ఆఖరి రైలు
వెళ్ళిపోయింది
నీకు పోవాలని లేదు
పోగూడదనీ లేదు
రైలు
చూపు పరిధి దాటే వరకు
చూస్తుండిపోయావు
ఎన్నో పాదముద్రల్ని
తూకం వేసిన
పాత స్టేషనది
నీ అడుగుల భారం
బలహీనతను చూసి
మాసిన సిమెంటు బేంచి
పిలిచింది
నీవు నిర్లిప్తతంగా
తన మూలన
ఒదిగినట్టు కూర్చున్నావు
దూరంగా ఆకలితో
కుక్కపిల్ల అరుస్తోంది
నీవు అరవలేని
మర్యాదస్తునివి
స్టేషన్ ప్రశాంతంగా ఉన్నా
నీవు స్థిమితంగా లేవు
నీ పక్కన రావిచెట్టు
కాకి నీ దిగులును
అర్థం చేసుకుందేమో
మీద వేయబోయిన రెట్టను
పక్కన వేసింది
నీకు తెలియదు ఆ విషయం
సాయంత్రం
చీకటి వేషం కట్టింది
లైట్లు వెలిగాయి
నీ ఇష్టప్రపంచంలో
వెలుగు లేదు
నీ పాత్ర ఏమిటో
ఎపుడూ అర్థం కాదు నీకు
జేబులో మాసిన ఫోను
మిడికింది
నీ నీడను
అక్కడే వదిలేసుకుని లేచావు
నీకిష్టం లేని
ఘర్ అనే గోరిలోకి నడిచావు
రేయంతా నీ ఆత్మ
మంచులోనే తడుస్తూ ఉంది
ముసలి రైలు ఒకటి
జాలిగా చూసి వెళ్ళింది
ఆ రైలు నీవే .
Philosophical