కొత్త తరం రచయిత్రి కీర్తి ఇనుగుర్తి రాసిన ఆరేళ్ల ప్రేమ పుస్తకం జూలై 18 శుక్రవారం రోజున విడుదలైంది. లామకాన్ రచయిత నరేష్కుమార్ సూఫీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ హాజరయ్యారు. మరో రచయిత కవమాలితోపాటు రచయిత్రి తల్లితండ్రులతో కలిసి ఆరేళ్ల ప్రేమ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుప్పిలి పద్మ మాట్లాడారు.. ప్రేమలో ఓడిపోవటం వల్ల జీవితం ముగిసినట్టు కాదనీ, ఈనాటి యువతీ, యువకులు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయనీ చెబుతూ, పేరెంట్స్ పిల్లల మధ్య ఉండాల్సిన బంధం, స్నేహపూర్వక వాతావరణం ఉండాలనీ, ఆవిషయాలని చక్కగా అర్థమయ్యేలా రాశారనీ రచయిత్రి కీర్తి ఇనుగుర్తిని అభినందించారు. మరో వక్త కవనమాలి మాట్లాడుతూ తెలుగు పుస్తకాలు వరుసగా రావటం, అందులోనూ ఎంతో పరిణితితో కూడిన ఇలాంటి రచనలు రావటం ఆనందగా ఉందని చెప్పారు. తాను చూసిన మనుషులు, చుట్టూ ఉన్న వాతావరణమే ఈ నవల రాయటానికి ప్రేరణ అనీ, తన తల్లిదండ్రుల ప్రేమ కూడా తనను ఈ రచన చేయటానికి ప్రోత్సహించిందని చెప్పారు. ఈ సందర్భంగా రచయిత్రి కీర్తి మాట్లాడుతూ ‘ప్రస్తుత సమాజంలో ఉన్న వాస్తవిక పరిస్థితులను, నా చుట్టూ పక్కల చూసిన కొన్ని ఆంశాలను ప్రమాణికంగా తీసుకుని ఆరేళ్ల ప్రేమ నవల రాయడం జరిగింది. మనం నిరంతరం చూస్తున్న విషయాలనే ఈ నవల్లో పొందుపరిచాను. యువత సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ఏర్పరుచుకుని ప్రేమలో పడి శారీరక, మానసికంగా అవతలి వారికి అలవాటు పడి, ప్రేమలో విఫలమై చివరికి హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా నా వంతు ప్రయత్నం ఉండాలనే ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ‘ఆరేళ్ల ప్రేమ’.
ఒక 23 ఏళ్ల అమ్మాయి, 33 ఏళ్ల అబ్బాయి. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రేమించుకుని కొన్ని అనివార్యకారణాలతో విడిపోతారు. నవల అంతా అమ్మాయి వైపు నుంచే సాగుతుంది. ప్రేమలో విఫలం అయినందుకుఆగిపోకుండా.. జీవితంలో ముందుకు వెళ్లే విధంగా ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్. ఇందులో భాగంగానే పిల్లలప్రేమ విషయంలో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో.. పిల్లలు సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా దైర్ఘ్యం చెప్పాలో.. ఈ నవలలో చూపించే ప్రయత్నం చేశాను. కుటుంబ బంధాలు, స్నేహ సంబంధాలు, సమాజంలోని ఆంశాలకు తెలంగాణ యాసను జోడించి పుస్తకాన్ని రచించాను. ప్రేమలో విఫలం అయ్యాక యువత తమను తాము బలపరుచుకుని, కోల్పోయిన వాటి కోసం నిరాశ చెందకుండా.. రేపటి భవిష్యత్ కోసం ముందుకు సాగాలనేది ‘ఆరేళ్ల ప్రేమ’ ముఖ్య ఉద్దేశం.’ అని వివరించారు. ఇలాంటి పుస్తకాలని చదవటం వల్ల జీవితంలో ఒక స్పష్టత వస్తుందనీ, ఇటువంటి పుస్తకాలు ఇంకా రావాలని కోరుకుంటున్నట్టు అందుకే ఈ పుస్తకాన్ని ప్రచురించాలని అనుకున్నట్టు ఝాన్సీ పబ్లికేషన్స్ ప్రతినిధి శ్రీ దివ్య చెప్పారు. ఛాయా పబ్లికేషన్స్ నుంచి అరుణాంక్, ఒక పబ్లికేషన్ నుంచి సిద్దార్థ కట్టా, సాయి వంశీ, ఆదిత్య అన్నావజ్జల, ఇంకా పలువురు పాఠకులూ, రచయితలూ ఈ సభలో పాల్గొన్నారు.

వ్యాక్యాన్ని జతచేయండి