తెలుగు సాహిత్యంలో భావుక, కాల్పనిక, అస్తిత్వ రచనలు విస్తృతంగా వెలువడుతున్నా, శాస్త్రీయ, వైజ్ఞానిక రచనలు, ముఖ్యంగా వైద్య, ఆరోగ్య సంబంధిత సాహిత్యం మాత్రం చాలా తక్కువ. ఈ కొరతను తీర్చిన కొద్దిమంది వైద్య నిపుణులలో డాక్టర్ యనమదల మురళీకృష్ణ అగ్రగణ్యులు.
1998 నుండీ దినపత్రికలలో ఎయిడ్స్ గురించి వ్యాసాలు రాస్తూ, 2000 సంవత్సరంలో ఆయన వెలువరించిన ‘ఎయిడ్స్’ పుస్తకం అప్పట్లో సమాజంలో ఈ వ్యాధి పట్ల నెలకొన్న అనేక అపోహలను తొలగించి, ప్రజలు వ్యాధిని ఎదుర్కోవడానికి ఎంతో ఉపకరించింది. పదేళ్ల కాలంలో ఎనిమిది ముద్రణలకు వెళ్లడం ఈ పుస్తకం తన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది.
2020లో కోవిడ్ పీడ ప్రారంభం నుండీ, డాక్టర్ మురళీకృష్ణ శాస్త్రీయ, సాధికార రచనలతో తెలుగు ప్రజలను జాగృతం చేశారు. ఫేస్‌బుక్‌లో ఆయన రాసిన వ్యాసాలు విస్తృత స్థాయిలో ప్రజలకు చేరాయి. 2021 డెల్టా వేవ్ సమయంలో, తేలికపాటి కోవిడ్ కోసం ఏస్పిరిన్, ప్రెడ్నిసొలోన్, ఎజిత్రోమైసిన్‌లతో ఆయన రూపొందించిన హోమ్ కేర్ కిట్తెలుగు ప్రజలకు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. 2022 జనవరి 20న ఒమిక్రాన్ రకం కోవిడ్ కోసం ఆయన ప్రచురించిన హోమ్ కేర్ సలహాలు ఆయన ఫేస్‌బుక్ వాల్‌పై 13,000 సార్లకు పైగా షేర్ అయ్యాయి. ఇది ఆయన రచనల సాధికారతకు, ప్రజల్లో వాటికున్న ఆదరణకు నిదర్శనం. కోవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాలలో వందలాది మందికి ఉచితంగా మందులు పంపి, భరోసాను అందించారు. 2022లో ఆయన ప్రచురించిన ఆత్మకథాత్మక వైద్య విజ్ఞాన గ్రంథం ‘కోవిడ్ ఎయిడ్స్ నేను’ మంచి ప్రజాదరణ పొందింది.

2024లో, ఆయన ‘హెచ్ఐవి ఎయిడ్స్ తెలుగు పుస్తకం’, ‘హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్’ అనే రెండు పుస్తకాలను రచించారు. జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నవంబర్ 2024 సంచికలో, ఇంగ్లిష్ పుస్తకాన్ని “వృద్ధిలో ఉన్న దేశాల వైద్య సాహిత్యానికి ఇది ఒక గొప్ప చేర్పు” అని శ్లాఘించింది.
2000 సంవత్సరంలో కాకినాడలో తొలి హెచ్ఐవి క్లినిక్ను ప్రారంభించిన డాక్టర్ మురళీకృష్ణ, గత రెండున్నర దశాబ్దాలుగా దాదాపు 7,000 మంది హెచ్ఐవి-ఎయిడ్స్ రోగులకు వైద్య సేవలు అందించారు. సమాజపు నిరాదరణకు గురైన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆయన చేసిన సేవలకు, ప్రజలను భీతావహులను చేసిన కోవిడ్ పీడ సమయంలో తన రచనల ద్వారా భరోసా నింపినందుకు గాను, ప్రజా వైద్యునిగా గౌరవిస్తూ 2025 జూన్ 22న హిందూపురంలో ‘తపన సాహిత్య వేదిక సేవా పురస్కారం’తో ఆయనను సత్కరించారు.
వ్యాక్యాన్ని జతచేయండి