రాగాలు మనస్సులో ఎన్నో భావాలు ప్రేరేపిస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే . కొన్ని ఉత్తేజ పరుస్తాయి , కొన్ని శాంతింపచేస్తాయి , కొన్ని ఆలోచింపజేస్తాయి , మరి కొన్ని శొధనకు దారి తీస్తాయి . కొన్ని జాలువారే స్వరాలతో ఆర్ద్రత ని తట్టి లేపుతాయి. అలాంటి రాగాలలో పహాడి, జోగ్, పీలు, కాఫీ – ఇవి ఎప్పుడు విన్నా మనసుకి ఆనందం, శాంతి.
ఈ వేళ పహాడి రాగం చూద్దాం. ఆ రాగం పుట్టుక హిమాలయాల కొండల లోయలలో. ఆ రాగం వింటూ ఉంటే మంచుతో నిండిన కొండలు, ప్రవహించే నదులు, జలపాతాలు, సెలయేరుల ఝరి, పచ్చని మైదానం, విరగబూసే పువ్వలు, ఎత్తైన వృక్షాలు, వాటి మధ్య నుంచి వచ్చే గాలి ఈల పాటలు, అన్నీ మనోఫలకం మీద ఒక కదిలే చిత్రం లా కనిపిస్తుంది. చల్లని వాతావరణం , మధ్య మధ్యలో వెచ్చని సూర్యకిరణాలు మనల్ని పలకరిస్తాయి. అదీ ఆ రాగ చలనం .
1967 లో ప్రముఖ సంతూర్ విద్వాంసులు పండిట్ శివకుమార్ శర్మ, వేణువు విద్వాంసులు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా కలిసి Call of the Valley అని ఒక musical album తీసుకు వచ్చారు . అహిర్ భైరవ్ , భూప్, నటభైరవ్ , దేశ్ , పీలు రాగాల తో సాగి చివరికి పహాడితో ముగుస్తుంది. ఆ పహాడి మన మనసులో అలా వుండి పోయి మనల్ని ఆ కాశ్మీరి లోయల్లో నుండి దిగి రానీయదు. అసలు సంతూర్ అక్కడి వాయిద్యం . అన్ని తీగలు నుండి సాగే రాగంతో పాటు సెలయేరుల నడక ఆ వాయిద్యంలో వినపడుతుంది.
పహాడి రాగం కొంత రాజస్థానీ జానపద సంగీత శైలిలో ఎక్కువగా వినపడే మాండ్ రాగానికి , గంగ , యమునా ప్రవహించే మైదానం లో వినపడే పీలూ రాగానికి దగ్గరగా ఉంటుంది.
ఈ రాగం వింటూ వుంటే హిమాలయాల సౌందర్యమే కాకుండా అనేక భావాలు స్ఫురిస్తాయి. ఎక్కువగా శృంగారం, శాంత రసాలను పోషిస్తుంది. ఇది పాడే సమయం సాయంకాలం.
సినిమాలలో ప్రేమ గీతాలుకి, విరహగీతాలకి కూడా ఈ రాగం వుపయోగించారు. ఇక రఫీ గొంతులో ఈ రాగం ఎంతో సొగసుగా, ఎన్నో పోకడలు పోతుంది. ఒకటా , రెండా- ఎన్ని మంచి పాటలు!
సుహానీ రాత్ ఢల్ చుకీ , న జానే తుమ్ కబ్ ఆవోగి,
యే వాదియా , యే ఫిజాయే బులా రహి హై తుమ్హే , ముఝే తుమ్ సే మొహబ్బత్ హై , ఆజ్ కి రాత్ మేరీ దిల్ కి సలామీ లేలే … ఇలా ఎన్నో పాటలు ఈ రాగం పై ఆధారితంగా రూపొందాయి. కానీ వీటిలో మకుటం- చౌదవీ కా చాంద్ హో .
ఈ పాట అతి సుందరమైన వేయి రేకుల గులాబీ. ఆ పాట అదే పేరు తో వున్న సినిమా లోది. వహీదా రెహమాన్ , గురుదత్ ల పై చిత్రీకరించిన ఈ పాట మనల్ని మరో లోకం లో కి తీసుకు పోతుంది. వహీదా వల్ల పాట బాగుందా ? పాట వల్ల వహీదా బాగుందా? అసలు ఈ మేజిక్ కి రఫీ గొంతు కారణమా? లేక రవి సంగీతమా ?వీటితో పాటు కలసిన షకీల్ బదాయుని కవిత్వమా ? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. అన్నీ కలిసి ఈ పాటను చిరస్థాయిగా నిలిపాయి.
పాటలో కవి చాతుర్యం– ఎంత ప్రేమ, ఆరాధన గుప్పించారో! పౌర్ణమి ముందు రోజు చంద్రుడి లా మెరసిపోతోందా? లేక సూర్యుడు లాగానా ? ఎలా అనుకున్నా ఆమెలా మరొకరు లేరు. ఆమె కురులు మేఘాలు, కళ్ళు మధు పాత్రలు . చిరు నవ్వు ఒక మెరుపు. ఎంత పొగిడినా కూడా తక్కువే.

కవి పలుకులులలో వున్న అబ్బురం రఫీ గొంతులో మనకు వినిపిస్తుంది. ముఖ్యంగా ఖుదా కి కసమ్ అన్నప్పుడు మనకి కూడా అదే భావం కలుగుతుంది. ఎక్కువ గమకాలు లేవు. సాఫీగా జాలువారిన రాగం. తీయని కాంక్ష, అమితమైన ప్రేమ, ఆరాధన అన్నీ గొంతులో పలికించడం ఆయనకే సాధ్యం .
భావ సౌందర్యం, రాగ మాధుర్యం , నలుపు తెలుపులతో చిత్రించిన గురుదత్ చాతుర్యం- ఈ పాట ని ప్రేమకి ప్రతీకగా నిలిపింది.
వ్యాక్యాన్ని జతచేయండి