ఇచ్ఛామతి

Missing

మనుషుల మధ్యకు వెళ్ళినప్పుడు
ఒక్కోసారి మరీ ఒంటరైపోతున్నాం

కొన్నిసార్లు నలుగురితో మాట్లాడిన తరువాత
చుట్టూ పెరిగిన గోడల నడుమ
కుప్పకూలిపోతాం తోక తెగిన
ఒంటరి బల్లిలా

ఎవరన్నారు
ఒక్కడిగా ఉన్నప్పుడే ఒంటరితనం
ఒంటి మీద పేరుకుపోతుందని?
ఒక్కడిగా ఉన్నప్పుడు అంతులేని ఏకాంతం
ఎంతో సందడిగా ఉండవచ్చు…
ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక సమూహంలా
జనారణ్యంలా ఊగిపోవచ్చు
కానీ.. ఇప్పుడు జనంలోకి వెళ్తున్నకొద్దీ
మనుషులు చేజారుతున్న ఒంటరితనం

ఒకరో ఇద్దరో తోడుగా
ఒక ప్రయాణం ఊహించడమే కష్టమైపోయింది
ఒక్కరే చేయలేని ప్రయాణాలుంటాయి
పది మంది కలిసి చేరుకోవాల్సిన గమ్యాలుంటాయి
గోడలు దాటుకుని వీధుల్లో కాల్వల్లా
ప్రవహించాల్సిన సందర్భాలుంటాయి

కానీ… మనుషుల్లోకి వెళ్తున్నకొద్దీ
మళ్ళీ మళ్ళీ ఈనెల్లా చీలుకుపోవడమేంటి?
కనీసం ఒంటరిగా కూడా మిగలకపోవడమేంటి?

నిన్నటి గాయం లేకుండా
రేపటి వ్యూహం లేకుండా
రెండు చేతులతో నిండుగా మరో మనిషిని
కావలించుకుని ఎన్నాళ్ళయింది?

ఫోన్ మాట్లాడి కట్ చేసింతర్వాత
మరీ మరీ ఒంటరితనం ఒక్కోసారి
ఒంటరితనానికీ ఏకాంతానికీ మధ్య
ఏమిటీ అగాధం ప్రతిసారీ?
Spread the love

Pasunuru Sreedhar Babu

పద్యం ఒక దీపం కదా... అంటూ లోపలి అరణ్యాలను అనేకానేక నేనులుగా విచ్ఛిన్నమై వెలిగించే ప్రయత్నం చేస్తున్న కవి పసునూరు శ్రీధర్‌బాబు. సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనల్లోంచి కవిత్వంగా ధ్వనిస్తూ తొలి కవితా సంకలనం “అనేకవచనం” ప్రచురించారు 1999లో కొత్త మిలీనియానికి ద్వారాలు తెరుస్తూ. ఆ తరువాత ఇరవయ్యేళ్ళకు 2021లో “నిదురపోని మెలకువ చెప్పిన కల” పేరుతో రెండో సంపుటిని ప్రచురించారు. అనేకవచనం సంపుటికి అజంతా అవార్డు, రమణ-సుమనశ్రీ పౌండేషన్ పురస్కారం అందుకున్నారు. నిదురపోని మెలకువ చెప్పిన సంకలనానికి 2022లో రొట్టమాకు రేవు పురస్కారం, ఖమ్మం ఈస్తటిక్స్ అవార్డు, మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం అందుకున్నారు. యాదాద్రి జిల్లాలోని మోత్కూరు గ్రామనికి చెందిన శ్రీధర్‌బాబు వృత్తి రీత్యా జర్నలిస్ట్. ఇండియా టుడే, హెచ్ఎంటీవీ, 10టీవీ, బీబీసీ న్యూస్ వంటి సంస్థలలో పని చేశారు. “ఏకాంతం ఒక అతిథి” పేరుతో ఆయన మూడో కవిత్వ సంకలనం త్వరలో విడుదల కానుంది.

1 వ్యాక్య

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!