తెలుగు పుస్తకాలను పాఠ్యాంశాలు గా తప్ప వేరే ఇతర మాధ్యమాలలో చదవటం అలవాటు లేని నాకు డిగ్రీ మొదటి సంవత్సరం లో నాకు పెద్దగా పరిచయం లేని ఒక సీనియర్ అబ్బాయి ఒకరు పిలిచి మరి బహుమతిగా ఇచ్చిన పుస్తకం “అంతర్ముఖం”. ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయికి ఇటువంటి పుస్తకం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆలోచిస్తూనే అనేక ప్రశ్నలతో మొదలుపెట్టాను.
నా పద్దెనిమిదవ యేట 2013లో నేను పూర్తిగా చదివిన మొట్ట మొదటి తెలుగు నవల ఇది. యండమూరి… ఈ పేరు కి ఉన్న ప్రాముఖ్యత ఆ నోట ఈ నోట వినడమే తప్పా ఆయన కల్పనా శక్తిని స్వయంగా రుచి చూసింది మాత్రం ఈ నవల లోనే.
నా టీనేజీ ఆలోచనల్లోని విశృంఖలత్వంను ఎద్దేవా చెయ్యడానికి ఒక డబ్బై ఏళ్ల వ్యక్తిని మంచాన పడేసి
“మాటలు చేతలు ఒకేలాగా ఉండటమే నిజాయితి” అని నేర్పించడానికి యండమూరి గారు పంపించారు అనుకున్నాను. ఈ పుస్తకం ఆ సీనియర్ ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.
కానీ పుస్తకం పేజీలు, నా జీవితపు పేజీలు ముందుకు వెళ్తూనే ఉన్నాయి…
ఈరోజుకి ఈ పుస్తకాన్ని చదివి పుష్కర కాలం అవుతున్నా కూడా కొన్ని మాటలు, ఊహలు ఆలోచనలు ఇంకా నా వెనకాలే నీడలా ఉన్నాయేమో అనిపిస్తుంది. అక్షరాలు అనేవి ఆలోచనల పొరల మీద మాత్రమే కాదు మనస్సు లోతుల్లోకి , మెదడు మలుపుల్లోకి దూసుకెళ్లి వైద్యం చేస్తాయన్న విషయం ముప్పై ఏళ్ళకి అవగతం అయింది.
ఈ నవల చదివిన చాలా కాలం వరకు ఒక ఇబ్బంది ఉండేది. ఒళ్ళు అలసిపోయినా, మనసు అలసిపోయినా సేద తీరే సదరు మంచం ఎక్కితే మొట్ట మొదట కనిపించే సీలింగ్, ఫ్యాన్ నా పద్దెనిమిది ఏళ్ళ వాస్తవాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి తీసుకెళ్లి అక్కడ నన్ను నిర్జీవ స్థితి లో పడుకోబెట్టి ఏదొక రోజు రాబోయే వాస్తవాన్ని గుర్తుచేసేవి. మృత్యువు ముంగిట ఆయన పేల్చిన మాటల తూటాలు సామాజిక వాస్తవికతను, తాత్వికత ను సరైన సమయానికి నాకు అలవాటు చేసాయి.
కాలానుగుణంగా అందాలు అద్దుకుని ఆడంబరంగా కనిపించినా కూడా ఈరోజుకి సీలింగ్కున్న ఫ్యాన్ ను చూసి నేను నా మనసుకి బట్టలు మారుస్తాను.
బాహ్య ప్రపంచం నా ఇల్లు, ఉద్యోగం భర్త, పిల్ల,కుటుంబం ఇరుగుపొరుగు నానా రభస ఉండే నా రంగుల దుస్తులు మనసుని విడిచి పెట్టి ఒక తెల్లని పల్చని వైరాగ్యపు దుప్పటి నీ ధరిస్తుంది. ఆ ఫ్యాన్ కు వున్న రెక్కలు నన్ను నా “అంతర్ముఖం” ను ప్రశ్నిస్తాయి.
ఈరోజు నా ఈ అనుభవం రాస్తుంటే అనిపిస్తోంది. అసలు మృత్యువు ముంగిట్లో కూర్చుని వుంటే మూలిగే ముసలోడి పాత్ర చేత మాటల ముగ్గులు వేయించగలిగే సత్తా యండమూరి సొత్తా అని ఆలోచన.
ఏవడండీ మంచాన పడుకుని నోట మాట పడిపోయి అచేతనా అవస్థ లో సైతం మెటీరియలిసం నుండి కమ్యునిజం వరకు ప్రేమ ప్రవాహం నుండి పైశాచిక ఆనందం వరకు మనలో మానసిక చేతన కలిగేలా మాట్లాడగలరు, మాట్లాడించగలరు ఈయన తప్పా అనిపిస్తోంది.
యుద్ధ భూమి లో ఒక్కొక్కరిగా శత్రువులను చంపుకుంటూ వస్తున్న సైనికుడిలా నా శరీరం కూడా ఒక్కొక్క అవయవాన్ని చంపుకుంటూ మృత్యువు నా దగ్గరకి వస్తోంది అంటారు యండమూరి.
డబ్బై ఏళ్ల వయసు లో శిథిలమైపోతున్న శరీర అవయవాలను ను యుద్ధ భూమి లో క్షతగాత్రులైన సైనికులతో పోల్చాలన్న ఆలోచన ను వర్ణమాల లోని ఏ అక్షరం తో వర్ణించాలనీ ఆలోచించినా దొరకడం లేదేమో. చాలా మంది ఫ్రెంచ్ దిగ్గజం ఆల్బర్ట్ కామస్ రచన యొక్క తెలుగు అనువాదం లా ఉంటుంది అని. అనువాదం అయినా ఆమాటకి ఏ వాదం అయినా ఈరోజుకి నాలో ఆలోచనల్లో “హేతువాదం” అలవోకగా ఇమిడిపోవడానికి కారణం ఈ పుస్తకం, దాని యొక్క ప్రభావం.
పరంధామయ్య మనస్తత్వం, అతని లాగ కూతురు బూటకపు జీవితాన్ని కప్పిపుచుకున్నా, మల్లిక లాగ ప్రేమను మార్కెటు లో తూకం వేసినా, సత్యం లాగ ఇంగ్లీష్ లో “టేక్ అవే” అంటారు కదా అటువంటివి ఈ పుస్తకం లో నేను ఇంటికి, నా బుర్రకి శాశ్వతంగా తెచ్చుకున్నవి కొన్ని కబుర్లు మీతో పంచుకుంటాను.
“అంతా సవ్యంగా జరుగుతుందిలే” ఈ మాట తరువాత కాలం లో సినిమాల్లో కూడా విన్నాము “all is well” అని అనువాదం లాగ. సందర్భం ఏదైనా ఈ వాక్యం ఇచ్చే ధైర్యం ఈరోజుకి నాలో నాలాంటి ఎందరిలోనో ఆశావాదం నింపింది.
“మన బాధలను బయట వాళ్ళ తో పంచుకోవడం మంచిది కాదు” ఈ మాట ఓ టీనేజర్ గా నేను నేర్చుకున్న జీవిత గుణపాఠం అనే చెప్పాలి.
“స్త్రీ 16 ఏళ్ళ వయసులో ఒకరిని ప్రేమించి… అతన్ని పాతికేళ్ళకి వదిలేసి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని స్థిరపడుతుంది అంటూ…ప్రేమ ఒక ప్రవాహం లాంటిది…కాలం అనే ఎత్తుపల్లాల మీద convenient గా వ్యక్తిత్వం అనే ఒడిడుకుల మధ్య అవసరం అనే అవగాహన పెరిగే కొద్ది ఒక పర్వతాన్ని వదిలి మరో శిఖరాన్ని ప్రేమించి చివరకు భద్రత భావం అనే సముద్రంలో స్థిరపడుతుంది. మగవాడికి అభద్రత భావం లేదు కాబట్టి… విభిన్నమైన సర్కిల్స్ వేత్తుక్కుంటాడు.” అమ్మాయిలకు ఉండే ఇన్సెక్యూరిటీస్ గురించి అంటే అమ్మాయి జీవితం లో రాబోయే పరిణామాల గురించి చాలా అలవోకగా జ్యోతిష్యం చెప్పారేమో అనిపించేలా ఉండే ఈ వాక్యం ఈరోజుకి వాస్తవమే. ఐతే “అమ్మాయిల ఇన్సేక్యూటిస్” అనే పదజాలం మాత్రం ఎందుకనో నా చెవులకి కిట్టలేదు. నిజాలు కఠినంగా ఉంటాయేమో అందుకేనేమో మరి. అంటే అబ్బాయిలకి ఇన్సెక్యూరిటీస్ ఉండవని యండమూరి గారి అభిప్రాయం తో నేను ఏకీభవించలేను. రూపం, ప్రకటన వేరైనా అభద్రతా భావం లేకుండా మనుషులు ఎలా వుంటారు అనేది నా ప్రశ్న. ఈ అంతర్ముఖం అనేది కూడా మన అభద్రతల నుండి ఉద్భవించినదే కదా అని ఒక సంకోచం.
ఐతే రచయిత తో అప్పుడపుడు మన సంఘీ భావం తెలిపినట్టే వ్యతిరేక భావం కూడా తెలుపలేక పోతే మంచి పాఠకుడు ఎలా తయారు అవుతాడు ? ఐతే అక్కడక్కడ అయిష్టంగా అనిపించిన మాటలు వున్నా కూడా
ఆణిముత్యం లాంటి మాటలు దొర్లుతూనే ఉంటాయి ఈ మానసిక మందుల తోటలో…
“మనకోసం మనం ఒక నిర్ణయం తీసుకుంటే … దానికోసం ఎంతైనా పోరాడగలం. అది మన వాళ్ళ కోసం తీసుకుంటే వచ్చే ప్రశ్నలు ఎదుర్కోవడం చాలా కష్టం.”
ఈ మాట నాలో ఆరోజు నుండి ఈరోజు వరకు విచక్షణా శక్తిని,డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నీ బాగా ఇంప్రూవ్ చేసింది అనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం ప్రతీ చాప్టర్ కు సుమారుగా మూడు నాలుగు మెంటల్ లెసన్స్ దొరుకుతాయి ఈ పుస్తకం లో అని నా అభిప్రాయం. నాకే కాదు నా వయసులో ఉన్న టీనేజ్ అబ్బాయికి సైతం పాఠాలు ఇందులో ఉంటాయి. “స్త్రీ జాతి పైన తాత్కాలికంగానైనా చెడు అభిప్రాయం రావడం తన మీద తనకే అసహ్యం కలుగచేసింది” అంటాడు ఒక దగ్గర.
“నిజాలు ఎవరి ద్వారానో తెలిసే కంటే అసలు వారి ద్వారానే తెలిస్తే మంచిది” అని మోసం చేస్తున్న భార్య ను ఉద్దేశించి చెప్పడం లో తప్పు దారి పట్టిన స్త్రీ పట్ల కూడా గౌరవం వ్యక్తం చేయడం చూస్తాము.
మానవ సంబంధాలు , వికృత వేషాలు, పటాటోప ప్రవర్తనలు ఇలా ఇవన్నిటి మిశ్రమం ఈ నవల. మేడిపండు వంటి ముఖానికి మరో వైపు ఉన్న అంతర్ముఖం చదివి చాలా కాలం అయినా కూడా ఇన్ని విషయాలు జ్ఞప్థికి వస్తున్నాయి అంటే ఈ పుస్తకం మళ్ళీ చదవాలని కొత్త కోణం లో మరిన్ని విషయాలు నేర్చుకోమని కాలమే నాకు చేస్తున్న విజ్ఞప్తి ఇది అనిపిస్తోంది.
వ్యాక్యాన్ని జతచేయండి