పరిచయం

వాసిరెడ్డి సీతాదేవి
15 డిసెంబర్1933 -13 ఏప్రిల్ 2007
వాసిరెడ్డి సీతాదేవి గారిది తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం.
స్త్రీ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ఆమె రచనలు ప్రతీకలు
ఆమె మొదటి కథ1952లో వచ్చిన సాంబయ్య పెళ్లి.
దాదాపు 40 నవలలు 100కు పైగా కథలు అనేక వ్యాసాలు రాశారు
హిందీలో ఉన్నత విద్య అభ్యసించారు. ఎన్నో రచనలు హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేశారు. ఆమె రాసిన మట్టి మనిషి నవల 14 భారతీయ భాషల్లోకి అనువాదమైంది మరీచిక నవల ప్రభుత్వ నిషేధానికి గురయింది.
కొన్ని నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి.
శ్రీకృష్ణదేవరాయ ,పద్మావతి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి
పానీ ఆ రహా హై
“ఈ ప్రకారంబుగా….
శివకేశ బంధిత అయిన గంగాభవాని భువికి దిగుతున్న సమయంబున భగీరథుని మనస్సు ఎలాగున్నదయ్యా అంటే…”
కంచుగంటలా మ్రోగుతున్న శంకరశాస్త్రిగారి కంఠం అకస్మాత్తుగా ఆగిపోయింది.
నల్లకుంటలోని శంకరమఠంలో శంకరశాస్త్రిగారి పురాణ శ్రవణం చేస్తున్న భక్తులు అలలు అలలుగా లేచి నిలబడ సాగారు.
“భక్తులారా! మరికొంతసేపు ఓపిక పట్టండి. గంగావతరణం పూర్తి కావచ్చింది. భగీరథుని సంకల్పాన్నీ, కార్యదీక్షనూ మరొకసారి గుర్తుచేసుకొని, మరో పది నిముషాలు కూర్చోండి. ఆసాంతం పురాణం వినని దోషం మీకూ, పురాణ పఠనం పూర్తి చెయ్యని పాపం నాకూ అంటకుండా ఉండాలంటే…”
మైకులో విన్పిస్తున్న శాస్త్రిగారి కంఠం “పానీ ఆ రహా! పానీ ఆ రహా! భాగో! భాగో!” అని అరుస్తూ పరుగులు తీస్తున్న జనం రొదలో కలిసిపోయింది. శాస్త్రికి ఎదురుగా ఉన్న జనసమూహం ఉప్పెనలా శంకర మఠం గోడల మీది నుంచి పొంగింది. గేటు దగ్గిర తొక్కిసలాట. ఆడ-మగా తేడా లేదు. చిన్నా-పెద్దా తారతమ్యం లేదు. ఉన్నది ఒక్కటే, అది ప్రాణ భయం. మనిషి మీద నుంచి మనిషి నడిచిపోతున్నాడు. జారిన పైటలు, పరుగులు తీస్తున్న పంచలు, పిల్లల ఏడ్పులు, ఆడవాళ్ళ ఆర్తనాదాలు పెద్ద వాళ్ళ హాహాకారాలు! శాస్త్రిగారి చెవులు చిల్లులు పడ్తున్నాయి.
శాస్త్రిగారికి తల తిరిగినట్టయ్యింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కాళ్ళు పట్టు తప్పుతున్నాయి. యాంత్రికంగా లేచి నిలబడ్డాడు.
ఆశ్చర్యం!
తనకే తెలియదు తనెప్పుడు నిలబడ్డాడో!
ఏమిటీ ప్రళయం?
ఏమిటీ ఉత్పాతం?
ఇది తన పురాణ మహిమా?
నిజంగా గంగామాత ఆకాశంనుంచి భూమిమీదకు దుముకుతోందా?
అప్రయత్నంగానే శాస్త్రిగారు తల పైకెత్తి చూశారు.
ఆకాశం నిర్మలంగా కన్పించింది. అక్కడక్కడ మబ్బులు కమ్ముతున్నట్టున్నాయి.
వాతావరణంలో మసకలు కమ్ముతున్నాయి.
శివుని జటాజూటం నుండి దుముకుతున్న గంగాభవాని ఏదీ? ఎక్కడా కన్పించడం లేదే? మరి! ఈ జనం! ఈ తొక్కిసలాట! ఈ అరుపులు, పరుగులు, కేకలు ఎందుకు?
“సంభవామి యుగే-యుగే” అది ఇప్పుడే జరుగుతోందా?
“ఓ శాత్తుర్లూ! ఏందయ్య! గట్లనే నిలబడ్తివి! ఉరుకుండ్రీ!” యాదగిరి శాస్త్రిని ముందుకు తోశాడు.
“ఏమైంది యాదగిరీ?” శాస్త్రి కంఠం పెగుల్చుకొని అడిగాడు.
“కట్టా టూట్ గయా! పానీ ఆ రహా హై! భాగో!” బయట నుంచి కేకలు.
“గట్లనే నిలబడ్తివి! ఉరుకురీ!”
“కట్టా పుట్టా అంటే ఏంది యాదగిరీ? ఇంతకీ ఏమైందీ?”
“గండిపేట చెరువు కట్ట తెగిందట. నీళ్ళొస్తునాయ్ బేగి ఉరుకు” అంటూ యాదగిరి ముందుకు పరుగుతీశాడు. శాస్త్రి పిలుస్తున్నాడు. యాదగిరి వెనకే పరిగెత్తే ప్రయత్నం చేస్తూ యాదగిరి వెనక్కు తిరిగి చూడటం లేదు.
“హారి భగీరథుడా!” అరిచాడు శాస్త్రి. ‘హారి భగవంతుడా!’ అన్నాననే అనుకొన్నాడు. ఆయనగారి బుర్రలో గంగావతరణ ఘట్టం ఇంకా మెదులుతోనే ఉంది కాబోలు! భగవంతుణ్ణి స్మరించబోయిన శాస్త్రికి భగీరథుడే గుర్తొచ్చాడు.
రోడ్డుమీద రొప్పుతూ, రోజుతూ పరుగులు తీస్తున్న శాస్త్రికి ముందు ఉరుకుతున్న యాదగిరి కనుమరుగై పోయాడు. పక్క వీధుల్లో నుంచి, సందుల్లోనుంచీ జనం రోడ్డుమీదకు పరుగులు తీస్తున్నారు. వెనకనుంచి వస్తున్న లారీలోని జనం ‘పానీ! ఆరా! కట్టా టూట్ గయా! భాగో! భాగో!’ అని అరుస్తున్నారు.
ఆ కేకలకూ, అరుపులకూ శాస్త్రిగారి పరుగు వేగం అందుకొన్నది.
విద్యానగర్ దాటిపోయింది.
యూనివర్శిటీ దాటింది.
శాస్త్రిగారు పరుగు తీస్తూనే ఉన్నారు. చీకట్లు ముసురుకొస్తున్నాయి. శాస్త్రి పరుగెత్తుతూనే ఉన్నాడు. పక్కనుంచి తెల్ల అంబాసిడర్ కారు దూసుకుపోయింది. ఆ కారు డాక్టరుగారిదని గుర్తించాడు శాస్త్రి. ఆ డాక్టరు ఇంట్లో ఆయన ఎన్నో నోములూ, వ్రతాలూ చేయించాడు. ఆ డాక్టరు పెళ్ళాం బిడ్డల్ని కార్లో వేసుకుని సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నాడు.
“అయ్యా! డాక్టరుగారూ!” శాస్త్రి చేసిన ఆక్రందన ఆ డాక్టరుకు విన్పించలేదు. విన్పించినా ఈ బడుగు బ్రాహ్మడికోసం ఆగుతాడా?
“అబ్బా!”
శాస్త్రికి ఎదురు దెబ్బ తగిలింది. బొటనవ్రేలు చిట్లింది. అప్పుడు గాని శాస్త్రిగారు తన కాళ్ళకు చెప్పుల్లేవని గ్రహించలేదు. తన చెప్పులు? అవును వాటిని తను ఆ వ్యాస పీఠం దగ్గిరే వదిలేశాడు. పైపంచ కూడా వదిలేశాడు.
చెమటలు, ముచ్చెమటలు. నుదుటి విభూది రేఖలు చెరిగిపోతున్నాయి. ఛాతీమీదా, దండలమీదా ఉన్న విభూది రేఖలు చెమటతోపాటు కారిపోయాయి. ఎగశ్వాస! దిగశ్వాస నోరు తెరిచే పరుగెత్తుతున్నాడు శాస్త్రి.
పిప్పళ్ళ బస్తాలా ఉండే ఆయన బొజ్జ నీళ్ళు నిండిన తోలుసంచిలా పైకీ కిందకూ కదులుతోంది. లోపల ఏదో “బొళుకు బొళుకు” మని అంటోంది.
ఉండీ ఉండీ చల్లటి గాలి వంటిని తాకుతున్నట్లుగా అన్పించింది శాస్త్రికి.
ఈ గాలి! అవును! అదే గాలి! నీటిమీది నుంచి వీచే గాలికి అయిపోయింది! అంతా అయిపోయింది! జల ప్రళయం ముంచుకొస్తూంది. పురానాపూల్ కొట్టుకుపోయింది. నాంపల్లి మునిగిపోయింది. పాతబస్తీ వాళ్ళు చార్మినార్ ఎక్కి ప్రాణాలు కాపాడుకొంటారు. అదీ మునిగిపోతే? అమ్మో! ఇంకేముంది! హైదరాబాద్ అలనాటి ద్వారకాపురి అయిపోతుందా?
మూసీ వరదల్లో మూడు వందల మంది ప్రాణాలను కాపాడిన ఆ చెట్టు యింకా అక్కడే ఉంది. తను చిన్నప్పుడు వరద గోదావరి పొంగు చూసాడు. దివిసీమలో తాటిచెట్ల తలలు నరికిన ఉప్పెన గురించి విన్నాడు.
జలప్రళయం! ప్రకృతిలోని భీభత్సాలన్నింటినీ తలదన్నే భీభత్సం జల ప్రళయం. అందుకే యుగాంతంలో జల ప్రళయం వస్తుందన్నారు.
సర్వే సర్వత్రా జలమయం – జలార్నవమైన వసుంధర – వట పత్రశాయి-
శతసహస్ర కోటి పిశాచాలు ఒక్కసారిగా అరిచినట్టు కారు హారన్ విన్పించింది. ఆలోచిస్తూ పరుగెత్తుతున్న, పరుగెత్తుతూ ఆలోచిస్తున్న శాస్త్రి రోడ్డుమీద ఎగిరిపడ్డాడు. కొద్దిలో బతికి బయటపడ్డాడు. దాదాపు అది అతన్ని ఒరుచుకుంటూ రాచుకుంటూనే పోయింది.
శంకరశాస్త్రిగారు ఇంకా పరుగెత్తుతూనే ఉన్నారు. అది పరుగో! నడకో! పాకుడో! దొర్లుడో! చెప్పడం కష్టం! అయినా శాస్త్రి ముందుకే పోతున్నాడు. దూరంగా, దూరదూరంగా సాగిపోతూనే ఉన్నాడు.
“పానీ ఆ రహా హై! భాగో! భాగో! నీళ్ళొస్తున్నాయి! పారిపొండి” ఈసారి ఆ మాటలు శాస్త్రి చెవుల్లో నుంచి కాదు. బుర్రలోనుంచి విన్పిస్తున్నాయి. బయటి నుంచి కాదు, లోపలి నుంచే విన్పిస్తున్నాయి.
చల్లగా మెల్లగా, జరజరా, చరచరా, నంగనాచిలా, తుంగబుర్రలా, దొంగముండలా, కొండముచ్చులా నీరు శాస్త్రిగారి కాళ్ళను చుట్టేసింది.
పాదాలు మునిగాయి. మునిగిపోతున్నాయి! మోకాళ్ళు దాటి కొండచిలువలా గుండెను చుట్టేసింది. పాములా గొంతును పెనవేసుకొన్నది. సుళ్ళు తిరుగుతూ నోటిని మింగి, ముక్కును వాసన చూస్తున్న గంగమ్మ తల్లిని చూసి శాస్త్రిగారు ఏమన్నారయ్యా అంటే –
వినండి! “ఒసే దయ్యమా! ఆగు!” పాపం శమించుగాక! ఇంకా ఏమన్నారయ్యా అంటే – “ఒరే బైరాగి వెధవా! ఒరే పాములోడా! ఆ గంగ ముండను అదుపులో పెట్టుకోరా! అదుపు తప్పిన అది మళ్ళీ వశంలోకి రాదురా!”
శంకరశాస్త్రి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. నీటిలో మునిగిపోతున్న భయం, అతని మనసునూ, శరీరాన్ని చుట్టి వేసింది. ఎలా పరుగెత్తుతున్నాడో, ఎటు పరుగెడుతున్నాడో తెలియని స్థితిలో ఎదురుగా ఒక గుట్ట కన్పించింది. శాస్త్రిరోడ్డు దాటి గుట్టకేసి పరుగుతీశాడు.
కొండ గుట్ట సగంవరకూ ఎక్కిన శాస్త్రి కాళ్ళు పట్టుతప్పాయి. బోర్లా పడ్డాడు. లేవడానికి ప్రయత్నించాడు. సాధ్యపడలేదు. కిందకు చూశాడు. పర్వాలేదు. తను ఎత్తున ఉన్నాడు. నీళ్ళు ఇంత ఎత్తుకు రావు! తన జాతకంలో రాసిపెట్టిన నీళ్ళగండం ఇదేనేమో! అమ్మయ్య! గండం గడిచింది. మరో పాతికేళ్ళవరకూ తనకు ధోకాలేదు. అలా అని తన జాతకంలో స్పష్టంగా రాసివుంది. శాస్త్రిగారి మనసు తేలికపడింది. బుర్రలో అలుముకున్న భయం తాలూకు మబ్బులు విచ్చిపోయాయి. జరిగిందేమిటో గుర్తుచేసుకోగానే గుండెవచ్చి గొంతుకు అడ్డుపడినట్టుగా అయింది.
“బాబూ!” దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. దిక్కులు చూశాడు. చిమ్మ చీకట్లు మనిషి అలికిడి లేదు. “ఒరే నాయనా! కుమారస్వామీ!” కొండ ప్రతిధ్వనించింది. కాని శాస్త్రి గారి మనవడు చిరంజీవి కుమారస్వామి పలక లేదు. ప్రాణభీతితో తను చేసిందేమిటో తెలిసింది. ఏడేళ్ళ మనవడ్ని వదిలేసి ప్రాణం మీది తీపితో అప్రయత్నంగానే పరుగులు తీశాడు. తన ప్రాణం కాపాడుకోవటానికి పరుగులు తీశాడు. శంకర శాస్త్రి కళ్ళముందు శంకర మఠంలో జనం తొక్కిసలాట మెదిలింది. ఆబోతుల కాళ్ళకింద నలిగిపోతున్న లేగదూడలు.
“ఓ శంకరా! శంకరా!”
శంకరశాస్త్రి గుండె బరువెక్కిపోతోంది. గొంతు తడారిపోయింది. నాలుక పిడచకట్టుకుపోయింది. వంట్లోని నీరంతా చమటగా కారిపోయింది.
“దాహం! దాహం!”
తను భరించలేడు. లేవాలి. దాహం తీరాలి.
శంకరశాస్త్రి లేవడానికి ప్రయత్నించాడు. ఒక్క కాలు మాత్రమే లేచింది. రెండోది లేవదేం? తొంటి జారిపోయింది. అవును తాను కొండ ఎక్కుతున్నప్పుడు పడ్డాడుగా! ఇహ ఇక్కడ్నుంచి తను కదలలేడు. గొంతెండిపోతున్నది.
“దాహం! దాహం!” వెర్రిగా అరుస్తున్నాడు.
అరచిన కొద్దీ గొంతెండిపోతున్నది. అందుబాటులో గుక్కెడు నీళ్ళు లేవు. రెండు చేతులతో తడిమాడు. ఎండకు కాగిన కొండరాళ్ళు చేతులకు వేడిగా తగిలాయి.
ఇంత చెమ్మ దొరకదా? ఒక్క రెమ్మలో ఉండే చెమ్మ దొరికినా చాలు.
దాహంతో శాస్త్రి ప్రాణం విలవిల లాడుతోంది.
క్షణాలు యుగాలుగా గడిచిపోతున్నాయి. యుగ యుగాలుగా నీటికోసం పరితపిస్తున్న లాంటి భావం. ఆర్తి ఏదో శంకరశాస్త్రి మనసును ఆవహించింది. కుమారస్వామి తలపుకొచ్చాడు. తాత ముత్తాతల్ని స్వర్గానికి పంపిన భగీరథుడిలా, ఇప్పుడు తన మనవడు ఉంటే తన ఆర్తిని తన దాహాన్నీ తీర్చేవాడు. కాని…
శరీరం దహించుకుపోతున్నది శాస్త్రికి.
“దాహం! దాహం! ఓ భగీరథా! గంగను రప్పించు” గంగావతరణం జరగాలి. తన దాహం తీరాలి. పొంగిన వరద గోదావరిని అవపోసనబట్టి ఒక్క గుక్కన తాగేస్తాడు! అప్పటికి గాని తన దాహం తీరదు.
గంగమ్మ తల్లీ రా!
కృష్ణవేణమ్మా రావే!
శంకరశాస్త్రిగారు స్పృహతప్పి పడిపోయారు! తెల్లవారుఝామున కురిసిన కుంభ వృష్టికి కొండమీది నుంచి కిందికి జారి రోడ్డువారన పడివున్న శాస్త్రిగారి శవాన్ని. మునిసిపాలిటీ వాళ్ళు ఎత్తివేయాలా? లేక పోలీసువాళ్ళు ఎత్తివేయాలా? అన్నది తేలక ఇంకా అక్కడే అలాగే వుంది.
ఇది ఆనాటి కథ కాగా –
ఈనాడు శాస్త్రిగారి తద్దినం పెట్టడానికి నల్లాలో గండిపేట నీళ్ళూ రాలేదు.
వ్యాక్యాన్ని జతచేయండి