పచ్చగా ఉండొద్దూ’’ అంటూ ఎత్తి పొడిచింది ముసలమ్మ.

ఆ ఇద్దరూ వెళ్లిపోయారు.

అత్తగారిళ్ళు చేరుకొన్నారు.

ఆ వెనుక అయిదు సంవత్సరాలు హాయిగానే గడిచింది.

రామలింగానికి పెళ్ళి జరిగింది. వందలాదిగా వచ్చారు చుట్టాలు. ఇరవై పొత్తరలు పులాకులై పోయినై.

‘‘ఎంత చక్కంగా ఉందే నీ కోడలు చుక్కలాగా….. కోడలు నలుపైతే కులమంతా నలుపు. నీ కోడలచ్చం దొండపండే మీనాక్షమ్మా’’ అంటూ అభినందించింది సూరమ్మ.

‘‘ఔనౌను’’ అంటూ సమర్థించుకొన్నది చింతాయమ్మవ్వ.

కోడలు కాపురానికి వచ్చి మూడు మాసాలైనవి. అత్తగారి పెత్తనం అడుగంటింది. అవ్వగారి అధికారం గవ్వకు కూడా చెల్లకపోయింది. మామ గారి హక్కులు మంటగలిశాయి.

‘‘రామలింగానికి అత్తగారింటిలో నిమ్మకాయంత మరుపు మందు మ్రింగించారన్నది’’ మరకతం.

‘‘కాకుంటే కన్నతల్లిని పట్టుకొని తంబె పలుపుతో చావకొడతాడా’’ అంటూ విస్తుపోయింది మాణిక్యం.

మరకతం అన్న మాటలో సత్యమెంతో చెప్పలేం కానీ మాణిక్యం అన్నట్టు తంబె పలుపుతో తల్లిని కొట్టాడు రామలింగం.

అదేమంటూ ముసలామె అడ్డుపడితే ఆమెను ములుగోలతో చితకపొడిచాడు. ఏమి ఈ ఆగడం అంటూ విరుచుకపడ్డ పెద్దబ్బ రెండు చెంపలూ వాచిపోయినై.

ఏమిటీ విపరీతం అనుకున్నారంతా. మీనాక్షమ్మ అవమానంతో క్రుంగిపోయింది. పెద్దబ్బ ఆత్మహత్య చేసుకొంటే పోయేదిగా అన్నంత వరకూ వచ్చాడు. ముసలామె నోరు నొచ్చే వరకూ వాగివాగీ ఆగిపోయింది.

రామలింగం ఏ మాత్రం తగ్గలేదు. మాటామాటా వచ్చి యిల్లు వదలి వెళ్ళమన్నాడు పెద్దబ్బ.

‘‘ఇది నీ సొమ్ము కాదు. నా తాత సొమ్ము’’ అంటూ బోషాణం తాళం గుత్తిని తెంపుకొన్నాడు రామలింగం.

అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది వరహాలు. కనులముందు అస్పష్టంగా కన్పించింది చింతాయి. పెద్దబ్బ ఎవ్వరికీ చెప్పకుండా వరహాలు యింటికి వెళ్ళి పోయాడు. తాను కాపురానికి వచ్చిన వెనుక తండ్రీ అదే తొలిసారి తన కడప త్రొక్కడం. ఆమె సంతోషానికి మేర లేకపోయింది. ఆనందంతో చేతికి నీళ్ళిచ్చింది. ఆప్యాయతతో వడ్డించింది. కన్న కూతురి చేతి అన్నం కన్న తల్లి పెట్టినట్టే ఉంది. పెద్దబ్బ సంతృప్తిగా భుజించి పడుకుని నిద్రపోయాడు. ఆ మరునాడు… ఆ మరునాడు గడిచాక మూడో రోజున అన్నాడు.

‘‘నే నిక్కడే ఉండిపోతానమ్మా వరహాలూ’’ అని.

ఆమె నాన్నగారి కన్నీటిని చూచి ఆశ్చర్య పడింది. ఏం జరిగిందో తెలియక తికమక పడి చివరికి సాహసించి అడిగింది. విషయం తెలుసుకొన్నాక గుండె పగిలేలా ఏడ్చింది. వాడిని పాతర వేస్తానంటూ నాగుపాములా పైకి లేచింది.

‘‘నువ్వేమీ పని చేయవద్దు. ఇష్టం ఉంటే అలా మామిడి తోటకో, టెంకాయ తోటకో వెళ్ళిరా. వాడి ముఖం చూడవద్దింక’’ అన్నది.

వారం రోజులు గడిచాక చింతాయి జాబు వ్రాయించింది. మీనాక్షమ్మ ఆమె వద్దకు వచ్చి చేరుకొన్నదట. పిల్లాణ్ని ఆడించుకొంటూ ఉంటే చాలని, పెద్ద దిక్కుగా ఉంటుందని భర్త చెప్పడం వల్ల అమ్మను నిలుపుకొన్నానని వ్రాయించింది.

‘‘అయితే ముసలమ్మ ఏమైనట్టు?’’ ప్రశ్నించింది పెద్దబ్బ. దానికి సమాధానంగా ఆ మరునాడే ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ జాబు ముసలమ్మ వ్రాయించింది.

‘‘నా కట్టెలో జీవం ఉండే వరకు యింకొకరి కడప త్రొక్కను. నా గుక్కెడు ప్రాణమూ ఇక్కడ పోవలసిందే. వాడేదో కోపం వచ్చి కొడితే పారిపోవడం ఎందుకు? మన బిడ్డేగా కొట్టింది.’’

పెద్దబ్బ నాలుక చప్పరించి వూరుకున్నాడు. ఒక్క సంవత్సరం గడిచి పోయింది. ముసలమ్మ చచ్చిపోయింది. పెద్దబ్బ మీనాక్షమ్మ అందరు చుట్టాలు ఆనాడొక్కచోట చేరారు. దహనమయి పోయింది. పాలు కూడా పోసేశారు. ఉత్తర క్రియలు కూడా ముగిసిపోయినవి.

ఆ రాత్రి నలుగురు చుట్టాలూ రామలింగాన్ని అడిగారు. తల్లీ తండ్రీ పొరుగింట్లో ఉండటం మర్యాదకాదని.

వరహాలుకు రోషం వచ్చింది. ‘‘నిన్న కాక మొన్న పుట్టిన ఈ వెధవ నెందుకు బ్రతిమలాడ్డం, లెయ్యండి పోదాం’’ అంటూ పైకి లేచింది. చింతాయి కూడా అప్పుడే లేచి మూటాముల్లే సర్దుకున్నది. మీనాక్షి చింతాయమ్మ బండిలో కూర్చున్నది. పెద్దబ్బ వరహాల బండిలో కూచున్నాడు. రెండు బండ్లూ కదులుతుంటే విస్తుపోతూ చూచారు ఇరుగు పొరుగు.

‘‘ఎంత మగవాడైనా వాడి పెళ్ళానికి లోకువే. ఎందుకో ఈ మగబిడ్డలు?’’

‘‘తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దడం కొడుకుల చేతవుతుంది. కాని కూతుళ్ల చేతవుతుందా?’’

‘‘పెట్టి పుట్టాడు అనుభవించడానికి, ఏనాటి ఋణమో కాకుంటే ఇదేం విపరీతం?’’

‘‘ఎన్నాళ్ళు పెంచితే నేం. కంటికి ఒత్తులేసుకొని కాపాడారు. దేవేంద్రుడు పుట్టాడనుకొన్నారు. వీడే యముడై కూచున్నాడు.’’

‘‘ఏమైనా ఆడ పుట్టకే పుట్టక. అత్తా మామల చూచి మూతి ముడుచుకొన్నా అమ్మా నాన్నలను చూచినప్పుడైనా అయ్యో మంటుంది మనస్సు!’’

ఇట్లా నానా విధాలుగా అనుకొన్నారు అమ్మలక్కలు.

‘‘పాపం! ఎంత శ్రమ వచ్చిందే. వీడికోసం ఎన్ని నోములు నోచిందా తల్లి. వీడికి పుట్టు గతులుంటాయా’’ అంటూ చీది చీది వేసింది సింగారం.

‘‘ఎన్ని దేవతలకు మీదు లెత్తి కట్టింది పాపం! ఇందుకేనా?’’ అంటూ ముక్కు మీద వేలేసుకొన్నది మరకతం.

‘‘ముప్పయ్యో ఏట తలనీలాలు కూడా యిచ్చిందిగదే!’’ అంటూ యింటి వైపు దారి తీసింది మాణిక్యం.

రెండు బండ్లూ కనుచూపు మేరను దాటుకొన్నవి.

Spread the love

జి.ఎస్.చలం

పుట్టింది కొత్తపల్లిలో. పాఠశాల విద్య పార్వతీపురంలో. పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో కళాశాల విద్య, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య.
వృత్తి: విజయనగరం జిల్లాలో మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు భాషా బోధన.
రచనలు:
రజకుల జీవిత నేపథ్యంలో" రేవు" నవల, కళింగాంధ్ర మాండలిక పదకోశం, మృచ్ఛకటికం (అనువాదం), కన్యాశుల్కంలో వాడుక మాటలు, తెలుగు నవల విస్తరించిన వివిధ కోణాలు, భూషణం మోనోగ్రాఫ్, కళింగాంధ్ర కవితా సంకలనం "తిత్తవ"కు భూషణం సమగ్ర కథా సంపుటికి సంపాదకత్వం.

నటుడు, దర్శకుడు.
సంపూర్ణ కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు, సంక్షిప్త నాటకంలో రామప్ప పంతులు పాత్రలు ధరించి దర్శకత్వం వహించారు. కొన్ని వ్యాసాలు రాశారు. ప్రసంగాలు చేసారు.విద్యార్థుల్లో భాషా సాహిత్యాల పట్ల అభిరుచి కలిగించేందుకు కృషి చేస్తున్నారు.

వ్యాక్యాన్ని జతచేయండి

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!